ప్రసంగి 7:11-29

ప్రసంగి 7:11-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

జ్ఞానం ఒక వారసత్వంలా ఒక మంచి విషయమే అది సూర్యుని క్రింద బ్రతికి ఉన్నవారికి ప్రయోజనం కలిగిస్తుంది. డబ్బుతో భద్రత లభించినట్లే, జ్ఞానంతో కూడా భద్రత లభిస్తుంది, ప్రయోజనం ఏంటంటే: జ్ఞానం తనను కలిగినవారిని కాపాడుతుంది. దేవుడు చేసిన వాటిని పరిశీలించండి: ఆయన వంకరగా చేసిన దానిని ఎవరు సరిచేయగలరు? సమయం మంచిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి; కానీ సమయం చెడుగా ఉన్నప్పుడు ఇలా ఆలోచించండి: దేవుడు దీన్ని చేశారు అలాగే దాన్ని చేశారు. అందువల్ల, తమ భవిష్యత్తు గురించి ఎవరూ ఏమీ తెలుసుకోలేరు. నా ఈ అర్థరహిత జీవితంలో నేను ఈ రెండు చూశాను; నీతిమంతులు తమ నీతిలో నశించారు, దుష్టులు తమ దుష్టత్వంలో దీర్ఘకాలం జీవించారు. మరీ ఎక్కువ నీతిమంతునిగా ఉండకు, మరీ ఎక్కువ జ్ఞానిగా ఉండకు, నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకొంటావు? మరీ ఎక్కువ దుర్మార్గంగా ఉండకు, మూర్ఖునిగా ఉండకు. సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి? ఒకదాన్ని పట్టుకోవడం మరొకదాన్ని విడిచిపెట్టకపోవడం మంచిది. దేవునికి భయపడేవారు అన్ని విపరీతాలను అధిగమిస్తారు. పట్టణంలోని పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తికి ఉన్న జ్ఞానం శక్తివంతమైనది. ఎప్పుడూ పాపం చేయకుండా మంచినే చేస్తూ ఉండే, నీతిమంతులు భూమిపై ఒక్కరు లేరు. ప్రజలు చెప్పే ప్రతి మాటను వినవద్దు, లేకపోతే మీ సేవకుడు మిమ్మల్ని శపించడం మీరు వింటారు. ఎందుకంటే మీరే చాలాసార్లు ఇతరులను శపించారని మీకు తెలుసు. నా జ్ఞానంతో ఇదంతా నేను పరిశోధించాను, “నేను జ్ఞానిని కావాలని నిశ్చయించుకున్నాను” కాని అది నావల్ల కాలేదు. జ్ఞానం దూరంగా లోతుగా ఉంది దానిని ఎవరు కనుగొనగలరు? జ్ఞానాన్ని, సంగతుల మూలకారణాన్ని వెదకి తెలుసుకోడానికి, దుష్టత్వంలోని బుద్ధిహీనతను, మూర్ఖత్వంలోని వెర్రితనాన్ని గ్రహించడానికి, నేను నా హృదయాన్ని నిలుపుకున్నాను. నేను మరణం కన్నా దుఃఖకరమైనది తెలుసుకున్నాను, అది వల వంటిది, ఉచ్చులాంటి మనస్సు కలిగి సంకెళ్ల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని సంతోషపరిచేవారు ఆమె నుండి తప్పించుకుంటారు. కాని ఆమె పాపులను పట్టుకుంటుంది. ప్రసంగి ఇలా అంటున్నాడు, “నేను తెలుసుకున్నది ఇదే: “సంగతుల మూలకారణాలను తెలుసుకోడానికి ఒక దానికి మరొకదాన్ని జోడించాను. నేను ఇంకా వెదకుతున్నాను కాని దొరకడం లేదు, వేయిమంది పురుషులలో ఒక్క యథార్థవంతుడు దొరికాడు, కానీ స్త్రీలందరిలో ఒక్క యథార్థవంతురాలు కూడా దొరకలేదు. నేను తెలుసుకున్నది ఇది ఒక్కటే; దేవుడు మనుష్యజాతిని యథార్థవంతులుగానే సృజించారు, కానీ వారు అనేక చెడు పథకాల వెంటపడుతున్నారు.”

ప్రసంగి 7:11-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం. భూమి పైన జీవించే వారందరికీ అది ఉపయోగకరం. జ్ఞానం, డబ్బు, ఈ రెండూ భద్రతనిచ్చేవే. అయితే జ్ఞానంతో లాభం ఏమిటంటే తనను కలిగి ఉన్నవారికి అది జీవాన్నిస్తుంది. దేవుడు చేసిన పనులను గమనించు. ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా? మంచి రోజుల్లో సంతోషంగా గడుపు. చెడ్డ రోజుల్లో దీన్ని ఆలోచించు, తాము గతించి పోయిన తరువాత ఏం జరగబోతుందో తెలియకుండా ఉండడానికి దేవుడు సుఖదుఃఖాలను పక్కపక్కనే ఉంచాడు. నేను నిష్ప్రయోజనంగా తిరిగిన కాలంలో నేను చాలా విషయాలు చూశాను. నీతిమంతులై ఉండి కూడా నశించిపోయిన వారున్నారు, దుర్మార్గులై ఉండీ దీర్ఘ కాలం జీవించిన వారున్నారు. అంత స్వనీతిపరుడుగా ఉండకు. నీ దృష్టికి నీవు అంత ఎక్కువ తెలివి సంపాదించుకోకు. నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకుంటావు? మరీ ఎక్కువ చెడ్డగా, మూర్ఖంగా ఉండవద్దు. నీ సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి? నీవు ఈ జ్ఞానానికి అంటిపెట్టుకుని దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు మంచిది. దేవునిలో భయభక్తులు గలవాడు తాను చేయవలసిన వాటినన్నిటినీ జరిగిస్తాడు. ఒక పట్టణంలో ఉన్న పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తిలో ఉన్న జ్ఞానం శక్తివంతమైంది. ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు. చెప్పుడు మాటలు వింటూ నీ పనివాడు నిన్ను శపించేలా చేసుకోకు. నువ్వు కూడా చాలాసార్లు ఇతరులను శపించావు కదా. ఇదంతా నేను జ్ఞానంతో పరిశోధించి తెలుసుకున్నాను. “నేను జ్ఞానిగా ఉంటాను” అని నేననుకున్నాను గాని అది నా వల్ల కాలేదు. జ్ఞానం బహు దూరంగా, లోతుగా ఉంది. దానినెవడు తెలుసుకోగలడు? వివేచించడానికి, పరిశోధించడానికి, జ్ఞానాన్ని, సంగతుల మూల కారణాలను తెలుసుకోడానికి, చెడుతనం అనేది మూర్ఖత్వం అనీ బుద్ధిహీనత వెర్రితనమనీ గ్రహించేలా నేను నేర్చుకోడానికి, పరీక్షించడానికి నా మనస్సు నిలిపాను. చావు కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడింది. అది ఉచ్చులు, వలలు లాంటి మనస్సు, సంకెళ్ళ లాంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారు దాన్ని తప్పించుకుంటారు గాని పాపం చేసేవారు దాని వలలో పడిపోతారు. సంగతుల మూల కారణాలు ఏమిటో తెలుసుకోడానికి నేను వివిధ పనులను పరిశీలించినపుడు ఇది నాకు కనబడింది అని ప్రసంగి అనే నేను చెబుతున్నాను. అయితే నేను ఎంత పరిశోధించినా నాకు కనబడనిది ఒకటి ఉంది. అదేమంటే వెయ్యి మంది పురుషుల్లో నేనొక్క నిజాయితీపరుణ్ణి చూశాను గాని స్త్రీలందరిలో ఒక్కరిని కూడా చూడలేదు. నేను గ్రహించింది ఇది ఒక్కటే, దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు గాని వారు వివిధ రకాల కష్టాలు తమ పైకి తెచ్చుకుని చెదరిపోయారు.

ప్రసంగి 7:11-29 పవిత్ర బైబిల్ (TERV)

నీకు ఆస్తితో బాటు జ్ఞానం కూడా ఉంటే మరింత మంచిది. నిజానికి, వివేకవంతులు కావలసిన దానికంటే అధికంగానే ఐశ్వర్యాన్ని పొందుతారు. వివేకవంతుడు సంపన్నుడవగలడు. ధనం అండ అయినట్టే వివేకం అండ అవుతుంది. కాని జ్ఞానంయొక్క ప్రయోజనం ఏమంటే, వివేకం తన యజమానికి అండ అవుతుంది. దేవుడు చేసినవాటిని పరిశీలించి చూడండి. వాటిలో ఏదైనా ఒకటి పొరపాటైనదని నీవు అనుకున్నా వాటిలో ఏ ఒక్కదాన్ని నీవు మార్చలేవు! రోజులు బాగున్నప్పుడు, నీవు దాన్ని అనుభవించు. కాని, రోజులు బాగుండనప్పుడు, దేవుడు మనకి మంచి రోజులు, చెడ్డ రోజులు వ్రాసి పెట్టాడన్న విషయం మరచిపోకు. ముందేమి జరుగుతుందో ఏ ఒక్కరికీ తెలియదు. నా స్వల్ప జీవిత కాలంలో నేను అన్ని చూశాను. మంచివాళ్లు చిన్న వయస్సులోనే మరణించడం చూశాను. చెడ్డవాళ్లు సుదీర్ఘకాలం జీవించడం చూశాను. అందుకని అకాలంగా నిన్ను నీవు చంపుకోవడం దేనికి? అతి మంచిగా కాని, అతి చెడ్డగా కాని ఉండకు. అతి తెలివిగా కాని అతి మూర్ఖంగా కాని ఉండకు. నీ ఆయువు తీరక ముందే నువ్వెందుకు చనిపోవాలి? దీనిని పట్టుకో గాని దానిని చేయి విడువకుండా ఉండటం మేలు. దేవునికి భయపడేవారు కూడా కొన్ని మంచికార్యాలు, కొన్ని చెడ్డకార్యాలు చేస్తారు. ఎప్పుడు మంచి పనులే చేసి, ఎన్నడూ పాపాలు చేయని మంచివాడంటూ లేడని ఖచ్చితంగా చెప్పవచ్చు. జ్ఞానం మనిషికి శక్తిని చేకూరుస్తుంది. నగరంలో పదిమంది (మూర్ఖులైన) నాయకులకంటె ఒక్క వివేకవంతుడు ఎక్కువ బలవంతుడై ఉంటాడు. జనం చెప్పే మాటలన్ని చెవిని చొరనీయకు. నీ స్వంత నౌకరే నీ గురించి చెడ్డ మాటలు చెప్పడం నీవు వినవచ్చు. నీవు కూడా అనేకసార్లు యితరులను గురించి చెడ్డ మాటలు చెప్పియుండ వచ్చునని నీకు తెలుసు. నేను నా వివేకాన్ని వినియోగించి, ఈ విషయాలన్నింటిని గురించి ఆలోచించాను. నేను సరైన వివేకిగా వుండాలని కోరుకున్నాను. కాని అది దుస్సాధ్యం. విషయాలెందుకిలా ఉన్నాయో నేను అర్థం చేసుకోలేను. దాన్ని అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టమే. నేను అధ్యయనం చేసి, సరైన జ్ఞానాన్ని అన్వేషించేందుకు చాలా గట్టి ప్రయత్నం చేశాను. ప్రతి ఒక్కదానికి హేతువును కనుక్కునేందుకు నేను ప్రయత్నించాను. (నేనేమి తెలుసుకున్నాను?) చెడ్డగా ఉండటం మూర్ఖత్వమనీ, మూర్ఖంగా వ్యవహరించడం పిచ్చితనమనీ నేను తెలుసుకున్నాను. (కొందరు) స్త్రీలు వలల మాదిరిగా ప్రమాద కారులు అన్న విషయం కూడా నేను తెలుసుకున్నాను. వాళ్ల హృదయాలు వలల్లాంటివి, వాళ్ల చేతులు గొలుసుల్లాంటివి. ఆ స్త్రీల చేతుల్లో చిక్కడం మరణం కంటె హీనం. దేవుణ్ణి అనుసరించే వ్యక్తి అలాంటి స్త్రీలనుండి పారిపోతాడు. అయితే, పాపులు సరిగ్గా వాళ్లకే చిక్కుతారు. ప్రసంగి ననే నేను చెప్పేదేమిటంటే, “వీటన్నింటికీ సమాధానాలు కనుగొనగలనేమోనని నేను పై విషయాలన్నీ మొత్తంగా పరిశీలించాను. సమాధానాల కోసం నేనిప్పటికీ అన్వేషిస్తూనే వున్నాను. అయితే, నేను కనుగొన్నది ఇది: నాకు వెయ్యి మందిలో ఒక్క మంచి మగాడు కనిపించగా, వెయ్యి మందిలో ఒక్క మంచి స్త్రీ కూడా కనిపించలేదు. “నేను తెలుసుకున్న మరో విషయం: దేవుడు మనుష్యుల్ని నిజాయితీగల (మంచి) వాళ్లుగా సృష్టించాడు. కాని, మనుష్యులు చెడ్డగా ఉండేందుకు అనేక మార్గాలు కనుగొన్నారు.”

ప్రసంగి 7:11-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

జ్ఞానము స్వాస్థ్యమంత యుపయోగము; సూర్యుని క్రింద బ్రదుకువారికి అది లాభకరము. జ్ఞానము ఆశ్ర యాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదము; అయితే జ్ఞానము దాని పొందిన వారి ప్రాణమును రక్షించును; ఇదే జ్ఞానమువలన కలుగు లాభము. దేవుని క్రియలను ధ్యానించుము; ఆయన వంకరగా చేసినదానిని ఎవడు చక్కపరచును? సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము; తాము చనిపోయిన తరువాత జరుగుదానిని నరులు తెలిసికొనకుండునట్లు దేవుడు సుఖదుఃఖములను జతపరచియున్నాడు. నా వ్యర్థసంచారముల కాలములో నేను వీటినన్నిటిని చూచితిని; నీతి ననుసరించి నశించిన నీతిమంతులు కలరు. దుర్మార్గులై యుండియు చిరాయువులైన దుష్టులును కలరు. అధికముగా నీతిమంతుడవై యుండకుము; అధికముగా జ్ఞానివికాకుము; నిన్ను నీవేల నాశనము చేసి కొందువు? అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరుగవద్దు; నీ కాలమునకు ముందుగా నీ వేల చనిపోదువు? నీవు దీని పట్టుకొనియుండుటయు దానిని చేయివిడువకుండుటయు మేలు; దేవునియందు భయభక్తులు గలవాడు వాటినన్నిటిని కొనసాగించును. పట్టణమందుండు పదిమంది అధికారులకంటె జ్ఞానము గలవానికి జ్ఞానమే యెక్కువైన ఆధారము. పాపము చేయక మేలుచేయుచుండు నీతిమంతుడు భూమిమీద ఒకడైనను లేడు. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్యపెట్టకుము. నీవును అనేకమారులు ఇతరులను శపించితివని నీకే తెలిసి యున్నది గదా. ఇది అంతయు జ్ఞానముచేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసికొందునని నేననుకొంటిని గాని అది నాకు దూరమాయెను. సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడు వివేచించుటకును పరిశోధించుటకును, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతులయొక్క హేతువులను తెలిసికొనుటకును, భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెఱ్ఱితన మనియు గ్రహించుటకును, రూఢి చేసికొని నా మనస్సు నిలిపితిని. మరణముకంటె ఎక్కువ దుఃఖము కలిగించునది ఒకటి నాకు కనబడెను; అది వలల వంటిదై, ఉరులవంటి మనస్సును బంధకములవంటి చేతులును కలిగిన స్త్రీ ; దేవునిదృష్టికి మంచివారైనవారు దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దానివలన పట్టబడుదురు. సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడెనని ప్రసంగినైన నేను చెప్పు చున్నాను; అయితే నేను తరచి చూచినను నాకు కనబడ నిది ఒకటి యున్నది. అదేదనగా వెయ్యిమంది పురుషులలో నేనొకని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకతెను చూడలేదు. ఇది యొకటిమాత్రము నేను కను గొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని యున్నారు.