ప్రసంగి 7

7
జ్ఞానాన్ని ఎన్నుకోవడం
1పరిమళ తైలం కంటే మంచి పేరు మేలు.
ఒకడు పుట్టిన రోజు కంటే చనిపోయిన రోజే మేలు.
2విందు జరుగుతున్న ఇంటికి వెళ్ళడం కంటే దుఃఖంతో ఏడుస్తున్న వారి ఇంటికి వెళ్ళడం మేలు.
ఎందుకంటే చావు అందరికీ వస్తుంది కాబట్టి జీవించి ఉన్నవారు దాన్ని గుర్తు పెట్టుకోవాలి.
3నవ్వడం కంటే ఏడవడం మేలు.
ఎందుకంటే దుఃఖ ముఖం తరవాత హృదయంలో సంతోషం కలుగుతుంది.
4జ్ఞానులు తమ దృష్టిని దుఃఖంలో ఉన్నవారి ఇంటి మీద ఉంచుతారు.
అయితే మూర్ఖుల ఆలోచనలన్నీ విందులు చేసుకొనే వారి ఇళ్ళపై ఉంటాయి.
5మూర్ఖుల పాటలు వినడం కంటే జ్ఞానుల గద్దింపు వినడం మేలు.
6ఎందుకంటే మూర్ఖుల నవ్వు బాన కింద చిటపట శబ్దం చేసే చితుకుల మంటలాంటిది.
ఇది కూడా నిష్ప్రయోజనం.
7జ్ఞానులు అన్యాయం చేస్తే వారి బుద్ధి చెడిపోయినట్టే.
లంచం మనసును చెడగొడుతుంది.
8ఒక పని ప్రారంభం కంటే దాని ముగింపు ప్రాముఖ్యం.
అహంకారి కంటే శాంతమూర్తి గొప్పవాడు.
9కోపించడానికి తొందరపడవద్దు.
మూర్ఖుల హృదయాల్లో కోపం నిలిచి ఉంటుంది.
10“ఇప్పటి రోజుల కంటే గతించిన రోజులు ఎందుకు మంచివి” అని అడగొద్దు.
అది తెలివైన ప్రశ్న కాదు.
11జ్ఞానం మనం వారసత్వంగా పొందిన ఆస్తితో సమానం.
భూమి పైన#7:11 భూమి పైన సూర్యుని కింద జీవించే వారందరికీ అది ఉపయోగకరం.
12జ్ఞానం, డబ్బు, ఈ రెండూ భద్రతనిచ్చేవే.
అయితే జ్ఞానంతో లాభం ఏమిటంటే తనను కలిగి ఉన్నవారికి అది జీవాన్నిస్తుంది.
13దేవుడు చేసిన పనులను గమనించు.
ఆయన వంకరగా చేసినదాన్ని ఎవడైనా తిన్నగా చేయగలడా?
14మంచి రోజుల్లో సంతోషంగా గడుపు. చెడ్డ రోజుల్లో దీన్ని ఆలోచించు,
తాము గతించి పోయిన తరువాత ఏం జరగబోతుందో తెలియకుండా ఉండడానికి దేవుడు సుఖదుఃఖాలను పక్కపక్కనే ఉంచాడు.
15నేను నిష్ప్రయోజనంగా తిరిగిన కాలంలో నేను చాలా విషయాలు చూశాను.
నీతిమంతులై ఉండి కూడా నశించిపోయిన వారున్నారు,
దుర్మార్గులై ఉండీ దీర్ఘ కాలం జీవించిన వారున్నారు.
16అంత స్వనీతిపరుడుగా ఉండకు. నీ దృష్టికి నీవు అంత ఎక్కువ తెలివి సంపాదించుకోకు.
నిన్ను నీవే ఎందుకు నాశనం చేసుకుంటావు?
17మరీ ఎక్కువ చెడ్డగా, మూర్ఖంగా ఉండవద్దు.
నీ సమయం రాకముందే ఎందుకు చనిపోవాలి?
18నీవు ఈ జ్ఞానానికి అంటిపెట్టుకుని దాన్ని విడిచిపెట్టకుండా ఉంటే నీకు మంచిది.
దేవునిలో భయభక్తులు గలవాడు తాను చేయవలసిన వాటినన్నిటినీ జరిగిస్తాడు.
19ఒక పట్టణంలో ఉన్న పదిమంది అధికారుల కంటే తెలివైన వ్యక్తిలో ఉన్న జ్ఞానం శక్తివంతమైంది.
20ఈ భూమి మీద ఎప్పుడూ పాపం చేయకుండా మంచి జరిగిస్తూ ఉండే నీతిమంతుడు భూమి మీద ఒక్కడు కూడా లేడు.
21చెప్పుడు మాటలు వింటూ నీ పనివాడు నిన్ను శపించేలా చేసుకోకు.
22నువ్వు కూడా చాలాసార్లు ఇతరులను శపించావు కదా.
23ఇదంతా నేను జ్ఞానంతో పరిశోధించి తెలుసుకున్నాను. “నేను జ్ఞానిగా ఉంటాను” అని నేననుకున్నాను గాని అది నా వల్ల కాలేదు.
24జ్ఞానం బహు దూరంగా, లోతుగా ఉంది. దానినెవడు తెలుసుకోగలడు?
25వివేచించడానికి, పరిశోధించడానికి, జ్ఞానాన్ని, సంగతుల మూల కారణాలను తెలుసుకోడానికి,
చెడుతనం అనేది మూర్ఖత్వం అనీ బుద్ధిహీనత వెర్రితనమనీ గ్రహించేలా నేను నేర్చుకోడానికి, పరీక్షించడానికి నా మనస్సు నిలిపాను.
26చావు కంటే ఎక్కువ దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడింది. అది ఉచ్చులు, వలలు లాంటి మనస్సు, సంకెళ్ళ లాంటి చేతులు కలిగిన స్త్రీ.
దేవుని దృష్టికి మంచివారు దాన్ని తప్పించుకుంటారు గాని పాపం చేసేవారు దాని వలలో పడిపోతారు.
27సంగతుల మూల కారణాలు ఏమిటో తెలుసుకోడానికి నేను వివిధ పనులను పరిశీలించినపుడు ఇది నాకు కనబడింది అని ప్రసంగి అనే నేను చెబుతున్నాను. అయితే నేను ఎంత పరిశోధించినా నాకు కనబడనిది ఒకటి ఉంది. 28అదేమంటే వెయ్యి మంది పురుషుల్లో నేనొక్క నిజాయితీపరుణ్ణి చూశాను గాని స్త్రీలందరిలో ఒక్కరిని కూడా చూడలేదు. 29నేను గ్రహించింది ఇది ఒక్కటే, దేవుడు మనుషులను యథార్థవంతులుగానే పుట్టించాడు గాని వారు వివిధ రకాల కష్టాలు తమ పైకి తెచ్చుకుని చెదరిపోయారు.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

ప్రసంగి 7: IRVTel

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి