ప్రసంగి 2:1-11

ప్రసంగి 2:1-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

“అప్పుడు, నిన్ను సంతోషం చేత పరీక్షిస్తాను, నువ్వు మేలును రుచి చూడు” అని నేను నా హృదయంతో చెప్పుకున్నాను. అయితే అది కూడా వ్యర్థప్రయత్నమే అయ్యింది. నవ్వుతో, నువ్వు వెర్రిదానివి అనీ సంతోషంతో, నీవలన లాభం లేదు అనీ అన్నాను. నా మనస్సు ఇంకా జ్ఞానాన్ని కోరుకుంటుండగా ఆకాశం కింద మానవులు తమ జీవితంలో ఏమి చేస్తే మేలు పొందుతారో చూద్దామని, ద్రాక్షారసంతో నా శరీరాన్ని సంతోషపరచుకొంటాను, బుద్ధిహీనత వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని ఆలోచించాను. నేను గొప్ప గొప్ప పనులు చేశాను. నా కోసం ఇళ్ళు కట్టించుకున్నాను, ద్రాక్షతోటలు నాటించుకున్నాను. తోటలు, ఉద్యానవనాలను వేయించి వాటిలో పలు రకాల పండ్ల చెట్లు నాటించాను. ఆ చెట్లకు నీటి కోసం నేను చెరువులు తవ్వించాను. ఆడ, మగ పనివారిని నియమించుకున్నాను. దాసులుగానే నా ఇంట్లో పుట్టినవారు నాకు ఉన్నారు. యెరూషలేములో నాకు ముందు ఉన్న వారందరికంటే ఎక్కువగా పశువులు, గొర్రె మేకల మందలు నేను సంపాదించుకున్నాను. నా కోసం వెండి బంగారాలను, వివిధ దేశాల రాజులకు, సంస్థానాల అధిపతులకు ఉండేటంత సంపదను సమకూర్చుకున్నాను. గాయకులనూ గాయకురాళ్ళనీ, మనుషులు కోరేవాటన్నిటినీ సంపాదించుకుని అనేకమంది స్త్రీలనూ ఉంచుకున్నాను. నాకు ముందు యెరూషలేములో ఉన్న వారందరికంటే గొప్పవాణ్ణి, ఆస్తిపరుణ్ణి అయ్యాను. నా జ్ఞానం నన్ను నడిపిస్తూనే ఉంది. నా కళ్ళు చూడాలని ఆశపడిన వాటిని చూడకుండా నేను అడ్డు చెప్పలేదు. నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషించింది. అందుకే సంతోషాలను అనుభవించకుండా నేను నా హృదయాన్ని నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు నేను చేసిన పనులన్నిటినీ, వాటి కోసం నేను పడిన బాధ అంతటినీ గమనించి చూస్తే అవన్నీ నిష్ప్రయోజనంగా, ఒకడు గాలి కోసం ప్రయాసపడినట్టుగా కనిపించింది. సూర్యుని కింద ప్రయోజనకరమైనది ఏదీ లేనట్టు నాకు కనిపించింది.

షేర్ చేయి
Read ప్రసంగి 2

ప్రసంగి 2:1-11 పవిత్ర బైబిల్ (TERV)

నాలో నేను, “నేను సరదాగా గడపాలి. నేను నా శాయశక్తులా సమస్త సుఖాలూ అనుభవించాలి” అనుకున్నాను. కాని, అది కూడా నిష్ప్రయోజనమైన పనే అని గ్రహించాను. (ఎల్లప్పుడు) సరదాగా నవ్వుతూ గడపడం మూర్ఖత్వం. సరదాగా గడిపేయడం ద్వారా కలిగే మేలేమీ లేదు. అందుకని, కడుపునిండా ద్రాక్షారసం తాగుతూ మనస్సును జ్ఞానంతో నింపుదామని అనుకున్నాను. సంతోషంగా వుండాలన్న ప్రయత్నంలో నేనీ మూర్ఖత్వానికి చోటిచ్చాను. తమ స్వల్పకాల జీవితంలో జనానికి ఏది మంచిదో కనుక్కోవాలనుకున్నాను. అప్పుడిక నేను పెద్ద పెద్ద పనులు చెయ్య నారంభించాను. నేను నాకోసం భవనాలు కట్టించాను. ద్రాక్షాతోటలు నాటించాను. తోటలు వేయించాను, ఉద్యానవనాలు నెలకొల్పాను. నేను రకరకాల పండ్ల చెట్లు నాటించాను. నేను నాకోసం నీటి మడుగులు తవ్వించి, వాటిలోని నీటిని పెరుగుతున్న చెట్లకు పోసేందుకు వినియోగించాను. నేను మగ, ఆడ బానిసలను ఖరీదు చేశాను. నా భవనంలోనే కొందరు బానిసలు పుట్టారు. నాకు చాల గొప్ప వస్తువులు ఉన్నాయి. నాకు పశువుల మందలు, గొర్రెల మందలు ఉన్నాయి. యెరూషలేములో ఏ ఒక్కనికన్న నాకు ఎక్కువ వస్తువులు ఉన్నాయి. నేను దండిగా వెండి బంగారాలు కూడబెట్టాను. ఆయా రాజుల, రాజ్యాల సంపదలను సంపాదించాను. నా ఆస్థానంలో గాయనీ, గాయకులు ఉన్నారు. నేను ఎవరు కోరినదైనా కలిగియుంటిని. నేను బాగా ధనవంతుణ్ణీ, కీర్తిమంతుణ్ణీ అయ్యాను. యెరూషలేములో నా వెనుకటి వారందరికంటె నేను గొప్పవాడినయ్యాను. నా జ్ఞానం వివేకం నాకు సహాయం చేశాయి. నేను చూసి, కోరుకున్నదల్లా నేను పొందాను. నేను చేసినవన్నీ నా మనస్సుకి తృప్తిని కలిగించాయి. నేను చేసిన శ్రమ అంతటికీ ప్రతిఫలం ఈ ఆనందమే. అయితే, అటు తర్వాత నేను చేసినవాటన్నింటినీ నేనొకసారి సమీక్షించుకున్నాను. నేను పడ్డ శ్రమ అంతటినీ బేరీజు వేసుకున్నాను. అదంతా వృథా శ్రమ అన్న నిర్ణయానికి వచ్చాను! అది గాలిని మూట కట్టుకొనే ప్రయత్నంలాంటిది. ఈ జీవితంలో మనం చేసే పనులన్నింటి వల్లా మనం పొందే లాభం ఏమీ లేదు.

షేర్ చేయి
Read ప్రసంగి 2

ప్రసంగి 2:1-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

కానీ నిన్ను సంతోషముచేత శోధించి చూతును; –నీవు మేలు ననుభవించి చూడుమని నేను నా హృదయముతో చెప్పుకొంటిని; అయితే అదియు వ్యర్థప్రయత్న మాయెను. నవ్వుతో– నీవు వెఱ్ఱిదానవనియు, సంతోష ముతో–నీచేత కలుగునదేమియనియు నేవంటిని. నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రదుకుకాలమంతయు మనుష్యులు ఏమిచేసి మేలు అనుభవింతురో చూడవలెనని తలచి, నా దేహమును ద్రాక్షారసముచేత సంతోషపరచుకొందుననియు, మతి హీనతయొక్క సంగతి అంతయు గ్రహింతుననియు నా మనస్సులో నేను యోచన చేసికొంటిని. నేను గొప్ప పనులు చేయబూనుకొంటిని, నాకొరకు ఇండ్లు కట్టించు కొంటిని, ద్రాక్షతోటలు నాటించుకొంటిని. నాకొరకు తోటలను శృంగారవనములను వేయించుకొని వాటిలో సకలవిధములైన ఫలవృక్షములను నాటించితిని. వృక్షముల నారుమళ్లకు నీరుపారుటకై నేను చెరువులు త్రవ్వించు కొంటిని. పనివారిని పని కత్తెలను సంపాదించుకొంటిని; నా యింట పుట్టిన దాసులు నాకుండిరి; యెరూషలేమునందు నాకు ముందుండిన వారందరికంటె ఎక్కువగా పసుల మందలును గొఱ్ఱె మేకల మందలును బహు విస్తారముగా సంపాదించుకొంటిని. నాకొరకు నేను వెండి బంగారములను, రాజులు సంపాదించు సంపదను, ఆయా దేశములలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని; నేను గాయకులను గాయకురాండ్రను మనుష్యులిచ్ఛయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచు కొంటిని. నాకు ముందు యెరూషలేమునందున్న వారందరి కంటెను నేను ఘనుడనై అభివృద్ధి నొందితిని; నా జ్ఞానము నన్ను విడిచి పోలేదు. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండ నేను అభ్యంతరము చేయలేదు; మరియు నా హృదయము నా పనులన్నిటినిబట్టి సంతో షింపగా సంతోషకరమైనదేదియు అనుభవించకుండ నేను నా హృదయమును నిర్బంధింపలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగము. అప్పుడు నేను చేసిన పనులన్నియు, వాటికొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నియు వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను, సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడెను.

షేర్ చేయి
Read ప్రసంగి 2

ప్రసంగి 2:1-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

“ఇప్పుడు, మంచి ఏమిటో తెలుసుకోవడానికి సంతోషం చేత నిన్ను పరీక్షిస్తాను” అని నాలో నేను అనుకున్నాను. కాని ఇది కూడా అర్థరహితమేనని తెలిసింది. నవ్వుతో, “నీది వెర్రితనమని”, ఆనందంతో, “నీవు ఏమి సాధిస్తావు?” అని నేను అన్నాను. నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను. నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను. తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను. పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను. దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి. నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు. నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది. నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే. అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.

షేర్ చేయి
Read ప్రసంగి 2