ప్రసంగి 2:1-11

ప్రసంగి 2:1-11 OTSA

“ఇప్పుడు, మంచి ఏమిటో తెలుసుకోవడానికి సంతోషం చేత నిన్ను పరీక్షిస్తాను” అని నాలో నేను అనుకున్నాను. కాని ఇది కూడా అర్థరహితమేనని తెలిసింది. నవ్వుతో, “నీది వెర్రితనమని”, ఆనందంతో, “నీవు ఏమి సాధిస్తావు?” అని నేను అన్నాను. నా మనస్సు ఇంకా నన్ను జ్ఞానంతో నడిపిస్తూ ఉండగానే, ద్రాక్షరసంతో నన్ను నేను తృప్తిపరుచుకోవాలని, బుద్ధిహీనత వలన ఉపయోగం తెలుసుకోవాలని అనుకున్నాను. ఆకాశం క్రింద తాము జీవించే కొన్ని రోజుల్లో మనుష్యులు ఏమి చేస్తే మంచిదో చూడాలనుకున్నాను. నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను. తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను. పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను. దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి. నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు. నాకన్నా ముందు యెరూషలేములోని వారందరికంటే నేనెంతో గొప్పవాడినై ఎంతో వృద్ధి చెందాను. వీటన్నిటిలో నా జ్ఞానం నాతోనే ఉంది. నా కళ్లు కోరినవాటిలో దేన్ని చూడకుండ నేను నిరాకరించలేదు; సంతోషాలను అనుభవించకుండా నా హృదయాన్ని ఆటంకపరచలేదు. నా పనులన్నిటిని బట్టి నా హృదయం సంతోషించింది. నా శ్రమంతటికి కలిగిన ఫలితం ఇదే. అయితే, నా చేతులు చేసిన పనులన్నిటిని వాటికోసం నేను పడిన శ్రమనంతటి పరిశీలిస్తే, అవన్నీ అర్థరహితమే అని, గాలికి ప్రయాసపడినట్లే అని తెలుసుకున్నాను. సూర్యుని క్రింద లాభకరమైనదేదీ లేదని నేను గ్రహించాను.

Read ప్రసంగి 2