ప్రసంగి 10:1-9
ప్రసంగి 10:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పరిమళతైలంలో పడిన చచ్చిన ఈగలు దానికి చెడు వాసన తెచ్చినట్లు, కొంచెం మూర్ఖత్వం జ్ఞానాన్ని ఘనతను పాడుచేస్తుంది. జ్ఞాని హృదయం కుడి చేతిలో ఉంటుంది, కాని మూర్ఖుడి హృదయం ఎడమ చేతిలో ఉంటుంది. తెలివిలేనివారు దారిలో సరిగా నడవలేక వారు ఎంత తెలివితక్కువ వారు అనేది అందరికి చూపిస్తారు. వారు ఎంత తెలివితక్కువ వారు అనేది, మీ ఉద్యోగాన్ని వదిలేయవద్దు; ప్రశాంతత గొప్ప నేరాలు జరుగకుండ ఆపుతుంది. నేను సూర్యుని క్రింద ఒక చెడ్డ విషయాన్ని చూశాను, ఒక పాలకుడు పొరపాటున చేసిన అన్యాయం: అదేమిటంటే మూర్ఖులను ఉన్నత పదవులలో, సమర్థులను దిగువ స్థాయిలో ఉంచడమే. నేను బానిసలు గుర్రాలపై, యువరాజులు బానిసల్లా కాలినడకన వెళ్లడం చూశాను. గొయ్యి త్రవ్వినవారే అందులో పడతారు; గోడను పడగొట్టిన వారే పాము కాటుకు గురవుతారు. రాళ్లు దొర్లించేవారు దానివల్ల గాయపడతారు; మొద్దులను చీల్చేవారు వాటి వల్ల ప్రమాదానికి గురి అవుతారు.
ప్రసంగి 10:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పరిమళ తైలంలో ఈగలు పడి చస్తే అది దుర్వాసన కొడుతుంది. కొంచెం మూర్ఖత్వం త్రాసులో వేసి చూస్తే జ్ఞానాన్ని, గౌరవాన్ని తేలగొడుతుంది. జ్ఞాని హృదయం అతణ్ణి కుడి చేతితో పని చెయ్యిస్తుంది, మూర్ఖుడి హృదయం అతని ఎడమ చేతితో పని చేయిస్తుంది. మూర్ఖుడు మార్గంలో సరిగా నడుచుకోవడం చేతకాక తాను మూర్ఖుణ్ణి అని అందరికి తెలిసేలా చేసుకుంటాడు. యజమాని నీ మీద కోపపడితే నీ ఉద్యోగాన్ని విడిచి పెట్టకు. నీ సహనం ఘోరమైన తప్పిదాలు జరక్కుండా చేస్తుంది. రాజులు పొరపాటుగా చేసే అన్యాయం నేను ఒకటి చూశాను. ఏమంటే మూర్ఖులను పెద్ద పదవుల్లో, గొప్పవారిని వారి కింద నియమించడం. సేవకులు గుర్రాల మీద స్వారీ చేయడం, అధిపతులు సేవకుల్లా నేల మీద నడవడం నాకు కనిపించింది. గొయ్యి తవ్వేవాడు కూడా దానిలో పడే అవకాశం ఉంది. ప్రహరీ గోడ పడగొట్టే వాణ్ణి పాము కరిచే అవకాశం ఉంది. రాళ్లు దొర్లించే వాడికి అది గాయం కలిగించవచ్చు. చెట్లు నరికే వాడికి దానివలన అపాయం కలగొచ్చు.
ప్రసంగి 10:1-9 పవిత్ర బైబిల్ (TERV)
అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలేచాలు. అదే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు. వివేకవంతుడి ఆలోచనలు అతన్ని సరైన మార్గంలో నడిపిస్తాయి. అయితే, అవివేకి అలోచనలు అతన్ని తప్పు మార్గంలో నడిపిస్తాయి. మూర్ఖుడు అలా దారి వెంట పోయేటప్పుడు సైతం తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తాడు. దానితో, వాడొక మూర్ఖుడన్న విషయాన్ని ప్రతి ఒక్కడూ గమనిస్తాడు. యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నీవు నీ కొలువు వదిలెయ్యబోకు. నీవు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్ద పెద్ద పొరపాట్లను కూడా నీవు సరిదిద్దవచ్చు. ప్రపంచంలో జరిగే మరో అంశం నా దృష్టికి వచ్చింది. అది సమంజసమైనది కాదు. సాధారణంగా అది పరిపాలకులు చేసే పొరపాటు: అవివేకులకు ముఖ్యమైన పదవులు, జ్ఞాన సంపన్నులకు అప్రధానమైన పదవులు కట్టబెడతారు. సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను చూశాను. గొయ్యి తవ్వే వ్యక్తి, తానే దానిలో పడవచ్చు. గోడ కూలగొట్టేవాణ్ణి పాము కాటెయ్యవచ్చు. పెద్దబండలను దొర్లించేవాడికి వాటివల్లనే గాయాలు కావచ్చు. చెట్లు నరికేవాడికి కూడా ప్రమాదం లేకపోలేదు, (ఆ చెట్లు అతని మీద కూలవచ్చు.)
ప్రసంగి 10:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
బుక్కా వాని తైలములో చచ్చిన యీగలు పడుట చేత అది చెడువాసన కొట్టును; కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచినయెడల జ్ఞానమును ఘనతను తేల గొట్టును. జ్ఞానియొక్క హృదయము అతని కుడిచేతిని ఆడించును, బుద్ధిహీనుని హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. బుద్ధిహీనుడు తన ప్రవర్తననుగూర్చి అధైర్య పడి–తాను బుద్ధిహీనుడని అందరికి తెలియజేయును. ఏలువాడు నీమీద కోపపడినయెడల నీ ఉద్యోగమునుండి నీవు తొలగిపోకుము; ఓర్పు గొప్ప ద్రోహకార్యములు జరుగకుండ చేయును. పొరపాటున అధిపతిచేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు పనివారు గుఱ్ఱములమీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును. రాళ్లు దొర్లించువాడు వాటిచేత గాయమునొందును; చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును.
ప్రసంగి 10:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)