ప్రసంగి 1:1-9
ప్రసంగి 1:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
యెరూషలేమును పరిపాలించే రాజు, దావీదు కొడుకూ అయిన ప్రసంగి మాటలు. పొగమంచులో ఆవిరిలాగా, గాలి కదలిక లాగా ప్రతిదీ మాయమైపోతున్నదని ప్రసంగి చెబుతున్నాడు. అది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తున్నది. సూర్యుని కింద మానవులు పడే కష్టం వలన వారికేం లాభం? ఒక తరం గతించిపోతుంటే ఇంకో తరం వస్తూ ఉంది. భూమి మాత్రం ఎప్పుడూ స్థిరంగా నిలిచి ఉంది. సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. మళ్ళీ ఉదయించాల్సిన స్థలం చేరడానికి త్వరపడతాడు. గాలి దక్షిణ దిక్కుకు వీచి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరుగుతుంది. అలా తన దారిలో మళ్ళీ మళ్ళీ వీస్తూ తిరిగి వస్తున్నది. నదులన్నీ సముద్రంలోకే వెళ్తున్నాయి గానీ అది ఎప్పటికీ నిండడం లేదు. నదుల నీరంతా అవి ఎక్కడనుండి పారుతూ వస్తున్నాయో అక్కడికే వెళ్లి తిరిగి సముద్రంలోకి వెళ్తున్నాయి. మధ్యలో విశ్రాంతి లేకుండా అన్నీ అలసటతోనే జరిగిపోతున్నాయి. మానవులు దాన్ని వివరించలేరు. చూసే వాటి విషయంలో కంటికి తృప్తి కలగడం లేదు. వినే వాటి విషయంలో చెవికి తృప్తి కలగడం లేదు. ఇంతవరకూ ఉన్నదే ముందు కూడా ఉంటుంది. ఇంతవరకూ జరిగిందే ఇక ముందూ జరుగుతుంది. ఇది కొత్తది అని చెప్పదగినది సూర్యుని కింద ఏదీ లేదు.
ప్రసంగి 1:1-9 పవిత్ర బైబిల్ (TERV)
ఇవి దావీదు కుమారుడును, యెరూషలేము రాజు అయిన ప్రసంగి చెప్పిన మాటలు. అన్నీ చాల అర్థరహితాలు. “సమస్తం వృధా కాలయాపన!” అంటాడు ప్రసంగి. ఈ జీవితంలో తాము చేసే కాయ కష్టమంతటికీ మనుష్యులు లాభం ఏమైనా పొందుతున్నారా? (లేదు!) ఒక తరం మారి మరొకతరం వస్తుంది. కాని, ఈ భూమి శాశ్వతంగా ఉంటుంది. సూర్యుడు ఉదయించును మరియు అస్తమించును. మరల ఉదయించే చోటుకు త్వరగా వెళతాడు. గాలి దక్షిణ దిశకి వీస్తుంది, తిరిగి ఉత్తర దిశకి వీస్తుంది. గాలి, చుట్టూ తిరిగి తిరిగి చివరకు తాను బయల్దేరిన చోటుకే రివ్వున వస్తుంది. నదులన్నీ మరల మరల ఒక్క చోటుకే ప్రవహిస్తాయి. అవన్నీ సముద్రంలోకే పోయి పడినా సముద్రం నిండదు. ఆయా విషయాలను మాటలు పూర్తిగా వివరించలేవు. అయితేనేమి, మనుష్యులు మాట్లాడుతూనే వుంటారు. మాటలు మళ్లీ మళ్లీ మన చెవుల్లో పడుతూనే వుంటాయి. అయినా, మన చెవులకి తృప్తి తీరదు. మన కళ్లు ఎన్నింటినో చూస్తూ ఉంటాయి. అయినా మనకి తనివి తీరదు. అన్నీ ఆదినుంచి ఉన్నట్లే కొనసాగుతున్నాయి. ఇంతకు ముందు జరిగినవే ఇక ముందూ ఎల్లప్పుడూ జరుగుతాయి. ఈ జీవితంలో కొత్తదంటూ ఏదీ లేదు.
ప్రసంగి 1:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దావీదు కుమారుడును యెరూషలేములో రాజునైయుండిన ప్రసంగి పలికిన మాటలు. –వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యునిక్రింద నరులు పడుచుండు పాటు అంతటివలన వారికి కలుగుచున్న లాభ మేమి? తరము వెంబడి తరము గతించి పోవుచున్నది; భూమియొకటే యెల్లప్పుడును నిలుచునది. సూర్యుడుదయించును, సూర్యుడు అస్తమించును, తానుదయించు స్థలము మరల చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును; ఇట్లు మరల మరల తిరుగుచు తన సంచారమార్గమున తిరిగి వచ్చును. నదులన్నియు సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు; నదులు ఎక్కడనుండి పారివచ్చునో అక్కడికే అవి ఎప్పుడును మరలిపోవును ఎడతెరిపిలేకుండ సమస్తము జరుగుచున్నది; మనుష్యులు దాని వివరింప జాలరు; చూచుటచేత కన్ను తృప్తిపొందకున్నది, వినుటచేత చెవికి తృప్తికలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.
ప్రసంగి 1:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
దావీదు కుమారుడును యెరూషలేము రాజును అయిన ప్రసంగి మాటలు: ఈ ప్రసంగి ఇలా అంటున్నాడు, “అర్థరహితం! అర్థరహితం! అంతా అర్థరహితమే.” సూర్యుని క్రింద మనుష్యులు కష్టించి పని చేయడం వలన వారికి కలిగే లాభం ఏమిటి? తరాలు వస్తాయి తరాలు పోతాయి, కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, తాను ఉదయించే చోటుకు మరలా చేరాలని త్వరపడుతున్నాడు. గాలి దక్షిణం వైపు వీస్తూ అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; అది సుడులు సుడులుగా తిరుగుతూ, తన దారిలోనే తిరిగి వస్తుంది. నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి, అయినా సముద్రం ఎప్పటికీ నిండదు. నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో అక్కడికే తిరిగి వెళ్తాయి. అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి, మనుష్యులు దానిని వివరించలేరు. ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు. ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు. ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.