ద్వితీయోపదేశకాండము 29:2-29

ద్వితీయోపదేశకాండము 29:2-29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

మోషే ఇశ్రాయేలీయులందరిని పిలిపించి, వారితో ఇలా అన్నాడు: యెహోవా ఈజిప్టులో ఫరోకు అతని అధికారులందరికి, అతని దేశమంతటికి చేసింది మీ కళ్లు చూశాయి. మీ కళ్లతో మీరు ఆ గొప్ప పరీక్షలను, ఆ అసాధారణ గుర్తులను, గొప్ప అద్భుతాలను చూశారు. అయినా నేటి వరకు గ్రహించే మనస్సును గాని, చూసే కళ్లను గాని, వినే చెవులను గాని యెహోవా మీకు ఇవ్వలేదు. అయినప్పటికీ యెహోవా అంటున్నారు, “నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన నలభై సంవత్సరాల్లో, మీ బట్టలు గాని, కాళ్ల చెప్పులు గాని పాతగిల్లలేదు. మీరు రొట్టెలు తినలేదు ద్రాక్షరసం గాని మద్యం గాని త్రాగలేదు. నేనే మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకుంటారని ఇలా చేశాను.” మీరిక్కడికి వచ్చినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనతో పోరాడడానికి వచ్చారు, కాని మనం వారిని ఓడించాము. మనం వారి దేశాన్ని స్వాధీనపరచుకుని రూబేనీయులకు, గాదీయులకు, మనష్షే అర్థగోత్రానికి వారసత్వంగా దాన్ని ఇచ్చాము. ఈ ఒడంబడిక షరతులను జాగ్రత్తగా పాటించాలి, తద్వార మీరు చేసేవాటన్నిటిలో మీరు వృద్ధిచెందుతారు. మీ దేవుడైన యెహోవా మీతో చెప్పిన ప్రకారం మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారం, నేడు మిమ్మల్ని తనకు ప్రజలుగా నియమించుకొని తానే మీకు దేవుడైయుండేలా మీ దేవుడైన యెహోవా నేడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణంలోను మీరు ఈ రోజున మీరంతా అనగా మీ నాయకులు, ముఖ్య పురుషులు, మీ పెద్దలు, అధికారులు, ఇశ్రాయేలీయులలో ఇతర పురుషులందరు, మీ పిల్లలు, మీ భార్యలు, మీ పాళెంలో నివసిస్తున్న విదేశీయులు, మీ కట్టెలను నరికేవారు, మీ నీటిని తోడేవారు, అందరు నేడు మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడికలోకి ప్రవేశించడానికి ఇక్కడ నిలబడి ఉన్నారు, ఈ రోజు యెహోవా ప్రమాణం చేయడం ద్వారా, ఈ రోజు మిమ్మల్ని తన ప్రజలుగా నియమించుకొని, ఆయన మీకు వాగ్దానం చేసినట్లుగా మీ తండ్రులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రమాణం చేసినట్లుగా మీ దేవునిగా ఉంటారు. నేను ఈ ఒడంబడిక ప్రమాణాన్ని మీతో మాత్రమే కాదు, మన దేవుడైన యెహోవా సన్నిధిలో మాతోపాటు నిలబడి ఉన్నవారితో కూడా చేస్తున్నాను. మా దేవుడైన యెహోవా సన్నిధిలో ఈ రోజు మాతో పాటు నిలబడ్డ వారు కానీ ఈ రోజు ఇక్కడ లేని వారితో కూడా ఉన్నారు. మేము ఈజిప్టులో ఎలా జీవించామో, ఇక్కడి మార్గంలో దేశాల గుండా ఎలా వెళ్లామో మీకే తెలుసు. వాటిలో మీరు వారి అసహ్యకరమైన చిత్రాలు చెక్క రాతి, వెండి బంగారు విగ్రహాలను చూశారు. ఆ దేశాల దేవుళ్ళను సేవించడానికి వెళ్లి మన దేవుడైన యెహోవా నుండి తమ హృదయాన్ని మనస్సు ప్రక్కకు త్రిప్పుకున్న పురుషుడు గాని, స్త్రీ గాని, వంశం గాని గోత్రం గాని లేరనే విషయాన్ని నిర్ధారించుకోండి; అటువంటి చేదు విషాన్ని ఉత్పత్తి చేసే మూలం మీ మధ్యలో లేదనేది నిర్ధారించుకోండి. అలాంటి వ్యక్తులు ఈ ప్రమాణం యొక్క మాటలు విన్నప్పుడు, వారు తమ మీదికి ఆశీర్వాదాన్ని ఆహ్వానించుకుంటూ, “నేను నా సొంత మార్గంలో వెళ్లాలని పట్టుదలతో ఉన్నప్పటికీ, నేను సమాధానం కలిగి ఉంటాను” అని అనుకుంటారు, వారు నీటితో తడపబడిన భూమిపైకి, అలాగే ఎండిన భూమిపైకి విపత్తును తెస్తారు. యెహోవా వారిని క్షమించడానికి ఎన్నటికీ ఇష్టపడరు; ఆయన కోపం, రోషం వారిపై భగ్గుమంటాయి. ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ వారి పైకి వస్తాయి, యెహోవా ఆకాశం క్రిందనుండి వారి పేర్లను తుడిచివేస్తారు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడిక యొక్క అన్ని శాపాల ప్రకారం, కీడు కలుగజేయడానికి యెహోవా వారిని ఇశ్రాయేలు యొక్క అన్ని గోత్రాల నుండి వేరు చేస్తారు. తర్వాతి తరాలలో మిమ్మల్ని అనుసరించే మీ పిల్లలు, సుదూర దేశాల నుండి వచ్చిన విదేశీయులు, దేశంపై పడిన ఆపదలను, వ్యాధులను వేటితోనైతే యెహోవా దాన్ని బాధించారో చూస్తారు. దేశమంతా ఉప్పు, గంధకం చేత తగలబడుతున్న వ్యర్థంలా ఉంటుంది అనగా ఏదీ నాటబడదు, ఏదీ మొలకెత్తదు, దానిపై ఏ కూరగాయలు పెరగవు. ఈ నాశనం యెహోవా తీవ్ర కోపంతో పడగొట్టిన సొదొమ గొమొర్రా, అద్మా, సెబోయిము పట్టణాల నాశనంలా ఉంటుంది. దేశాలన్నీ, “ఈ దేశానికి యెహోవా ఎందుకు ఇలా చేశారు? ఎందుకు ఈ భయంకరమైన, మండుతున్న కోపం?” అని అడుగుతాయి. దానికి సమాధానం ఇలా ఉంటుంది: “ఈ ప్రజలు తమ పూర్వికుల దేవుడైన యెహోవా ఒడంబడికను, ఆయన వారిని ఈజిప్టు నుండి బయటకు తీసుకువచ్చినప్పుడు ఆయన వారితో చేసుకున్న ఒడంబడికను విడిచిపెట్టారు. వారు వెళ్లి ఇతర దేవుళ్ళను సేవించారు, వారికి నమస్కరించారు, వారు వారికి తెలియని దేవుళ్ళు, ఆయన వారికి ఇవ్వని దేవుళ్ళు. అందువల్ల ఆ దేశంపై యెహోవా కోపం భగ్గుమంది, అందుకే గ్రంథంలో వ్రాయబడి ఉన్న అన్ని శాపాలను ఆయన వారి పైకి తీసుకువచ్చారు. యెహోవా భీకరమైన కోపంలో, గొప్ప క్రోధంలో వారి దేశంలో నుండి వారిని పెకిలించి, ఇప్పుడున్నట్లుగా, వారిని వేరే దేశంలోకి నెట్టివేశారు.” రహస్య విషయాలు మన దేవుడైన యెహోవాకు చెందినవి, కానీ వెల్లడించబడిన విషయాలు మనకు మన పిల్లలకు ఎప్పటికీ ఉంటాయి, ఈ ధర్మశాస్త్రంలోని మాటలన్నిటినీ మనం పాటించాలి.

ద్వితీయోపదేశకాండము 29:2-29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి వారితో ఇలా చెప్పాడు. “యెహోవా మీ కళ్ళ ఎదుట ఐగుప్తు దేశంలో ఫరోకు, అతని సేవకులందరికీ అతని దేశమంతటికీ చేసినదంతా, అంటే తీవ్రమైన ఆ బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు. అయినప్పటికీ గ్రహించే హృదయాన్నీ చూసే కళ్ళనూ వినే చెవులనూ ఇప్పటికీ యెహోవా మీకు ఇవ్వలేదు. నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకొనేలా 40 ఏళ్ళు నేను మిమ్మల్ని ఎడారిలో నడిపించాను. మీ దుస్తులు మీ ఒంటి మీద పాతబడలేదు. మీ చెప్పులు మీ కాళ్ల కింద అరిగిపోలేదు. మీరు రొట్టెలు తినలేదు, ద్రాక్షారసం గానీ, మద్యం గానీ తాగలేదు. మీరు ఈ ప్రాంతానికి చేరినప్పుడు హెష్బోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మనపై దండెత్తినప్పుడు మనం వారిని హతమార్చి వాళ్ళ దేశాలను స్వాధీనం చేసుకుని రూబేను, గాదు, మనష్షే అర్థగోత్రాల వాళ్లకు వారసత్వంగా ఇచ్చాము. కాబట్టి మీరు చేసేదంతా సవ్యంగా జరిగేలా ఈ నిబంధన కట్టడలు పాటించి, వాటి ప్రకారం ప్రవర్తించండి. మీరంతా ఈ రోజు మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. ఇశ్రాయేలు ప్రజల్లో ప్రతివాడూ, అంటే మీ నాయకులూ, గోత్రాల ప్రజలూ, పెద్దలూ, అధికారులూ, పిల్లలూ, మీ భార్యలూ మీ శిబిరంలో ఉన్న పరదేశులూ, కట్టెలు నరికేవాడు మొదలుకుని మీకు నీళ్లు తోడేవారి వరకూ అందరూ ఇక్కడ నిలబడ్డారు. మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించినట్టు, మీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణం చేసిన విధంగా ఈ రోజు మిమ్మల్ని తన స్వంత ప్రజగా నియమించుకుని తానే మీకు దేవుడుగా ఉండాలని మీ దేవుడైన యెహోవా సంకల్పించాడు. ఈనాడు మీకు నియమిస్తున్న మీ దేవుడైన యెహోవా నిబంధనలో, ఆయన ప్రమాణం చేసిన దానిలో మీరు పాలు పొందడానికి ఇక్కడ నిలబడ్డారు. నేను ఈ నిబంధన, ఈ ప్రమాణం చేసేది మీతో మాత్రమే కాదు, ఇక్కడ మనతో, మన దేవుడైన యెహోవా ఎదుట నిలబడిన వాళ్ళతో ఇక్కడ ఈ రోజు మనతో కూడ కలవని వారితో కూడా చేస్తున్నాను. మనం ఐగుప్తు దేశంలో ఎలా నివసించామో, మీరు దాటి వచ్చిన ప్రజల మధ్యనుంచి మనమెలా దాటివచ్చామో మీకు తెలుసు. వారి నీచమైన పనులూ, కర్ర, రాయి, వెండి, బంగారంతో చేసిన విగ్రహాలను మీరు చూశారు. ఆ దేశాల ప్రజల దేవుళ్ళను పూజించడానికి మన దేవుడైన యెహోవా దగ్గర నుంచి తొలగే హృదయం, మీలో ఏ పురుషునికీ ఏ స్త్రీకీ ఏ కుటుంబానికీ ఏ గోత్రానికీ ఉండకూడదు. అలాంటి చేదైన విషం పుట్టించే మూలాధారం మీమధ్య ఉండకూడదు. అలాంటివాడు ఈ శిక్ష విధులు విన్నప్పుడు, తన హృదయంలో తనను తాను పొగడుకుంటూ ‘నేను నా హృదయాన్ని కఠినం చేసుకుంటున్నాను, నాకు క్షేమమే కలుగుతుంది’ అనుకుంటాడు. యెహోవా అలాంటివాణ్ణి క్షమించడు. యెహోవా కోపం, రోషం అతని మీద రగులుకుంటుంది. ఈ గ్రంథంలో రాసి ఉన్న శాపాలన్నీ వాడికి ప్రాప్తిస్తాయి. యెహోవా అతని పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచి వేస్తాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న నిబంధన శాపాలన్నిటి ప్రకారం శిక్షించడానికి యెహోవా ఇశ్రాయేలు ప్రజల గోత్రాలన్నిటిలో నుంచి అతణ్ణి వెళ్ళ గొట్టేస్తాడు. కాబట్టి రాబోయే తరం వారు, మీ తరువాత పుట్టే మీ సంతానం, చాలా దూరం నుంచి వచ్చే పరాయి దేశీయులు మీ దేశానికి యెహోవా రప్పించిన తెగుళ్లనూ రోగాలనూ చూస్తారు. యెహోవా తన కోపోద్రేకంతో నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయీము పట్టణాలవలె ఆ ప్రాంతాలన్నీ గంధకంతో, ఉప్పుతో చెడిపోయి, విత్తనాలు మొలకెత్తకుండా, పంటలు పండకపోవడం చూసి, వారు యెహోవా ఈ దేశాన్ని ఎందుకిలా చేశాడు? ఇంత తీవ్రమైన కోపానికి కారణం ఏమిటి? అని చెప్పుకుంటారు. అప్పుడు ప్రజలు ఇలా చెబుతారు. ‘వారి పితరుల దేవుడు యెహోవా ఐగుప్తు దేశం నుంచి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు లక్ష్యపెట్టలేదు. తమకు తెలియని అన్య దేవుళ్ళను, మొక్కవద్దని యెహోవా వారికి చెప్పిన దేవుళ్ళకు మొక్కి, పూజించారు. కాబట్టి ఈ గ్రంథంలో రాసిన శిక్షలన్నీ ఈ దేశం మీదికి రప్పించడానికి దాని మీద యెహోవా కోపాగ్ని రగులుకుంది. యెహోవా తన తీవ్రమైన కోపాగ్నితో, ఉగ్రతతో వాళ్ళను తమ దేశం నుంచి పెళ్ళగించి, వేరొక దేశానికి వెళ్లగొట్టాడు. ఇప్పటి వరకూ వాళ్ళు అక్కడే ఉండిపోయారు.’ రహస్యంగా ఉండే విషయాలన్నీ మన దేవుడు యెహోవాకు చెందుతాయి. అయితే మనం ఈ ధర్మశాస్త్ర విధులన్నిటి ప్రకారం నడుచుకోవడానికి మనకు వెల్లడైన సంగతులు మాత్రం ఎప్పటికీ మనకూ, మన సంతానానికీ చెందుతాయి.”

ద్వితీయోపదేశకాండము 29:2-29 పవిత్ర బైబిల్ (TERV)

మోషే ఇశ్రాయేలు ప్రజలందిర్నీ సమావేశపర్చాడు. అతను వాళ్లతో ఇలా చేప్పాడు: “ఈజిప్టు దేశంలో యెహోవా చేసిన వాటన్నింటినీ మీరు చూసారు. ఫరోకు, ఫరో నాయకులకు, అతని దేశం అంతటికీ యెహోవా చేసిన వాటిని మీరు చూసారు. ఆయన వాళ్లకు కలిగించన గొప్ప కష్టాలు అన్నీ మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు మీరు చూసారు. కానీ జరిగిందేమిటో ఈ రోజూకూ మీకు అర్థంకాలేదు. మీరు చూసిన దానిని, విన్నదానిని యెహోవా మీకు అర్థం కానివ్వలేదు. 40 సంవత్సరాలు యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించాడు. ఆ కాలం అంతటిలో మీ బట్టలు పాతబడలేదు, మీ చెప్పులు అరిగిపోలేదు. మీ వద్ద భోజనం ఏమీలేదు. ద్రాక్షారసంగాని తాగేందుకు మరేదీగాని మీ దగ్గరలేదు. కానీ మీ విషయంలో యెహోవా శ్రద్ధతీసుకొన్నాడు. ఆయన మీ దేవుడైన యెహోవా అని మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఇలా చేసాడు. “మీరు ఈ స్థలానికి వచ్చినప్పుడు, హెష్భోను రాజు సీహోను, బాషాను రాజు ఓగు మన మీద యుద్ధానికి వచ్చారు. కానీ మనం వాళ్లను ఓడించాం. అప్పుడు వారి దేశాన్ని మనం స్వాధీనం చేసుకొని, రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్థగోత్రం వారికి స్వంతంగా ఇచ్చాము. కనుక ఈ ఒడంబడికలోని ఆదేశాలకు పూర్తిగా లోబడుతుంటే మీరు చేసే ప్రతి దానిలో మీరు విజయం పొందుతూ ఉంటారు. “ఈ వేళ మీరంతా ఇక్కడ మీ దేవుడైన యెహోవా ఎదుట నిలబడ్డారు. మీ నాయకులు, మీ అధికారులు, మీ పెద్దలు, మిగిలిన మనుష్యులంతా ఇక్కడ ఉన్నారు. మీ భార్యలు, పిల్లలు ఇక్కడ ఉన్నారు. మీ మధ్య నివసిస్తూ, మీ కట్టెలు కొట్టి, మీకు నీళ్లు మోసే విదేశీయులు కూడా ఇక్కడ ఉన్నారు. మీరంతా మీ దేవుడైన యెహోవాతో ఒక ఒడంబడిక చేసుకొనేందుకు ఇక్కడ ఉన్నారు. యెహోవా నేడు మీతో ఈ ఒడంబడిక చేస్తున్నాడు. ఈ ఒడంబడిక మూలంగా యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటున్నాడు. మరియు సాక్షాత్తూ ఆయనే మీకు దేవుడుగా ఉంటాడు. ఇది ఆయన మీతో చెప్పాడు. మీ పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన దీనిని వాగ్దానం చేశాడు. యెహోవా ఈ వాగ్దానాలన్నింటితో కూడిన ఈ ఒడంబడికను మీతో మాత్రమే చేయటం లేదు. ఈ వేళ ఇక్కడ మన దేవుడైన యెహోవా యెదుట నిలిచిన మనందరితో ఆయన ఈ ఒడంబడిక చేస్తున్నాడు. అయితే ఈనాడు ఇక్కడ మనతో లేని మన సంతానానికి కూడ ఈ ఒడంబడిక వర్తిస్తుంది. మనం ఈజిప్టు దేశంలో ఎలా జీవించామో మీకు జ్ఞాపకమే. ఇక్కడికి వచ్చే మార్గంలో ఉన్న దేశాల్లోంచి మనం ఎలా ప్రయాణం చేసామో అదీ మీకు జ్ఞాపకమే. చెక్క, రాయి, వెండి, బంగారంతో వారు చేసిన అసహ్యమైన విగ్రహాలను మీరు చూసారు. ఈ వేళ ఇక్కడ ఉన్న పురుషుడుగాని, స్త్రీగాని, కుటుంబంగాని, వంశం గాని మీ దేవుడైన యెహోవా నుండి తిరిగిపోకుండా గట్టి జాగ్రత్తలో ఉండండి. ఏ వ్యక్తి కూడా పోయి ఆ రాజ్యల దేవుళ్లను సేవించకూడదు. అలా చేసేవాళ్లు చేదైన విష ఫలాలు ఫలించే మొక్కల్లా ఉంటారు. “ఒక వ్యక్తి ఈ శాపాలన్నీ విని, ‘నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూనే ఉంటాను. నాకేమీ కీడు సంభవించదు’ అంటూ తనను తాను ఆదరించుకో వచ్చును. ఆ వ్యక్తి తనకు మాత్రమేగాక ప్రతి ఒక్కరికీ చివరకు మంచి వాళ్లకుకూడ కీడు జరిగిస్తాడు. ఆ వ్యక్తిని యోహోవ క్షమించడు. మరియు, ఆ వ్యక్తిమీద యెహోవాకు కోపం వస్తుంది, యెహోవా ఆ వ్యక్తిని శిక్షిస్తాడు. ఇశ్రాయేలు వంశాలన్నింటి నుండీ యెహోవా అతణ్ణి వేరు చేసేస్తాడు. యెహోవా అతన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడిన కీడులన్నీ అతనికి సంభవిస్తాయి. ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ఒడంబడికలో ఆ విషయాలన్నీ ఒక భాగం: “భవిష్యత్తులో మీ సంతానంవారు, దూరదేశాల్లోని విదేశీయులు మీ దేశం ఎలా పాడైపోయిందో చూస్తారు. యెహోవా దాని మీదికి రప్పించిన రోగాలను వారు చూస్తారు. దేశం అంతా మండే గంధకం, ఉప్పుతో నిష్ప్రయోజనంగా ఉంటుంది. దేశంలో ఏమీ నాట బడదు ఏవీ, చివరకు గురుగులుకూడ పెరగవు. యెహోవా చాలా కోపగించినప్పుడు నాశనం చేసిన సొదొమ, గొమొర్రా, అద్మా, జెబోయిం పట్టణాల్లా ఈ దేశం ఉంటుంది. “‘యెహోవా ఈ దేశానికి ఎందుకు ఇలా చేసాడు? ఆయనకు ఎందుకు ఇంతకోపం వచ్చింది?’ అని ఇతర రాజ్యాలన్నీ అడుగుతాయి. జవాబు ఇదే: ‘ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకుల దేవుడైన యెహోవా ఒడంబడికను విడిచిపెట్టేసారు గనుక యెహోవాకు కోపం వచ్చింది. యెహోవా వారిని ఈజిప్టు దేశంనుండి బయటకు తీసుకొనివచ్చినప్పుడు ఆయన వారితో చేసిన ఒడంబడికను పాటించటం వాళ్లు మానివేసారు. ఇశ్రాయేలు ప్రజలు ఇదివరకు ఎన్నడూ ఆరాధించని ఇతర దేవుళ్లను ఆరాధించటం మొదలు పెట్టారు. ఆ దేవుళ్లను పూజించ వద్దని యెహోవా ఆ ప్రజలతో చెప్పాడు. అందువల్లనే ఈ దేశ ప్రజల మీద యెహోవాకు అంతగా కోపం వచ్చింది. అందుచేత ఈ గ్రంథంలో వ్రాయబడిన శాపాలన్నీ ఆయన వారి మీదికి రప్పించాడు. యెహోవా వారి మీద చాలా కోపగించాడు. కనుక ఆయన వాళ్లను వారి దేశంనుండి బయటకు లాగేసాడు. ఈనాడు వారు ఉన్న మరో దేశంలో ఆయన వాళ్లను ఉంచాడు.’ “మన దేవుడైన యెహోవా రహస్యంగా ఉంచిన మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఆ సంగతులు ఆయనకు మాత్రమే తెలుసు. ఆయితే యెహోవా తన ధర్మశాస్త్రాన్ని మాత్రం మనల్ని తెలసుకోనిచ్చాడు. ఆ ధర్మశాస్త్రం మనకోసం, మన సంతతివారికోసం. మనం దానికి శాశ్వతంగా విధేయులం కావాలి.

ద్వితీయోపదేశకాండము 29:2-29 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను–యెహోవా మీ కన్నులయెదుట ఐగుప్తు దేశమున ఫరోకును అతని సేవకులందరికిని అతని సమస్త జనమునకును చేసినదంతయు, అనగా ఆ గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్యములను మీరు కన్నులార చూచితిరి. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటివరకు మీకిచ్చి యుండలేదు. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలిసికొనునట్లు నలువది సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటిమీద పాతగిలిపోలేదు; మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలి పోలేదు. మీరు రొట్టె తినలేదు, ద్రాక్షారసమేగాని మద్యమేగాని త్రాగలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీరు ఈ చోటికి చేరినప్పుడు హెష్బోనురాజైన సీహోనును బాషానురాజైన ఓగును యుద్ధమునకు మనమీదికి రాగా మనము వారిని హతము చేసి వారి దేశమును స్వాధీనపరచుకొని రూబేనీయులకును గాదీయులకును మనష్షే అర్ధగోత్రపువారికిని దాని స్వాస్థ్యముగా ఇచ్చితిమి. కాబట్టి మీరు చేయునదంతయు చక్కగా జరుగునట్లు ఈ నిబంధన వాక్యములను అనుసరించి నడుచు కొనవలెను. నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారముగాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండునట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతోకూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నవారితోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనములమధ్యనుండి మనమెట్లు దాటివచ్చితిమో మీరెరుగుదురు. వారి హేయక్రియలను, కఱ్ఱతోను రాతితోను వెండితోను బంగారముతోను చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరిగదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవాయొద్ద నుండి తొలగు హృదయముగల పురుషుడేగాని స్త్రీయేగాని కుటుంబమేగాని గోత్రమేగాని నేడు మీలో ఉండకుండునట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండునట్లును, నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను వినునప్పుడు, మద్యముచేత దప్పి తీర్చుకొనవలెనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు; అట్టివాడు మీలోనుండినయెడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యునిమీద పొగరాజును; ఈ గ్రంథములో వ్రాయ బడిన శాపములన్నియువానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము క్రిందనుండకుండ తుడిచివేయును. ఈ ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటినిబట్టి వానికి కీడు కలుగజేయుటకై యెహోవా ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలోనుండి వాని వేరుపర చును. కాబట్టి మీ తరువాత పుట్టు మీ సంతతివారును దూరదేశమునుండి వచ్చు పరదేశులును సమస్త జనములును ఆ దేశముయొక్క తెగుళ్లను యెహోవా దానిమీదికి తెప్పించిన సంకటములను చూచి వారు, యెహోవా తన కోపోద్రేకముచేత నశింపజేసిన సొదొమ గొమొఱ్ఱా అద్మా సెబోయీములవలె ఆ సమస్త దేశమును గంధకముచేతను ఉప్పుచేతను చెడిపోయి, విత్తబడకయు దానిలో ఏదియు బుట్టకయు దానిలో ఏ కూరయు మొలవకయు ఉండుట చూచి –యెహోవా దేని బట్టి యీ దేశమును ఇట్లు చేసెనో? యీ మహా కోపాగ్నికి హేతువేమో? అని చెప్పుకొందురు. మరియు వారు–వారి పితరుల దేవుడైన యెహోవా ఐగుప్తు దేశములోనుండి వారిని రప్పించిన తరువాత ఆయన తమతో చేసిన నిబంధనను వారు నిరాకరించిరి తామెరుగని అన్యదేవతలను, ఆయన వారికి నియమింపని దేవతలను, పూజించి వాటికి నమస్క రించిరి గనుక యీ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నిటిని యీ దేశముమీదికి తెప్పించుటకు దానిమీద యెహోవా కోపము రవులుకొనెను. యెహోవా తన కోపోద్రేకముచేతను అత్యుగ్రతచేతను తమ దేశములోనుండి వారిని పెల్లగించి, నేడున్నట్లుగా వారిని వెళ్లగొట్టి పరదేశము పాలుచేసెను. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.

ద్వితీయోపదేశకాండము 29:2-29 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)