ద్వితీయోపదేశకాండము 28:58-68

ద్వితీయోపదేశకాండము 28:58-68 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఈ గ్రంథంలో రాసిన ఈ ధర్మశాస్త్ర సూత్రాలను పాటించి వాటి ప్రకారం ప్రవర్తించక, మీ యెహోవా దేవుని ఘనమైన నామానికి, భయభక్తులు కనపరచకపోతే యెహోవా మీకూ మీ సంతానానికీ దీర్ఘకాలం ఉండే, మానని భయంకరమైన రోగాలు, తెగుళ్ళు రప్పిస్తాడు. మీకు భయం కలిగించే ఐగుప్తు రోగాలన్నీ మీమీదికి రప్పిస్తాడు. అవి మిమ్మల్ని వదిలిపోవు. మీరు నాశనం అయ్యే వరకూ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో రాయని ప్రతి రోగం, ప్రతి వ్యాధి ఆయన మీకు తెస్తాడు. మీరు మీ యెహోవా దేవుని మాట వినలేదు కాబట్టి, అంతకుముందు మీరు ఆకాశనక్షత్రాల్లాగా విస్తరించినప్పటికీ కొద్దిమందే మిగిలి ఉంటారు. మీకు మేలు చేయడంలో, మిమ్మల్ని అభివృద్ది చేయడంలో మీ యెహోవా దేవుడు మీపట్ల ఎలా సంతోషించాడో అలాగే మిమ్మల్ని నాశనం చెయ్యడానికి, మిమ్మల్ని హతమార్చడానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు స్వాధీనం చేసుకోడానికి ప్రవేశిస్తున్న దేశం నుంచి తొలగించి వేస్తాడు. యెహోవా భూమి ఈ చివర నుంచి ఆ చివరి వరకూ అన్య దేశాల్లో మీరు చెదిరిపోయేలా చేస్తాడు. అక్కడ మీ పితరులు సేవించని చెక్కతో, రాయితో చేసిన అన్య దేవుళ్ళను కొలుస్తారు. ఆ ప్రజల మధ్య మీకు నెమ్మది ఉండదు. నీ అరికాలికి విశ్రాంతి కలగదు. అక్కడ మీ గుండెలు అదిరేలా, కళ్ళు మసకబారేలా, మీ ప్రాణాలు కుంగిపోయేలా యెహోవా చేస్తాడు. చస్తామో, బతుకుతామో అన్నట్టుగా ఉంటారు. బతుకు మీద ఏమాత్రం ఆశ ఉండదు. పగలూ రాత్రి భయం భయంగా గడుపుతారు. రాత్రింబవళ్ళూ భయం భయంగా కాలం గడుపుతారు. మీ ప్రాణాలు నిలిచి ఉంటాయన్న నమ్మకం మీకు ఏమాత్రం ఉండదు. మీ హృదయాల్లో ఉన్న భయం వల్ల ఉదయం పూట ఎప్పుడు సాయంత్రం అవుతుందా అనీ, సాయంకాలం పూట ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తుంటారు. మీరు ఇకపై ఐగుప్తు చూడకూడదు అని నేను మీతో చెప్పిన మార్గంలోగుండా యెహోవా ఓడల మీద ఐగుప్తుకు మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. మీరు అక్కడ దాసులుగా, దాసీలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరే అమ్ముకోవాలని చూస్తారు కానీ మిమ్మల్ని కొనేవారెవ్వరూ ఉండరు.”

ద్వితీయోపదేశకాండము 28:58-68 పవిత్ర బైబిల్ (TERV)

“ఈ గ్రంథంలో వ్రాయబడిన చట్టంలోని ఆదేశాలన్నింటికీ మీరు విధేయులు కావాలి. భయంకరమైన, అద్భుతమైన మీ దేవుడైన యెహోవా నామాన్ని మీరు గౌరవించాలి. మీరు విధేయులు కాకపోతే, అప్పుడు యెహోవా మీకు దారుణమైన కష్టాలు కలిగిస్తాడు. మరియు మీ సంతతివారు గొప్ప కష్టాలు చాలకాలం కొనసాగే భయంకర రోగాలు అనుభవిస్తారు. మీరు ఈజిప్టులో చాలా కష్టాలు, రోగాలు చూసారు. అవి మిమ్మల్ని భయస్తుల్నిగా చేసాయి. ప్రభువు ఆ చెడ్డ వాటన్నిటినీ మీ మీదికి రప్పిస్తాడు. ఈ గ్రంథంలో వ్రాయబడని ప్రతి విధమైన ప్రతి రోగాన్ని, ప్రతి కష్టాన్నియెహోవా మీ మీదికి రప్పిస్తాడు. మీరు నాశనం అయ్యేంతవరకు ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు. మీరు ఆకాశ నక్షత్రాలు ఉన్నంత మంది ఉండవచ్చు. కానీ మీలో కొంచెంమంది మాత్రమే మిగులుతారు. ఎందుకు మీకు ఇలా జరుగుతుంది? మీరు మీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక. “ఇదివరకు మీకు మేలు చేసి, మీ రాజ్యాన్ని విశాలపరచాలంటే. యెహోవాకు సంతోషం. అదే విధంగా మిమ్మల్ని పాడుచేసి, నాశనం చేయటానికి యెహోవా సంతోషిస్తాడు. మీరు మీ స్వంతంగా తీసుకొనేందుకు ప్రవేశిస్తున్న దేశంలోనుండి మీరు తొలగించివేయబడతారు. భూమి ఈవైపునుండి ఆ వైపునకు గల ప్రపంచ ప్రజలందరి మధ్యకు యెహోవా మిమ్మల్ని చెదరగొట్టివేస్తాడు. మీరు గాని మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఆరాధించని దేవుళ్లను, చెక్క, రాతితో చేసిన దేవుళ్లను మీరు సేవిస్తారు. “ఈ రాజ్యాలలో మీకు ఏ మాత్రం శాంతి ఉండదు. మీరు విశ్రాంతి తీసుకొనే చోటు ఎక్కడా ఉండదు. యెహోవా మీ మనస్సులను చింతతో నింపేస్తాడు. మీ కళ్లు భారంగా ఉంటాయి. మీరు చాలా అల్లకల్లోలంగా ఉంటారు. మీరు ప్రమాదంలో ఎల్లప్పుడూ అనుమానంగా జీవిస్తారు. రాత్రింబవళ్లు మీకు భయం కలుగుతూ ఉంటుంది. మీ జీవితాల విషయం మీకు ఎన్నడూ గట్టి నమ్మకం ఉండదు. ‘ఇది సాయంత్రం అయితే బాగుండును’ అని ఉదయాన మీరంటారు. ‘ఇది ఉదయం అయితే బాగుండును’ అని సాయంత్రం అంటారు. ఎందుకంటే మీ హృదయంలో ఉండే భయంవల్ల, మీరు చూసే చెడు సంగతులవల్ల. యెహోవా మళ్లీ మిమ్మల్ని ఓడల్లో ఈజిప్టుకు పంపిస్తాడు. మీరు మళ్లీ ఎన్నటికీ తిరిగి ఆ స్థలానికి తిరిగి వెళ్లనవసరం లేదని నేను మీతో చెప్పాను, కానీ యెహోవా మిమ్మల్ని అక్కడికి పంపిస్తాడు. అక్కడ మీరు మీ శత్రువులకు బానిసలుగా అమ్ముడుబోయేందుకు ప్రయత్నిస్తారు. కానీ మిమ్మల్ని ఎవరూ కొనరు.”

ద్వితీయోపదేశకాండము 28:58-68 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నీవు జాగ్రత్త పడి యీ గ్రంథములో వ్రాయబడిన యీ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి గైకొనుచు, నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమగల భీకరమైన నామమునకు భయపడనియెడల యెహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును. అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్లును చెడ్డ రోగములునై యుండును. నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటిని ఆయన నీ మీదికి తెప్పించును; అవి నిన్ను వెంటాడును. మరియు నీవు నశించువరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినలేదు గనుక ఆకాశనక్షత్రములవలె విస్తారములైన మీరు, లెక్కకు తక్కువై కొద్ది మందే మిగిలియుందురు. కాబట్టి మీకు మేలుచేయుచు మిమ్మును విస్తరింపజేయుటకు మీ దేవుడైన యెహోవా మీయందు ఎట్లు సంతో షించెనో అట్లు మిమ్మును నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును యెహోవా సంతోషించును గనుక నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించుచున్న దేశములోనుండి పెల్లగింపబడుదువు. దేశముయొక్క యీ కొనమొదలుకొని ఆ కొనవరకును సమస్తజనములలోనికి యెహోవా నిన్ను చెదరగొట్టును. అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియు రాతివియునైన అన్యదేవతలను పూజింతువు. ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు; నీ అరకాలికి విశ్రాంతి కలుగదు. అక్కడ యెహోవా హృదయకంపమును నేత్రక్షీణతయు మనోవేదనయు నీకు కలుగజేయును. నీకు ఎల్లప్పుడు ప్రాణభయము కలిగి యుండును. నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువాటిచేతను ఉదయమున–అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున–అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు. మరియు నీవు మరి ఎప్పుడును దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యెహోవా ఐగుప్తునకు ఓడలమీద నిన్ను మరల రప్పించును. అక్కడ మీరు దాసులగాను దాసీలగాను మీ శత్రువులకు మిమ్మును మీరు అమ్మ జూపు కొందురుగాని మిమ్మును కొనువాడొకడైన నుండడు.

ద్వితీయోపదేశకాండము 28:58-68 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే, యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు. మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు. ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు. అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు. ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు. మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు. ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు. మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.