ద్వితీయో 28:58-68

ద్వితీయో 28:58-68 OTSA

ఈ గ్రంథంలో వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర మాటలన్నిటిని ఒకవేళ మీరు జాగ్రత్తగా పాటించక, మీ దేవుడైన యెహోవా మహిమగల అద్భుతమైన నామానికి మీరు భయపడకపోతే, యెహోవా మీకు, మీ వారసులకు భయంకరమైన తెగుళ్ళు, కఠినమైన, సుదీర్ఘమైన విపత్తులు, తీవ్రమైన, దీర్ఘకాలిక అనారోగ్యాలను పంపుతారు. మీరు భయపడే ఈజిప్టు వ్యాధులన్నిటిని ఆయన మీ మీదికి తెస్తారు, అవి మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటాయి. మీరు నాశనం అయ్యేవరకు ఈ ధర్మశాస్త్ర పుస్తకంలో నమోదు చేయబడని ప్రతి విధమైన రోగాన్ని, విపత్తును కూడా యెహోవా మీపైకి తెస్తారు. ఆకాశంలోని నక్షత్రాల్లా అనేకమైన మీరు కొద్దిమంది మాత్రమే మిగిలి ఉంటారు, ఎందుకంటే మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడలేదు. మీరు వృద్ధి చెందడం, సంఖ్య పెరగడం యెహోవాకు ఎంత సంతోషాన్ని కలిగించిందో, మిమ్మల్ని పతనం చేయడం, నాశనం చేయడం కూడా ఆయనను అంతే సంతోషపరుస్తుంది. మీరు స్వాధీనం చేసుకోవడానికి ప్రవేశిస్తున్న దేశం నుండి మీరు పెరికివేయబడతారు. అప్పుడు యెహోవా భూమి యొక్క ఒక చివర నుండి మరొక చివర వరకు అన్ని దేశాల మధ్య మిమ్మల్ని చెదరగొడతారు. అక్కడ మీరు ఇతర దేవుళ్ళను మీకు గాని మీ పూర్వికులకు గాని తెలియని చెక్కతో రాతితో చేయబడిన దేవుళ్ళను సేవిస్తారు. ఆ దేశాల్లో మీకు విశ్రాంతి దొరకదు, మీ అరికాలుకు కూడా విశ్రాంతి స్థలం ఉండదు. అక్కడ యెహోవా మీకు మనోవేదన, ఎదురుచూపులతో మసకబారిన కళ్లను, కలవరపడుతున్న హృదయాన్ని ఇస్తారు. మీరు రాత్రి, పగలు దిగులుతో నిండుకొని, ఎప్పుడూ ప్రాణభయంతో జీవిస్తారు, మీరు బ్రతుకుతారన్న నమ్మకం మీకు ఉండదు. ఎందుకంటే మీ హృదయాలను నింపే భయం మీ కళ్లు చూసే దృశ్యాలను బట్టి మీరు ఉదయాన, “ఒకవేళ ఇది సాయంత్రం అయితే బాగుండు!” అని సాయంత్రం, “ఒకవేళ ఇది ఉదయం అయితే బాగుండు!” అని అంటారు. మీరు మళ్ళీ ఎన్నడూ ఈజిప్టుకు ప్రయాణం చేయకూడదని నేను చెప్పిన ఈజిప్టుకు యెహోవా మిమ్మల్ని ఓడలలో తిరిగి పంపుతారు. అక్కడ మీరు మగ, ఆడ బానిసలుగా మీ శత్రువులకు మిమ్మల్ని మీరు అమ్మకానికి పెట్టుకుంటారు, కానీ ఎవరూ మిమ్మల్ని కొనరు.

Read ద్వితీయో 28