ద్వితీయోపదేశకాండము 28:2-13
ద్వితీయోపదేశకాండము 28:2-13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు; పొలములో దీవింపబడుదువు; నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొఱ్ఱె మేకల మందలు దీవింపబడును; నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చునప్పుడు దీవింపబడుదువు; వెలుపలికి వెళ్లునప్పుడు దీవింపబడుదువు. నీ మీదపడు నీ శత్రువులను యెహోవా నీ యెదుట హత మగునట్లు చేయును; వారొక త్రోవను నీమీదికి బయలుదేరి వచ్చి యేడు త్రోవల నీ యెదుటనుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞల ననుసరించి ఆయన మార్గములలో నడుచుకొనినయెడల యెహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠితజనముగా నిన్ను స్థాపించును. భూప్రజలందరు యెహోవా నామమున నీవు పిలువబడు చుండుట చూచి నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణముచేసిన దేశమున యెహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేలపంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. యెహోవా నీ దేశముమీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవుచేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును, ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేకజనములకు అప్పిచ్చెదవు కాని అప్పుచేయవు నేడు నేను మీకాజ్ఞాపించు మాటలన్నిటిలో దేనివిషయములోను కుడికిగాని యెడమకుగాని తొలగి
ద్వితీయోపదేశకాండము 28:2-13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు మీ యెహోవా దేవుని మాట వింటే ఈ దీవెనలన్నీ మీరు స్వంతం చేసుకుంటారు. పట్టణంలో, పొలంలో మీకు దీవెనలు కలుగుతాయి. మీ గర్భఫలం, మీ భూఫలం, మీ పశువుల మందలూ, మీ దుక్కిటెద్దులూ, మీ గొర్రె మేకల మందల మీద దీవెనలుంటాయి. మీ గంప, పిండి పిసికే తొట్టి మీదా దీవెనలుంటాయి. మీరు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు దీవెనలుంటాయి. యెహోవా మీ మీదికి వచ్చే మీ శత్రువులు మీ ఎదుట హతమయ్యేలా చేస్తాడు. వాళ్ళు ఒక దారిలో మీ మీదికి దండెత్తి వచ్చి ఏడు దారుల్లో మీ ఎదుట నుంచి పారిపోతారు. మీ ధాన్యపు గిడ్డంగుల్లో మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మీకు దీవెన కలిగేలా యెహోవా ఆజ్ఞాపిస్తాడు. మీ యెహోవా దేవుడు మీకిస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు మీ యెహోవా దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన మార్గాల్లో నడుచుకుంటే యెహోవా మీకు ప్రమాణం చేసినట్టు ఆయన తనకు ప్రతిష్టిత ప్రజగా మిమ్మల్ని స్థాపిస్తాడు. భూప్రజలంతా యెహోవా పేరుతో మిమ్మల్ని పిలవడం చూసి మీకు భయపడతారు. యెహోవా మీకిస్తానని మీ పితరులతో ప్రమాణం చేసిన దేశంలో యెహోవా మీ గర్భఫలాన్నీ మీ పశువులనూ మీ పంటనూ సమృద్ధిగా వర్ధిల్లజేస్తాడు. యెహోవా మీ దేశం మీద దాని కాలంలో వాన కురిపించడానికీ మీరు చేసే పనంతటినీ ఆశీర్వదించడానికీ ఆకాశ గిడ్డంగులను తెరుస్తాడు. మీరు అనేక రాజ్యాలకు అప్పిస్తారు కాని అప్పు చెయ్యరు. ఇవ్వాళ నేను మీకాజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని, ఎడమవైపుకు గాని తొలగిపోకుండా
ద్వితీయోపదేశకాండము 28:2-13 పవిత్ర బైబిల్ (TERV)
మీరు గనుక మీ దేవుడైన యెహోవాకు విధేయులైతే ఈ ఆశీర్వాదాలన్నీ మీకు లభించి, మీ స్వంతం అవుతాయి. “యెహోవా మీ పట్టణాలు మీ పొలాలను ఆశీర్వాదిస్తాడు. యెహోవా మీకు అధిక సంతానం యిచ్చి ఆశీర్వాదిస్తాడు. మీ పొలాలను మంచి పంటలతో ఆయన ఆశీర్వదిస్తాడు మీ పశువులకు సంతానాభివృద్ధి కలిగిస్తాడు మీకు పశువులు, గొర్రెలు విస్తారంగా ఉంటాయి. మీకు ధాన్యపు పంటలు, ఆహారం సమృద్ధిగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతి పనిలో యెహోవా మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు. “మీ మీదికి వచ్చే మీ శత్రువులను మీరు ఓడించేటట్టు యెహోవా చేస్తాడు. మీ శత్రువు మీ మీదికి ఒకే మార్గంలో వచ్చి, ఏడు మార్గాల్లో పారిపోతాడు. “మీ కొట్లు నిండుగా ఉండేటట్టు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు చేసే ప్రతిదాన్నీ ఆయన ఆశీర్వదిస్తాడు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా మిమ్మల్ని తన స్వంత ప్రజలుగా చేసుకొంటాడు. మీరు మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు విధేయులై, ఆయన మార్గాల్లో మీరు జీవిస్తే ఆయన దీనిని మీకు వాగ్దానం చేసాడు. అప్పుడు మీరు యెహోవా పేరు పెట్టబడిన ప్రజలు అని ఆ దేశ ప్రజలంతా తెలుసుకొంటారు. వారు మీకు భయపడతారు. “మరియు యెహోవా దేవుడు మీకు ఎన్నో మంచి వాటిని ఇస్తాడు. ఆయన మీకు ఎంతోమంది పిల్లల్ని ఇస్తాడు. మీ పశువులకు ఆయన ఎన్నో దూడ పిల్లలను ఇస్తాడు. మీకు ఇస్తానని యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో ఆయన మీకు మంచి పంట ఇస్తాడు. యెహోవా తన గొప్ప ఆశీర్వాదాల్ని దాచి ఉంచిన ఆకాశాన్ని తెరచి. సరైన సమయంలో మీ భూమిమీద ఆయన వర్షం కురిపిస్తాడు. మీరు చేసే పనులన్నింటినీ యెహోవా ఆశీర్వదిస్తాడు. అనేక రాజ్యాలకు అప్పు ఇచ్చేంత ధనం మీ దగ్గర ఉంటుంది. కానీ మీరు వారి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. యెహోవా మిమ్మల్ని తలగానే ఉంచు తాడుగాని తోకగాకాదు. మీరు పైవారు గానే ఉంటారు కాని క్రిందవారుగా ఉండరు. ఈ వేళ నేను మీకు చెబుతున్న మీ దేవుడైన యెహోవా ఆదేశాలకు మీరు విధేయులైతే ఇదంతా జరుగుతుంది. ఈ ఆజ్ఞలకు మీరు జాగ్రత్తగా విధేయులు కావాలి.
ద్వితీయోపదేశకాండము 28:2-13 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి: మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి. మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు దీవించబడతారు. శత్రువులు మీ మీదికి లేచినప్పుడు, యెహోవా వారిని మీ ముందు ఓడిపోయేలా చేస్తారు. వారు ఒకవైపు నుండి మీ దగ్గరకు వస్తారు కాని నీ దగ్గరి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు. అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు. యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు. కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు. యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు.