ద్వితీయో 28:2-13

ద్వితీయో 28:2-13 OTSA

మీ దేవుడైన యెహోవాకు మీరు లోబడితే, ఈ దీవెనలన్నీ మీ మీదికి వచ్చి, మిమ్మల్ని వెంబడిస్తాయి: మీరు పట్టణంలో దీవించబడతారు, పొలంలో దీవించబడతారు. మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి. మీ గంప, మీ పిండి పిసికే తొట్టి దీవించబడుతుంది. మీరు లోపలికి వచ్చినప్పుడు, బయటకు వెళ్లినప్పుడు దీవించబడతారు. శత్రువులు మీ మీదికి లేచినప్పుడు, యెహోవా వారిని మీ ముందు ఓడిపోయేలా చేస్తారు. వారు ఒకవైపు నుండి మీ దగ్గరకు వస్తారు కాని నీ దగ్గరి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు. మీ కొట్ల మీదకు మీ ప్రయత్నాలన్నిటి మీదకు యెహోవా దీవెనలు పంపుతారు. మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించి, ఆయన మార్గంలో మీరు నడుచుకుంటే, యెహోవా ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్లుగా, యెహోవా మిమ్మల్ని తన పరిశుద్ధ ప్రజలుగా స్థాపిస్తారు. అప్పుడు భూమి మీద ఉన్న జనాంగాలందరూ మీరు యెహోవా పేరుతో పిలువబడ్డారని చూసి, వారు మీకు భయపడతారు. యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు. కాలానుగుణంగా మీ భూమిపై వర్షం కురిపించడానికి, మీ చేతి పనులన్నింటినీ దీవించడానికి యెహోవా తన ఆకాశ గిడ్డంగులను తెరుస్తారు. మీరు అనేక దేశాలకు అప్పు ఇస్తారు, కానీ ఎవరినుండి అప్పు తీసుకోరు. యెహోవా మిమ్మల్ని తలగా చేస్తారు, తోకగా కాదు. ఈ రోజు నేను మీకు ఇచ్చే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు శ్రద్ధగా గమనించి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే, మీరు పై వారిగా ఉంటారు, క్రింది వారిగా ఉండరు.

Read ద్వితీయో 28