ద్వితీయోపదేశకాండము 15:7-11
ద్వితీయోపదేశకాండము 15:7-11 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీ దేవుడు యెహోవా మీకిస్తున్న దేశంలోని మీ పట్టణాల్లో ఎక్కడైనా మీ సోదరుల్లో ఒక బీదవాడు ఉంటే అతనిపై దయ చూపాలి. మీ హృదయాలను కఠినపరచుకోకూడదు. మీ చెయ్యి ముడుచుకోకుండా తప్పక వాడి వైపు చాచి, వాడి అక్కరకు చాలినంతగా వాడికి అప్పు ఇవ్వాలి. అప్పు రద్దు చేయాల్సిన “ఏడో సంవత్సరం దగ్గర పడింది” అనే చెడ్డ తలంపు మీ మనస్సులో కలగనీయవద్దు. బీదవాడైన మీ సోదరునిపై మీరు దయ చూపి అతనికేమీ ఇవ్వకపోతే వాడొకవేళ మిమ్మల్ని గూర్చి యెహోవాకు మొరపెడితే అది మీకు పాపం అవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా అతనికి ఇవ్వాలి. అతనికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన యెహోవా దేవుడు మీ పనులన్నిటిలో, మీరు చేసే ప్రయత్నాలన్నిటిలో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పేదలు దేశంలో ఉండక మానరు. అందుచేత నేను మీ దేశంలో దీనులు, “పేదలు అయిన మీ సోదరులకు తప్పకుండా సహాయం చేయాలని మీకు ఆజ్ఞాపిస్తున్నాను.
ద్వితీయోపదేశకాండము 15:7-11 పవిత్ర బైబిల్ (TERV)
“మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు నివసించేటప్పుడు మీ ప్రజల మధ్య ఎవరైనా పేదవారు ఒకరు ఉండవచ్చును. మీరు స్వార్థపరులుగా ఉండకూడదు. ఆ పేద మనిషికి సహాయం చేసేందుకు మీరు నిరాకరించకూడదు. మీరు అతనికి భాగం పంచిపెట్టేందుకు యిష్టపడాలి. ఆ వ్యక్తికి అవసరమైనవి అన్నీ అతనికి అప్పుగా ఇచ్చేందుకు మీరు ఇష్టపడాలి. “ఏడవ సంవత్సరం అంటే అప్పులు రద్దుచేసే సంవత్సరం దగ్గర్లో ఉందని చెప్పి ఎవరికైనా అప్పు ఇచ్చేందుకు ఎన్నడూ తిరస్కరించవద్దు. అలాంటి చెడుతలంపు మీ మనసులో కలుగనియ్యవద్దు. సహాయం కావాల్సిన ఆ వ్యక్తిని గూర్చి నీవు ఎన్నడూ చెడుగా తలంచవద్దు. నీవు అతనికి సహాయం చేసేందుకు నిరాకరించకూడదు. ఆ పేదవానికి నీవు ఏమీ ఇవ్వకపోతే అతడు నీ మీద యెహోవాకు ఆరోపణ చేస్తాడు. మరియు యెహోవా నిన్ను పాపం చేసిన నేరస్థునిగా చూస్తాడు. “పేదవానికి నీవు ఇవ్వగలిగినదంతా ఇవ్వు. అతనికి యిచ్చే విషయంలో చెడుగా భావించకు. ఎందుకంటే ఈ మంచి పని చేసినందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మును ఆశీర్వదిస్తాడు. ఆయన నీ కార్యాలన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నాలన్నిటిలోనూ, నిన్ను ఆశీర్వాదిస్తాడు. దేశంలో పేద ప్రజలు ఎల్లప్పుడూ ఉంటారు. అందుకే మీ ప్రజలకు మీ దేశంలో అక్కరలో ఉండే పేద ప్రజలకు ఇచ్చేందుకు మీరు సిద్ధంగా ఉండాలని నేను మీకు ఆజ్ఞ యిస్తున్నాను.
ద్వితీయోపదేశకాండము 15:7-11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండినయెడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండ నీ హృదయమును కఠినపరచు కొనకూడదు. నీ చెయ్యి ముడుచుకొనక వానికొరకు అవశ్యముగా చెయ్యి చాచి, వాని అక్కరచొప్పున ఆ యక్కరకు చాలినంత అవశ్యముగా వానికి అప్పియ్యవలెను. విడుదల సంవత్సరమైన యేడవసంవత్సరము సమీపమైనదని చెడ్డతలంపు నీ మనస్సులో పుట్టక యుండునట్లు జాగ్రత్తపడుము. బీదవాడైన నీ సహోదరునియెడల కటాక్షము చూపక నీవు వానికేమియు ఇయ్యక పోయినయెడల వాడొకవేళ నిన్నుగూర్చి యెహోవాకు మొఱ్ఱపెట్టును; అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికియ్యవలెను. వాని కిచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోను నీవుచేయు ప్రయత్నములన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును. బీదలు దేశములో ఉండకమానరు. అందుచేత నేను–నీ దేశములోనున్న నీ సహోదరులగు దీనులకును బీదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలెనని నీ కాజ్ఞాపించుచున్నాను.
ద్వితీయోపదేశకాండము 15:7-11 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశపు పట్టణాల్లో ఎక్కడైనా మీ తోటి ఇశ్రాయేలీయులలో ఎవరైనా పేదవారు ఉంటే, వారి పట్ల మీ హృదయాలను కఠినంగా లేదా పిసినారిగా ఉంచకూడదు. కాని వారికి అవసరమైనంత దానిని వారికి గుప్పిలి విప్పి ధారాళంగా అప్పు ఇవ్వాలి. ఈ దుష్ట ఆలోచన మీ హృదయాల్లో పుట్టకుండా జాగ్రత్తపడండి: “ఏడవ సంవత్సరం, అప్పులు రద్దు చేసే సంవత్సరం సమీపించింది” తద్వార మీ తోటి ఇశ్రాయేలీయుల మధ్య ఉన్న పేదవారి పట్ల దయ చూపించకుండ మీరు వారికి ఏమి ఇవ్వకుండ ఉండకూడదు. మీరు అలా చేస్తే, వారు మీకు వ్యతిరేకంగా యెహోవాకు మొరపెడతారు; అప్పుడు మీరు పాపం చేసినవారిగా పరిగణించబడతారు. వారికి ధారాళంగా ఇవ్వండి, సణిగే హృదయం లేకుండా వారికి ఇవ్వండి; అప్పుడు మీ దేవుడైన యెహోవా మీ పనులన్నిటిలో మీరు చేసే ప్రతీ దానిలో మిమ్మల్ని దీవిస్తారు. దేశంలో ఎల్లప్పుడు పేదవారు ఉంటారు. కాబట్టి మీ దేశంలో తోటి ఇశ్రాయేలీయులలో పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ధారాళంగా మీ గుప్పిలి విప్పాలని నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను.