దానియేలు 5:1-30

దానియేలు 5:1-30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కొన్ని సంవత్సరాలు తరువాత ఒక రోజు రాజైన బెల్షస్సరు తన రాజ్యంలోని వెయ్యి మంది అధికారులకు గొప్ప విందు చేయించాడు. ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షమద్యం తాగుతున్నాడు. బెల్షస్సరు ద్రాక్షమద్యం సేవిస్తూ తన తండ్రి నెబుకద్నెజరు యెరూషలేమును కొల్లగొట్టి దేవాలయంలో నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్ష మద్యం సేవించాలన్నది అతడి ఉద్దేశం. సేవకులు యెరూషలేములో ఉన్న దేవుని నివాసమైన ఆలయం నుండి దోచుకువచ్చిన బంగారు పాత్రలు తీసుకువచ్చారు. రాజు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్ష మద్యం పోసుకుని సేవించారు. అలా సేవిస్తూ బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేయబడిన తమ దేవుళ్ళను కీర్తించారు. ఆ సమయంలోనే రాజుకు మనిషి చేతి వేళ్ళు కనిపించాయి. దీపస్తంభం ఎదురుగా రాజ భవనం గోడ మీద ఏదో ఒక రాత రాస్తూ ఉన్నట్టు కనబడింది. ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి. రాజు ఆత్రుతగా గారడీ విద్యలు చేసేవాళ్ళను, కల్దీయులను జ్యోతిష్యులను వెంటనే పిలిపించమని ఆజ్ఞ ఇచ్చాడు. బబులోనులోని జ్ఞానులు రాగానే వాళ్ళతో ఇలా అన్నాడు. “ఈ రాతను చదివి దీని భావం నాకు తెలియజేసిన వాడికి అతడు ఎవరైనా సరే, అతనికి ఊదా రంగు దుస్తులు ధరింపజేసి అతని మెడకు బంగారు గొలుసులు వేయిస్తాను. అతణ్ణి రాజ్యంలో మూడో అధిపతిగా నియమిస్తాను.” రాజ్యానికి చెందిన జ్ఞానులందరూ చేరుకున్నారు. కానీ అక్కడ రాసింది చదవడానికీ దాని భావం చెప్పడానికీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అందువల్ల బెల్షస్సరు రాజు మరింత భయపడ్డాడు. అధికారులంతా ఆశ్చర్యపడేలా అతని ముఖం వికారంగా మారిపోయింది. రాజు, అతని అధిపతులు ఆందోళన చెందుతున్న విషయం రాణికి తెలిసింది. ఆమె విందు జరుగుతున్న గృహానికి చేరుకుని, రాజుతో ఇలా చెప్పింది. “రాజు చిరకాలం జీవిస్తాడు గాక. నీ ఆలోచనలతో కలవరపడవద్దు. నీ మనస్సును నిబ్బరంగా ఉంచుకో. నీ రాజ్యంలో పవిత్ర దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. నీ తండ్రి జీవించి ఉన్న కాలంలో అతనికి దేవతల జ్ఞానం, బుద్ధి వివేకాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. అందువల్ల నీ తండ్రి నెబుకద్నెజరు అతణ్ణి దేశంలో శకునం చెప్పేవాళ్ళ మీద, గారడీవిద్య గలవారి మీద, కల్దీయుల, జ్యోతిష్యుల మీద అధికారిగా నియమించాడు.” “ఈ దానియేలు బుద్ధికుశలత కలిగినవాడై కలల భావం చెప్పడానికి, మర్మం బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి జ్ఞానం, తెలివితేటలు కలిగినవాడు కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలుకు కబురు పెట్టి రప్పించు. అతడు దీని భావం నీకు చెబుతాడు.” అప్పుడు వాళ్ళు దానియేలును తీసుకువచ్చారు. అతడు వచ్చినప్పుడు రాజు ఇలా అన్నాడు. “రాజైన నా తండ్రి యూదయ దేశం నుండి చెరపట్టి తీసుకువచ్చిన బందీల్లో ఉన్న దానియేలువి నువ్వే కదా? దేవుళ్ళ ఆత్మ, బుద్ది వివేకాలు, అమితమైన జ్ఞాన సంపద నీలో ఉన్నాయని నిన్ను గూర్చి విన్నాను. గోడపై రాసి ఉన్న దీన్ని చదివి దాని భావం తెలియజేయడానికి జ్ఞానులను, గారడీ విద్యలు చేసేవాళ్ళను పిలిపించాను. వాళ్ళు దీని అర్థం చెప్పలేకపోయారు.” “నిగూఢ మర్మాలను వెల్లడించడానికి, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీవు సమర్ధుడవని నిన్ను గూర్చి విన్నాను. కనుక ఈరాతను చదివి, దాని అర్థం వివరించిన పక్షంలో నీకు ఊదారంగు దుస్తులు ధరింపజేస్తాను. నిన్ను దేశంలో నా తరువాత మూడో స్థానంలో అధికారిగా చేస్తాను.” బదులుగా దానియేలు ఇలా అన్నాడు. “రాజా, నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో. వాటిని ఇంకా ఎవరికైనా ఇచ్చుకో. నేను ఇక్కడ రాసి ఉన్నదాన్ని చదివి, నీకు దాని అర్థం చెబుతాను. రాజా విను. మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థితిని, రాజ్యాన్ని. బల ప్రభావాలను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చి ఘనపరిచాడు. దేవుడు అతనికి అలాంటి ఉన్నత స్థితిని అనుగ్రహించడంవల్ల అతడు ఎవరిని చంపాలనుకున్నాడో వాళ్ళను చంపాడు. ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళను కాపాడాడు. ఎవరిని గొప్ప చేయాలనుకున్నాడో వాళ్ళను గొప్పచేశాడు. ఎవరిని అణచివేయాలనుకున్నాడో వాళ్ళను అణచివేశాడు. అందువల్ల సకల ప్రాంతాల ప్రజలు, వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు అతనికి భయపడుతూ అతని ఎదుట వణకుతూ లోబడి ఉన్నారు.” “అయితే అతని హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. అతని హృదయం కఠినం చేసుకుని చెడ్డ పనులు జరిగించినప్పుడు దేవుడు అతని నుండి రాజ్యాన్ని తీసివేసి అతని ఘనతనంతా పోగొట్టాడు. అతణ్ణి మనుషుల మధ్య నుండి తరిమివేశాడు. అతడి మనసు పశువుల మనసులా మారిపోయింది. అతడు అడవి గాడిదలాగా గడ్డి మేస్తూ ఆకాశం నుంచి పడే మంచుకు తడిసిపోయాడు. మహోన్నతుడైన దేవుడే మనుషుల మీదా, రాజ్యాల మీదా సర్వాధికారి అనీ, ఆయన ఎవరిని వాటిపై నియమించాలనుకున్నాడో వాళ్ళను నియమిస్తాడనీ గ్రహించే వరకూ అదే స్థితిలో ఉండిపోయాడు.” “బెల్షస్సరూ, అతని కొడుకువైన నీకు ఈ విషయాలన్నీ తెలుసు. అవన్నీ తెలిసి కూడా నువ్వు నీ మనస్సును అదుపులో ఉంచుకోకుండా పరలోకంలో ఉండే ప్రభువుకంటే అధికంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు. అందువల్ల ఆ దేవుని సన్నిధి నుండి ఈ చెయ్యి వచ్చి ఈ విధంగా రాసింది. రాసిన విషయం ఏమిటంటే, ‘మెనే మెనే టెకేల్‌ ఉఫార్సీన్‌.’ ఈ రాతకి అర్థం ఏమిటంటే, ‘మెనే’ అంటే, దేవుడు నీ రాజ్య పాలన విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. ‘టెకేల్‌’ అంటే, ఆయన నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువవాడిగా కనిపించావు. ‘ఫెరేన్‌’ అంటే, నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసివేసి మాదీయ జాతికివారికి, పారసీకులకు ఇవ్వడం జరుగుతుంది.” బెల్షస్సరు ఆజ్ఞ ప్రకారం దానియేలుకు ఊదారంగు దుస్తులు తొడిగించారు. అతని మెడలో స్వర్ణ హారం వేసి, ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణలో అతణ్ణి మూడవ అధికారిగా నియమించి చాటింపు వేయించారు. అదే రాత్రి బెల్షస్సరు అనే ఆ కల్దీయుల రాజును చంపేశారు.

షేర్ చేయి
Read దానియేలు 5

దానియేలు 5:1-30 పవిత్ర బైబిల్ (TERV)

రాజైన బెల్షస్సరు తన వెయ్యిమంది అధికారులకు ఒక గొప్ప విందు ఇచ్చాడు. వారితో కలిసి రాజు ద్రాక్షామద్యం సేవిస్తూ ఉన్నాడు. బెల్షస్సరు ద్రాక్షామద్యం త్రాగుతుండగా తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము ఆలయంనుంచి తీసుకువచ్చిన బంగారు, వెండి పాత్రలు తీసుకురమ్మని అతతడు సేవకులకు ఆజ్ఞాపించాడు. బెల్షస్సరు తన సామంతులు, తన భార్యలు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్షామద్యం పానం చేయాలని కోరాడు. కనుక యెరూషలేము ఆలయంనుంచి తెచ్చిన ఆ ప్రాత్రల్ని వారు తీసుకు వచ్చారు. రాజు మరియు అతని సామంతులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు ఆ పాత్రల్లో పానం చేశారు. త్రాగుచూ వారు బంగారం, వెండి, కంచు, ఇనుము, కర్ర, రాయి మొదలైన వాటితో తయారు చేయబడిన తమ దేవుళ్లను కీర్తించారు. అప్పుడు ఉన్నట్టుండి, ఒక వ్యక్తి చేతి వ్రేళ్లు కనబడి, గోడమీద వ్రాయసాగాయి. రాజగృహములో దీపం ప్రక్కగా గోడమీద ఆ చెయ్యి వ్రాసింది. ఆ చెయ్యి వ్రాస్తుండగా, రాజు చూశాడు. రాజైన బెల్షస్సరు భయభ్రాంతుడయ్యాడు, భయంవల్ల అతని ముఖం పాలిపోయింది. మోకాళ్ళు వణకుతు ఒకదానితో ఒకటి కొట్టుకొనసాగాయి. అతని కాళ్లు చాలా బలహీనంకాగా, అతడు నిలబడలేక పోయాడు. అప్పుడు ఇంద్రజాలికుల్ని, కల్దీయుల్ని, తన సమక్షానికి తీసుకురావలసిందిగా కోరాడు. ఆ వివేకవంతులతో, “గోడమీది ఈ వ్రాతను చదివే ఏ వ్యక్తికైనా నేను బహుమతి ఇస్తాను, అతను దాని అర్థం కూడా తెలపాలి. ఊదారంగు వస్త్రాలు అతనికి బహూకరిస్తాను. అతని మెడలో ఒక బంగారు గొలుసు వేస్తాను. అతనిని రాజ్యంలో మూడవ ఉన్నత పరిపాలకునిగా చేస్తాను” అని చెప్పాడు. అందువల్ల వివేకవంతులందరు లోనికి వచ్చారు. కాని వారు ఆ వ్రాతను చదవలేకపోయారు. దాని అర్థాన్నికూడా చెప్పలేకపోయారు. బెల్షస్సరు, అతని అధికారులు కలవరపడ్డారు. అతనికి చింత, భయం కూడా ఎక్కువయ్యాయి. ఆ భయంతో అతని ముఖం తెల్లబోయింది. విందు జరుగుతున్న ఆ ప్రదేశానికి రాజుయొక్క తల్లి వచ్చింది. ఆమె రాజు, అతని అధికారుల మాటలు విన్నది. “రాజా, నీవు చిరకాలం వర్థిల్లాలి. ఏమీ భయపడకు. భయంతో నీ ముఖం కలత చెంద నివ్వకు. నీ రాజ్యంలో ఒక మనుష్యుడున్నాడు. పవిత్ర దేవుళ్ల ఆత్మ అతనిలో ఉంది. నీ తండ్రి పరిపాలించే రోజుల్లో అతను రహస్య విషయాలు తెలుసుకోగలనని నిరూపించాడు. చాలా చురుగ్గా, వివేకవంతంగా ఉన్నట్లుగా కూడా అతను కనిపించాడు. ఇటువంటి విషయాల్లో అతను దేవతలవంటివాడు. నీ తండ్రి నెబుకద్నెజరు ఈ వ్యక్తిని వివేకవంతులందరికీ అధికారిగా నియమించాడు. అతను ఇంద్రజాలికులందరికి, కల్దీయులందరికి ఆధిపత్యం వహించాడు. నేను మాటలాడుతున్న వ్యక్తి పేరు దానియేలు. రాజు అతనికి బెల్తెషాజరు అని నామకరణం చేశాడు. బెల్తెషాజరు చాలా బుద్ధిమంతుడు. అతనికి చాలా విషయాలు తెలుసు. అతను కలయొక్క అర్థాలు చెప్పగలడు. రహస్య విషయాలు వివరించగలడు. కఠినమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరం చెప్పగలడు. దానియేలును పిలిపించు. గోడమీది వ్రాతకుగల అర్థమేమిటో అతను చెప్పగలడు” అని ఆమె చెప్పింది. అందువల్ల దానియేలును రాజు వద్దకు తీసుకు వచ్చారు. దానియేలుతో రాజు, “నీ పేరేనా దానియేలు, రాజైన మా తండ్రి యూదానుండి బందీగా తీసుకొని వచ్చినవాడవు నీవేనా? నీలో దేవతల ఆత్మ ఉన్నదని నేను విన్నాను. నీవు చురుకైనవాడవనీ, చాలా వివేక వంతుడవనీ, రహస్యాలను నీవు అర్థం చేసుకో గలవనీ విన్నాను. వివేకవంతుల్నీ, ఇంద్రజాలికుల్నీ గోడమీది వ్రాత చదవటానికి నా వద్దకు తీసుకువచ్చారు. కాని వారు నాకు గోడమీది వ్రాతకుగల అర్థాన్ని తెలుపలేకపోయారు. నేను నిన్ను గురించి విన్నాను. మర్మముల అర్థం ఏమిటో నీవు చెప్పగలవని విన్నాను. కఠినమైన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవని కూడా విన్నాను. గోడమీది వ్రాతను చదివి, దాని అర్థాన్ని నీవు వివరించగలిగితే, నీకు ఊదారంగుగల బట్టలు ధరింపజేస్తాను. నీ మెడకు బంగారు గొలుసు వేస్తాను. తర్వాత రాజ్యంలో నీవు మూడవ ఉన్నత పరిపాలకుడవు కాగలవు” అని అన్నాడు. తర్వాత దానియేలు రాజుతో, “బెల్షస్సరు రాజా, నీ కానుకలు నీవద్దనే ఉంచుకో. లేకపోతే, ఆ బహుమతుల్ని మరెవరికైనా ఇవ్వు. కాని నీ కోసం నేను గోడమీది వ్రాతను చదువగలను. మరియు దాని అర్థమేమిటో నీకు వివరించగలను” అని చెప్పాడు. “రాజా, సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరును మహా శక్తివంతుడైన రాజుగా చేశాడు. దేవుడు అతన్ని అతి ముఖ్యుడుగా చేశాడు. పెక్కు దేశాలకు చెందిన ప్రజలు, పలు భాషలు మాట్లాడే ప్రజలు నెబుకద్నెజరును చూచి భయపడేవారు. ఎందు కంటే సర్వోన్నతుడైన దేవుడు అతన్ని అతి ముఖ్యుడైన రాజుగా చేసిన కారణంవల్ల. నెబుకద్నెజరు ఒక వ్యక్తిని చంపదలచినట్లయితే, అతనిని చంపేవాడు. ఒక వ్యక్తిని జీవింపజేయ తలచుకుంటే, అతణ్ణి జీవించేలా చేసేవాడు. ఏ మనుష్యుల్ని ముఖ్యులుగా చేయదలుచుకుంటే, ఆ మనుష్యుల్ని ముఖ్యులుగా చేసేవాడు. హీనులుగా చేయదలచుకుంటే, హీనులుగా చేసేవాడు. “కాని నెబుకద్నెజరు గర్విష్ఠి అయ్యానాడు, మొండివాడయ్యాడు. అందువల్ల అతనినుండి అధికారం తీసుకొనబడింది. అతని రాజ సింహాసనం తొలగించబడింది. అతని ప్రభావం తొలగించబడింది. అతని బుద్ధి జంతువుల బుద్ధివలె మారింది. అతను అడవి గాడిదలతో నివసించసాగాడు. ఎద్దువలె పచ్చిక మేసాడు. మంచువల్ల తడిసాడు. అతను పాఠం నేర్చుకొనే వరకు ఈ సంగతులు జరిగాయి. తర్వాత సర్వోన్నతుడైన దేవుడు మనుష్యుల రాజ్యాల్ని పాలించువాడని, తనకు నచ్చిన వానికి రాజ్యాలు అప్పగించగలడని తెలుసుకొన్నాడు. “నెబుకద్నెజరు కుమారుడవైన బెల్షస్సరూ! ఈ విషయాలు నీకు ఇంతకు మునుపే తెలుసు, అయినా నిన్ను నీవు తగ్గించుకొనలేదు. అందుకు బదులుగా నీవు పరలోకమందున్న ప్రభువుకు విరోధంగా హెచ్చించుకున్నావు. యెహోవా ఆలయంనుండి నీవు త్రాగే పాత్రలు నీ కోసం ఆజ్ఞాపించి తెప్పించావు. తర్వాత నీవు, నీ భార్యలు, నీ ఉపపత్నులు, రాజోద్యోగులు ఆ పాత్రలనుండి ద్రాక్షామద్యం పానం చేశారు. నీవు వెండి, బంగారు, కంచు, ఇనుము, రాయి, కర్రలతో చేయబడిన దేవుళ్లను కీర్తించావు. అవి నిజమైన దేవుళ్లు కావు. అవి చూడలేవు, వినలేవు, లేక ఏమీ అర్థం చేసుకోలేవు. కాని నీ జీవితం మీదను, నీవు చేసేవాటి మీదను, అధికారంగల దేవుణ్ణి నీవు గౌరవించలేదు. ఆ కారణం వల్ల, దేవుడు గోడమీద వ్రాసే హస్తాన్ని పంపించాడు. ఈ క్రింది మాటలే గోడమీద వ్రాయబడినవి: మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. “ఈ మాటలకు అర్థం ఇది: మెనే: అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయములో లెక్కచూసి దాన్ని ముగించాడు. టెకేల్: అనగా దేవుడు నిన్ను త్రాసులో తూచగా నువ్వు తక్కువగా కనబడ్డావు. ఉఫార్సీన్: అనగా నీ రాజ్యం నీ వద్దనుండి తీసివేయబడి మాదీయులకూ పారసీకులకూ విభజింపబడింది.” తర్వాత బెల్షస్సరు ఊదారంగు బట్టలు దానియేలుకు ధరింపచేసేలా ఆజ్ఞ ఇచ్చాడు. అతని మెడకు బంగారు గొలుసు ధరింపజేశాడు. అతను రాజ్యంలో మూడవ గొప్ప పాలకుడని ప్రకటింపజేశాడు. ఆ రాత్రే బబులోను రాజైన బెల్షస్సరు హతుడయ్యాడు.

షేర్ చేయి
Read దానియేలు 5

దానియేలు 5:1-30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

రాజగు బెల్షస్సరు తన యధిపతులలో వెయ్యిమందికి గొప్ప విందుచేయించి, ఆ వెయ్యిమందితో కలిసికొని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన యధిపతులును తన రాణులును తన ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగునట్లు, తన తండ్రియగు నెబుకద్నెజరు యెరూషలేములోని యాలయములోనుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞ ఇచ్చెను. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసమగు ఆలయములోనుండి తీసికొన్న సువర్ణోపకరణములను తెచ్చి యుంచగా, రాజును అతని యధిపతులును అతని రాణులును అతని ఉపపత్నులును వాటిలో ద్రాక్షారసము పోసి త్రాగిరి. వారు బంగారు వెండి యిత్తడి యినుము కఱ్ఱ రాయి అను వాటితో చేసిన దేవతలను స్తుతించుచు ద్రాక్షారసము త్రాగుచుండగా ఆ గడియలోనే మానవ హస్తపు వ్రేళ్లు కనబడి, దీపము దగ్గర రాజుయొక్క నగరు గోడ పూత మీద ఏదో యొక వ్రాత వ్రాయుచున్నట్టుండెను. రాజు ఆ హస్తము వ్రాయుట చూడగా అతని ముఖము వికారమాయెను, అతడు మనస్సునందు కలవరపడగా అతని నడుము కీళ్లువదలి అతని మోకాళ్లు గడగడ వణకుచు కొట్టుకొనుచుండెను. రాజు గారడీ విద్యగలవారిని కల్దీయులను జ్యోతిష్కులను పిలువనంపుడని ఆతురముగా ఆజ్ఞ ఇచ్చి, బబులోనులోని జ్ఞానులు రాగానే ఇట్లనెను–ఈ వ్రాతను చదివి దీని భావమును నాకు తెలియజెప్పువాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడినవాడై రాజ్యములో మూడవ యధిపతిగా ఏలును. రాజు నియమించిన జ్ఞానులందరు అతని సముఖమునకు వచ్చిరి గాని ఆ వ్రాత చదువుటయైనను దాని భావము తెలియజెప్పుట యైనను వారివల్ల కాకపోయెను. అందుకు రాజగు బెల్షస్సరు మిగుల భయాక్రాంతుడై తన యధిపతులు విస్మయమొందునట్లుగా ముఖవికారముగలవాడాయెను. రాజునకును అతని యధిపతులకును జరిగిన సంగతి రాణి తెలిసికొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను– రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనియ్యకుము, నీ మనస్సు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు. అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు; నీ తండ్రికాలములో అతడు దైవజ్ఞానమువంటి జ్ఞానమును బుద్ధియు తెలివియు గలవాడైయుండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రియైన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును గారడీవిద్య గలవారికిని కల్దీయులకును జ్యోతిష్కులకును పై యధిపతిగా అతని నియమించెను. ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును, మర్మములు బయలుపరచుటకును, కఠినమైన ప్రశ్నలకుత్తర మిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము, అతడు దీని భావము నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలును పిలువనంపించిరి. అతడు రాగా రాజు ఇట్లనెను–రాజగు నా తండ్రి యూదయలోనుండి ఇక్కడికి తీసికొనివచ్చిన చెర సంబంధమగు యూదులలోనుండు దానియేలు నీవే గదా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీయందున్నవని నిన్నుగూర్చి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావము తెలియజెప్పవలెనని జ్ఞానులను గారడీవిద్య గలవారిని పిలిపించితిని గాని వారు ఈ సంగతియొక్క భావమును తెలుపలేక పోయిరి. అంతర్భావములను బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరమిచ్చుటకును నీవు సమర్థుడవని నిన్నుగూర్చి వినియున్నాను గనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావమును తెలియజెప్పుటకును నీకు శక్యమైనయెడల నీవు ఊదారంగు వస్త్రము కట్టుకొని మెడను సువర్ణకంఠభూషణము ధరించుకొని రాజ్యములో మూడవ యధిపతివిగా ఏలుదువు. అందుకు దానియేలు ఇట్లనెను–నీ దానములు నీయొద్ద నుంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవనికైన నిమ్ము; అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియ జెప్పెదను. రాజా చిత్తగించుము; మహోన్నతుడగు దేవుడు మహర్దశను రాజ్యమును ప్రభావమును ఘనతను నీ తండ్రియగు నెబుకద్నెజరునకు ఇచ్చెను. దేవుడు అతనికిట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరెనో వారిని చంపెను; ఎవరిని రక్షింపగోరెనో వారిని రక్షించెను, ఎవరిని హెచ్చింపగోరెనో వారిని హెచ్చించెను; ఎవరిని పడవేయగోరెనో వారిని పడవేసెను. కాబట్టి సకల రాష్టములును జనులును ఆయా భాషలు మాటలాడు వారును అతనికి భయపడుచు అతని యెదుట వణకుచు నుండిరి. అయితే అతడు మనస్సున అతిశయించి, బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసి కొనగా దేవుడు అతని ప్రభుత్వము నతనియొద్దనుండి తీసి వేసి అతని ఘనతను పోగొట్టెను. అప్పుడతడు మానవుల యొద్దనుండి తరమబడి పశువులవంటి మనస్సుగలవాడాయెను. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యములలో ఏలుచు, ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించునని అతడు తెలిసికొనువరకు అతడు అడవి గాడిదలమధ్య నివసించుచు పశువులవలె గడ్డి మేయుచు ఆకాశపు మంచు చేత తడిసిన శరీరము గలవాడాయెను. బెల్షస్సరూ, అతని కుమారుడవగు నీవు ఈ సంగతియంతయు ఎరిగి యుండియు, నీ మనస్సును అణచుకొనక, పరలోకమం దున్న ప్రభువుమీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. ఎట్లనగా నీవును నీ యధిపతులును నీ రాణులును నీ ఉప పత్నులును దేవుని ఆలయసంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసము పోసి త్రాగవలెనని వాటిని తెచ్చియుంచుకొని వాటితో త్రాగుచు, చూడనైనను విననైనను గ్రహింపనైనను చేతకాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కఱ్ఱ రాయి అను వాటితో చేయబడిన దేవతలను స్తుతించితిరి గాని, నీ ప్రాణమును నీ సకల మార్గములును ఏ దేవుని వశమున ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు. కావున ఆయన యెదుటనుండి ఈ యరచేయి వచ్చి ఈ వ్రాతను వ్రాసెను; వ్రాసిన శాసనమేదనగా, మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్. ఈ వాక్యభావమేమనగా, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వవిషయములో లెక్కచూచి దాని ముగించెను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరేస్ అనగా నీ రాజ్యము నీయొద్దనుండి విభాగింపబడి మాదీయులకును పారసీకులకును ఇయ్యబడును. బెల్షస్సరు ఆజ్ఞ ఇయ్యగా వారు దానియేలునకు ఊదారంగు వస్త్రము తొడిగించి యతని మెడను బంగారపు హారమువేసి ప్రభుత్వముచేయు టలో నతడు మూడవ యధికారియని చాటించిరి. ఆ రాత్రియందే కల్దీయుల రాజగు బెల్షస్సరు హతుడాయెను.

షేర్ చేయి
Read దానియేలు 5

దానియేలు 5:1-30 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

బెల్షస్సరు రాజు తన వేయిమంది ప్రముఖులకు గొప్ప విందు ఏర్పాటు చేసి వారితో కలిసి ద్రాక్షరసం త్రాగాడు. బెల్షస్సరు ద్రాక్షరసం త్రాగుతున్నప్పుడు, తన తండ్రియైన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలు తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. రాజు, తన ప్రముఖులు, తన భార్యలు, తన ఉంపుడుగత్తెలు వాటిలో ద్రాక్షరసం త్రాగాలని అనుకున్నాడు. కాబట్టి వారు యెరూషలేములోని దేవుని మందిరంలో నుండి తెచ్చిన బంగారు గిన్నెలు తీసుకురాగా రాజు, అతని ప్రముఖులు, అతని భార్యలు, అతని ఉపపత్నులు వాటిలో త్రాగారు. వారు ద్రాక్షరసం త్రాగుతూ, తమ బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అనే వాటితో చేసిన దేవుళ్ళను స్తుతించారు. అకస్మాత్తుగా మనిషి చేతివ్రేళ్లు కనిపించాయి, అవి దీపస్తంభానికి ఎదురుగా రాజభవనం గోడ మీద ఆ చేయి వ్రాస్తుండగా రాజు చూశాడు. అప్పుడు రాజు ముఖం తెల్లబోయింది, భయంతో అతని మోకాళ్లు వణుకుతూ కొట్టుకున్నాయి. రాజు శకునగాళ్లను, కల్దీయ జ్యోతిష్యులను, సోదె చెప్పేవారిని పిలిపించగా వచ్చిన బబులోను జ్ఞానులతో అతడు ఇలా అన్నాడు, “ఎవరైనా ఈ గోడ మీద రాత చదివి, దాని భావం నాకు చెప్తే, అతనికి ఊదా రంగు వస్త్రాలు తొడిగించి, తన మెడలో బంగారు గొలుసు వేసి, రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాము.” అప్పుడు రాజు యొక్క జ్ఞానులందరు వచ్చారు, కాని గోడ మీద ఆ రాతను చదవలేకపోయారు, దాని అర్థం చెప్పలేకపోయారు. కాబట్టి బెల్షస్సరు రాజు ఇంకా భయపడ్డాడు, అతని ముఖం ఇంకా పాలిపోయింది. అతని అధికారులు కలవరపడ్డారు. రాజు, అతని అధికారుల స్వరాలు విని, రాణి విందుశాలకు వచ్చింది, “రాజు చిరకాలం జీవించు గాక! కలవరపడకండి! నిబ్బరంగా ఉండండి! అని ఆమె అన్నది. మీ రాజ్యంలో పవిత్ర దేవుళ్ళ ఆత్మ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు. మీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం, వివేకం, తెలివితేటలు కలిగినవానిగా గుర్తించబడ్డాడు. మీ తండ్రియైన నెబుకద్నెజరు రాజు అతన్ని మాంత్రికులు, శకునగాళ్లు, కల్దీయ జ్యోతిష్యులు, సోదె చెప్పేవారి మీద అధిపతిగా నియమించాడు. ఎందుకంటే బెల్తెషాజరు అని రాజుచేత పిలువబడే దానియేలుకు చురుకైన మనస్సు, వివేకం, జ్ఞానం కలిగి, కలల భావాలు చెప్పడానికి, మర్మాలు వివరించడానికి, కఠినమైన ప్రశ్నలను పరిష్కరించడానికి సామర్థ్యం గలవాడు. ఆ దానియేలును పిలిపించండి, అతడు ఈ వ్రాతకు అర్థం మీకు చెప్తాడు.” కాబట్టి దానియేలును రాజు సముఖానికి తీసుకువచ్చారు. రాజు దానియేలుతో ఇలా అన్నాడు, “నా తండ్రి యూదా నుండి తెచ్చిన బందీలలో ఒకడివైన దానియేలు నీవేనా? నీలో దేవుళ్ళ ఆత్మ ఉందని, దైవ జ్ఞానం, వివేకం, విశేష జ్ఞానం ఉన్నాయని నేను విన్నాను. గోడ మీద ఈ వ్రాత చదివి, దాని అర్థం నాకు చెప్పడానికి జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాను, కాని వారెవరు అర్థం చెప్పలేకపోయారు. ఇప్పుడు నీవు భావాలు చెప్పగలవని, కఠిన ప్రశ్నలను పరిష్కరించగలవని నేను విన్నాను. ఈ వ్రాత చదివి దాని అర్థం నాకు చెప్తే, నీకు ఊదా రంగు వస్ర్తం తొడిగించి, నీ మెడకు బంగారు గొలుసు వేసి, నిన్ను రాజ్యంలో మూడవ అధికారిగా చేస్తాను.” అప్పుడు దానియేలు రాజుకు జవాబిస్తూ, “మీ కానుకలు మీరే ఉంచుకోండి, మీ బహుమానాలు ఎవరికైనా ఇవ్వండి. అయితే రాజు కోసం నేను ఈ రాత చదివి, దాని భావం ఏంటో చెప్తాను” అన్నాడు. “రాజా! సర్వోన్నతుడైన దేవుడు నీ తండ్రి నెబుకద్నెజరుకు ఆధిపత్యం, మహాత్యం, ఘనత, వైభవం ప్రసాదించారు. అతనికి ఇచ్చిన ఉన్నత స్థానాన్ని బట్టి అన్ని దేశాలు, వివిధ భాషల ప్రజలందరు అతనికి వణుకుతూ, భయపడేవారు. రాజు చంపాలనుకున్న వారిని చంపేవాడు; వదిలేయాలనుకున్నవారిని వదిలేశాడు; ఉన్నత పదవి ఇవ్వాలనుకున్నవారికి ఉన్నత పదవి ఇచ్చాడు; అవమానించాలని అనుకున్నవారిని అవమానించాడు. అయితే, అతని హృదయం అహంకారంతో నిండింది, గర్వంతో బండబారి పోయింది, అప్పుడు అతడు తన సింహాసనం నుండి త్రోసివేయబడి, తన మహిమను కోల్పోయాడు. అతడు ప్రజల్లో నుండి తరమబడి అతనికి జంతువుల మనస్సు ఇవ్వబడింది; అతడు అడవి గాడిదలతో నివసిస్తూ, ఎద్దులా గడ్డి మేశాడు; సర్వోన్నతుడు భూరాజ్యాల మీద అధికారి అని, ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే వారికి వాటిని ఇస్తారని అతడు గుర్తించేవరకు అతని శరీరం ఆకాశం నుండి కురిసే మంచుకు తడిసింది. “అయితే అతని కుమారుడవైన బెల్షస్సరు, ఇదంతా తెలిసినా కూడా నిన్ను నీవు తగ్గించుకోలేదు. పరలోక ప్రభువుకు వ్యతిరేకంగా నిన్ను నీవు గొప్ప చేసుకున్నావు. దేవాలయ పాత్రలను తెప్పించి వాటిలో ద్రాక్షరసం పోసుకొని నీవు, నీ అధికారులు, నీ భార్యలు, నీ ఉంపుడుగత్తెలు త్రాగారు. చూడలేని, వినలేని, గ్రహించలేని వెండి, బంగారం, ఇత్తడి, ఇనుము, కర్ర, రాతి దేవుళ్ళను నీవు స్తుతించావు. కాని నీ జీవితాన్ని, నీ మార్గాలన్నిటిని తన చేతిలో పట్టుకున్న దేవున్ని నీవు గౌరవించలేదు. కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు. “వ్రాయబడిన రాత ఇది: మెనే, మెనే, టెకేల్, ఉఫార్సీన్. “ఈ పదాల అర్థం ఇది: “మెనే: దేవుడు నీ పరిపాలన రోజులను లెక్కించి, నీ పాలనను ముగింపుకు తీసుకువచ్చారు. “టెకేల్: నీవు త్రాసులో తూచబడ్డావు, తక్కువగా ఉన్నట్లు తేలింది. “ఫెరేస్: నీ రాజ్యం విభజింపబడి మాదీయులకు పర్షియా వారికి ఇవ్వబడుతుంది.” అప్పుడు బెల్షస్సరు ఆజ్ఞమేరకు, దానియేలుకు ఊదా రంగు వస్ర్తం తొడిగించారు, అతని మెడలో బంగారు గొలుసు వేశారు, అతన్ని రాజ్యంలో మూడవ అధికారిగా ప్రకటించారు. అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు

షేర్ చేయి
Read దానియేలు 5