దాని 5
5
గోడ పై చేవ్రాత
1కొన్ని సంవత్సరాలు తరువాత ఒక రోజు రాజైన బెల్షస్సరు తన రాజ్యంలోని వెయ్యి మంది అధికారులకు గొప్ప విందు చేయించాడు. ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షమద్యం తాగుతున్నాడు. 2బెల్షస్సరు ద్రాక్షమద్యం సేవిస్తూ తన తండ్రి నెబుకద్నెజరు#5:2 తన తండ్రి నెబుకద్నెజరు తండ్రి అన్న మాటను పూర్వీకుడు అనే అర్ధంలో వాడారు తప్ప నిజమైన తండ్రి కాదు. యెరూషలేమును కొల్లగొట్టి దేవాలయంలో నుండి తెచ్చిన బంగారు, వెండి పాత్రలను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. అతడు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు వాటిలో ద్రాక్ష మద్యం సేవించాలన్నది అతడి ఉద్దేశం.
3సేవకులు యెరూషలేములో ఉన్న దేవుని నివాసమైన ఆలయం నుండి దోచుకువచ్చిన బంగారు పాత్రలు తీసుకువచ్చారు. రాజు, అతని అధికారులు, రాణులు, ఉపపత్నులు ఆ పాత్రల్లో ద్రాక్ష మద్యం పోసుకుని సేవించారు. 4అలా సేవిస్తూ బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేయబడిన తమ దేవుళ్ళను కీర్తించారు. 5ఆ సమయంలోనే రాజుకు మనిషి చేతి వేళ్ళు కనిపించాయి. దీపస్తంభం ఎదురుగా రాజ భవనం గోడ మీద ఏదో ఒక రాత రాస్తూ ఉన్నట్టు కనబడింది. 6ఆ చెయ్యి గోడపై రాస్తూ ఉండడం చూసిన రాజు ముఖం పాలిపోయింది. అతడు హృదయంలో కలవరం చెందాడు. అతని మోకాళ్ళు వణుకుతూ గడగడ కొట్టుకున్నాయి. నడుము కీళ్లు పట్టు సడలాయి.
7రాజు ఆత్రుతగా గారడీ విద్యలు చేసేవాళ్ళను, కల్దీయులను జ్యోతిష్యులను వెంటనే పిలిపించమని ఆజ్ఞ ఇచ్చాడు. బబులోనులోని జ్ఞానులు రాగానే వాళ్ళతో ఇలా అన్నాడు. “ఈ రాతను చదివి దీని భావం నాకు తెలియజేసిన వాడికి అతడు ఎవరైనా సరే, అతనికి ఊదా రంగు దుస్తులు ధరింపజేసి అతని మెడకు బంగారు గొలుసులు వేయిస్తాను. అతణ్ణి రాజ్యంలో మూడో అధిపతిగా నియమిస్తాను.” 8రాజ్యానికి చెందిన జ్ఞానులందరూ చేరుకున్నారు. కానీ అక్కడ రాసింది చదవడానికీ దాని భావం చెప్పడానికీ ఎవ్వరికీ సాధ్యం కాలేదు.
9అందువల్ల బెల్షస్సరు రాజు మరింత భయపడ్డాడు. అధికారులంతా ఆశ్చర్యపడేలా అతని ముఖం వికారంగా మారిపోయింది. 10రాజు, అతని అధిపతులు ఆందోళన చెందుతున్న విషయం రాణికి తెలిసింది. ఆమె విందు జరుగుతున్న గృహానికి చేరుకుని, రాజుతో ఇలా చెప్పింది. “రాజు చిరకాలం జీవిస్తాడు గాక. నీ ఆలోచనలతో కలవరపడవద్దు. నీ మనస్సును నిబ్బరంగా ఉంచుకో. 11నీ రాజ్యంలో పవిత్ర దేవుని ఆత్మ కలిగి ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. నీ తండ్రి జీవించి ఉన్న కాలంలో అతనికి దేవతల జ్ఞానం, బుద్ధి వివేకాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. అందువల్ల నీ తండ్రి నెబుకద్నెజరు అతణ్ణి దేశంలో శకునం చెప్పేవాళ్ళ మీద, గారడీవిద్య గలవారి మీద, కల్దీయుల, జ్యోతిష్యుల మీద అధికారిగా నియమించాడు.”
12“ఈ దానియేలు బుద్ధికుశలత కలిగినవాడై కలల భావం చెప్పడానికి, మర్మం బయలుపరచడానికి, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి జ్ఞానం, తెలివితేటలు కలిగినవాడు కనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అని పేరు పెట్టాడు. ఈ దానియేలుకు కబురు పెట్టి రప్పించు. అతడు దీని భావం నీకు చెబుతాడు.”
13అప్పుడు వాళ్ళు దానియేలును తీసుకువచ్చారు. అతడు వచ్చినప్పుడు రాజు ఇలా అన్నాడు. “రాజైన నా తండ్రి యూదయ దేశం నుండి చెరపట్టి తీసుకువచ్చిన బందీల్లో ఉన్న దానియేలువి నువ్వే కదా? 14దేవుళ్ళ ఆత్మ, బుద్ది వివేకాలు, అమితమైన జ్ఞాన సంపద నీలో ఉన్నాయని నిన్ను గూర్చి విన్నాను. 15గోడపై రాసి ఉన్న దీన్ని చదివి దాని భావం తెలియజేయడానికి జ్ఞానులను, గారడీ విద్యలు చేసేవాళ్ళను పిలిపించాను. వాళ్ళు దీని అర్థం చెప్పలేకపోయారు.”
16“నిగూఢ మర్మాలను వెల్లడించడానికి, కఠినమైన ప్రశ్నలకు జవాబు చెప్పడానికి నీవు సమర్ధుడవని నిన్ను గూర్చి విన్నాను. కనుక ఈరాతను చదివి, దాని అర్థం వివరించిన పక్షంలో నీకు ఊదారంగు దుస్తులు ధరింపజేస్తాను. నిన్ను దేశంలో నా తరువాత మూడో స్థానంలో అధికారిగా చేస్తాను.”
17బదులుగా దానియేలు ఇలా అన్నాడు. “రాజా, నీ బహుమతులు నీ దగ్గరే ఉంచుకో. వాటిని ఇంకా ఎవరికైనా ఇచ్చుకో. నేను ఇక్కడ రాసి ఉన్నదాన్ని చదివి, నీకు దాని అర్థం చెబుతాను. 18రాజా విను. మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థితిని, రాజ్యాన్ని. బల ప్రభావాలను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చి ఘనపరిచాడు. 19దేవుడు అతనికి అలాంటి ఉన్నత స్థితిని అనుగ్రహించడంవల్ల అతడు ఎవరిని చంపాలనుకున్నాడో వాళ్ళను చంపాడు. ఎవరిని కాపాడాలనుకున్నాడో వాళ్ళను కాపాడాడు. ఎవరిని గొప్ప చేయాలనుకున్నాడో వాళ్ళను గొప్పచేశాడు. ఎవరిని అణచివేయాలనుకున్నాడో వాళ్ళను అణచివేశాడు. అందువల్ల సకల ప్రాంతాల ప్రజలు, వివిధ భాషలు మాట్లాడేవాళ్ళు అతనికి భయపడుతూ అతని ఎదుట వణకుతూ లోబడి ఉన్నారు.”
20“అయితే అతని హృదయం గర్వంతో ఉప్పొంగిపోయింది. అతని హృదయం కఠినం చేసుకుని చెడ్డ పనులు జరిగించినప్పుడు దేవుడు అతని నుండి రాజ్యాన్ని తీసివేసి అతని ఘనతనంతా పోగొట్టాడు. 21అతణ్ణి మనుషుల మధ్య నుండి తరిమివేశాడు. అతడి మనసు పశువుల మనసులా మారిపోయింది. అతడు అడవి గాడిదలాగా గడ్డి మేస్తూ ఆకాశం నుంచి పడే మంచుకు తడిసిపోయాడు. మహోన్నతుడైన దేవుడే మనుషుల మీదా, రాజ్యాల మీదా సర్వాధికారి అనీ, ఆయన ఎవరిని వాటిపై నియమించాలనుకున్నాడో వాళ్ళను నియమిస్తాడనీ గ్రహించే వరకూ అదే స్థితిలో ఉండిపోయాడు.”
22“బెల్షస్సరూ, అతని కొడుకువైన నీకు ఈ విషయాలన్నీ తెలుసు. అవన్నీ తెలిసి కూడా నువ్వు నీ మనస్సును అదుపులో ఉంచుకోకుండా పరలోకంలో ఉండే ప్రభువుకంటే అధికంగా నిన్ను నువ్వు హెచ్చించుకున్నావు. 23ఎలాగంటే నువ్వూ, నీ అధికారులు, రాణులు, ఉపపత్నులు దేవుని ఆలయం నుండి తెచ్చిన పాత్రల్లో ద్రాక్షామద్యం పోసుకుని సేవించారు. బంగారం, వెండి, యిత్తడి, ఇనుము, చెక్క, రాయిలతో చేసిన, చూడలేని, వినలేని, గ్రహించలేని దేవుళ్ళను కీర్తించారు. నీ ప్రాణం, నీ సకల సంపదలు ఏ దేవుని చేతిలో ఉన్నాయో ఆ దేవుణ్ణి నువ్వు ఘనపరచలేదు. 24అందువల్ల ఆ దేవుని సన్నిధి నుండి ఈ చెయ్యి వచ్చి ఈ విధంగా రాసింది. రాసిన విషయం ఏమిటంటే, ‘మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్.’
25ఈ రాతకి అర్థం ఏమిటంటే, ‘మెనే’ అంటే, దేవుడు నీ రాజ్య పాలన విషయంలో లెక్క చూసి దాన్ని ముగించాడు. 26‘టెకేల్’ అంటే, ఆయన నిన్ను త్రాసులో తూచినప్పుడు నువ్వు తక్కువవాడిగా కనిపించావు. 27‘ఫెరేన్’ అంటే, నీ రాజ్యం నీ దగ్గర నుండి తీసివేసి మాదీయ జాతికివారికి, పారసీకులకు ఇవ్వడం జరుగుతుంది.” 28బెల్షస్సరు ఆజ్ఞ ప్రకారం దానియేలుకు ఊదారంగు దుస్తులు తొడిగించారు. 29అతని మెడలో స్వర్ణ హారం వేసి, ప్రభుత్వ వ్యవహారాల నిర్వహణలో అతణ్ణి మూడవ అధికారిగా నియమించి చాటింపు వేయించారు. 30అదే రాత్రి బెల్షస్సరు అనే ఆ కల్దీయుల రాజును చంపేశారు. 31అరవై రెండు సంవత్సరాల వయసున్న మాదీయ రాజు దర్యావేషు సింహాసనం అధిష్టించాడు.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
దాని 5: IRVTel
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
TEL-IRV
Creative Commons License
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.