దానియేలు 2:1-9
దానియేలు 2:1-9 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నెబుకద్నెజరు పరిపాలన యొక్క రెండవ సంవత్సరంలో అతడు కలలు కన్నాడు; వాటివలన అతని మనస్సు కలతచెందింది, అతడు పడుకోలేకపోయాడు. కాబట్టి అతడు తనకు వచ్చిన కలను చెప్పడానికి మాంత్రికులను, శకునగాళ్లను, గారడీవారిని, జ్యోతిష్యులను పిలిపించాడు. వారు వచ్చి రాజు సమక్షంలో నిలబడ్డారు. రాజు వారితో, “నాకు కల వచ్చింది, అది నన్ను కలవరపెడుతుంది, దాని భావం ఏంటో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను” అని అన్నాడు. అప్పుడు జ్యోతిష్యులు రాజుకు జవాబిస్తూ, “రాజు చిరకాలం జీవించు గాక! మీ దాసులకు కల ఏంటో చెప్పండి, మేము దాని భావం చెప్తాం” అన్నారు. రాజు కల్దీయ జ్యోతిష్యులతో, “నేను ఆ కలను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పకపోతే మిమ్మల్ని ముక్కలుగా చేసి, మీ ఇళ్ళను కూల్చివేస్తాను. కాని ఒకవేళ మీరు నా కలను, దాని భావాన్ని చెప్తే మీకు కానుకలు, బహుమానాలు, గొప్ప ఘనతను ఇస్తాను. కాబట్టి నాకు వచ్చిన కలను చెప్పి, దాని భావాన్ని వివరించండి” అన్నాడు. అందుకు వారు, “రాజు తన దాసులకు కలను చెబితే మేము దాని భావం వివరిస్తాం” అన్నారు. అప్పుడు రాజు వారితో ఇలా అన్నాడు, “నాకు వచ్చిన కలను నేను మరచిపోయాను కాబట్టి మీరు కాలయాపన చేయడానికి ప్రయత్నిస్తున్నారని నాకు ఖచ్చితంగా తెలుసు. నాకు వచ్చిన కలను మీరు చెప్పకపోతే, మీరు ఖచ్చితంగా శిక్షించబడతారు. పరిస్థితి మారాలని నన్ను తప్పుదారి పట్టించే మోసపు మాటలు చెప్పాలని అనుకుంటున్నారు. కాబట్టి నాకు కలను చెప్పండి, అప్పుడు మీరు కల భావం చెప్పగలరని నేను తెలుసుకుంటాను.”
దానియేలు 2:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు. తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. రాజు వాళ్ళతో “నాకు నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలల అర్థం తెలుసుకోవాలని నేను ఎంతో ఆదుర్దా పడుతున్నాను” అని చెప్పాడు. అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలలను నేను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పాలి. చెప్పని పక్షంలో మిమ్మల్ని ఖండ ఖండాలుగా నరికిస్తాను. మీ ఇళ్ళను నేలమట్టం చేయిస్తాను. కలనూ దాని భావాన్నీ చెప్పిన వాళ్ళకు కానుకలు, బహుమతులు ఇస్తాను. వాళ్ళు నా సమక్షంలో సత్కరిస్తాను. కాబట్టి నా కలను, దాని భావాన్ని చెప్పండి” అన్నాడు. అప్పుడు వాళ్ళంతా “రాజా, మీకు వచ్చిన ఆ కలను మీ దాసులమైన మాకు చెప్పిన పక్షంలో మేము దాని భావం చెబుతాము” అని మళ్ళీ జవాబిచ్చారు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను నేను మరచిపోవడం వల్ల మీరు తాత్సారం చేయాలని చూస్తున్నట్టు నేను గ్రహించాను. నా సన్నిధిలో అబద్ధాలు, వంచన మాటలు పలుకుతూ యుక్తిగా కాలయాపన చేయాలని చూస్తున్నారు. మీరు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పకపోతే నేను కచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను కాబట్టి ముందు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పండి. అప్పుడు ఆ కలకు అర్థం చెప్పడానికి మీకు సామర్థ్యం ఉందని నేను తెలుసుకుంటాను” అన్నాడు.
దానియేలు 2:1-9 పవిత్ర బైబిల్ (TERV)
నెబుకద్నెజరు రాజుగావున్న రెండవ సంవత్సరంలో, అతనికి కొన్ని కలలు వచ్చాయి. ఆ కలలు అతన్ని కలతపెట్టాయి, కనుక అతనికి నిద్ర పట్టలేదు. అప్పుడు రాజు తన కలను చెప్పటానికి మాంత్రికులను, గారడీవాళ్లను, శకునం చెప్పేవాళ్లను, కల్దీయులను పిలుపించుమని ఆజ్ఞాపించాడు. వారందరు వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. తాను ఏమి కలగన్నాడో చెప్పమని రాజు వారిని అడిగాడు. అప్పుడు వారితో రాజు ఇలా అన్నాడు, “ఆ కల నన్ను కలత పెట్టింది. కాబట్టి కల, దాని అర్థం నాకు మీరు చెప్పాలి” తర్వాత కల్దీయులు రాజుతో సిరియా భాషలో, “రాజా, వర్థిల్లుము. మేము నీ సేవకులం. దయచేసి నీ కల ఏమిటో చెప్పుము. ఆ తర్వాత దాని అర్థం మేము చెబుతాము” అని అన్నారు. అప్పుడు నెబుకద్నెజరు వారితో, “ఆ కలను నేను మర్చిపోయాను. కలను, దాని అర్థాన్ని కూడా మీరు చెప్పాలి. మీరు ఇవి చెప్పకపోతే, మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తాను. మీ ఇళ్లను పాడు దిబ్బలుగా చేయిస్తాను. కాని మీరు నా కలను, దాని అర్థాన్ని వివరించినట్లయితే, అప్పుడు మీకు నేను కానుకలు, బహుమానాలు ఇస్తాను. గొప్పగా గౌరవిస్తాను. అందువల్ల ఆ కలను, దాని భావాన్ని, మీరు నాతో చెప్పండి” అని అన్నాడు. మళ్లీ ఆ జ్ఞానవంతులు, “రాజా, దయచేసి నీ కలను చెప్పుము, మేము దాని అర్థం చెబుతాము” అని అడిగారు. అప్పుడు నెబుకద్నెజరు ఇలా అన్నాడు: “మీరింకా వ్యవధి కోరుతున్నారని నాకు తెలుసు. కాని నేనేమి చెప్పానో, అది నా నిర్ధారణ అని మీకు తెలుసు. మీరు నా కలను గురించి చెప్పకపోతే, నేను మిమ్మల్ని శిక్షిస్తానని కూడా మీకు తెలుసు. కాబట్టి మీరంతా నాతో వ్యర్థమైన మాటలు, అబద్ధాలు చెప్పటానికి కాలయాపన చేస్తున్నారు. నేను చెప్పిన మాటలు మరచిపోతానని మీరు భావించవద్దు. ఇప్పుడు నా కలనుగురించి చెప్పండి. మీరు చెప్పితే, అప్పుడు ఆ కలయొక్క అర్థము కూడా మీరు చెప్పగలరని నాకు తెలుస్తుంది.”
దానియేలు 2:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నెబుకద్నెజరు తన యేలుబడియందు రెండవ సంవత్సరమున కలలు కనెను. అందునుగురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్రపట్టకుండెను. కాగా రాజు తాను కనిన కలలను తనకు తెలియజెప్పుటకై శకునగాండ్రను గారడీవిద్యగలవారిని మాంత్రికులను కల్దీయులను పిలువ నంపుడని యాజ్ఞ ఇయ్యగా వారు వచ్చి రాజు సముఖమున నిలచిరి. రాజు వారితో–నేనొక కల కంటిని, ఆ కల భావము తెలిసికొనవలెనని నేను మనోవ్యాకుల మొంది యున్నాననగా కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి– రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము. రాజు–నేను దాని మరచి పోతిని గాని, కలను దాని భావమును మీరు తెలియజేయనియెడల మీరు తుత్తునియలుగా చేయబడుదురు; మీ యిండ్లు పెంటకుప్పగా చేయబడును. కలను దాని భావమును తెలియజేసినయెడల దానములును బహుమానములును మహాఘనతయు నా సముఖములో నొందుదురు గనుక కలను దాని భావమును తెలియజేయుడనగా వారు –రాజు ఆ కలను తమరి దాసులమైన మాకు చెప్పినయెడల మేము దాని భావమును తెలియజేసెదమని మరల ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు ఉత్తరమిచ్చి చెప్పినది ఏమనగా – నేను మరచి యుండుట మీరు చూచి కాలహరణము చేయవలెనని మీరు కనిపెట్టుచున్నట్లు నేను బాగుగా గ్రహించుచున్నాను. కాలము ఉపాయముగా గడపవలెనని అబద్ధమును మోసపుమాటలను నాయెదుట పలుక నుద్దేశించియున్నారు. మీరు కలను చెప్పలేకపోయినయెడల నేను చెప్పిన మాట ఖండితము గనుక కలను నాకు చెప్పుడి అప్పుడు దాని భావమును తెలియజేయుటకు మీకు సామర్థ్యము కలదని నేను తెలిసికొందును.
దానియేలు 2:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)