దాని 2:1-9

దాని 2:1-9 IRVTEL

రాజైన నెబుకద్నెజరు పాలన కాలం రెండవ సంవత్సరంలో అతనికి నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలలను బట్టి అతడు కలవరం చెందాడు. అతనికి నిద్రపట్టడం లేదు. తనకు వచ్చిన కలలను గూర్చి తెలియజేయడానికి శకునాలు చెప్పేవాళ్ళను, గారడీ విద్యలు చేసేవాళ్ళను, మాంత్రికులను, జోతిష్యులను పిలవమని ఆజ్ఞ ఇచ్చాడు. వాళ్ళందరూ వచ్చి రాజు ఎదుట నిలబడ్డారు. రాజు వాళ్ళతో “నాకు నిద్రలో కలలు వచ్చాయి. ఆ కలల అర్థం తెలుసుకోవాలని నేను ఎంతో ఆదుర్దా పడుతున్నాను” అని చెప్పాడు. అప్పుడు జోతిష్యులు సిరియా భాషలో “రాజు చిరకాలం జీవించు గాక. మీ దాసులమైన మాకు ఆ కలలు ఏమిటో చెప్పండి. దాని భావం మీకు వివరిస్తాం” అన్నారు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలలను నేను మరచిపోయాను. మీరు నాకు వచ్చిన కలను, దాని భావాన్ని చెప్పాలి. చెప్పని పక్షంలో మిమ్మల్ని ఖండ ఖండాలుగా నరికిస్తాను. మీ ఇళ్ళను నేలమట్టం చేయిస్తాను. కలనూ దాని భావాన్నీ చెప్పిన వాళ్ళకు కానుకలు, బహుమతులు ఇస్తాను. వాళ్ళు నా సమక్షంలో సత్కరిస్తాను. కాబట్టి నా కలను, దాని భావాన్ని చెప్పండి” అన్నాడు. అప్పుడు వాళ్ళంతా “రాజా, మీకు వచ్చిన ఆ కలను మీ దాసులమైన మాకు చెప్పిన పక్షంలో మేము దాని భావం చెబుతాము” అని మళ్ళీ జవాబిచ్చారు. అప్పుడు రాజు “నాకు వచ్చిన కలను నేను మరచిపోవడం వల్ల మీరు తాత్సారం చేయాలని చూస్తున్నట్టు నేను గ్రహించాను. నా సన్నిధిలో అబద్ధాలు, వంచన మాటలు పలుకుతూ యుక్తిగా కాలయాపన చేయాలని చూస్తున్నారు. మీరు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పకపోతే నేను కచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాను కాబట్టి ముందు నాకు వచ్చిన కల ఏమిటో చెప్పండి. అప్పుడు ఆ కలకు అర్థం చెప్పడానికి మీకు సామర్థ్యం ఉందని నేను తెలుసుకుంటాను” అన్నాడు.