కొలొస్సయులకు 3:12-17
కొలొస్సయులకు 3:12-17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కనుక, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రియమైన వారిలా, మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి. ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. వాటన్నిటిని ఒక్కటిగా సంపూర్ణ ఐక్యతలోనికి తీసుకువచ్చే ప్రేమను వీటన్నింటి కంటే పైగా ధరించుకోండి. ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కొరకు మీరు పిలువబడ్డారు, కనుక క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి. సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మీరు మాటలలో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
కొలొస్సయులకు 3:12-17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి. ఒకరినొకరు సహించుకోండి. ఇతరుల పట్ల కృప కలిగి ఉండండి. ఎవరి మీదైనా ఫిర్యాదు ఉంటే ప్రభువు మిమ్మల్ని క్షమించినట్టే మీరూ క్షమించండి. వీటన్నిటికి పైగా ప్రేమను కలిగి ఉండండి. ప్రేమ ఐక్యతకు పరిపూర్ణ రూపం ఇస్తుంది. క్రీస్తు ప్రసాదించే శాంతి మీ హృదయాల్లో పరిపాలించనివ్వండి. ఈ శాంతి కోసమే మిమ్మల్ని ఒకే శరీరంగా దేవుడు పిలిచాడు. ఇంకా కృతజ్ఞులై ఉండండి. క్రీస్తు వాక్కు మీలో సమృద్ధిగా నివసించనివ్వండి. సంపూర్ణ జ్ఞానంతో ఒకరికొకరు బోధించుకోండి, బుద్ది చెప్పుకోండి. మీ హృదయాల్లో కృతజ్ఞత కలిగి కీర్తనలతోనూ భజనలతోనూ ఆత్మ సంబంధమైన గానాలతోనూ దేవునికి పాటలు పాడండి. మాటతో గానీ చర్యతో గానీ, మీరేది చేసినా ప్రభువైన యేసు పేర చేయండి. తండ్రి అయిన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతలు అర్పిస్తూ చేయండి.
కొలొస్సయులకు 3:12-17 పవిత్ర బైబిల్ (TERV)
మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. మీలో ఎవడైనా మీకు అన్యాయం చేసినవాడనిపిస్తే కోపగించుకోకుండా అతణ్ణి క్షమించండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా యితరులను క్షమించండి. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రేమను అలవర్చుకోండి. అది సంపూర్ణమైన బంధాన్ని, పరిపూర్ణమైన ఐక్యతను కలుగ చేస్తుంది. క్రీస్తు కలుగచేసిన శాంతిని మీ హృదయాలను పాలించనివ్వండి. మీరు ఒకే శరీరంలో ఉండాలని దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీలో శాంతి కలుగచేయాలని ఆయన ఉద్దేశ్యం. కృతజ్ఞతతో ఉండండి. క్రీస్తు సందేశాన్ని మీలో సంపూర్ణంగా జీవించనివ్వండి. మీ తెలివినంతా ఉపయోగించి పరస్పరం సహాయం చేసుకోండి. దైవసందేశాన్ని బోధించుకోండి. దేవునికి మీ హృదయాల్లో కృతజ్ఞతలు తెలుపుకొంటూ స్తుతిగీతాలు, కీర్తనలు పాడుకోండి. వాక్యాలు చదవండి. మాటద్వారా కాని, క్రియా రూపంగా కాని మీరేది చేసినా యేసు ప్రభువు పేరిట చెయ్యండి. ఆయన ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి కృతజ్ఞతతో ఉండండి.
కొలొస్సయులకు 3:12-17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హానిచేసెనని యొకడనుకొనినయెడల ఒకని నొకడు సహించుచు ఒకని నొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అను గ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుండ నియ్యుడి; ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి; మరియు కృతజ్ఞులై యుండుడి. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధిచెప్పుచు కృపా సహి తముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి. మరియు మాట చేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.
కొలొస్సయులకు 3:12-17 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి. ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. వీటన్నిటికి పైగా, పరిపూర్ణ ఐక్యతలో బంధించే ప్రేమను ధరించుకోండి. ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కోసం మీరు పిలువబడ్డారు, కాబట్టి క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి. సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి. మీరు మాటల్లో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.