కొలొస్సయులకు 3:10-12
కొలొస్సయులకు 3:10-12 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మరియు సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. ఇక్కడ యూదేతరులను గాని లేక యూదులని గానీ, సున్నతి పొందిన వారని గానీ సున్నతి పొందని వారని గానీ, అనాగరికులని లేక నాగరికులని కాని, బానిసలని గాని స్వతంత్రులని కాని భేదం లేదు. క్రీస్తే సమస్తం, అందరిలో ఉన్నది ఆయనే. కనుక, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రియమైన వారిలా, మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.
కొలొస్సయులకు 3:10-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఇప్పుడు ఒక నూతన వ్యక్తిని ధరించారు. ఆ నూతన వ్యక్తిని మీలో సృష్టించిన వాడి స్వరూపంలోకి పూర్ణ జ్ఞానంతో నూతనమవుతూ ఉన్నారు. ఇలాంటి అవగాహనలో గ్రీకు వాడనీ యూదుడనీ భేదాలు ఉండవు. సున్నతి పొందిన వాడనీ సున్నతి పొందని వాడనీ భేదం లేదు. ఆటవికుడనీ, సితియా జాతివాడనీ, బానిస అనీ, స్వతంత్రుడనీ లేదు. క్రీస్తే సమస్తం, సమస్తంలో ఆయనే ఉన్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి.
కొలొస్సయులకు 3:10-12 పవిత్ర బైబిల్ (TERV)
మీరు క్రొత్త జీవితం పొందారు. ఆ జీవితానికి సృష్టికర్త అయినటువంటి దేవుడు మిమ్మల్ని తన ప్రతిరూపంలో మలుస్తూ, తనను గురించిన జ్ఞానాన్ని మీలో అభివృద్ధి పరుస్తున్నాడు. ఇక్కడ గ్రీసు దేశస్థునికి, యూదునికి భేదం లేదు. సున్నతి పొందినవానికి, పొందనివానికి భేదంలేదు. విదేశీయునికి, సిథియనుడికి భేదం లేదు. బానిసకు, బానిసకానివానికి భేదం లేదు. క్రీస్తే సర్వము. అన్నిటిలోనూ ఆయనే ఉన్నాడు. మీరు దేవుడు ఎన్నుకొన్న వాళ్ళు. ఆయన ప్రేమిస్తున్న పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి.
కొలొస్సయులకు 3:9-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు. ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు. కాగా, దేవునిచేత ఏర్పరచబడినవారును పరిశుద్ధులును ప్రియులునైనవారికి తగినట్లు, మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి.
కొలొస్సయులకు 3:10-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. ఇక్కడ యూదులు అని యూదేతరులు అని, సున్నతి పొందిన వారని సున్నతి పొందని వారని, అనాగరికులని నాగరికులని, బానిసలని స్వతంత్రులని భేదం లేదు, క్రీస్తే సర్వం, అందరిలో ఆయనే ఉన్నాడు. కాబట్టి, పరిశుద్ధులును ప్రియమైన వారునైన దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల్లా మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి.