కొలొస్సయులకు 3:1-9
కొలొస్సయులకు 3:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు క్రీస్తుతోకూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతోకూడ దేవునియందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతోకూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటివలన దేవుని ఉగ్రత అవిధేయులమీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీనోట బూతులు అను వీటినన్నిటిని విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి; ఏలయనగా ప్రాచీనస్వభావమును దాని క్రియలతోకూడ మీరు పరిత్యజించి, జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించినవాని పోలికచొప్పున నూతన పరచబడుచున్న నవీనస్వభావమును ధరించుకొని యున్నారు.
కొలొస్సయులకు 3:1-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చునివున్నారు. భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి. ఎందుకంటే, మీరు చనిపోయారు, కనుక మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడివుంది. మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతోపాటు మహిమలో ప్రత్యక్షమవుతారు. కనుక మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధన అయిన దురాశలను చంపివేయండి. వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది. ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు. కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి. మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కనుక ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు
కొలొస్సయులకు 3:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడ సజీవులుగా లేపాడు కాబట్టి పైన ఉన్న వాటినే వెతుకుతూ ఉండండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. పైన ఉన్న వాటి మీదే మీ మనసు నిలపండి. భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు చనిపోయారు గానీ మీ జీవాన్ని దేవుడు క్రీస్తులో దాచి పెట్టాడు. మీ జీవం అయిన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా మహిమలో ఆయనతో ప్రత్యక్షమౌతారు. కాబట్టి ఈ లోకంలోని పాపపు వాంఛలను అంటే వ్యభిచారం, అపవిత్రత, లైంగిక విశృంఖలత, దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను చంపివేయండి. వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి వస్తుంది. గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు మీరు తీవ్ర కోపం, ఆగ్రహం, దుర్మార్గపు ఉద్దేశాలు, నిందా వాక్కులు, మీ నోటి నుండి అవమానకరమైన మాటలు, బూతులు అన్నీ వదిలి పెట్టాలి. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. ఎందుకంటే మీరు మీ పూర్వ నైజాన్ని దాని పనులతో సహా తీసివేశారు.
కొలొస్సయులకు 3:1-9 పవిత్ర బైబిల్ (TERV)
మీరు క్రీస్తుతో కూడా సజీవంగా లేచి వచ్చారు. ఆయన పరలోకంలో దేవుని కుడిచేతి వైపు కూర్చొని ఉన్నాడు. కనుక పరలోకంలో ఉన్నవాటిని ఆశించండి. మీరు మరణించారు. ఇప్పుడు మీ ప్రాణం క్రీస్తుతో సహా దేవునిలో దాగి ఉంది. కనుక భూమ్మీద ఉన్నవాటిని కాకుండా పరలోకంలో ఉన్నవాటిని గురించి ఆలోచించండి. క్రీస్తు మీ నిజమైన ప్రాణం. ఆయన వచ్చినప్పుడు మీరాయనతో సహా దేవుని మహిమలో భాగం పంచుకొంటారు. మీరు మీ భౌతిక వాంఛల్ని చంపుకోవాలి. అంటే, వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఇవి ఒక విధమైన విగ్రహారాధన కనుక, వీటన్నిటినీ వదులుకోవాలి. వీటివల్ల దేవునికి కోపం వస్తుంది. మీ గత జీవితంలో ఈ గుణాలు మీలో ఉన్నాయి. కాని యిక మీరు ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఇతరులను దూషించరాదు. బూతులు మాటలాడరాదు. మీరు మీ పాత స్వభావాల్ని, పద్ధతుల్ని వదిలి వేసారు కనుక అసత్యములాడరాదు.
కొలొస్సయులకు 3:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కాబట్టి, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చుని ఉన్నారు. భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి. ఎందుకంటే, మీరు చనిపోయారు, కాబట్టి మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడి ఉంది. మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతో పాటు మహిమలో ప్రత్యక్షమవుతారు. కాబట్టి మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధనయైన దురాశలను చంపివేయండి. వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది. ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు. కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి. మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కాబట్టి ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు