అపొస్తలుల కార్యములు 9:19-31

అపొస్తలుల కార్యములు 9:19-31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు. సౌలు కొన్ని రోజులు దమస్కులోని శిష్యులతో గడిపాడు. యేసే దేవుని కుమారుడని సమాజమందిరాలలో ప్రకటించడం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్న వారందరు ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసు పేరట ప్రార్థించిన వారిని నాశనం చేసిన వాడు ఇతడే కదా? ముఖ్యయాజకుల దగ్గరకి వారిని బందీలుగా పట్టుకొని వెళ్లడానికే ఇక్కడి వచ్చాడు కదా?” అని చెప్పుకొన్నారు. అయినా సౌలు మరింత ఎక్కువ బలపడి యేసే క్రీస్తు అని రుజువుచేస్తూ దమస్కులో జీవిస్తున్న యూదులను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకొన్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. అయితే అతని అనుచరులు రాత్రి వేళలో అతన్ని తీసుకువెళ్లి గంపలో కూర్చోబెట్టి గోడలోని సందు గుండా క్రిందకు దించారు. అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు. కానీ బర్నబా అతన్ని దగ్గరకు చేరదీసి అపొస్తలుల దగ్గరకు అతన్ని తీసుకు వచ్చాడు. సౌలు తన ప్రయాణంలో ప్రభువును ఎలా చూసాడు, ప్రభువు అతనితో మాట్లాడిన విషయం, అతడు దమస్కులో యేసు పేరట ధైర్యంగా ఎలా బోధించాడు అనే విషయాలను వారికి చెప్పాడు. కనుక సౌలు వారితో కలిసివుంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు. అతడు గ్రీకుభాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ వాదించాడు, అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నించారు. దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు. ఆ తర్వాత యూదయ, గలిలయ మరియు సమరయ ప్రాంతాలలో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది.

అపొస్తలుల కార్యములు 9:19-31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అతడు దమస్కులో ఉన్న శిష్యులతో చాలా రోజులు గడిపాడు. వెంటనే సమాజ మందిరాల్లో యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తూ వచ్చాడు. విన్నవారంతా ఆశ్చర్యపడి, ‘యెరూషలేములో ఈ పేరుతో ప్రార్థన చేసే వారిని నాశనం చేసింది ఇతడే కదా? వారిని బందీలుగా ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకుపోడానికి ఇక్కడికి కూడా వచ్చాడు కదా’ అని చెప్పుకున్నారు. అయితే సౌలు మరింతగా బలపడి ‘యేసే క్రీస్తు’ అని రుజువు పరుస్తూ దమస్కులో నివసిస్తున్న యూదులను కలవరపరచాడు. చాలా రోజులు గడిచిన తరువాత యూదులు అతనిని చంపాలని ఆలోచించారు. వారి కుతంత్రం సౌలుకు తెలిసింది. వారు అతనిని చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాల దగ్గర కాపు కాశారు. అయితే అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో కూర్చోబెట్టి గోడ మీద నుండి అతనిని కిందికి దింపి తప్పించారు. అతడు యెరూషలేము వచ్చినపుడు శిష్యులతో చేరడానికి ప్రయత్నం చేశాడు గాని, అతడు శిష్యుడని నమ్మలేక అందరూ అతనికి భయపడ్డారు. అయితే బర్నబా అతనిని చేరదీసి అపొస్తలుల దగ్గరికి తీసుకుని వచ్చి, “అతడు దారిలో ప్రభువును చూశాడనీ, ప్రభువు అతనితో మాట్లాడాడనీ, అతడు దమస్కులో యేసు నామంలో ధైర్యంగా బోధించాడు” అనీ, వారికి వివరంగా తెలియపరచాడు. అతడు యెరూషలేములో వారితో కలిసి వస్తూ పోతూ, ప్రభువు నామంలో ధైర్యంగా బోధిస్తూ, గ్రీకు యూదులతో మాట్లాడుతూ తర్కించాడు. అయితే వారు అతణ్ణి చంపాలని ప్రయత్నం చేశారు. సోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరయకు తీసుకు వచ్చి తార్సుకు పంపేశారు. కాబట్టి యూదయ, గలిలయ, సమరయ, ప్రాంతాలంతటా సంఘం ప్రశాంతంగా ఉంటూ అభివృద్ది చెందింది. ప్రభువు పట్ల భయం, పరిశుద్ధాత్మ ప్రసాదించే ఆదరణ కలిగి సాగిపోతూ విస్తరించింది.

అపొస్తలుల కార్యములు 9:19-31 పవిత్ర బైబిల్ (TERV)

ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది. సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు. అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపినవాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు. కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు. కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు. సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు. ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

అపొస్తలుల కార్యములు 9:19-31 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను. వెంటనే సమాజమందిరములలో –యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను. వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి. కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.

అపొస్తలుల కార్యములు 9:19-31 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అతడు కొంత ఆహారం తీసుకున్న తర్వాత శక్తి పొందుకొన్నాడు. సౌలు కొన్ని రోజులు దమస్కులోని శిష్యులతో గడిపాడు. యేసే దేవుని కుమారుడని సమాజమందిరాల్లో ప్రకటించడం మొదలుపెట్టాడు. అతని మాటలు విన్నవారందరు ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసు పేరట ప్రార్థించిన వారిని నాశనం చేసినవాడు ఇతడే కదా? ముఖ్య యాజకుల దగ్గరకి వారిని బందీలుగా పట్టుకుని వెళ్లడానికే ఇక్కడి వచ్చాడు కదా?” అని చెప్పుకొన్నారు. అయినా సౌలు మరింత ఎక్కువ బలపడి యేసే క్రీస్తు అని రుజువుచేస్తూ దమస్కులో జీవిస్తున్న యూదులను ఆశ్చర్యపరిచాడు. చాలా రోజులు గడిచిన తర్వాత అతన్ని చంపాలని యూదులు కుట్ర చేశారు. కాని వారి కుట్ర గురించి సౌలు తెలుసుకున్నాడు. అతన్ని చంపడానికి వారు రాత్రింబగళ్ళు పట్టణపు ద్వారాల దగ్గర చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. అయితే అతని అనుచరులు రాత్రివేళలో అతన్ని తీసుకెళ్లి గంపలో కూర్చోబెట్టి గోడలోని సందు గుండా క్రిందకు దించారు. అతడు యెరూషలేముకు వచ్చినప్పుడు, శిష్యులతో చేరడానికి ప్రయత్నించాడు, కాని అతడు నిజమైన శిష్యుడని నమ్మలేక వారు అతనికి భయపడ్డారు. కానీ బర్నబా అతన్ని దగ్గరకు చేరదీసి అపొస్తలుల దగ్గరకు అతన్ని తీసుకువచ్చాడు. సౌలు తన ప్రయాణంలో ప్రభువును ఎలా చూశాడు, ప్రభువు అతనితో మాట్లాడిన విషయం, అతడు దమస్కులో యేసు పేరట ధైర్యంగా ఎలా బోధించాడు అనే విషయాలను వారికి చెప్పాడు. కాబట్టి సౌలు వారితో కలిసి ఉంటూ యెరూషలేములో స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరట ధైర్యంగా బోధించసాగాడు. అతడు గ్రీకుభాష మాట్లాడే యూదులతో మాట్లాడుతూ వాదించాడు, అయితే వారు అతన్ని చంపాలని ప్రయత్నించారు. దీనిని గురించి తెలుసుకొన్న విశ్వాసులు, అతన్ని కైసరయకు తీసుకువచ్చి తార్సుకు పంపించారు. ఆ తర్వాత యూదయ, గలిలయ సమరయ ప్రాంతాల్లో ఉన్న సంఘం కొంత సమయం ప్రశాంతాన్ని ఆనందిస్తూ బలపడింది. దేవుని భయాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధాత్మచేత ప్రోత్సాహింపబడి, సంఘం సంఖ్య మరింత పెరిగింది.