అపొస్తలుల కార్యములు 9

9
1సౌలు ఇంకను ప్రభువుయొక్క శిష్యులను బెదరించు టయును హత్యచేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధానయాజకునియొద్దకు వెళ్లి 2యీ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనినయెడల, వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజములవారికి పత్రికలిమ్మని అడిగెను. 3అతడు ప్రయాణము చేయుచు దమస్కుదగ్గరకు వచ్చి నప్పుడు, అకస్మాత్తుగా ఆకాశమునుండి యొక వెలుగు అతనిచుట్టు ప్రకాశించెను. 4అప్పుడతడు నేలమీదపడి –సౌలా, సౌలా, నీవేల నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. 5–ప్రభువా, నీవెవడవని అతడడుగగా ఆయన–నేను నీవు హింసించు చున్న యేసును; 6లేచి పట్టణములోనికి వెళ్లుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. 7అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని యెవనిని చూడక మౌనులై నిలువ బడిరి. 8సౌలు నేలమీదనుండి లేచి కన్నులు తెరచినను ఏమియు చూడలేక పోయెను గనుక వారతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. 9అతడు మూడుదినములు చూపులేక అన్నపానము లేమియు పుచ్చుకొనకుండెను.
10దమస్కులో అననీయ అను ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు–అననీయా, అని అతనిని పిలువగా 11అతడు–ప్రభువా, యిదిగో నేనున్నాననెను. అందుకు ప్రభువు–నీవు లేచి, తిన్ననిదనబడిన వీధికి వెళ్లి, యూదా అనువాని యింట తార్సువాడైన సౌలు అనువానికొరకు విచారించుము; ఇదిగో అతడు ప్రార్థనచేయుచున్నాడు. 12అతడు అననీయ అను నొక మనుష్యుడు లోపలికివచ్చి, తాను దృష్టిపొందునట్లు తలమీద చేతులుంచుట చూచియున్నాడని చెప్పెను. 13అందుకు అననీయ–ప్రభువా, యీ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసియున్నాడని అతనిగూర్చి అనేకులవలన వింటిని. 14ఇక్కడను నీ నామమునుబట్టి ప్రార్థనచేయు వారినందరిని బంధించుటకు అతడు ప్రధానయాజకులవలన అధికారము పొంది యున్నాడని ఉత్తరమిచ్చెను. 15అందుకు ప్రభువు–నీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు#9:15 మూలభాషలోపాత్రయైయున్నాడు. 16ఇతడు నా నామముకొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. 17అననీయ వెళ్లి ఆ యింట ప్రవేశించి, అతని మీద చేతులుంచి–సౌలా, సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు, నీవు దృిష్టిపొంది, పరిశుద్ధాత్మతో నింపబడునట్లు నన్ను పంపి యున్నాడని చెప్పెను. 18అప్పుడే అతని కన్నులనుండి పొరలవంటివి రాలగా దృష్టికలిగి, లేచి బాప్తిస్మము పొందెను; తరువాత ఆహారము పుచ్చుకొని బలపడెను.
19పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతోకూడ కొన్ని దినములుండెను. 20వెంటనే సమాజమందిరములలో –యేసే దేవుని కుమారుడని ఆయననుగూర్చి ప్రకటించుచు వచ్చెను. 21వినినవారందరు విభ్రాంతినొంది, యెరూషలేములో ఈ నామమునుబట్టి ప్రార్థన చేయువారిని నాశనము చేసినవాడితడే కాడా? వారిని బంధించి ప్రధానయాజకులయొద్దకు కొనిపోవుటకు ఇక్కడికి కూడ వచ్చియున్నాడని చెప్పుకొనిరి. 22అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి–ఈయనే క్రీస్తు అని రుజువు పరచుచు దమస్కులో కాపురమున్న యూదులను కలవరపరచెను.
23అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంప నాలోచింపగా 24వారి ఆలోచన సౌలునకు తెలియ వచ్చెను. వారు అతని చంపవలెనని రాత్రింబగళ్లు ద్వారములయొద్ద కాచుకొనుచుండిరి 25గనుక అతని శిష్యులు రాత్రివేళ అతనిని తీసికొనిపోయి గంపలో ఉంచి, గోడ గుండ అతనిని క్రిందికి దింపిరి.
26అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నముచేసెను గాని, అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. 27అయితే బర్నబా అతనిని దగ్గరతీసి అపొస్తలులయొద్దకు తోడుకొనివచ్చి–అతడు త్రోవలో ప్రభువును చూచెననియు, ప్రభువు అతనితో మాటలాడెననియు, అతడు దమస్కులో యేసు నామమునుబట్టి ధైర్యముగా బోధించెననియు, వారికి వివరముగా తెలియపరచెను. 28-29అతడు యెరూషలేములో వారితోకూడ వచ్చుచు పోవుచు, ప్రభువు నామమునుబట్టి ధైర్యముగా బోధించుచు, గ్రీకుభాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచునుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని 30సహోదరులు దీనిని తెలిసికొని అతనిని కైసరయకు తోడుకొనివచ్చి తార్సునకు పంపిరి.
31కావున యూదయ గలిలయ సమరయ దేశములం దంతట సంఘము క్షేమాభివృద్ధినొందుచు#9:31 మూలభాషలోకట్టబడుచు. సమాధానము కలిగియుండెను; మరియు ప్రభువునందు భయమును పరిశు ద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
32ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారముచేయుచు, లుద్దలో కాపురమున్న పరిశుద్ధులయొద్దకు వచ్చెను. 33అక్కడ పక్షవాయువు కలిగి యెనిమిది ఏండ్లనుండి మంచము పెట్టియుండిన ఐనెయ అను ఒక మనుష్యుని చూచి, 34పేతురు–ఐనెయా, యేసు క్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరచుకొనుమని అతనితో చెప్పగా 35వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురమున్నవారందరు అతనిచూచి ప్రభువుతట్టు తిరిగిరి.
36మరియు యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను; ఆమెకు భాషాంతరమున దొర్కా#9:36 అనగా, లేడి. అని పేరు. ఆమె సత్‌క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి యుండెను. 37ఆ దినములయందామె కాయిలాపడి చనిపోగా, వారు శవమును కడిగి మేడ గదిలో పరుండ బెట్టిరి. 38లుద్ద యొప్పేకు దగ్గరగా ఉండుటచేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని, అతడు తడవుచేయక తమయొద్దకు రావలెనని వేడుకొనుటకు ఇద్దరు మనుష్యులను అతని యొద్దకు పంపిరి. 39పేతురు లేచి వారితోకూడ వెళ్లి అక్కడ చేరినప్పుడు, వారు మేడగదిలోనికి అతనిని తీసికొనివచ్చిరి; విధవరాండ్రందరు వచ్చి యేడ్చుచు, దొర్కా తమతోకూడ ఉన్నప్పుడు కుట్టిన అంగీలును వస్త్రములును చూపుచు అతని యెదుట నిలిచిరి. 40పేతురు అందరిని వెలుపలికి పంపి మోకాళ్లూని ప్రార్థనచేసి శవమువైపు తిరిగి–తబితా, లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతురును చూచి లేచి కూర్చుండెను. 41అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను. 42ఇది యొప్పేయందంతట తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసముంచిరి. 43పేతురు యొప్పేలో సీమోనను ఒక చర్మకారునియొద్ద బహుదినములు నివసించెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

అపొస్తలుల కార్యములు 9: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

అపొస్తలుల కార్యములు 9 కోసం వీడియో