అపొస్తలుల కార్యములు 7:2-8

అపొస్తలుల కార్యములు 7:2-8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అందుకు స్తెఫను చెప్పినదేమనగా–సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండకమునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై –నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. అప్పుడతడు కల్దీయుల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత, అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న యీ దేశమందు నివసించుటకై దేవుడతని తీసికొనివచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతనికిని, అతని తరువాత అతని సంతానమునకును దీనిని స్వాధీనపరతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు–అతని సంతానము అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు నన్నూరు సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధపెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు–ఏ జనమునకు వారు దాసులైయుందురో ఆ జనమును నేను విమర్శచేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతని కనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున ఎనిమిదవ దినమందు అతనికి సున్నతిచేసెను; ఇస్సాకు యాకోబును యాకోబు పన్నిద్దరు గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి.

అపొస్తలుల కార్యములు 7:2-8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అందుకు అతడు, “సహోదరులారా మరియు తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ‘నీ దేశాన్ని మరియు నీ సొంత జనాన్ని విడిచిపెట్టి, నేను నీకు చూపించబోయే దేశానికి బయలుదేరి వెళ్లు’ అని చెప్పారు. “కనుక అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు. ఇక్కడ అతనికి ఒక పాదం పట్టే అంత స్థలం కూడా దేవుడు వారసత్వంగా ఇవ్వలేదు. కాని దేవుడు అబ్రాహాముకు ఒక్క సంతానం కూడా లేని సమయంలో అతని తర్వాత రాబోయే అతని సంతానం ఆ దేశాన్ని స్వాధీన పరచుకొంటారని అతనితో వాగ్దానం చేశారు. దేవుడు అతనితో ఇలా మాట్లాడారు: ‘నీ సంతతివారు తమది కాని పరాయి దేశంలో నాలుగు వందల సంవత్సరాల వరకు బానిసలుగా వేధించబడతారు. కాని వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత ఆ దేశం నుండి వారు బయటకు వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు’ అని దేవుడు చెప్పారు. అప్పుడు దేవుడు అబ్రాహాముకు సున్నతితో ఒక నిబంధనను ఇచ్చారు. కనుక అతడు ఇస్సాకుకు తండ్రియైనప్పుడు నిబంధన ప్రకారం అతడు పుట్టిన ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇలా ఇస్సాకు యాకోబుకు తండ్రిగా మరియు యాకోబు పన్నెండు గోత్రాల పితరులను కన్న తండ్రిగా సున్నతి నిబంధనను పాటించారు.

అపొస్తలుల కార్యములు 7:2-8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అందుకు స్తెఫను చెప్పింది ఏమంటే, “సోదరులారా, తండ్రులారా, వినండి. మన పూర్వికుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసపటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై ‘నీవు నీ దేశాన్నీ, నీ సొంతజనాన్నీ విడిచి బయలుదేరి, నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళు’ అని చెప్పాడు. “అప్పుడతడు కల్దీయుల దేశాన్ని విడిచి వెళ్ళి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడ నుండి మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడతన్ని తీసుకొచ్చాడు. ఆయన ఇందులో అతనికి కనీసం కాలుపెట్టేంత స్థలం కూడా సొంత భూమిగా ఇవ్వకుండా, అతడికి సంతానం లేనపుడు అతనికీ, అతని తరువాత అతని సంతానానికీ దీన్ని స్వాధీనం చేస్తానని వాగ్దానం చేశాడు. “అయితే దేవుడు అతని సంతానం పరాయి దేశంలో కొంతకాలం ఉంటారనీ, ఆ దేశస్థులు వారిని 400 ఏళ్ళు బానిసలుగా బాధపెడతారనీ చెప్పాడు. అంతేగాక వారు బానిసలుగా ఉండబోతున్న ఆ దేశాన్ని తాను శిక్షిస్తాననీ ఆ తరువాత వారు బయటికి వచ్చి ఈ స్థలం లో తనను ఆరాధిస్తారనీ దేవుడు చెప్పాడు. ఆయన అబ్రాహాముకు సున్నతితో కూడిన ఒక నిబంధనను ఇచ్చాడు. అతడు ఇస్సాకును కని ఎనిమిదవ రోజున సున్నతి చేశాడు. ఇస్సాకు యాకోబును, యాకోబు పన్నెండుమంది గోత్ర మూలపురుషులనూ కని వాళ్లకి సున్నతి చేశారు.

అపొస్తలుల కార్యములు 7:2-8 పవిత్ర బైబిల్ (TERV)

అతడు సమాధానంగా, “అయ్యలారా! సోదరులారా! నేను చెప్పేది వినండి. అది మన తండ్రి అబ్రాహాము ‘మెసొపొతమియలో’ నివసిస్తున్న కాలం. అంటే, అతడు అప్పటికి యింకా తన నివాసాన్ని ‘హారాను’ పట్టణానికి మార్చలేదన్న మాట. అక్కడ అతనికి తేజస్వి అయిన దేవుడు కనిపించి, ‘నీ దేశాన్ని, ప్రజల్ని వదిలి నేను చూపబోయే దేశానికి వెళ్ళు’ అని అన్నాడు. “అందువల్ల అతడు కల్దీయుల దేశాన్ని వదిలి హారానులో స్థిరపడ్డాడు. అతని తండ్రి చనిపోయాక ఆ దేశాన్ని కూడా వదలమని, మీరిప్పుడు నివసిస్తున్న ఈ దేశంలో దేవుడతణ్ణి స్థిరపర్చాడు. దేవుడతనికి ఈ దేశంలో ఒక్క అడుగు భూమి కూడా ఆస్తిగా యివ్వలేదు. అతనికి అప్పుడు సంతానం లేకపోయినా, అతనికి, అతని తర్వాత రానున్న వాళ్ళకు ఆ దేశం ఆస్తిగా ఉంటుందని వాగ్దానం చేసాడు. “దేవుడతనితో, ‘నీ వారసులు పరదేశంలో నివసిస్తారు. ఆ పరదేశీయులు నీ వాళ్ళను నాలుగు వందల సంవత్సరాలు తమ బానిసలుగా ఉంచుకొని వాళ్ళను కష్టపెడతారు. వాళ్ళను బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను. ఆ తర్వాత నీ ప్రజలు ఆ దేశం వదిలి నన్ను యిక్కడ ఆరాధిస్తారు’ అని అన్నాడు. “సున్నతి నియమాన్ని పాటిస్తే తన వాగ్దానాన్ని నిలుపుకొంటానని దేవుడు అబ్రాహాముతో ఒక ఒప్పందం చేసాడు. ఇస్సాకు పుట్టిన ఎనిమిదవ రోజున అబ్రాహాము అతనికి సున్నతి చేయించాడు. అదే విధంగా ఇస్సాకు తన కుమారుడైన యాకోబుకు సున్నతి చేయించాడు. యాకోబు తన పన్నెండుమంది కుమారులకు సున్నతి చేయించాడు. ఈ పన్నెండు మంది పండ్రెండు వంశాలకు మూల పురుషులయ్యారు.

అపొస్తలుల కార్యములు 7:2-8 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అందుకు అతడు, “సహోదరులారా తండ్రులారా, నా మాటను వినండి! మన పితరుడైన అబ్రాహాము హారానులో నివసించక ముందు మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, ‘నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్లు’ అని చెప్పారు. “కాబట్టి అతడు కల్దీయుల దేశాన్ని విడిచివెళ్లి హారానులో నివసించాడు. అతని తండ్రి చనిపోయిన తర్వాత, నేడు మనం నివసిస్తున్న ఈ దేశంలో నివసించడానికి దేవుడు అతన్ని పంపారు. ఇక్కడ అతనికి ఒక పాదం పట్టే అంత స్థలం కూడా దేవుడు వారసత్వంగా ఇవ్వలేదు. కాని దేవుడు అబ్రాహాముకు ఒక్క సంతానం కూడా లేని సమయంలో అతని తర్వాత రాబోయే అతని సంతానం ఆ దేశాన్ని స్వాధీన పరచుకొంటారని అతనితో వాగ్దానం చేశారు. దేవుడు అతనితో ఇలా మాట్లాడారు: ‘నీ వారసులు తమది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు పరాయివారిగా ఉంటారు, వారు బానిసలుగా ఉంటూ వేధించబడతారు. కాని వారిని బానిసలుగా చేసిన దేశాన్ని నేను శిక్షిస్తాను, ఆ తర్వాత ఆ దేశం నుండి వారు బయటకు వచ్చి ఈ స్థలంలో నన్ను ఆరాధిస్తారు’ అని దేవుడు చెప్పారు. అప్పుడు దేవుడు అబ్రాహాముకు సున్నతితో ఒక నిబంధనను ఇచ్చారు. కాబట్టి అతడు ఇస్సాకుకు తండ్రియైనప్పుడు నిబంధన ప్రకారం అతడు పుట్టిన ఎనిమిదవ రోజున అతనికి సున్నతి చేశాడు. ఇలా ఇస్సాకు యాకోబుకు తండ్రిగా యాకోబు పన్నెండు గోత్రాల పితరులను కన్న తండ్రిగా సున్నతి నిబంధనను పాటించారు.