అపొస్తలుల కార్యములు 4:1-22

అపొస్తలుల కార్యములు 4:1-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

వారు ప్రజలతో మాటలాడుచుండగా, యాజకులును దేవాలయపు అధిపతియు సద్దూకయ్యులును వారు ప్రజ లకు బోధించుటయు, యేసునుబట్టి మృతులలోనుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారిమీదికివచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని, సాయంకాలమైనందున మరునాటివరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినినవారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్యయించుమించు అయిదువేలు ఆయెను. మరునాడు వారి అధికారులును పెద్దలును శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. ప్రధానయాజకుడైన అన్నయు కయపయు, యోహానును అలెక్సంద్రును ప్రధానయాజకుని బంధువులందరు వారితోకూడ ఉండిరి. వారు పేతురును యోహానునుమధ్యను నిలువబెట్టి– మీరు ఏ బలముచేత ఏ నామమునుబట్టి దీనిని చేసితిరని అడుగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై యిట్లనెను –ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమునుగూర్చి వాడు దేనివలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొనవలసినదేమనగా, మీరు సిలువవేసినట్టియు, మృతులలోనుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామ ముననే వీడు స్వస్థతపొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే; ఆ రాయి మూలకు తలరాయి ఆయెను. మరి ఎవనివలనను రక్షణ కలుగదు; ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి, వారు యేసుతోకూడ ఉండినవారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితోకూడ నిలిచియుండుట చూచి యేమియు ఎదురు చెప్పలేకపోయిరి. అప్పుడు –సభ వెలుపలికి పొండని వారికాజ్ఞాపించి తమలోతాము ఆలోచనచేసి –ఈ మనుష్యులను మనమేమి చేయుదము? వారిచేత ప్రసిద్ధమైన సూచకక్రియ చేయబడియున్నదని యెరూషలేములో కాపురమున్న వారికందరికి స్పష్టమే, అది జరుగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంక వ్యాపింపకుండుటకై– ఇకమీదట ఈ నామమునుబట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదరుపెట్టవలెనని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిపించి–మీరు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని వారికాజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారినిచూచి–దేవుని మాట వినుటకంటె మీ మాట వినుట దేవునిదృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి; మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక యుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి; ప్రజలందరు జరిగిన దానినిగూర్చి దేవుని మహిమపరచుచుండిరి గనుక సభవారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొన లేక వీరిని గట్టిగా బెదరించి విడుదలచేసిరి. స్వస్థ పరచుట అను ఆ సూచకక్రియ యెవని విషయములో చేయబడెనో వాడు నలువది ఏండ్లకంటె ఎక్కువ వయస్సు గలవాడు.

అపొస్తలుల కార్యములు 4:1-22 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కాపలావారి అధిపతి మరియు సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. వారు పేతురు యోహానులను పట్టుకొని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు ఐదువేల వరకు పెరిగింది. మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు మరియు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. వారు పేతురు యోహానులను తీసుకొనివచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు మరియు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేసారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామంను బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ ‘ఇండ్లు కట్టే మీరు తృణీకరించిన రాయి అయిన యేసు, మూలరాయి అయ్యారు.’ కనుక మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని మామూలు మనుషులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతోపాటు ఉన్నవారని గుర్తించారు. కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. కనుక వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే ప్రతి ఒక్కరికి వీరు ఈ గొప్ప సూచక క్రియను చేశారని తెలుసు, కనుక అది జరగలేదని చెప్పలేము. అయినా ఈ సంగతిని ప్రజలలో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు. మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేక దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. మా మట్టుకైతే, మేము చూసినవాటిని మరియు విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు. ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కనుక వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. అద్బుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.

అపొస్తలుల కార్యములు 4:1-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతూ ఉన్నపుడు యాజకులూ, ద్వారపాలకుల అధికారీ, సద్దూకయ్యులూ వారి దగ్గరికి వచ్చారు. వారు యేసుని గూర్చి బోధిస్తూ ఆయన చనిపోయి తిరిగి లేచాడని ప్రకటించడం విని కలవరపడ్డారు. వారిని బలవంతంగా పట్టుకుని, సాయంకాలం అయిందని మరునాటి వరకూ వారిని ఖైదులో ఉంచారు. కానీ వాక్కు విన్న వారిలో చాలామంది నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య దాదాపు ఐదు వేలు. మరుసటి రోజు వారి అధికారులూ పెద్దలూ ధర్మశాస్త్ర పండితులూ యెరూషలేములో సమావేశమయ్యారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాండర్, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో ఉన్నారు. వారు పేతురు యోహానులను వారి మధ్యలో నిలబెట్టి, “మీరు ఏ అధికారంతో ఏ నామంలో దీన్ని చేశారు?” అని అడిగారు. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇలా అన్నాడు, “ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ కుంటివాడికి చేసిన మంచి పని గురించి, వాడెలా బాగుపడ్డాడని ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు కదా. మీరూ, ఇశ్రాయేలు ప్రజలంతా తెలుసుకోవలసింది ఏమంటే, మీరు సిలువ వేసిన, మృతుల్లో నుండి దేవుడు లేపిన నజరేయుడైన యేసుక్రీస్తు నామాన్నే వీడు బాగుపడి మీ ముందు నిలుచున్నాడు. ఇల్లు కట్టే మీరు వదిలేసిన రాయి ఆయనే. ఆ రాయి భవనానికి ఆధారశిల అయ్యింది. ఎవ్వరివల్లా రక్షణ రాదు. ఈ నామంలోనే మనం రక్షణ పొందాలి గాని, ఆకాశం కింద ఉన్న మనుషుల్లోని మరి ఏ నామంలోనూ రక్షణ పొందలేము.” వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వారు చదువులేని సామాన్యులని తెలుసుకుని ఆశ్చర్యపడి, వారు యేసుతో ఉండేవారు అని గుర్తించారు. బాగుపడ్డ ఆ వ్యక్తి వారితోపాటు నిలబడడం చూసి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అధికారులు సభాస్థలం నుంచి బయటికి వెళ్ళండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసుకుని, ‘ఈ మనుషులను మనమేం చేద్దాం? వారిద్వారా గొప్ప అద్భుతం జరిగిందని యెరూషలేములో నివసిస్తున్న వారందరికీ తెలుసు, అది జరగలేదని చెప్పలేం. అయినా ఇది జనాల్లోకి యింకా వ్యాపించకుండా, ఇకనుండి ఈ నామంతో ఎవరితోనూ మాట్లాడవద్దని మనం వారిని బెదిరిద్దాం’ అని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి, “మీరు యేసు నామంలో ఏ మాత్రం మాట్లాడకూడదు, బోధించకూడదు” అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహానులు వారిని చూసి, “దేవుని మాట కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమేనా? మీరే చెప్పండి. మేమేం చూశామో, ఏమి విన్నామో వాటిని చెప్పకుండా ఉండలేము” అని వారికి జవాబిచ్చారు. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని కొనియాడుతున్నారు కాబట్టి సభవారు వీరిని ఎలా శిక్షించాలో తెలియక గట్టిగా బెదరించి విడుదల చేశారు. అద్భుతంగా బాగుపడిన వాడి వయస్సు నలభై ఏళ్ళు పై మాటే.

అపొస్తలుల కార్యములు 4:1-22 పవిత్ర బైబిల్ (TERV)

యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది. మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు. అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు. ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే! ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’ రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.” పేతురు, యోహాను చదువురాని మామూలు మనుష్యులని వాళ్ళకు తెలుసు. కాని వాళ్ళ ధైర్యాన్ని చూసి సభ్యులకు ఆశ్చర్యం వేసింది. అప్పుడా సభ్యులు వాళ్ళు యేసుతో ఉన్నవాళ్ళని గ్రహించారు. కాని నయమైన మనిషి వాళ్ళతో నిలిచి ఉండటం చూసి యింకే ఆక్షేపణలు చెయ్యలేక పోయారు. వాళ్ళను మహాసభనుండి వెళ్ళమని ఆజ్ఞాపించి పరస్పరం యిలా చర్చించుకొన్నారు: “వీళ్ళనేం చెయ్యాలి? యెరూషలేము నివాసులందరికి వీళ్ళు అద్భుతమైన మహిమ చేసారని బాగా తెలుసు. మనం దాన్ని కాదనలేం. కాని యిది ప్రజల్లో యింకా ఎక్కువగా వ్యాపించక ముందే యిక మీదట అతని పేరిట ఎవరితో ఏమీ మాట్లాడవద్దని వాళ్ళను వారించాలి.” వాళ్ళను మళ్ళీ పిలిచి యేసు పేరిట బోధించకూడదని, ఆయన గురించి మాట్లాడకూడదని ఆజ్ఞాపించారు. కాని పేతురు, యోహాను వాళ్ళకు సమాధానం చెబుతూ, “మీరు చెప్పింది చెయ్యాలో, లేక దేవుడు చెప్పింది చెయ్యాలో, దేవుని దృష్టిలో ఏది న్యాయమో మీలో మీరు నిర్ణయించుకోండి. ఎందుకంటే మేము చూసినదాన్ని, విన్నదాన్ని గురించి ప్రజలకు చెప్పకుండా వుండలేము” అని అన్నారు. వాళ్ళు పేతురును, యోహానును యింకా కొంచెం భయపెట్టి వదిలేసారు. దేవుని మహిమవల్ల నయమైన వ్యక్తి నలభై ఏండ్లు దాటినవాడు. ఈ జరిగిన సంఘటనవల్ల ప్రజలంతా కలిసి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. అందువలన వీళ్ళను ఏ విధంగా శిక్షించాలో వాళ్ళు నిర్ణయం తీసుకోలేకపోయారు.

అపొస్తలుల కార్యములు 4:1-22 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కావలివారి అధిపతి సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. వారు పేతురు యోహానులను పట్టుకుని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు అయిదువేల వరకు పెరిగింది. మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. వారు పేతురు యోహానులను తీసుకువచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేశారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామాన్ని బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. యేసు గురించి, “ ‘ఇల్లు కట్టే మీరు నిషేధించిన రాయి మూలరాయి అయ్యింది’ అని వ్రాయబడింది. కాబట్టి మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు. వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని సామాన్య మనుష్యులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతో పాటు ఉన్నవారని గుర్తించారు. కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. కాబట్టి వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే వారందరికి వీరు ఈ గొప్ప సూచకక్రియను చేశారని తెలుసు, కాబట్టి అది జరగలేదని చెప్పలేము. అయినా ఈ సంగతిని ప్రజల్లో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు. మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేదా దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. మా మట్టుకైతే, మేము చూసినవాటిని విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు. ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కాబట్టి వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. అద్భుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.