పేతురు యోహానులు ప్రజలతో మాట్లాడుతున్నపుడు యాజకులు దేవాలయ కాపలావారి అధిపతి మరియు సద్దూకయ్యులు వారి దగ్గరకు వచ్చారు. అపొస్తలులు ప్రజలకు యేసును గురించి బోధిస్తూ, ఆయన మృతుల నుండి తిరిగి లేచాడని ప్రకటించడం విని వారు చాలా కలవరపడ్డారు. వారు పేతురు యోహానులను పట్టుకొని, సాయంకాలం కావడంతో, మరుసటిరోజు వరకు వారిని చెరసాలలో బంధించారు. కానీ సువార్తను విన్న అనేకమంది నమ్మారు; ఆ విధంగా నమ్మినవారిలో పురుషుల సంఖ్య సుమారు ఐదువేల వరకు పెరిగింది.
మరుసటిరోజు అధికారులు, యూదా నాయకులు మరియు ధర్మశాస్త్ర ఉపదేశకులు యెరూషలేములో కలుసుకొన్నారు. ముఖ్య యాజకుడు అన్నా, అతని అల్లుడు కయప, యోహాను, అలెగ్జాండరు మరియు ప్రధాన యాజకుని ఇతర కుటుంబ సభ్యులు అక్కడ ఉన్నారు. వారు పేతురు యోహానులను తీసుకొనివచ్చి వారి ముందు నిలబెట్టి, “మీరు ఈ పనిని ఏ అధికారంతో ఏ పేరిట చేశారు?” అని ప్రశ్నించడం మొదలుపెట్టారు.
అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నిండుకొని, వారితో, “అధికారులారా, ప్రజా నాయకులారా! మేము కుంటివానిపట్ల చూపించిన దయను బట్టి వాడు ఎలా స్వస్థత పొందాడో ప్రశ్నించడానికి నేడు మేము పిలువబడినట్లైతే, మీరు మరియు ఇశ్రాయేలు ప్రజలందరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీరు ఎవరిని సిలువ వేసారో, దేవుడు మరణం నుండి ఎవరిని తిరిగిలేపారో, ఆ నజరేయుడైన యేసు క్రీస్తు నామంను బట్టే, ఇతడు స్వస్థపడి మీ ముందు నిలబడ్డాడు. లేఖనాల్లో వ్రాయబడినట్లు,
“ ‘ఇండ్లు కట్టే మీరు తృణీకరించిన రాయి అయిన యేసు,
మూలరాయి అయ్యారు.’
కనుక మరి ఎవరి వలన రక్షణ పొందలేము, ఎందుకంటే ఆకాశం క్రింద మనుష్యులకు రక్షణ పొందడానికి మరి ఏ ఇతర పేరులేదు” అన్నాడు.
వారు పేతురు యోహానుల ధైర్యాన్ని చూసి, వీరు విద్యలేని మామూలు మనుషులని తెలుసుకొని ఆశ్చర్యపడి, వీరు యేసుతోపాటు ఉన్నవారని గుర్తించారు. కానీ ఆ స్వస్థపడినవాడు వీరితో కూడా నిలబడి ఉండడం చూసి మరి ఏమి చెప్పలేకపోయారు. కనుక వారు వీరిని న్యాయసభ నుండి బయటకు వెళ్లమని ఆదేశించి, తమలో తాము చర్చించుకొంటూ, “ఈ మనుష్యులను మనం ఏమి చేద్దాం? యెరూషలేములో నివసించే ప్రతి ఒక్కరికి వీరు ఈ గొప్ప సూచక క్రియను చేశారని తెలుసు, కనుక అది జరగలేదని చెప్పలేము. అయినా ఈ సంగతిని ప్రజలలో మరింతగా వ్యాపించకుండా ఆపడానికి, ఈ పేరట మరి ఎవరితో మాట్లాడకుండా వారిని మనం బెదిరిద్దాం” అని అనుకున్నారు.
మరల ఆ అపొస్తలులను లోపలికి పిలిచి యేసు పేరట ఎంత మాత్రం మాట్లాడకూడదు బోధించకూడదు అని ఆదేశించారు. అందుకు పేతురు యోహానులు, “దేవుని దృష్టిలో మీ మాట వినడం న్యాయమా లేక దేవుని మాట వినడం న్యాయమా? మీరే న్యాయం చెప్పండి. మా మట్టుకైతే, మేము చూసినవాటిని మరియు విన్నవాటిని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము” అని బదులిచ్చారు.
ప్రజలందరు జరిగినదాని గురించి దేవుని స్తుతిస్తున్నారు, అందుకని వీరిని ఎలా శిక్షించాలో నిర్ణయించలేకపోయారు. కనుక వారిని మరింత బెదిరించి విడిచిపెట్టారు. అద్బుతంగా స్వస్థపడినవాని వయస్సు నలభై సంవత్సరాలు.