అపొస్తలుల కార్యములు 23:12-22
అపొస్తలుల కార్యములు 23:12-22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు. ఇలా కలిసి ఒట్టుపెట్టుకున్న వారు సుమారు నలభై కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు ముఖ్య యాజకులు యూదా పెద్దల దగ్గరకు వెళ్లి, “మేము పౌలును చంపే వరకు ఏమి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాము. కాబట్టి మీరు న్యాయసభతో కలిసి, పౌలును మరింత వివరంగా విచారణ చేయాలని అతన్ని మీ దగ్గరకు తీసుకురమ్మని అధిపతితో మనవి చేయండి. అతడు ఇక్కడకు రావడానికి ముందే అతన్ని చంపడానికి మేము సిద్ధంగా ఉంటాం” అని చెప్పుకొన్నారు. అయితే పౌలు అక్క కుమారుడు ఈ కుట్ర గురించి విన్నప్పుడు, సైనిక కోటలోనికి పోయి ఆ విషయం పౌలుతో చెప్పాడు. అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ యువకుడిని అధిపతి దగ్గరకు తీసుకెళ్లండి; ఇతడు అధిపతికి ఒక మాట చెప్పాలి” అని చెప్పాడు. కాబట్టి అతడు ఆ యువకుని అధిపతి దగ్గరకు తీసుకుని వెళ్లాడు. అప్పుడు శతాధిపతి, “ఈ యువకుడు నీకు ఒక మాట చెప్పాలి కాబట్టి ఇతన్ని మీ దగ్గరకు తీసుకెళ్లమని ఖైదీగా ఉన్న పౌలు నన్ను విన్నవించుకున్నాడు” అని అధిపతితో చెప్పాడు. అప్పుడు ఆ అధిపతి అతని చేతిని పట్టుకుని ప్రక్కకు తీసుకెళ్లి, “నీవు నాకు ఏమి చెప్పాలని అనుకున్నావు?” అని అడిగాడు. అందుకు అతడు, “కొందరు యూదులు పౌలును మరింత వివరంగా విచారణ చేయాలనే వంకతో రేపు న్యాయసభకు అతన్ని పంపించమని మిమ్మల్ని విన్నవించుకొంటారు. అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కోసం ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు. ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు.
అపొస్తలుల కార్యములు 23:12-22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తెల్లవారిన తరువాత కొందరు యూదులు పోగై, తాము పౌలును చంపేటంతవరకూ అన్నపానాలు ముట్టం అని ఒట్టు పెట్టుకున్నారు. నలభై కంటే ఎక్కువమంది ఈ కుట్రలో చేరారు. వారు ప్రధాన యాజకుల దగ్గరకూ, పెద్దల దగ్గరకూ వచ్చి, “మేము పౌలును చంపేవరకూ ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకొన్నాం. కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనిని క్షుణ్ణంగా విచారించాలి అన్న వంకతో అతణ్ణి మీ దగ్గరికి తీసుకుని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయండి. అతడు మీ దగ్గరకి రాకముందే మేము అతనిని చంపడానికి సిద్ధపడి ఉన్నాం” అని చెప్పారు. అయితే పౌలు మేనల్లుడు వారు అలా పొంచి ఉన్నారని విని కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలియజేశాడు. అప్పుడు పౌలు ఒక శతాధిపతిని పిలిచి, “ఈ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరకి తీసుకు వెళ్ళు. ఇతడు అతనితో ఒక మాట చెప్పాల్సి ఉంది” అన్నాడు. శతాధిపతి ఆ అబ్బాయిని సహస్రాధిపతి దగ్గరికి తీసుకుని పోయి, “ఖైదీగా ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి నీ దగ్గరికి తీసుకుపొమ్మని అడిగాడు. ఇతడు నీతో ఒక మాట చెప్పుకోవాలట” అని చెప్పాడు. సహస్రాధిపతి ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని అవతలికి తీసుకుపోయి, ‘నీవు నాతో చెప్పాలనుకొన్న సంగతి ఏమిటి?’ అని ఒంటరిగా అడిగాడు. అందుకతడు, “నువ్వు పౌలును పూర్తిగా విచారించడం కోసం అతణ్ణి రేపు మహాసభ దగ్గరికి తీసుకురావాలని నిన్ను బతిమాలడానికి యూదులు ఎదురు చూస్తున్నారు. వారి విన్నపానికి ఒప్పుకోవద్దు. ఎందుకంటే వారిలో నలభై కంటే ఎక్కువమంది అతని కోసం చూస్తూ ఉన్నారు. వారు అతణ్ణి చంపేదాకా అన్నపానాలు ముట్టకూడదని ఒట్టు పెట్టుకున్నారు. ఇప్పుడు నీ మాట కోసం కనిపెట్టుకుని ఉన్నారు” అని చెప్పాడు. అప్పుడు ఆ సహస్రాధిపతి, “నువ్వు ఈ సంగతి నాకు తెలిపినట్టు ఎవరితోనూ చెప్పవద్దు” అని హెచ్చరించి పంపేశాడు.
అపొస్తలుల కార్యములు 23:12-22 పవిత్ర బైబిల్ (TERV)
మరుసటి రోజు యూదులు ఒక కుట్ర పన్నారు. పౌలును చంపేవరకు అన్నపానాలు ముట్టరాదని వాళ్ళందరూ ఒక ప్రమాణం తీసుకున్నారు. నలభై మంది కంటే ఎక్కువే ఈ కుట్రలో పాల్గొన్నారు. వాళ్ళు ప్రధానయాజకుల దగ్గరకు, పెద్దల దగ్గరకు వెళ్ళి, “మేము పౌలును చంపే వరకు అన్నపానాలు ముట్టరాదని ప్రమాణం తీసుకున్నాం. కనుక మీరు మహాసభ పక్షాన ‘అతణ్ణి గురించి మేము యింకా విశదంగా తెలుసుకోవాలనుకొంటున్నాము’ అని అబద్ధాలు చెప్పి, ఆ సాకుతో పౌలును పంపమని సహస్రాధిపతిని అడగండి. అతడు ఇక్కడికి చేరకముందే అతణ్ణి చంపటానికి మేము సిద్ధంగా ఉంటాము” అని అన్నారు. పౌలు మేనల్లుడు ఈ కుట్రను గూర్చి విని కోటలోకి వెళ్ళి పౌలుతో చెప్పాడు. పౌలు శతాధిపతిని పిలిచి, “ఈ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళు. అతనికి యితడు చెప్పవలసిన విషయం ఒకటుంది” అని అన్నాడు. శతాధిపతి ఆ యువకుణ్ణి సహస్రాధిపతి దగ్గరకు పిలుచుకెళ్ళి, “చెరసాలలో ఉన్న పౌలు నన్ను పిలిచి ఈ యువకుణ్ణి మీ దగ్గరకు పిలుచుకెళ్ళమన్నాడు. ఇతడు మీకొక విషయం చెప్పదలిచాడు!” అని అన్నాడు. సహస్రాధిపతి ఆ యువకుని చేయి పట్టుకొని ప్రక్కకు తీసుకెళ్ళి, “నాకేం చెప్పాలనుకొన్నావు?” అని అడిగాడు. ఆ యువకుడు, “పౌలును గురించి యింకా విశదంగా తెలుసుకోవాలనే సాకుతో యూదులందరూ కలిసి, పౌలును రేపు మహాసభకు పిలుచుకు రమ్మని మీకు విజ్ఞాపన చెయ్యాలనుకొంటున్నారు. వాళ్ళ విజ్ఞాపనను అంగీకరించకండి. నలభై కంటే ఎక్కువ మంది పౌలును పట్టుకోవటానికి కాచుకొని ఉన్నారు. అతణ్ణి చంపే దాకా అన్నపానీయాలు ముట్టమని ప్రమాణం తీసుకున్నారు” అని అన్నాడు. సహస్రాధిపతి యువకుణ్ణి వెళ్ళమని చెబుతూ, తనకీవిషయం చెప్పినట్టు ఎవ్వరికీ చెప్పవద్దని జాగ్రత్త పరిచాడు.
అపొస్తలుల కార్యములు 23:12-22 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి, తాము పౌలును చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనిరి. ఈ కుట్రలో చేరినవారు నలుబదిమంది కంటె ఎక్కువ. వారు ప్రధానయాజకుల యొద్దకును పెద్దలయొద్దకును వచ్చి–మేము పౌలును చంపువరకు ఏమియు రుచి చూడమని గట్టిగ ఒట్టుపెట్టుకొని యున్నాము. కాబట్టి మీరు మహా సభతో కలిసి, అతనినిగూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోవునట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవిచేయుడి; అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడియున్నామని చెప్పిరి. అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తనయొద్దకు పిలిచి–ఈ చిన్నవానిని సహస్రాధిపతియొద్దకు తోడుకొనిపొమ్ము, ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని యున్నాడనెను. శతాధిపతి సహస్రాధిపతియొద్ద కతని తోడుకొనిపోయి–ఖైదీయైన పౌలు నన్ను పిలిచి–నీతో ఒక మాట చెప్పుకొనవలెననియున్న యీ పడుచువానిని నీయొద్దకు తీసికొనిపొమ్మని నన్ను అడిగెనని చెప్పెను. సహస్రాధిపతి అతని చెయ్యి పట్టుకొని అవతలకు తీసి కొనిపోయి–నీవు నాతో చెప్పుకొనవలెనని యున్నదేమని యొంటరిగా అడిగెను. అందుకతడు–నీవు పౌలునుగూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసికొని రావలెనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టి యున్నారు. వారి మాటకు నీవు సమ్మతింపవద్దు; వారిలో నలువదిమందికంటె ఎక్కువ మనుష్యులు అతనికొరకు పొంచియున్నారు. వారు అతని చంపువరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకొనియున్నారు; ఇప్పుడు నీయొద్ద మాట తీసికొనవలెనని కనిపెట్టుకొని సిద్ధముగా ఉన్నారని చెప్పెను. అందుకు సహస్రాధిపతి–నీవు ఈ సంగతి నాకు తెలిపితివని యెవనితోను చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువానిని పంపివేసెను.