అపొస్తలుల కార్యములు 21:27-40

అపొస్తలుల కార్యములు 21:27-40 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు, ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలయంలో పౌలును చూసి, జనసమూహాన్ని రెచ్చగొట్టి అతన్ని పట్టుకున్నారు. వారు బిగ్గరగా, “తోటి ఇశ్రాయేలీయులారా, మాకు సహాయం చేయండి! ఈ వ్యక్తి మన ప్రజలకు మన ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా ప్రతిచోట అందరికి బోధిస్తున్నాడు. అంతేకాక గ్రీసుదేశస్థులను ఈ దేవాలయంలోనికి తీసుకువచ్చి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు. వారు అంతకుముందు ఎఫెసీయుడైన త్రోఫిముతో పౌలును పట్టణంలో చూశారు, కాబట్టి పౌలు అతన్ని దేవాలయంలోనికి తెచ్చాడని భావించారు. పట్టణం అంతా ఆందోళన రేగింది, అన్ని వైపుల నుండి ప్రజలు పరుగెత్తికొని వచ్చారు. వారు పౌలును పట్టుకుని, అతన్ని దేవాలయం నుండి బయటకు లాగి, వెంటనే దేవాలయ తలుపులు మూసేసారు. వారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతా ఆందోళనగా మారిందనే వార్త రోమా ప్రధాన సైన్యాధికారికి చేరింది. అతడు వెంటనే కొందరు అధికారులను, సైనికులను వెంటపెట్టుకుని ఆ గుంపు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆ ఆందోళనకారులు అధిపతిని అతని సైనికులను చూసి, పౌలును కొట్టడం ఆపివేశారు. అధిపతి వచ్చి అతన్ని పట్టుకుని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత, “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు. ఆ గుంపులో కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి కేకలు వేశారు, ఆ గందరగోళం వలన ఆ అధిపతికి నిజం ఏమిటని స్పష్టం కాలేదు, కాబట్టి పౌలును సైనిక కోటలోనికి తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు, అతనిపై ప్రజలు చాలా ఎక్కువగా దాడి చేస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొనివెళ్లారు. అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు. సైనికులు పౌలును సైనిక కోటలోనికి తీసుకెళ్తున్నప్పుడు, పౌలు ఆ అధిపతిని, “నేను మీతో ఒక విషయం చెప్పడానికి అనుమతి ఉందా?” అని అడిగాడు. అందుకు ఆ అధికారి, “నీకు గ్రీకుభాష తెలుసా?” అన్నాడు. “ఇంతకుముందు తిరుగుబాటును ఆరంభించి నాలుగు వేలమంది విప్లవకారులను అరణ్యంలోనికి నడిపించిన ఈజిప్టు వాడవు నీవేనా?” అని అడిగాడు. అందుకు పౌలు, “నేను కిలికియ ప్రాంతంలోని తార్సు పట్టణానికి చెందిన యూదుడను, ఆ గొప్ప పట్టణ పౌరుడిని. అయితే దయచేసి ప్రజలతో నన్ను మాట్లాడ నివ్వండి!” అన్నాడు. అధిపతి అనుమతితో, పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాడు. వారందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, హెబ్రీ భాషలో వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు.

అపొస్తలుల కార్యములు 21:27-40 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు ఆసియ నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూసి, బలవంతంగా పట్టుకుని అక్కడి ప్రజలందరినీ కలవర పరచి “ఇశ్రాయేలీయులారా, వచ్చి సహాయం చేయండి. ప్రజలకీ, ధర్మశాస్త్రానికీ, ఈ స్థలానికీ విరోధంగా అందరికీ, అన్నిచోట్లా బోధిస్తున్నవాడు వీడే. పైగా వీడు గ్రీకు వారిని దేవాలయంలోకి తెచ్చి ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు. ఎఫెసు వాడైన త్రోఫిము అంతకు ముందు పౌలుతో కలిసి ఉండడం వారు చూశారు కాబట్టి పౌలు అతణ్ణి కూడా దేవాలయంలోకి తీసుకుని వచ్చాడని వారు భావించారు. పట్టణమంతా గందరగోళంగా ఉంది. ప్రజలు గుంపులు గుంపులుగా పరుగెత్తుకు వచ్చి, పౌలును పట్టుకుని దేవాలయంలో నుండి బయటికి ఈడ్చి తలుపులు మూసేశారు. వారు అతణ్ణి చంపడానికి ప్రయత్నించారు. యెరూషలేము నగరమంతా అల్లకల్లోలంగా ఉందని ప్రధాన సైన్యాధికారికి సమాచారం వచ్చింది. వెంటనే అతడు సైనికులనూ, శతాధిపతులనూ వెంటబెట్టుకుని వారి దగ్గరికి పరుగెత్తుకు వచ్చాడు. వారు ఆ అధికారినీ, సైనికులనీ చూసి పౌలును కొట్టడం ఆపారు. అతడు వచ్చి పౌలును పట్టుకుని, రెండు సంకెళ్లతో అతనిని బంధించమని ఆజ్ఞాపించి, “ఇతడెవడు? ఏమి చేశాడు?” అని అడిగాడు. అయితే జనం వివిధ రకాలుగా కేకలు వేస్తూ అల్లరి చేయడం చేత అతడు నిజం తెలుసుకోలేక పౌలును కోటలోకి తీసుకుపొమ్మని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు ప్రజలు గుంపులుగా పోగై దాడికి దిగడం వలన సైనికులు అతణ్ణి మోసుకుపోవలసి వచ్చింది. ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు. వారు పౌలుని కోటలోకి తీసుకు పోతుండగా అతడు ఆ సేనాధిపతిని, “నేను నీతో ఒక మాట చెప్పవచ్చా?” అని అడిగాడు. అందుకు అతడు, “నీకు గ్రీకు భాష తెలుసా?’ ఇంతకు ముందు నాలుగు వేలమంది ఉగ్రవాదులను తీసుకుని అరణ్యంలోకి పారిపోయిన ఐగుప్తీయుడివి నువ్వే కదా?” అని అడిగాడు. అందుకు పౌలు, “నేను కిలికియలోని తార్సు పట్టణానికి చెందిన యూదుణ్ణి. ఒక మహా పట్టణపు పౌరుణ్ణి. నాకు ఈ ప్రజలతో మాటలాడే అవకాశం ఇవ్వమని నిన్ను వేడుకుంటున్నాను” అన్నాడు. అతడు దానికి అనుమతించాడు. అప్పుడు పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకి చేతితో సైగ చేశాడు. వారు సద్దుమణిగాక అతడు హెబ్రీ భాషలో ఇలా అన్నాడు.

అపొస్తలుల కార్యములు 21:27-40 పవిత్ర బైబిల్ (TERV)

ఏడు రోజులు పూర్తిగా గడవక ముందే ఆసియ ప్రాంతంనుండి వచ్చిన కొందరు యూదులు పౌలును మందిరంలో చూసారు. వాళ్ళు ప్రజల్ని పురికొలిపి పౌలును బంధించారు. ప్రజలతో, “ఇశ్రాయేలు ప్రజలారా! మాతో సహకరించండి. ఇతడు అన్ని ప్రాంతాలు తిరిగి ఇశ్రాయేలు ప్రజల్ని గురించి, మోషే ధర్మశాస్త్రాన్ని గురించి యెరూషలేములోని మందిరాన్ని గురించి విరుద్ధంగా అందరికీ బోధించాడు. ఇప్పుడు గ్రీకుల్ని కొందర్ని మందిరంలోకి పిలుచుకొని వెళ్ళి, ఈ పవిత్ర స్థానాన్ని అపవిత్రం చేసాడు” అని బిగ్గరగా అన్నారు. ప్రజలు ఎఫెసుకు చెందిన త్రోఫిమును పౌలుతో కలిసి పట్టణంలో తిరగటం చూసారు. కనుక పౌలు అతణ్ణి మందిరంలోకి పిలుచుకెళ్ళాడనుకున్నారు. పట్టణమంతా అల్లర్లు వ్యాపించాయి. ప్రజలు అన్ని వైపులనుండి పరుగెత్తికొంటూ వచ్చారు. పౌలును పట్టుకొని మందిరం అవతలికి లాగి వెంటనే మందిరం యొక్క తలుపులు మూసి వేసారు. వాళ్ళు, అతణ్ణి చంపే ప్రయత్నంలో ఉన్నారు. యెరూషలేమంతా అల్లర్లతో నిండిపోయిందనే వార్త సైన్యాధిపతికి పంపబడింది. ఆ సైన్యాధిపతి వెంటనే కొందరు సైనికుల్ని, సైన్యాధిపతుల్ని తన వెంట బెట్టుకొని ప్రజలు గుమి కూడిన చోటికి వెళ్ళాడు. వాళ్ళు సైన్యాధిపతిని, సైనికుల్ని చూసి, పౌలును కొట్టడం మానివేసారు. సైన్యాధిపతి అతని దగ్గరకు వెళ్ళి, అతణ్ణి పట్టుకొని యినుప గొలుసులతో కట్టి వేయమని ఆజ్ఞాపిస్తూ సైనికులకు అప్పగించాడు. “అతడెవరు? ఏం చేసాడు?” అని తదుపరి ప్రజల్ని విచారించాడు. ప్రజలు బిగ్గరగా కేకలు వేస్తూ, ఒకరొకటి, మరొకరు మరొకటి చెప్పారు. అల్లరిగా ఉండటం వల్ల సైన్యాధిపతికి జరిగిందేమిటో తెలియలేదు. పౌలును కోటలోకి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్లు ఎక్కుతుండగా ప్రజలు అల్లరి చేసారు. అందువల్ల సైనికులు పౌలును మోసికొని కోటలోకి తీసుకు వెళ్ళారు. ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు. సైనికులు పౌలును కోటలోకి తీసుకు వెళ్ళే ముందు, అతడు సైన్యాధిపతితో, “నేను మీతో కొద్దిగా మాట్లాడవచ్చా?” అని అడిగాడు. సైన్యాధిపతి, “నీవు గ్రీకు భాష మాట్లాడుతున్నావే! క్రితంలో ప్రభుత్వాన్ని ధిక్కరించి నాలుగు వేల మంది హంతకుల్ని ఎడారుల్లోకి పిలుచుకు వెళ్ళిన ఈజిప్టు దేశపువాడవు నీవే కదూ?” అని అడిగాడు. పౌలు, “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే ముఖ్య పట్టణానికి చెందిన పౌరుణ్ణి. నన్ను ప్రజలతో మాట్లాడనివ్వండి!” అని అడిగాడు. సైన్యాధిపతి సరేనన్నాడు. పౌలు మెట్ల మీద నిలబడి చేతులెత్తి శాంతించమని ప్రజల్ని కోరాడు. అందరూ శాంతించాక “హెబ్రీ” భాషలో ఈ విధంగా మాట్లాడాడు

అపొస్తలుల కార్యములు 21:27-40 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఏడు దినములు కావచ్చినప్పుడు ఆసియనుండి వచ్చిన యూదులు దేవాలయములో అతని చూచి, సమూహ మంతటిని కలవరపరచి అతనిని బలవంతముగా పట్టుకొని –ఇశ్రాయేలీయులారా, సహాయము చేయరండి; ప్రజ లకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసుదేశస్థులను దేవాలయములోనికి తీసికొనివచ్చి యీ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచియున్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫిమును అతనితోకూడ పట్టణములో అంతకుముందువారు చూచియున్నందున పౌలు దేవాలయములోనికి అతని తీసికొని వచ్చెనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరుగెత్తికొని వచ్చి, పౌలును పట్టుకొని దేవాలయములోనుండి అతనిని వెలుపలికి ఈడ్చిరి; వెంటనే తలుపులు మూయబడెను. వారతని చంపవలెనని యత్నించుచుండగా యెరూషలేమంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై యధికారికి వర్తమానము వచ్చెను; వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంట బెట్టుకొని వారియొద్దకు పరుగెత్తివచ్చెను; వారు పై యధికారిని సైనికులను రాణువవారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై యధికారి దగ్గరకు వచ్చి అతని పట్టుకొని, రెండు సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞా పించి–ఇతడెవడు? ఏమిచేసెనని అడుగగా, సమూహములో కొందరీలాగు కొందరాలాగు కేకలువేయు చున్నప్పుడు అల్లరిచేత అతడు నిజము తెలిసికొనలేక కోటలోనికి అతని తీసికొనిపొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్లమీదికి వచ్చినప్పుడు జనులు గుంపుకూడి బలవంతము చేయుచున్నందున సైనికులు అతనిని మోసికొని పోవలసి వచ్చెను. ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసికొనిపోవనై యుండగా అతడు పైయధికారిని చూచి–నేను నీతో ఒకమాట చెప్పవచ్చునా? అని అడిగెను. అందుకతడు–గ్రీకుభాష నీకు తెలియునా? ఈ దినములకుమునుపు రాజద్రోహమునకు రేపి, నరహంతకులైన నాలుగువేలమంది మనుష్యులను అరణ్యమునకు వెంటబెట్టుకొనిపోయిన ఐగుప్తీయుడవు నీవు కావా? అని అడిగెను. అందుకు పౌలు–నేను కిలికియలోని తార్సువాడనైన యూదుడను; ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాటలాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పెను. అతడు సెలవిచ్చిన తరువాత పౌలు మెట్లమీద నిలువబడి జనులకు చేసైగ చేసెను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీభాషలో ఇట్లనెను

అపొస్తలుల కార్యములు 21:27-40 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)