ఏడు రోజులు పూర్తి కావచ్చినప్పుడు, ఆసియా ప్రాంతం నుండి వచ్చిన కొందరు యూదులు దేవాలయంలో పౌలును చూసి, జనసమూహాన్ని రెచ్చగొట్టి అతన్ని పట్టుకున్నారు. వారు బిగ్గరగా, “తోటి ఇశ్రాయేలీయులారా, మాకు సహాయం చేయండి! ఈ వ్యక్తి మన ప్రజలకు మన ధర్మశాస్త్రానికి ఈ స్థలానికి వ్యతిరేకంగా ప్రతిచోట అందరికి బోధిస్తున్నాడు. అంతేకాక గ్రీసుదేశస్థులను ఈ దేవాలయంలోనికి తీసుకువచ్చి, ఈ పరిశుద్ధ స్థలాన్ని అపవిత్రం చేశాడు” అని కేకలు వేశారు. వారు అంతకుముందు ఎఫెసీయుడైన త్రోఫిముతో పౌలును పట్టణంలో చూశారు, కాబట్టి పౌలు అతన్ని దేవాలయంలోనికి తెచ్చాడని భావించారు.
పట్టణం అంతా ఆందోళన రేగింది, అన్ని వైపుల నుండి ప్రజలు పరుగెత్తికొని వచ్చారు. వారు పౌలును పట్టుకుని, అతన్ని దేవాలయం నుండి బయటకు లాగి, వెంటనే దేవాలయ తలుపులు మూసేసారు. వారు అతన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, యెరూషలేము పట్టణమంతా ఆందోళనగా మారిందనే వార్త రోమా ప్రధాన సైన్యాధికారికి చేరింది. అతడు వెంటనే కొందరు అధికారులను, సైనికులను వెంటపెట్టుకుని ఆ గుంపు దగ్గరకు పరుగెత్తుకొని వచ్చాడు. ఆ ఆందోళనకారులు అధిపతిని అతని సైనికులను చూసి, పౌలును కొట్టడం ఆపివేశారు.
అధిపతి వచ్చి అతన్ని పట్టుకుని, రెండు గొలుసులతో బంధించమని ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత, “అతడు ఎవరు? ఏమి చేశాడు?” అని అడిగాడు. ఆ గుంపులో కొందరు ఒకదాని గురించి కేకలు వేస్తుంటే, మరికొందరు మరొకదాని గురించి కేకలు వేశారు, ఆ గందరగోళం వలన ఆ అధిపతికి నిజం ఏమిటని స్పష్టం కాలేదు, కాబట్టి పౌలును సైనిక కోటలోనికి తీసుకుని వెళ్లమని ఆజ్ఞాపించాడు. పౌలు మెట్ల దగ్గరకు వచ్చినప్పుడు, అతనిపై ప్రజలు చాలా ఎక్కువగా దాడి చేస్తుండడంతో సైనికులు అతన్ని మోసుకొనివెళ్లారు. అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు.
సైనికులు పౌలును సైనిక కోటలోనికి తీసుకెళ్తున్నప్పుడు, పౌలు ఆ అధిపతిని, “నేను మీతో ఒక విషయం చెప్పడానికి అనుమతి ఉందా?” అని అడిగాడు.
అందుకు ఆ అధికారి, “నీకు గ్రీకుభాష తెలుసా?” అన్నాడు. “ఇంతకుముందు తిరుగుబాటును ఆరంభించి నాలుగు వేలమంది విప్లవకారులను అరణ్యంలోనికి నడిపించిన ఈజిప్టు వాడవు నీవేనా?” అని అడిగాడు.
అందుకు పౌలు, “నేను కిలికియ ప్రాంతంలోని తార్సు పట్టణానికి చెందిన యూదుడను, ఆ గొప్ప పట్టణ పౌరుడిని. అయితే దయచేసి ప్రజలతో నన్ను మాట్లాడ నివ్వండి!” అన్నాడు.
అధిపతి అనుమతితో, పౌలు మెట్ల మీద నిలబడి ప్రజలకు సైగ చేశాడు. వారందరు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, హెబ్రీ భాషలో వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు.