అపొస్తలుల కార్యములు 14:8-18

అపొస్తలుల కార్యములు 14:8-18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

లుస్త్రలో కుంటివాడొకడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అలా ఉన్నాడు కనుక ఎప్పుడు నడవలేదు. అతడు పౌలు చేసే బోధను వినేటప్పుడు, పౌలు సూటిగా అతని వైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, అతనితో, “లేచి నీ కాళ్ళ మీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు. పౌలు చేసిన కార్యాన్ని జనసమూహం చూసి, వారు లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవరూపంలో మనకొరకు దిగి వచ్చారు” అని కేకలు వేశారు. బర్నబాకు జూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెస్ అని పేర్లు పెట్టారు. ఆ పట్టణం బయట ఉన్న జూస్ గుడి పూజారి ప్రజలతో కలిసి ఎద్దులను, పూలదండలను పట్టణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారికి బలి అర్పించాలని అనుకున్నారు. అయితే అపొస్తలులైన బర్నబా మరియు పౌలు ఈ సంగతి విని, తమ వస్త్రాలను చింపుకొని ఆ జనసమూహంలోనికి చొరబడి, బిగ్గరగా ఇలా అన్నారు: “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుషులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాం. గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాలలో వెళ్లనిచ్చాడు. అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ మనస్సులను సంతోష పరుస్తున్నారు.” వారు ఈ మాటలు చెప్పినా కానీ తమకు బలి అర్పించాలనుకున్న సమూహాన్ని ఆపడం కష్టమైపోయింది.

అపొస్తలుల కార్యములు 14:8-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అతడు పుట్టు కుంటివాడు, ఎన్నడూ నడవలేదు. అతడు పౌలు మాటలాడుతుంటే విన్నాడు. పౌలు సూటిగా అతని వైపు చూసి, బాగుపడడానికి అతనికి విశ్వాసమున్నదని గమనించి, “లేచి నిలబడు” అని బిగ్గరగా అనగానే అతడు ఒక్క ఉదుటున లేచి నడవసాగాడు. ప్రజలు పౌలు చేసిన దాన్ని చూసి, లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవ రూపంలో మన దగ్గరికి వచ్చారు” అని కేకలు వేసి, బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు. పట్టణానికి ఎదురుగా ఉన్న జూస్ దేవుడి పూజారి, ఎడ్లనూ పూల దండలనూ పట్టణ ముఖద్వారం దగ్గరకి తీసుకుని వచ్చి సమూహంతో కలిసి, వారికి బలి అర్పించాలని చూశాడు. అపొస్తలులు బర్నబా, పౌలు ఈ సంగతి విని, తమ బట్టలు చింపుకుని సమూహంలోకి చొరబడి “అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. ఆయన గతించిన కాలాల్లో మనుషులందరినీ తమ సొంత మార్గాల్లో నడవనిచ్చాడు. అయినా ఆయన మేలు చేస్తూ ఆకాశం నుండి మీకు వర్షాన్నీ, ఫలవంతమైన రుతువులనూ దయచేస్తూ, ఆహారం అనుగ్రహిస్తూ, ఉల్లాసంతో మీ హృదయాలను నింపుతూ, తన గురించిన సాక్ష్యం నిలిపి ఉంచాడు.” వారు ఆ విధంగా ఎంతగా చెప్పినా సరే, తమకు బలి అర్పించకుండా ఆ గుంపులను ఆపడం చాలా కష్టమయింది.

అపొస్తలుల కార్యములు 14:8-18 పవిత్ర బైబిల్ (TERV)

లుస్త్రలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు. పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి, “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు. పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు. బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు. కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు: “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికిరానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు. “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు. కాని ఆకాశంనుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.” ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.

అపొస్తలుల కార్యములు 14:7-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

లుస్త్రలో బలహీన పాదములుగల యొకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై యెన్నడును నడువలేక కూర్చుండియుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతనివైపు తేరి చూచి, స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి – నీ పాదములు మోపి సరిగా నిలువుమని, బిగ్గరగా చెప్పి నప్పుడు అతడు గంతులువేసి నడువ సాగెను. జనసమూహములు పౌలు చేసినదాని చూచి, లుకయోనియ భాషలో –దేవతలు మనుష్యరూపము తాల్చి మనయొద్దకు దిగి వచ్చియున్నారని కేకలువేసి, బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగియైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతియొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి –అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గతకాలములలో సమస్త జనులను తమతమ మార్గములయందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశమునుండి మీకు వర్షమును, ఫలవంతములైన రుతువులను దయచేయుచు, ఆహారము ననుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలుచేయుటచేత తన్నుగూర్చి సాక్ష్యములేకుండ చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారీలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండ సమూహములను ఆపుట బహు ప్రయాసమాయెను.

అపొస్తలుల కార్యములు 14:8-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

లుస్త్రలో కుంటివాడొకడు అక్కడ కూర్చుని ఉన్నాడు. వాడు పుట్టుకతోనే అలా ఉన్నాడు కాబట్టి ఎప్పుడు నడవలేదు. అతడు పౌలు చేసే బోధను వినేటప్పుడు, పౌలు సూటిగా అతనివైపు చూసి స్వస్థత పొందడానికి అతనికి విశ్వాసం ఉందని గ్రహించి, అతనితో, “లేచి నీ కాళ్లమీద నిలబడు!” అని బిగ్గరగా అనగానే అతడు గంతులువేసి నడవసాగాడు. పౌలు చేసిన కార్యాన్ని జనసమూహం చూసి, వారు లుకయోనియ భాషలో, “దేవుళ్ళు మానవరూపంలో మన కోసం దిగి వచ్చారు” అని కేకలు వేశారు. బర్నబాకు జ్యూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెసు అని పేర్లు పెట్టారు. ఆ పట్టణం బయట ఉన్న జ్యూస్ గుడి పూజారి ప్రజలతో కలిసి ఎద్దులను, పూలదండలను పట్టణ ద్వారం దగ్గరకు తీసుకువచ్చి వారికి బలి అర్పించాలని అనుకున్నారు. అయితే అపొస్తలులైన బర్నబా పౌలు ఈ సంగతి విని, తమ వస్త్రాలను చింపుకొని ఆ జనసమూహంలోనికి చొరబడి, బిగ్గరగా ఇలా అన్నారు: “స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుష్యులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాము. గతంలో, ఆయన అన్ని దేశాల ప్రజలను తమ సొంత మార్గాల్లో వెళ్లనిచ్చాడు. అయినా కానీ ఆయన గురించి సాక్ష్యం లేకుండా ఉంచలేదు ఎలాగంటే: ఆయన మీకు ఆకాశం నుండి వర్షాన్ని వాటి రుతువుల్లో పంటలు పండింపచేసి తన దయను చూపించారు; సమృద్ధిగా ఆహారాన్ని అనుగ్రహిస్తూ మీ హృదయాలను ఆనందంతో నింపుతున్నారు.” వారు ఈ మాటలు చెప్పినా కానీ తమకు బలి అర్పించాలనుకున్న సమూహాన్ని ఆపడం కష్టమైపోయింది.