అపొస్తలుల 14:8-18

అపొస్తలుల 14:8-18 TERV

లుస్త్రలో ఒక కుంటివాడుండేవాడు. ఇతడు కుంటివానిగా పుట్టాడు. ఎన్నడూ నడవలేదు. పౌలు మాట్లాడుతుండగా అతడు విన్నాడు. పౌలు అతని వైపు సూటిగా చూసి నయం కాగల విశ్వాసం అతనిలో ఉందని గ్రహించి, “లేచి నీ కాళ్ళపై నిలబడు!” అని అతనితో బిగ్గరగా అన్నాడు. తక్షణం అతడు గంతేసి నడవటం మొదలు పెట్టాడు. పౌలు చేసింది చూసి ప్రజలు తమ లుకయొనియ భాషలో, “మానవ బృహస్పతి రూపంలో దేవుళ్ళు దిగివచ్చారు” అని బిగ్గరగా అన్నారు. బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. వీళ్ళు దేవుళ్ళని అనుకోవటం వల్ల వీళ్ళకు బలి యివ్వాలనే ఉద్దేశ్యంతో ఊరి బయట ఉన్న ద్యుపతి మందిరం యొక్క పూజారి, ప్రజలు కలిసి ఎద్దుల్ని, పూలహారాలను పట్టణ ద్వారాల దగ్గరకు తెచ్చారు. కాని అపొస్తలులైన బర్నబా, పౌలు ఇది విని తమ దుస్తుల్ని చింపుకొంటూ ఆ ప్రజల గుంపులోకి పరుగెత్తి యిలా బిగ్గరగా అన్నారు: “అయ్యలారా! మీరిలా ఎందుకు చేస్తున్నారు? మేము కూడా మనుష్యులమే! మీలాంటి మనుష్యులమే! ఈ పనికిరానివాటినుండి మిమ్మల్ని దూరం చేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాల్ని వాటిలో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుని వైపు మళ్ళించే సువార్తను తెచ్చాము. ఆ దేవుడు సజీవమైనవాడు. “ఇదివరలో దేవుడు ప్రజల్ని తమ యిష్టం వచ్చినట్లు చెయ్యనిచ్చాడు. కాని ఆకాశంనుండి వానలు కురిపించి, పంట కాలంలో పంటలు పండించి తినటానికి కావలసినంత ఆహారాన్నిచ్చి మన మనసుల్ని ఆనందంతో నింపి మనపై దయచూపి దేవుడు తానున్నట్లు తెలియచేసాడు.” ఇన్ని చెప్పాక కూడా ప్రజలు తాము యివ్వాలనుకొన్న బలినివ్వటం మానుకోలేదు.

అపొస్తలుల 14:8-18 కోసం వీడియో