అపొస్తలుల కార్యములు 10:23-48

అపొస్తలుల కార్యములు 10:23-48 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మరుసటిరోజు పేతురు వారితో కలిసి బయలుదేరాడు, వారితో పాటు యొప్పేలో ఉన్న కొందరు విశ్వాసులు కూడా వెళ్లారు. ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను మరియు సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కొరకు ఎదురు చూస్తున్నాడు. పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయితే పేతురు, “లేచి నిలబడు, నేను కూడా మనిషినే” అని చెప్పి అతన్ని పైకి లేపాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చివుండడం చూసాడు. అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధం. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేదించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు. కనుక నీవు నన్ను పిలిచినప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు చెప్పండి?” అని అడిగాడు. అందుకు కొర్నేలీ, “మూడు రోజుల క్రితం ఇదే సమయంలో అనగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తునప్పుడు అకస్మాత్తుగా మెరుస్తున్న వస్త్రాలలో ఉన్న ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి, నాతో, ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలను ఆలకించాడు మరియు నీవు పేదవారికి చేసిన దానధర్మాలను జ్ఞాపకం చేసుకొన్నాడు. నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. కనుక నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషం. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నింటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు. అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు, కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు. యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో మరియు శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు. “యూదయా ప్రాంతంలో మరియు యెరూషలేము పట్టణంలో యేసు చేసిన కార్యాలన్నింటికి మేము సాక్షులం. వారు ఆయనను సిలువ మీద వ్రేలాడదీసి చంపారు. కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. ఆయన ప్రజలందరికి కనబడలేదు; కానీ దేవుడు ముందుగానే తన సాక్షులుగా ఏర్పరచుకొన్నవారికి అనగా ఆయన మరణం నుండి తిరిగి జీవంతో లేచిన తర్వాత ఆయనతోపాటు తిని త్రాగిన మాకు కనబడ్డారు. దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వుమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.” పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. యూదేతరుల మీద కూడా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడడం చూసి పేతురుతో వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు. దానికి కారణం వారందరు ఇతర భాషలలో మాట్లాడుతూ దేవుని స్తుతించడం విన్నారు. అప్పుడు పేతురు, “మనం పొందుకొన్న విధంగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకొన్నారు కనుక వీరిని నీటి బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకపరచగలమా? ఆటంకపరచలేము కదా” అని అన్నాడు. కనుక వారు యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు. ఆ తర్వాత వారు పేతురును తమతో మరికొన్ని రోజులు ఉండుమని బ్రతిమాలుకొన్నారు.

అపొస్తలుల కార్యములు 10:23-48 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు. ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వారి కోసం ఎదురుచూస్తున్నాడు. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్ళి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయితే పేతురు అతనిని లేపి “లేచి నిలబడు. నేను కూడా మనిషినే” అని చెప్పాడు. అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు. అప్పుడతడు, “అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషిద్ధమైన వాడుగా, అపవిత్రుడుగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు” అని కొర్నేలితో చెప్పాడు. అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు. అందుకు పేతురు ఇలా అన్నాడు, “దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు. ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు. పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.

అపొస్తలుల కార్యములు 10:23-48 పవిత్ర బైబిల్ (TERV)

మరుసటి రోజు పేతురు వాళ్ళతో ప్రయాణమయ్యాడు. యొప్పేలోని కొందరు సోదరులు కూడా అతని వెంట వెళ్ళారు. ఆ మరుసటి రోజు వాళ్ళు కైసరియకు చేరుకొన్నారు. వీళ్ళు రానున్నారని తెలిసి కొర్నేలీ సన్నిహితులైన బంధువుల్ని తన యింటికి ఆహ్వానించాడు. పేతురు యింట్లోకి అడుగు పెడ్తుండగానే కొర్నేలీ అతనికి ఎదురు వెళ్ళి అతని కాళ్ళ ముందు సాష్టాంగపడి నమస్కరించాడు. పేతురు అతనిని లేపుతూ, “లెమ్ము! నేను కూడా ఒక మనిషినే” అని అన్నాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళాడు. అక్కడ చాలా మంది ప్రజలు సమావేశమై ఉండటం చూసాడు. పేతురు వాళ్ళతో, “యూదుడు, యూదుడు కానివానితో కలిసి ఉండరాదనీ, అతని యింటికి వెళ్ళరాదనీ యూదుల న్యాయశాస్త్రం అంటుంది. ఇది తప్పని మీకందరికి తెలుసు. కాని ‘ఏ వ్యక్తినీ అధమంగా భావించరాదు. పరిశుభ్రత లేనివాడని అనకూడదు’ అని నాకు దేవుడు తెలియజేసాడు. కాబట్టి నా కోసం పిలవనంపగానే వచ్చాను. నన్నెందుకు పిలిచారో నేను యిప్పుడు కారణం అడగవచ్చా?” అని అన్నాడు. కొర్నేలీ యిలా చెప్పాడు: “నాలుగు రోజుల క్రితం యిదే సమయంలో యింట్లో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అప్పుడు పగలు మూడు గంటలు. అకస్మాత్తుగా తెల్లటి మెరిసే దుస్తులు వేసుకొని ఒక వ్యక్తి నా ముందు ప్రత్యక్షమయ్యాడు. అతడు నాతో, ‘కొర్నేలీ! దేవుడు నీ ప్రార్థనల్ని విన్నాడు. నీవు పేదలకు చేస్తున్న దానాలను గుర్తించాడు. పేతురు అని పిలువబడే సీమోన్ను పిలుచుకు రావటానికి కొందర్ని యొప్పేకు పంపు. అతడిప్పుడు సీమోను అనే చెప్పులు కుట్టేవాని యింట్లో అతిథిగా ఉన్నాడు. ఈ చెప్పులు కుట్టేవాని యిల్లు సముద్ర తీరాన ఉంది’ అని చెప్పాడు. మిమ్మల్ని పిలుచుకు రావటానికి తక్షణం మనుష్యుల్ని పంపాను. మీరొచ్చి మంచి పని చేసారు. ఇప్పుడు మనమంతా దేవుని ముందున్నాము. మాకు చెప్పుమని ప్రభువు మీకాజ్ఞాపించినవన్నీ వినటానికి సిద్ధంగా ఉన్నాము.” పేతురు ఇలా చెప్పటం మొదలు పెట్టాడు: “దేవుడు పక్షపాతం చూపడని, తానంటే భయభక్తులున్న వాళ్ళను, నిజాయితీ పరుల్ని వాళ్ళు ఏ దేశస్థులైనా అంగీకరిస్తాడని యిప్పుడు నాకు బాగా తెలిసింది. ఈ సందేశాన్ని దేవుడు ఇశ్రాయేలు వంశీయులకు అందించాడు. దేవుడు మనకందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా శాంతి లభిస్తుందనే శుభవార్తను ప్రకటించాడు. “యోహాను బోధించిన బాప్తిస్మమును ప్రజలు పొందాక గలిలయలో ఒక సంగతి ప్రారంభమైంది. ఆ సంగతిని గురించిన ప్రకటనలు యూదయ ప్రాంతం అంతా వ్యాపించాయి. ఇది మీకంతా తెలుసు. నజరేతు నివాసి యేసును దేవుడు పవిత్రాత్మతో అభిషేకించాడు. అద్భుతమైన శక్తి యిచ్చాడు. దేవుడు ఆయనతో ఉండటం వల్ల యేసు ప్రజలకు మేలు చేస్తూ అన్ని ప్రాంతాలు పర్యటించాడు. సాతాను పీడవలన బాధపడ్తున్న వాళ్ళకు నయం చేసాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. “యెరూషలేము, యూదయ దేశంలో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఆయన చేసిన ప్రతి పనిని మేము కళ్ళారా చూసాము. వాళ్ళు ఆయన్ని మ్రానుతో చేసిన సిలువకు మేకులు కొట్టి చంపారు. కాని మూడవ రోజున దేవుడు ఆయన్ని బ్రతికించాడు. ఆయన ప్రజలకు కనిపించాలని దేవుని ఉద్దేశ్యం. అందరూ ఆయన్ని చూడలేదు. ఇదివరకే దేవుడు ఎన్నుకొన్న కొందరు మాత్రం చూసారు. మేమే ఆ సాక్షులం. ఆయన బ్రతికి వచ్చాక మేమంతా ఆయనతో కలిసి భోజనం చేసాం. “ఆయన అందరికి న్యాయాధిపతి. అంటే బ్రతికి ఉన్నవాళ్ళకు, పునర్జీవం పొందనున్న వాళ్ళకు. ఈ పదవిని దేవుడు ఆయనకిచ్చాడు. దీన్ని గురించి ప్రజల ముందు సాక్ష్యం చెప్పమని, సువార్తను ప్రకటించమని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. యేసును నమ్మినవాళ్ళు తమ పాపాలకు ఆయన ద్వారా క్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు చెప్పారు.” పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.

అపొస్తలుల కార్యములు 10:23-48 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మరునాడు అతడు లేచి, వారితోకూడ బయలుదేరెను; యొప్పేవారైన కొందరు సహోదరులును వారితోకూడ వెళ్లిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారికొరకు కనిపెట్టుకొని యుండెను. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదములమీదపడి నమస్కారము చేసెను. అందుకు పేతురు–నీవు లేచి నిలువుము, నేను కూడ నరుడనే అని చెప్పి అతని లేవనెత్తి అతనితో మాటలాడుచు లోపలికి వచ్చి, అనేకులు కూడియుండుట చూచెను. అప్పుడతడు–అన్యజాతివానితో సహవాసము చేయుటయైనను, అట్టివానిని ముట్టుకొనుటయైనను యూదునికి ధర్మముకాదని మీకు తెలియును. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగినవాడనియైనను అపవిత్రుడనియైనను చెప్పకూడదని దేవుడు నాకు చూపించియున్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమియు చెప్పక వచ్చితిని గనుక, ఎందునిమిత్తము నన్ను పిలువనంపితిరో దానినిగూర్చి అడుగు చున్నానని వారితో చెప్పెను. అందుకు కొర్నేలి– నాలుగు దినముల క్రిందట పగలు మూడుగంటలు మొదలుకొని యీ వేళవరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా యెదుట నిలిచి –కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను; నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి యున్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను. వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నామని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను –దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించియున్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయమొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెనను నదియే. దేవుడాయనకు తోడైయుండెను గనుక ఆయన మేలుచేయుచు, అపవాదిచేత పీడింపబడిన వారినందరిని స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన యూదుల దేశమందును యెరూషలేమునందును చేసినవాటికన్నిటికిని మేము సాక్షులము. ఆయనను వారు మ్రానున వ్రేలాడ దీసి చంపిరి. దేవుడాయనను మూడవదినమున లేపి ప్రజలకందరికి కాక దేవునిచేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలోనుండి లేచిన తరు వాత ఆయనతోకూడ అన్నపానములు పుచ్చుకొనిన మాకే, ఆయన ప్రత్యక్షముగా కనబడునట్లు అనుగ్రహించెను. ఇదియుగాక దేవుడు సజీవులకును మృతులకును న్యాయాధిపతినిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి దృఢసాక్ష్యమియ్యవలెనని మాకు ఆజ్ఞాపించెను. ఆయనయందు విశ్వాసముంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరు ఆయననుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నారనెను. పేతురు ఈ మాటలు ఇంక చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరిమీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందినవారిలో పేతురుతోకూడ వచ్చిన విశ్వాసులందరు, పరిశుద్ధాత్మ వరము అన్యజనులమీద సయితము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతినొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుని ఘనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు–మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండ ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసు క్రీస్తు నామమందువారు బాప్తిస్మము పొందవలెనని ఆజ్ఞాపించెను. తరువాత కొన్ని దినములు తమయొద్ద ఉండుమని వారతని వేడుకొనిరి.

అపొస్తలుల కార్యములు 10:23-48 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అప్పుడు పేతురు వారిని తన అతిథులుగా ఇంట్లోకి ఆహ్వానించాడు. మరుసటిరోజు పేతురు వారితో కలిసి బయలుదేరాడు, వారితో పాటు యొప్పేలో ఉన్న కొందరు విశ్వాసులు కూడా వెళ్లారు. ఆ మరుసటిరోజు అతడు కైసరయ పట్టణం చేరాడు. కొర్నేలీ తన బంధువులను సన్నిహిత స్నేహితులను పిలిచి వీరి కోసం ఎదురు చూస్తున్నాడు. పేతురు ఆ ఇంట్లో ప్రవేశించగానే, కొర్నేలీ అతన్ని కలుసుకొని భక్తితో అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయితే పేతురు, “లేచి నిలబడు, నేను కూడా మనిషినే” అని చెప్పి అతన్ని పైకి లేపాడు. పేతురు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చినప్పుడు, అక్కడ చాలామంది వచ్చి ఉండడం చూశాడు. అతడు వారితో, “మీ అందరికి తెలిసినట్లే ఒక యూదుడు, యూదుడుకాని వ్యక్తితో సాంగత్యం చేయడం, వారిని కలవడం, యూదా నియమానికి విరుద్ధము. అయితే ఎవరినీ నేను అపవిత్రులని గాని నిషేధించబడిన వారని గాని పిలువకూడదని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నీవు నన్ను పిలిచినప్పుడు ఏ అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు మీరు నన్ను ఎందుకు పిలిచారో నాకు చెప్పండి?” అని అడిగాడు. అందుకు కొర్నేలీ, “మూడు రోజుల క్రితం ఇదే సమయంలో అనగా మధ్యాహ్నం సుమారు మూడు గంటలప్పుడు నేను నా ఇంట్లో ప్రార్థన చేస్తునప్పుడు అకస్మాత్తుగా మెరుస్తున్న వస్త్రాల్లో ఉన్న ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి, నాతో, ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థనలను ఆలకించాడు నీవు పేదవారికి చేసిన దానధర్మాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పే పట్టణంలో ఉన్న పేతురు అని పిలువబడే సీమోనును పిలిపించు. అతడు సముద్రపు ఒడ్డున ఉన్న సీమోను అనే చర్మకారుని ఇంట్లో అతిథిగా ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. కాబట్టి నేను వెంటనే నిన్ను పిలిపించాను, నీవు మా మధ్యకు రావడం చాలా సంతోషము. ఇప్పుడు మేమందరం దేవుని సన్నిధిలో ఉండి దేవుడు నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి చేరుకొన్నాం” అని చెప్పాడు. అప్పుడు పేతురు మాట్లాడడం మొదలుపెట్టాడు, “దేవుడు పక్షపాతం చూపించడు, కానీ ప్రతీ జనాల్లో ఆయనకు భయపడుతూ సరియైనది చేసేవారిని ఆయన స్వీకరిస్తారని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. అందరికి ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా సమాధాన సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీకు తెలుసు. యోహాను ప్రకటించిన బాప్తిస్మం తర్వాత గలిలయ ప్రాంతం మొదలుకొని యూదయ చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటిలో జరిగిన సంగతులు మీకు తెలుసు. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఎలా అభిషేకించారో, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నందుకు ఎలా ఆయన మేలులను చేస్తూ అపవాది శక్తుల క్రింద ఉన్నవారందరిని బాగుచేస్తూ తిరిగాడో మీకు తెలుసు. “యూదయా ప్రాంతంలో యెరూషలేము పట్టణంలో యేసు చేసిన కార్యాలన్నింటికి మేము సాక్షులము. వారు ఆయనను సిలువ మీద వ్రేలాడదీసి చంపారు. కానీ దేవుడు ఆయనను మూడవ రోజున మరణం నుండి సజీవునిగా లేపి మేము ఆయనను చూసేలా మాకు కనుపరిచారు. ఆయన ప్రజలందరికి కనబడలేదు; కానీ దేవుడు ముందుగానే తన సాక్షులుగా ఏర్పరచుకున్నవారికి అనగా ఆయన మరణం నుండి తిరిగి జీవంతో లేచిన తర్వాత ఆయనతో పాటు తిని త్రాగిన మాకు కనబడ్డారు. దేవుడు ఆయననే సజీవులకు, మృతులకు తీర్పు తీర్చేవానిగా నియమించారని ప్రజలకు ప్రకటించి, సాక్ష్యం ఇవ్వమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపించారు. ఆయనను నమ్మిన ప్రతివారు ఆయన పేరట పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలందరు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చారు.” పేతురు ఇంకా ఈ మాటలను మాట్లాడుతుండగా, ఈ సందేశాన్ని విన్న వారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగి వచ్చారు. యూదేతరుల మీద కూడా పరిశుద్ధాత్మ వరం కుమ్మరించబడడం చూసి పేతురుతో వచ్చిన సున్నతి పొందిన విశ్వాసులు ఆశ్చర్యపోయారు. దానికి కారణం వారందరు ఇతర భాషల్లో మాట్లాడుతూ దేవుని స్తుతించడం విన్నారు. అప్పుడు పేతురు, “మనం పొందుకొన్న విధంగానే వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు కాబట్టి వీరిని నీటి బాప్తిస్మం పొందడానికి ఇక ఆటంకపరచగలమా? ఆటంకపరచలేము కదా” అని అన్నాడు. కాబట్టి వారు యేసు క్రీస్తు పేరట బాప్తిస్మం పొందాలని పేతురు ఆదేశించాడు. ఆ తర్వాత వారు పేతురును తమతో మరికొన్ని రోజులు ఉండమని బ్రతిమాలుకొన్నారు.