తెల్లవారగానే పేతురు లేచి, వారితో బయలుదేరాడు. వారితోపాటు కొంతమంది యొప్పే ఊరి సోదరులు కూడా వెళ్ళారు. ఆ మరుసటి రోజు వారు కైసరయ చేరుకున్నారు. కొర్నేలి తన బంధుమిత్రులను పిలిపించి వారి కోసం ఎదురుచూస్తున్నాడు. పేతురు లోపలికి రాగానే కొర్నేలి అతనికి ఎదురు వెళ్ళి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. అయితే పేతురు అతనిని లేపి “లేచి నిలబడు. నేను కూడా మనిషినే” అని చెప్పాడు. అతనితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళి చాలామంది సమావేశమై ఉండడం చూశాడు. అప్పుడతడు, “అన్యజాతి వారిని సందర్శించడం, వారితో సాంగత్యం చేయడం యూదునికి నియమం కాదని మీకు తెలుసు. అయితే ఏ వ్యక్తినీ నిషిద్ధమైన వాడుగా, అపవిత్రుడుగా ఎంచకూడదని దేవుడు నాకు చూపించాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అభ్యంతరం చెప్పకుండా వచ్చాను. ఇప్పుడు నన్నెందుకు పిలిపించావో నాకు చెప్పు” అని కొర్నేలితో చెప్పాడు. అందుకు కొర్నేలి, “నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి, మధ్యాహ్నం మూడు గంటలకు నేను మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. ఉన్నట్టుండి ధగధగలాడే బట్టలు ధరించిన ఒక వ్యక్తి నా ఎదురుగా నిలబడి ‘కొర్నేలీ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. పేదవారికి నీవు చేసిన దానధర్మాలను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు యొప్పేకు మనిషిని పంపి పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు. అతడు సముద్రం పక్కనే ఉన్న చర్మకారుడు సీమోను ఇంట్లో ఉన్నాడు’ అని నాతో చెప్పాడు. వెంటనే మీకు కబురు పెట్టాను. మీరు రావడం మంచిది అయింది. ప్రభువు మీకాజ్ఞాపించిన వాటన్నిటిని వినడానికి ఇప్పుడు మేమంతా దేవుని సన్నిధిలో ఇక్కడ సమావేశం అయ్యాము” అని చెప్పాడు. అందుకు పేతురు ఇలా అన్నాడు, “దేవుడు పక్షపాతం లేకుండా అందరినీ సమదృష్టితో చూస్తాడని నేను ఇప్పుడు స్పష్టంగా తెలుసుకున్నాను. ప్రతి జనంలోనూ తనపట్ల భయభక్తులు కలిగి నీతిగా నడుచుకునే వారిని ఆయన అంగీకరిస్తాడు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు శాంతి సువార్తను ప్రకటిస్తూ, ఇశ్రాయేలీయులకు పంపిన సందేశం మీకు తెలిసిందే కదా. యోహాను ప్రకటించిన బాప్తిసం తరువాత గలిలయ మొదలు యూదయ ప్రాంతమంతా జరిగిన సంగతులు కూడా మీకు తెలుసు. అవేవంటే దేవుడు నజరేతువాడైన యేసును పరిశుద్ధాత్మతోనూ, బలప్రభావాలతోనూ అభిషేకించాడు. దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేస్తూ సాతాను పీడన కింద ఉన్న వారందరినీ బాగుచేస్తూ వెళ్ళాడు. ఆయన యూదుల దేశంలో, యెరూషలేములో చేసిన వాటన్నిటికీ మేము సాక్షులం. ఈ యేసుని వారు మానుకు వేలాడదీసి చంపారు. దేవుడాయనను మూడవ రోజున సజీవంగా తిరిగి లేపాడు. ప్రజలందరికీ కాక దేవుడు ముందుగా ఏర్పరచిన సాక్షులకే, అంటే ఆయన చనిపోయి లేచిన తరువాత ఆయనతో కలిసి అన్నపానాలు చేసిన మాకే, ఆయన ప్రత్యక్షంగా కనిపించేలా అనుగ్రహించాడు. దేవుడు సజీవులకూ మృతులకూ న్యాయాధిపతిగా నియమించినవాడు ఈయనే అని ప్రజలకు ప్రకటించి సాక్షమివ్వాలని ఆయన మాకు ఆజ్ఞాపించాడు. ఆయనలో విశ్వాసముంచే వారంతా ఆయన నామంలో పాపక్షమాపణ పొందుతారని ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు” అని చెప్పాడు. పేతురు ఈ మాటలు చెబుతూ ఉండగానే అతని బోధ విన్న వారందరి మీదికీ పరిశుద్ధాత్మ దిగాడు. సున్నతి పొందిన విశ్వాసులంతా, అంటే పేతురుతో పాటు వచ్చినవారంతా, పరిశుద్ధాత్మ వరాన్ని యూదేతరుల మీద కూడా దేవుడు కుమ్మరించడం చూసి ఆశ్చర్యచకితులయ్యారు. ఎందుకంటే యూదేతరులు భాషల్లో మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతించడం వారు విన్నారు. అప్పుడు పేతురు, “మనలాగా పరిశుద్ధాత్మను పొందిన వీరు నీటి బాప్తిస్మం పొందకుండా ఎవరైనా అడ్డు చెప్పగలరా?” అని చెప్పి యేసుక్రీస్తు నామంలో వారు బాప్తిస్మం పొందాలని ఆజ్ఞాపించాడు. అటు తరువాత మరికొన్ని రోజులు తమ దగ్గర ఉండమని వారతన్ని బతిమాలారు.
Read అపొస్తలుల కార్యములు 10
వినండి అపొస్తలుల కార్యములు 10
షేర్ చేయి
అన్ని అనువాదాలను సరిపోల్చండి: అపొస్తలుల కార్యములు 10:23-48
వచనాలను సేవ్ చేయండి, ఆఫ్‌లైన్‌లో చదవండి, బోధన క్లిప్‌లను చూడండి ఇంకా మరెన్నో చేయండి!
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు