2 సమూయేలు 3:1-21

2 సమూయేలు 3:1-21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)

సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య చాలా కాలం యుద్ధం జరుగుతూనే ఉంది. దావీదు అంతకంతకు బలపడుతుంటే సౌలు కుటుంబం బలహీనమవుతూ వచ్చింది. దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు: యెజ్రెయేలుకు చెందిన అహీనోయముకు పుట్టిన అమ్నోను అతని మొదటి కుమారుడు; కర్మెలుకు చెందిన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టిన కిల్యాబు అతని రెండవ కుమారుడు; గెషూరు రాజైన తల్మయి కుమార్తెయైన మయకాకు పుట్టిన అబ్షాలోము మూడవ కుమారుడు; హగ్గీతు కుమారుడైన అదోనియా నాలుగవ కుమారుడు; అబీటలు కుమారుడైన షెఫట్యా అయిదవ కుమారుడు; దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు. వీరు దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో అబ్నేరు సౌలు కుటుంబంలో తన స్థానాన్ని బలపరచుకున్నాడు. అయ్యా కుమార్తె రిస్పా సౌలుకు ఉంపుడుగత్తెగా ఉండేది. “నా తండ్రి ఉంపుడుగత్తెతో నీవెందుకు శారీరక సంబంధం పెట్టుకున్నావు?” అని ఇష్-బోషెతు అబ్నేరును అడిగాడు. ఇష్-బోషెతు అన్న మాటకు అబ్నేరుకు చాలా కోపం వచ్చి, “నేనేమైనా యూదా పక్షాన చేరిన కుక్కతో సమానమా? ఈ రోజు వరకు నీ తండ్రియైన సౌలు కుటుంబానికి, అతని బంధువులకు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉన్నాను. నేను నిన్ను దావీదు చేతికి అప్పగించలేదు. అయినా నీవు ఈ స్త్రీ కారణంగా నా మీద నిందవేస్తున్నావు. యెహోవా దావీదుకు ప్రమాణ పూర్వకంగా వాగ్దానం చేసినట్టుగా సౌలు ఇంటి నుండి రాజ్యాన్ని తీసివేసి, దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు మీద యూదా మీద దావీదు సింహాసనాన్ని నేను స్థాపించకపోతే, దేవుడు అబ్నేరుతో కఠినంగా వ్యవహరించును గాక” అని అన్నాడు. దానితో ఇష్-బోషెతు అబ్నేరుకు భయపడి అతన్ని మరో మాట అనడానికి సాహసించలేదు. అప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు దూతలను పంపించి, “ఈ దేశం ఎవరిది? నాతో ఒప్పందం చేసుకో, ఇశ్రాయేలు రాజ్యమంతా నీది కావడానికి నేను నీకు సహాయం చేస్తాను” అని కబురు చేశాడు. అప్పుడు దావీదు, “మంచిది, నీతో ఒక ఒప్పందానికి వస్తాను కాని నీవు ఒక పని చేయాలి. నీవు నన్ను చూడడానికి వచ్చేటప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా దగ్గరకు తీసుకువస్తేనే నీవు నన్ను చూడగలవు” అని చెప్పాడు. ఆ తర్వాత దావీదు సౌలు కుమారుడైన ఇష్-బోషెతు దగ్గరకు దూతలను పంపించి, “వందమంది ఫిలిష్తీయుల మర్మాంగ చర్మాలు తెచ్చి వెల చెల్లించి నేను పెండ్లి చేసుకున్న నా భార్య మీకాలును నాకు అప్పగించు” అని కబురు చేశాడు. ఇష్-బోషెతు మనుష్యులను పంపి ఆమె భర్త లాయిషు కుమారుడైన పల్తీయేలు దగ్గర నుండి ఆమెను తీసుకురమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. ఆమె భర్త ఆమె వెంట ఏడుస్తూ బహూరీము వరకు వచ్చాడు. అయితే అబ్నేరు అతన్ని వెనుకకు వెళ్లిపొమ్మని చెప్పడంతో అతడు వెళ్లిపోయాడు. అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలతో మాట్లాడి, “గతంలో మీరు దావీదు మీకు రాజుగా ఉండాలని కోరుకున్నారు గదా! ‘నా సేవకుడైన దావీదు ద్వారా నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విడిపిస్తాను’ అని యెహోవా దావీదుకు ప్రమాణం చేశారు, కాబట్టి ఇప్పుడు మీ కోరిక నెరవేర్చుకోండి” అన్నాడు. అలాగే అబ్నేరు బెన్యామీనీయులతో స్వయంగా మాట్లాడాడు. ఆ తర్వాత అతడు హెబ్రోనుకు వెళ్లి ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులు అనుకున్న దాన్నంతా దావీదుకు తెలియజేశాడు. అబ్నేరు తనతో కూడా ఇరవైమంది మనుష్యులను వెంటపెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకు వచ్చినప్పుడు అతనికి అతనితో ఉన్నవారందరికి దావీదు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. అప్పుడు అబ్నేరు దావీదుతో, “నేను వెంటనే వెళ్లి ఇశ్రాయేలీయులందరిని నా ప్రభువైన రాజు కోసం సమావేశపరచి, వారు మీతో నిబంధన చేసేలా మీరు కోరుకున్న విధంగా మీరు వారిని పరిపాలించేలా చేస్తాను” అని చెప్పాడు. కాబట్టి దావీదు అబ్నేరును పంపించగా, అతడు సమాధానంతో వెళ్లాడు.

2 సమూయేలు 3:1-21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ చాలాకాలం పాటు యుద్ధాలు జరిగాయి. ఫలితంగా దావీదు మరింత బలంగా వృద్ధి చెందాడు, సౌలు కుటుంబం క్రమేపీ క్షీణించిపోయింది. హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. యెజ్రెయేలీయురాలైన అహీనోయముకు అమ్నోను అనే మొదటి కొడుకు పుట్టాడు. రెండవ కొడుకు కిల్యాబు అంతకు ముందు కర్మెలీ వాడైన నాబాలుకు భార్యగా ఉన్న అబీగయీలుకు పుట్టాడు. మూడవ వాడు అబ్షాలోము గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకాకు పుట్టాడు. నాలుగవ వాడు అదోనీయా హగ్గీతుకు పుట్టాడు. అయిదవ వాడు షెఫట్య అబీటలుకు పుట్టాడు. ఆరవ వాడు ఇత్రెయాము దావీదు భార్య ఎగ్లాకు పుట్టాడు. వీరంతా హెబ్రోనులో దావీదుకు పుట్టిన కొడుకులు. సౌలు కుటుంబం వారికీ, దావీదు కుటుంబం వారికీ యుద్ధాలు జరిగే సమయంలో అబ్నేరు సౌలు కుటుంబం వారికి ఎంతో సహాయం చేశాడు. రిస్పా కూతురు అయ్యా సౌలుకు ఒక ఉపపత్ని. ఇష్బోషెతు “నా తండ్రి ఉపపత్నితో నువ్వెందుకు సంబంధం పెట్టుకున్నావు” అని అబ్నేరును ప్రశ్నించాడు. ఇష్బోషెతు తనను అలా నిలదీసి అడిగినందుకు అబ్నేరుకు తీవ్రమైన కోపం వచ్చింది. అబ్నేరు “నిన్ను దావీదు చేతికి అప్పగించకుండా నీ తండ్రి అయిన సౌలు కుటుంబం వారికీ, అతని సహోదరులకూ, అతని స్నేహితులకూ నేను ఉపకారం చేశానే. నన్ను యూదావారి పక్షంతో చేరిన కుక్కతో సమానంగా ఎంచి, ఈ రోజున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుతున్నావా? యెహోవా దావీదుకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షంగా నేను చేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు రప్పిస్తాడు గాక. సౌలు కుటుంబం వారి చేతిలోనుండి రాజ్యాన్ని తప్పించి దాను నుండి బెయేర్షెబా దాకా ఇశ్రాయేలు వారికి, యూదా వారికి దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తాను” అన్నాడు. అబ్నేరు మాటలకు భయపడిన ఇష్బోషెతు ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. అబ్నేరు తన మనుషులను దావీదు దగ్గరికి పంపి “ఈ రాజ్యం ఎవరిది? నువ్వు నాతో ఒప్పందం చెయ్యి. నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీవైపు తిప్పుతాను” అని కబురు పంపాడు. అప్పుడు దావీదు “మంచిది. నేను నీతో ఒప్పందం చేస్తాను. అయితే నువ్వు ఒక పని చేయాలి. నన్ను చూడడానికి వచ్చే సమయంలో సౌలు కూతురు మీకాలును నా దగ్గరికి తీసుకురావాలి. లేకపోతే నీకు నా దర్శనం దొరకదు” అని జవాబిచ్చాడు. దావీదు సౌలు కొడుకు ఇష్బోషెతు దగ్గరికి తన మనుషులను పంపించి “ఫిలిష్తీయుల్లో వందమంది మర్మాంగ చర్మపు కొనలను తెచ్చి నేను పెండ్లి చేసుకొన్న మీకాలును నాకు అప్పగించాలి” అని చెప్పమన్నాడు. మీకాలు భర్త, లాయీషు కొడుకు అయిన పల్తీయేలు దగ్గర నుండి మీకాలును తీసుకు వచ్చేందుకు ఇష్బోషెతు తన మనుషులను పంపించాడు. ఆమె భర్త బహూరీము వరకూ మీకాలు వెనకాలే ఏడ్చుకుంటూ వస్తుంటే అబ్నేరు “నీవు తిరిగి వెనక్కి వెళ్ళిపో” అని చెప్పగానే అతడు వెళ్లిపోయాడు. అప్పుడు అబ్నేరు ఇశ్రాయేలు పెద్దలను పిలిపించి “దావీదు మిమ్మల్ని పాలించాలని మీరు ఇంతకు ముందు కోరుకున్నారు గదా? ‘నా సేవకుడైన దావీదు చేత నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలో నుండి, వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచిస్తాను’ అని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చాడు కాబట్టి మీ కోరిక నెరవేర్చుకోండి” అని వారితో చెప్పాడు. అబ్నేరు బెన్యామీనీయులతో ఆ విధంగా మాట్లాడిన తరువాత హెబ్రోనుకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికి, బెన్యామీనీయులందరి దృష్టికి ఏది అనుకూలమో దాన్ని దావీదుకు పూర్తిగా తెలియచేశాడు. అందుకోసం అబ్నేరు ఇరవైమందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరకి వచ్చాడు. దావీదు అబ్నేరుకు, అతని మనుషులకు విందు చేయించాడు. అప్పుడు అబ్నేరు “నేను వెళ్లి ఇశ్రాయేలు వారినందరినీ నా రాజు అయిన నీ సమక్షంలో సమకూర్చి, వారు నీతో ఒప్పందం చేసేలా, నీ చిత్త ప్రకారంగా నువ్వు రాజ్యాధికారం చేపట్టి నువ్వు కోరుకున్నదాని అంతటినీ పాలించేలా చేస్తాను” అని దావీదుతో చెప్పి అతని దగ్గర అనుమతి తీసుకుని శాంతికరంగా వెళ్లిపోయాడు.

2 సమూయేలు 3:1-21 పవిత్ర బైబిల్ (TERV)

సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి మధ్య దీర్ఘకాలిక యుద్ధం కొనసాగింది. దావీదు రాను రాను బాగా బలపడ్డాడు. సౌలు కుటుంబం నానాటికీ బలహీనమయింది. హెబ్రోనులో దావీదుకు పుత్ర సంతానం కలిగింది. మొదటి కుమారుడు అమ్నోను. అమ్నోను తల్లి యెజ్రె యేలీయురాలగు అహీనోయము. రెండవ కుమారుడు కిల్యాబు. కిల్యాబు తల్లి అబీగయీలు. ఈమె కర్మెలీయుడగు నాబాలు భార్యయైన విధవరాలు. మూడవ కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము తల్లి గెషూరు రాజైన తల్మయి కుమార్తె మయకా. నాల్గవ కుమారుడు అదోనీయా. అదోనీయా తల్లి హగ్గీతు. ఐదవ కుమారుడు షెఫట్య. షెఫట్య తల్లి అబీటలు. ఆరవ కుమారుడు ఇత్రెయాము. ఇత్రెయాము తల్లి దావీదు భార్యయగు ఎగ్లా. ఈ ఆరుగురు కుమారులు హెబ్రోనులో దావీదుకు కలిగారు. సౌలు కుటుంబానికి, దావీదు కుటుంబానికి యుద్ధం జరిగిన కాలంలో అబ్నేరు సౌలు సైన్యంలో బలాన్ని పుంజుకున్నాడు. సౌలుకు రిస్పా అనే ఒక దాసి వుండేది. ఆమె సౌలుకు ఇంచుమించు భార్యవలె వుండేది. రిస్పా అయ్యా అనువాని కుమార్తె. ఇష్బోషెతు ఒకనాడు అబ్నేరును పిలిచి, “నా తండ్రి పనిగత్తెతో నీవు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకున్నావు?” అని అడిగాడు. ఇష్బోషెతు అన్న మాటకు అబ్నేరుకు ఎక్కడా లేని కోపం వచ్చింది. అబ్నేరు ఇలా అన్నాడు, “నేను సౌలుకు, అతని కుటుంబానికి చాలా విధేయుడనై వున్నాను! నేను నిన్ను దావీదుకు అప్పగించలేదు; (పైగా అతడు నిన్ను ఓడించేలా చేయనూ లేదు.) యూదావారి తరపున పనిచేస్తూ ఒక రాజద్రోహిగా నేను ఎన్నడూ మెలగలేదు. కాని నీవిప్పుడు నేనొక నీచకార్యం చేసినట్లు మాట్లాడుతున్నావు! నేనిప్పుడు నిశ్చియంగా చెబుతున్నాను. దేవుడు చెప్పిన విషయాలు ఇప్పుడు జరిగేలా నేను తప్పక ప్రయత్నం చేస్తాను! సౌలు వంశంనుండి రాజ్యాన్ని తీసుకొని దావీదుకు ఇస్తానని యోహోవా చెప్పాడు. దావీదును యూదా రాజ్యానికి, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేస్తాడు. దాను నుండి బెయేర్షబా వరకు దావీదు పరిపాలిస్తాడు! ఈ పనులన్నీ నెరవేరేలా నేను సహాయ పడకపోతే దేవుడు నన్ను శిక్షించుగాక!” ఇష్బోషెతు అబ్నేరుతో ఇంకేమీ చెప్పలేక పోయాడు. ఇష్బోషెతు అతనంటే విపరీతంగా భయపడిపోయాడు. అబ్నేరు దావీదు వద్దకు దూతలను పంపాడు. అబ్నేరు తన మాటగా ఇలా చెప్పమన్నాడు: “నీవు ఈ రాజ్యాన్ని ఏలు. నాతో ఒక ఒడంబడిక చేసుకో. నీవు ఇశ్రాయేలంతటికీ రాజయ్యేలా నేను నీకు సహాయపడతాను.” అందుకు దావీదు, “మంచిది! నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుంటాను. కాని నిన్నొకటి అడుగుతాను; నీవు సౌలు కుమార్తె మీకాలును తీసుకొని వచ్చేవరకు నేను నిన్ను కలవను” అని చెప్పమన్నాడు. సౌలు కుమారుడు ఇష్బోషెతు వద్దకు దావీదు దూతలను పంపాడు. “నా భార్య మీకాలును తిరిగి నాకు తెచ్చి ఇవ్వు. ఆమె నాకు ప్రధానం చేయబడింది. ఆమెను వివాహమాడటానికి నేను వందమంది ఫిలిష్తియులను చంపియున్నాను” అని చెప్పి పంపాడు. లాయీషు కుమారుడైన పల్తీయేలు అనే వాని నుండి మీకాలును తీసుకొని రమ్మని సౌలు కుమారుడు ఇష్బోషెతు తన మనుష్యులను పంపాడు. మీకాలు భర్త పల్తీయేలు మీకాలుతో కూడా వచ్చాడు. మీకాలును అనుసరించి పల్తీయేలు బహూరీము వరకు ఏడుస్తూవచ్చాడు. కాని అబ్నేరు పల్తీయేలుతో, “ఇంటికి తిరిగి పొమ్మని” చెప్పాడు. అప్పుడు పల్తీయేలు ఇంటికి వెళ్లి పోయాడు. అబ్నేరు ఇశ్రాయేలు నాయకులకు యిలా వర్తమానం పంపించాడు: “మీరు దావీదును మీ రాజుగా చేసుకోవాలని చాలా కాలంగా కోరుకుంటూ వున్నారు. ఆ పని ఇప్పుడు చేయండి! ‘ఇశ్రాయేలీయులైన నా ప్రజలందరినీ ఫిలిష్తీయుల నుండి, వారి తదితర శత్రువుల నుండి రక్షిస్తాననీ; ఈ పని నా సేవకుడైన దావీదు ద్వారా నెరవేరుస్తాననీ’ యెహోవా పలికినప్పుడు ఆయన ఈ దావీదును గురించే చెప్పాడు.” అబ్నేరు ఈ విషయాలన్నీ దావీదుతో హెబ్రోనులో చెప్పాడు. ఈ విషయాలు బెన్యామీనీయులందరికీ కూడ చెప్పాడు. అబ్నేరు చెప్పిన విషయాలు బెన్యామీను వంశంవారికీ, ఇశ్రాయేలీయుందరికీ మంచివిగా తోచాయి. అప్పుడు అబ్నేరు హెబ్రోనులో దావీదు వద్దకు వచ్చాడు. అబ్నేరు అతనితో ఇరువది మంది మనుష్యులను తీసుకొని వచ్చాడు. అబ్నేరుకు, అతనితో వచ్చిన మనుష్యులకు దావీదు విందు ఇచ్చాడు. అబ్నేరు దావీదుతో ఇలా అన్నాడు, “ప్రభువైన నా రాజా! నేను ఇశ్రాయేలీయులందరినీ నీ వద్దకు తీసుకొని వస్తాను. అప్పుడు వారంతా నీతో ఒక ఒడంబడిక చేసుకొంటారు. తరువాత నీకు నచ్చిన విధంగా ఇశ్రాయేలును పరిపాలించవచ్చు!” తరువాత దావీదు అబ్నేరును వెళ్లమని చెప్పగా, అబ్నేరు ప్రశాంతంగా వెళ్లిపోయాడు.

2 సమూయేలు 3:1-21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను. కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను. నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను. ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను. అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెను–నా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని–నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదావారిమీదను నేను స్థిరపరచెదననెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి –ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీతట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు– మంచిది; నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు–నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి –దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకుమునుపు కోరితిరి గదా –నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను. అందునిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందుచేయించెను. అంతట అబ్నేరు–నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.