2 సమూయేలు 3:1-21

2 సమూయేలు 3:1-21 TELUBSI

సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంత కంతకు ప్రబలెను; సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులెవరనగా, అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు యెజ్రెయేలీయు రాలగు అహీనోయమువలన పుట్టెను. కిల్యాబు అను రెండవవాడు కర్మెలీయుడగు నాబాలు భార్యయైన అబీగ యీలు వలన పుట్టెను. మూడవవాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెయగు మయకావలన పుట్టెను. నాలుగవవాడగు అదోనీయా హగ్గీతువలన పుట్టెను. అయిదవవాడగు షెఫట్య అబీటలువలన పుట్టెను. ఆరవవాడగు ఇత్రెయాము దావీదునకు భార్యయగు ఎగ్లావలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబికులకును దావీదు కుటుంబికులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబికులకు బహు సహాయముచేసెను. అయ్యా కుమార్తెయైన రిస్పా యను ఒక ఉపపత్ని సౌలుకుండెను–నా తండ్రికి ఉప పత్నియగు దానిని నీ వెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడుగగా అబ్నేరును ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని–నిన్ను దావీదు చేతి కప్పగింపక నీ తండ్రియైన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారము చేసిన నన్ను యూదావారికి చేరిన కుక్కతో సమానునిగాచేసి యీ దినమున ఒక స్త్రీనిబట్టి నామీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతనిపక్షమున నేను నెరవేర్చని యెడల దేవుడు నాకు గొప్పఅపాయము కలుగజేయును గాక; సౌలు ఇంటివారి వశము కాకుండ రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబావరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలువారిమీదను యూదావారిమీదను నేను స్థిరపరచెదననెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి యిక ఏ మాటయు పలుకలేక పోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి –ఈ దేశము ఎవరిది? నీవు నాతో నిబంధనచేసినయెడల నేను నీకు సహాయము చేసి, ఇశ్రాయేలు వారినందరిని నీతట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా దావీదు– మంచిది; నేను నీతో నిబంధన చేసెదను. అయితే నీవు ఒకపని చేయవలెను; నా దర్శనమునకు వచ్చునప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను; లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి–ఫిలిష్తీయులలో నూరుమంది ముందోళ్లను తెచ్చి నేను పెండ్లి చేసికొనిన మీకాలును నాకప్పగింపుమని చెప్పుడనగా ఇష్బోషెతు దూతను పంపి, లాయీషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటియొద్దనుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీమువరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు–నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్లిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి –దావీదు మిమ్మును ఏలవలెనని మీరు ఇంతకుమునుపు కోరితిరి గదా –నా సేవకుడైన దావీదుచేత నా జనులగు ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల చేతిలోనుండియు, వారి శత్రువులందరి చేతిలోనుండియు విమోచించెదనని యెహోవా దావీదునుగూర్చి సెలవిచ్చియున్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో ఆలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలువారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను. అందునిమిత్తమై అబ్నేరు ఇరువదిమందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతనివారికిని విందుచేయించెను. అంతట అబ్నేరు–నేను పోయి ఇశ్రాయేలువారినందరిని నా యేలినవాడవగు నీ పక్షమున సమకూర్చి, వారు నీతో నిబంధనచేయునట్లును, నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరినదాని అంతటిమీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదునొద్ద సెలవుపుచ్చుకొని సమాధానముగా వెళ్లిపోయెను.