2 సమూయేలు 24:1-10

2 సమూయేలు 24:1-10 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఇంకొకమారు యెహోవా కోపము ఇశ్రాయేలీయులమీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణచేసి–నీవు పోయి ఇశ్రాయేలువారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతియైన యోవాబును పిలిచి–జనసంఖ్య యెంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బెయేర్షెబావరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారముచేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు–జనుల సంఖ్య యెంత యున్నను నా యేలినవాడవును రాజవునగు నీవు బ్రదికి యుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక; నా యేలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెననెను. అయినను రాజు యోవా బునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుటచేత యోవాబును సైన్యాధిపతులును ఇశ్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజుసముఖమునుండి బయలువెళ్లి యొర్దాను నది దాటి యాజేరుతట్టున గాదు లోయ మధ్యనుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడనుండి గిలాదునకును తహ్తింహోద్షీ దేశమునకును వచ్చిరి; తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి. అక్కడనుండి బురుజులుగల తూరు పట్టణమునకును హివ్వీయులయొక్కయు కనానీయులయొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణదిక్కుననున్న బెయేర్షెబావరకు సంచరించిరి. ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిదినెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను; ఇశ్రాయేలువారిలో కత్తి దూయగల యెనిమిది లక్షలమంది యోధులుండిరి; యూదా వారిలో అయిదు లక్షలమంది యుండిరి. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు–నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాని చేసితిని; యెహోవా, కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవిచేయగా

షేర్ చేయి
Read 2 సమూయేలు 24

2 సమూయేలు 24:1-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

యెహోవా కోపం మళ్ళీ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన వారికి వ్యతిరేకంగా దావీదును ప్రేరేపించాడు. “వెళ్లి ఇశ్రాయేలువారి, యూదావారి, జనాభా లెక్కలు తీసుకో” అని అదేశించాడు. అప్పుడు రాజు తనతో ఉన్న సైన్యాధిపతి యోవాబుకు “యుద్దానికి పోగల మనుషులు ఎంత మంది ఉన్నారో నాకు తెలియాలి. దాను మొదలు బెయేర్షెబా దాకా తిరిగిచూసి, ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్న వారిని లెక్కించు” అని ఆజ్ఞాపించాడు. అందుకు యోవాబు “నా ప్రభువు, రాజు అయిన నువ్వు చూస్తుండగానే యెహోవా ఈ జనాభాను నూరంతలు ఎక్కువ చేయు గాక. నా ప్రభువు, రాజు అయిన నీకు ఇలా చేయాలని ఎందుకు అనిపించింది?” అన్నాడు. అయినప్పటికీ రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞ తిరుగులేనిది గనక యోవాబు, సైన్యాధిపతులు ఇశ్రాయేలీయుల జన సంఖ్య చూడడానికి రాజు సముఖం నుండి బయలు దేరారు. వారు యొర్దాను నది దాటి లోయలో ఉన్న పట్టణానికి దక్షిణంగా అరోయేరు దగ్గర మకాం వేశారు. ఆపైన వారు గాదు ప్రాంతం గుండా యాజేరు చేరుకున్నారు. అక్కడ నుండి గిలాదుకు, తహ్తింహోద్షీ ప్రాంతానికి వచ్చారు. తరువాత దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు. అక్కడ నుండి కోటలు ఉన్న తూరు పట్టణానికీ, హివ్వీయుల, కనానీయుల పట్టణాలకూ చేరుకున్నారు. యూదా దేశానికి దక్షిణ దిక్కున ఉన్న బెయేర్షెబా వరకూ సంచరించారు. ఈ విధంగా వారు దేశమంతా సంచరించి తొమ్మిది నెలల ఇరవై రోజులకు తిరిగి యెరూషలేము చేరారు. అప్పుడు యోవాబు యుద్ధం చేయగల వారి మొత్తం లెక్క రాజుకు తెలియపరిచాడు. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయగల 8 లక్షలమంది యోధులు ఉన్నారు. యూదావారిలో 5 లక్షలమంది ఉన్నారు. జనసంఖ్య చూసినందుకు దావీదు మనస్సు నొచ్చుకుంది. అతడు యెహోవాతో “నేను చేసిన పని వలన గొప్ప పాపం మూటగట్టుకున్నాను. ఇలా చేయడం చాలా పెద్ద పాపం. యెహోవా, నేను చాలా తెలివి తక్కువ పని చేశాను. దయచేసి నీ దాసుడి దోషం తీసివెయ్యి” అన్నాడు.

షేర్ చేయి
Read 2 సమూయేలు 24

2 సమూయేలు 24:1-10 పవిత్ర బైబిల్ (TERV)

యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు. దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు. కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?” రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు. వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది) వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు. వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు. ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు. జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు. జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”

షేర్ చేయి
Read 2 సమూయేలు 24

2 సమూయేలు 24:1-10 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

యెహోవాకు మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల మీద కోపం రాగా ఆయన, “వెళ్లి ఇశ్రాయేలువారి యూదావారి జనాభాను లెక్కించు” అని దావీదును వారికి వ్యతిరేకంగా రెచ్చగొట్టారు. కాబట్టి రాజు యోవాబును, అతనితో ఉన్న సైన్యాధిపతులను పిలిచి, “యుద్ధానికి వెళ్లగలిగిన వారి సంఖ్య నాకు తెలిసేలా దాను నుండి బెయేర్షేబ వరకు ఇశ్రాయేలు గోత్రాలన్నిటి దగ్గరకు వెళ్లి జనాభా లెక్క తీసుకురండి” అని చెప్పాడు. కాని యోవాబు రాజుతో, “మీ దేవుడైన యెహోవా సైన్యాన్ని వందరెట్లు ఎక్కువ చేయడం నా ప్రభువైన రాజా మీరే చూస్తారు. కానీ నా ప్రభువు రాజు అలాంటి పని ఎందుకు చేయాలనుకుంటున్నాడు?” అని అన్నాడు. అయితే రాజు యోవాబుకు సైన్యాధిపతులకు ఇచ్చిన ఆజ్ఞకు తిరుగులేదు కాబట్టి వారు రాజు ఎదుట నుండి ఇశ్రాయేలీయుల జనాభా లెక్కించడానికి బయలుదేరి వెళ్లారు. యొర్దాను దాటి గాదు లోయ పట్టణానికి దక్షిణంగా అరోయేరులో శిబిరం ఏర్పరచుకున్నారు. అక్కడినుండి గాదు ప్రాంతం గుండా యాజెరుకు వెళ్లారు. అక్కడినుండి గిలాదు, తహ్తీము హొద్షీ ప్రాంతానికి వచ్చి దానాయాను మీదుగా సీదోనుకు వచ్చారు. అక్కడినుండి కోటలున్న తూరు పట్టణానికి హివ్వీయుల, కనానీయుల పట్టణాలన్నిటికి వచ్చారు. చివరిగా యూదా దేశానికి దక్షిణాన ఉన్న బెయేర్షేబ వరకు వచ్చారు. ఇలా వారు దేశమంతా తిరిగి తొమ్మిది నెలల ఇరవై రోజులకు యెరూషలేముకు చేరుకున్నారు. యోవాబు యుద్ధం చేయగలవారి సంఖ్య రాజుకు తెలియజేశాడు. ఇశ్రాయేలులో కత్తి తిప్పగలవారు ఎనిమిది లక్షలమంది ఉన్నారు, యూదా వారిలో అయిదు లక్షలమంది ఉన్నారు. సైన్యాన్ని లెక్కించిన తర్వాత దావీదు తప్పు చేశానని మనస్సాక్షి గద్దింపు పొంది, అతడు యెహోవాకు, “నేను ఈ పని చేసి ఘోరపాపం చేశాను. యెహోవా, మీ సేవకుని దోషాన్ని తొలగించమని బ్రతిమాలుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను” అని ప్రార్థన చేశాడు.

షేర్ చేయి
Read 2 సమూయేలు 24