2 సమూయేలు 24:1-10

2 సమూయేలు 24:1-10 TERV

యెహోవా మరోసారి ఇశ్రాయేలీయుల పట్ల కోపం చెందాడు. యెహోవా దావీదును ఇశ్రాయేలీయులకు వ్యతిరేకమయ్యేలా చేశాడు. యెహోవా దావీదుతో, “వెళ్లు, ఇశ్రాయేలు వారిని, యూదా వారిని లెక్కించు” అని అన్నాడు. దావీదు రాజు సైన్యాధక్షుడైన యోవాబును పిలిచి, “దాను నుండి బెయేర్షెబా వరకు తిరిగి ఇశ్రాయేలీయుల వంశాల వారందరినీ లెక్కించు. దానివల్ల వారెంత మంది వున్నారో నాకు తెలుస్తుంది,” అని అన్నాడు. కాని యోవాబు రాజైన దావీదుతో ఇలా అన్నాడు, “ఇప్పటి జనాభా ఎంతైనా వుండనీ; నీ ప్రభువైన దేవుడు అంతకు వంద రెట్లు ప్రజలను నీకు యిచ్చుగాక! ఇది జరుగగా నీవు చూడాలని కాంక్షిస్తున్నాను. అయినా ఈ పని నీవెందుకు తల పెట్టావు?” రాజు అది విని యోవాబును, సైన్యాధికారులను జనాభా లెక్కలు తీయమని తీవ్రంగా ఆజ్ఞాపించాడు. దానితో యోవాబు, సైన్యాధికారులు ఇశ్రాయేలులో జనాభా లెక్కలు తీయటానికి రాజును విడిచి వెళ్లారు. వారు యోర్దాను నదిదాటారు. అరోయేరు వద్ద గుడారాలు వేశారు. వారి గుడారాలు లోయలోని నగరానికి కుడిప్రక్కగా వున్నవి. (నగరం గాదులోయ మధ్యలో వుంది. యాజేరుకు వెళ్లే మార్గంలోనే నగరంవుంది) వారు గిలాదుకు, తహ్తింహోద్షీ దేశానికి వెళ్లారు. వారింకా దానాయానుకు, సీదోను ప్రాంతానికి వెళ్లారు. వారు తూరు కోటను, మరియు హివ్వీయుల, కనానీయుల యొక్క నగరాలను దర్శించారు. వారు యూదా దేశపు దక్షిణ ప్రాంతాన గల బెయేర్షెబా చేరారు. ఇలా దేశమంతా వారు తొమ్మిది నెలల, ఇరువది రోజుల పాటు తిరిగి చివరికి యెరూషలేముకు వచ్చారు. జనాభా పట్టికను యోవాబు రాజుకు సమర్పించాడు. ఇశ్రాయేలులో కత్తి పట్టగల జనం ఎనిమిది లక్షలవరకు వున్నారు. యూదాలో ఐదులక్షల మంది వున్నారు. జనాభా లెక్కలు చూసినందుకు దావీదు సిగ్గుపడ్డాడు. దావీదు యెహోవాకి ఇలా విన్నవించుకున్నాడు, “నేను చేసిన ఈ పనివల్ల నేను చాలా పాపం మూటగట్టుకున్నాను. ప్రభూవా, నా పాపాన్ని క్షమించమని వేడుకుంటున్నాను. నేను చాలా మూర్ఖంగా ప్రవర్తించాను.”

Read 2 సమూయేలు 24

2 సమూయేలు 24:1-10 కోసం వీడియో