2 సమూయేలు 19:1-7
2 సమూయేలు 19:1-7 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
రాజు తన కొడుకు గురించి విలపిస్తూ, విచారంగా ఉన్నాడన్న సంగతి ప్రజలందరికీ తెలిసింది. ఆనాటి విజయం ప్రజలందరి దుఃఖానికి కారణమయ్యింది. యుద్ధ సమయంలో భయపడి పారిపోయిన ప్రజలు దొంగలవలె తిరిగి పట్టణంలో ప్రవేశించారు. రాజు తన ముఖం కప్పుకుని “అబ్షాలోమా నా బిడ్డా, అబ్షాలోమా నా బిడ్డా” అంటూ కేకలువేస్తూ ఏడుస్తున్నాడని, అబ్షాలోమును గూర్చి విలపిస్తున్నాడన్న విషయం యోవాబు విన్నాడు. అతడు ఉన్న నగరంలోని భవనానికి వచ్చాడు. “నీ ప్రాణాన్ని, నీ కొడుకుల, కూతుళ్ళ ప్రాణాలను, నీ భార్యల, నీ ఉపపత్నుల ప్రాణాలను రక్షించిన నీ సేవకులనందరినీ నువ్వు సిగ్గుపరుస్తున్నావు. నీ సన్నిహితులను, అభిమానులను ద్వేషిస్తూ, నీ శత్రువులపై ప్రేమ చూపిస్తున్నావు. ఈనాడు నీ రాజ్య అధిపతులు, సేవకులు నీకు ఇష్టమైనవారు కారని చెబుతున్నావు. మేమంతా చనిపోయి అబ్షాలోము మాత్రం జీవించి ఉన్నట్టయితే అది నీకు సంతోషం కలిగించేది అని నేను గ్రహిస్తున్నాను. వెంటనే లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచు. నువ్వు గనుక ఇప్పుడు బయటికి రాకపోతే ఈ రాత్రి ఒక్కడు కూడా నీ దగ్గర ఉండడని యెహోవా పేరట ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీ చిన్నప్పటినుండి ఇప్పటివరకూ నీకు కలిగిన కీడులన్నిటికంటే అది నీకు మరీ కష్టంగా ఉంటుంది” అని రాజుతో చెప్పినప్పుడు రాజు లేచి బయటకు వచ్చి గుమ్మంలో కూర్చున్నాడు.
2 సమూయేలు 19:1-7 పవిత్ర బైబిల్ (TERV)
ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు. ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు. యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను – అందరినీ కాపాడారు. నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవనుభవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది.”
2 సమూయేలు 19:1-7 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని, యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి; నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని–అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా, రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చి–నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడల ప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము. నీవు బయటికి రాకయుండినయెడల ఈ రాత్రి యొకడును నీయొద్ద నిలువడని యెహోవా నామమునుబట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను; నీ బాల్యమునుండి నేటివరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటె అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవిచేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను.
2 సమూయేలు 19:1-7 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“రాజు అబ్షాలోము గురించి ఏడుస్తూ దుఃఖిస్తున్నాడు” అని ఎవరో యోవాబుకు చెప్పారు. “రాజు తన కుమారుని గురించి దుఃఖిస్తున్నాడు” అని సైనికులు విన్నారు కాబట్టి ఆ రోజు విజయం సైన్యమంతటికి దుఃఖంగా మారింది. యుద్ధం నుండి పారిపోయినందుకు సిగ్గుపడుతున్న సైనికులు ఆ రోజు దొంగల్లా పట్టణంలోకి ప్రవేశించారు. రాజు ముఖం కప్పుకుని, “నా కుమారుడా అబ్షాలోమా! అబ్షాలోమా నా కుమారుడా! నా కుమారుడా!” అని గట్టిగా ఏడ్చాడు. యోవాబు రాజభవనానికి వెళ్లి, “ఈ రోజు మీరు మీ ప్రాణాలను మీ కుమారుల కుమార్తెల ప్రాణాలను మీ భార్యల, ఉంపుడుగత్తెల ప్రాణాలను రక్షించిన మీ సైన్యమంతటిని అవమానపరిచారు. మిమ్మల్ని ద్వేషించేవారిని ప్రేమిస్తూ మిమ్మల్ని ప్రేమించేవారిని ద్వేషిస్తున్నారు. మీ సేనాధిపతులు వారి సైన్యం మీకు ముఖ్యం కాదని ఈ రోజు మీరు స్పష్టం చేశారు. మేమందరం చనిపోయి అబ్షాలోము ఒక్కడే బ్రతికి ఉంటే మీ దృష్టికి సరియైనదిగా ఉండేది, మీరు సంతోషించేవారని నాకర్థమయ్యింది. ఇప్పుడు మీరు లేచి బయటకు వచ్చి మీ సైన్యాన్ని ప్రోత్సహించండి. మీరు ఇప్పుడు బయటకు రాకపోతే ఈ రాత్రి వారిలో ఒక్కడూ మీ దగ్గర ఉండరని యెహోవా పేరిట ఒట్టు పెట్టి చెప్తున్నాను. అది మీ చిన్నప్పటి నుండి ఇప్పటివరకు మీకు వచ్చిన కష్టాల కన్నా తీవ్రంగా ఉంటుంది” అని అన్నాడు.