2 సమూయేలు 19:1-7

2 సమూయేలు 19:1-7 TERV

ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు. ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు. యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను – అందరినీ కాపాడారు. నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవనుభవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది.”

Read 2 సమూయేలు 19