2 సమూయేలు 12:13-23
2 సమూయేలు 12:13-23 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు దావీదు “నేను పాపం చేశాను” అని నాతానుతో అన్నాడు. అప్పుడు నాతాను “నీ పాపాన్ని బట్టి నువ్వు చనిపోయేలా యెహోవా నిన్ను శిక్షించక పోవచ్చు. అయితే నువ్వు చేసిన ఈ పనివల్ల యెహోవాను దూషించడానికి ఆయన శత్రువులకు నువ్వు ఒక మంచి కారణం చూపించావు. కాబట్టి నీకు పుట్టబోయే పసికందు తప్పకుండా చనిపోతాడు” అని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాడు. యెహోవా ఊరియా భార్య దావీదుకు కన్నబిడ్డను మొత్తి జబ్బు పడేలా చేశాడు. దావీదు ఉపవాసం ఉండి లోపలికి వెళ్లి బిడ్డ కోసం దేవుణ్ణి బతిమిలాడుతూ రాత్రంతా నేల మీద పడి ఉన్నాడు. ఇంట్లో ప్రముఖులు అతణ్ణి నేలపై నుండి లేపడానికి ప్రయత్నించారు. కానీ దావీదు ఒప్పుకోలేదు, వారితో కలసి భోజనం చేయలేదు. ఏడవ రోజు బిడ్డ చనిపోయాడు. దావీదు సేవకులు “బిడ్డ బతికి ఉన్నపుడు అతనితో ఏమి చెప్పినా అతడు మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ చనిపోయాడని చెబితే తనకు తాను ఏదైనా హాని చేసుకొంటాడేమో” అనుకున్నారు. వారు బిడ్డ చనిపోయాడన్న సంగతి అతనితో చెప్పడానికి భయపడ్డారు. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవడం గమనించి బిడ్డ చనిపోయాడని అర్థం చేసుకున్నాడు. “బిడ్డ చనిపోయాడా?” అని తన సేవకులను అడిగాడు. వారు “చనిపోయాడు” అని జవాబిచ్చాడు. అప్పుడు దావీదు నేలపై నుండి లేచి స్నానంచేసి నూనె రాసుకుని వేరే బట్టలు ధరించాడు. యెహోవా మందిరంలో ప్రవేశించి దేవునికి మొక్కి, తన ఇంటికి తిరిగి వచ్చి భోజనం తీసుకురమ్మన్నాడు. వారు భోజనం తెచ్చి వడ్డించినప్పుడు అతడు భోజనం చేశాడు. అతని సేవకులు “బిడ్డ బతికి ఉన్నప్పుడు ఉపవాసంతో బిడ్డ కోసం ఏడుస్తూ ఉన్నావు, వాడు చనిపోయినప్పుడు లేచి భోజనం చేశావు. నువ్వు ఇలా చేయడంలో అర్థం ఏమిటి?” అని దావీదును అడిగారు. అప్పుడు దావీదు “బిడ్డ బతికి ఉన్నప్పుడు దేవుడు నన్ను కరుణించి బిడ్డను బతికిస్తాడన్న ఆశతో నేను ఉపవాసముండి ఏడుస్తూ వేడుకొన్నాను. ఇప్పుడు బిడ్డ చనిపోయాడు కనుక నేనెందుకు ఉపవాసముండాలి? బిడ్డను నేను తిరిగి రప్పించగలనా? నేనే వాడి దగ్గరకు వెళ్తాను గానీ వాడు నా దగ్గరికి మళ్ళీ రాడు కదా” అని వారితో చెప్పాడు.
2 సమూయేలు 12:13-23 పవిత్ర బైబిల్ (TERV)
నాతానుతో, “యెహోవా పట్ల నేను పాపం చేశాను” అని దావీదు చెప్పాడు. అప్పుడు నాతాను దావీదుతో ఇలా అన్నాడు, “యెహోవా నీకు పాపవిమోచనం చేశాడు. నీవు చంపబడవు. కాని నీవు చేసిన ఈ పాపకార్యంవల్ల శత్రువులు నీ యెహోవాని అసహ్యించుకునేలా చేశావు. అందువల్ల నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు.” పిమ్మట నాతాను ఇంటికి వెళ్లిపోయాడు. ఊరియాభార్య ద్వారా దావీదుకు పుట్టిన బిడ్డ తీవ్రంగా జబ్బు పడేలా యెహోవా చేశాడు. దావీదు బిడ్డ కొరకు దేవుని ప్రార్థించాడు. దావీదు తినటానికి, తాగటానికి నిరాకరించాడు. అతను తన ఇంట్లోకివెళ్లి లోపలే వుండి పోయాడు. రాత్రంతా నేలమీదే పడుకొని వుండిపోయాడు. దావీదు కుటుంబంలో ముఖ్యులైన వారు వచ్చి దావీదును నేలమీద నుండి లేపటానికి ప్రయత్నించారు. కాని దావీదు లేవ నిరాకరించాడు. వారితో కలిసి భోజనం చేయటానికి కూడ దావీదు నిరాకరించాడు. ఏడవ రోజున శిశువు మరణించింది. శిశువు మరణించిందని దావీదుతో చెప్పటానికి సేవకులు భయపడ్డారు. ఒకరితో ఒకరు వారిలా అనుకోసాగారు, “చూడండి, బిడ్డ బ్రతికివుండగా మనం అతనితో మాట్లాడాలని ప్రయత్నం చేశాము. కాని అతను మన మాట వినలేదు. ఇప్పుడు బిడ్డ మరణం గురించి మనం తెలియ జేస్తే, అతడు తన ప్రాణానికి ముప్పు వాటిల్లే ఏ పనికైనా పాల్పడవచ్చు!” కాని దావీదు తన సేవకులు గుసగుసలాడుకోవటం గమనించి, బిడ్డ మరణించి వుండవచ్చని ఊహించాడు. “బిడ్డ చనిపోయాడా?” అని దావీదు సేవకులను అడిగాడు. “అవును, చనిపోయాడు” అని సేవకులు అన్నారు. దావీదు నేలమీద నుంచి లేచాడు. కాళ్లు చేతులు కడుక్కొని, బట్టలు మార్చుకొని, యెహోవాని ప్రార్థించటానికి ఆలయానికి వెళ్లాడు. తరువాత ఇంటికి వెళ్లి, తినటానికి ఆహారాన్ని అడిగాడు. సేవకులు కొంత ఆహారాన్ని ఇవ్వగా, అతడు తిన్నాడు. దావీదు సేవకులు అతనితో ఇలా చెప్పారు, “నీవిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? బిడ్డ బ్రతికి వుండగా నీవు తినటానికి నిరాకరించావు. నీవు ఏడ్చావు. కాని బిడ్డ చనిపోగానే, లేచి భోజనం చేశావు.” అందుకు దావీదు ఇలా చెప్పాడు: “బిడ్డ బ్రతికివుండగా నేను తినలేదు. ఏడ్చాను. ఎందువల్లనంటే యెహోవా నన్ను కనికరించి బిడ్డను బ్రతికించవచ్చు! ఎవరికి తెలుసు! అనుకున్నాను. కాని ఇప్పుడు బిడ్డ చనిపోయాడు. కావున ఇప్పుడు నేనెందుకు తినటానికి నిరాకరించాలి? నేను బిడ్డను తిరిగి బతికించుకొనగలనా? లేదు! ఏదో ఒక రోజున నేనే వాని దగ్గరకు వెళతాను. అంతేగాని వాడు నా వద్దకు తిరిగి రాలేడు.”
2 సమూయేలు 12:13-23 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతాను–నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను. యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను. దావీదు ఉపవాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడియుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను. ఏడవదినమున బిడ్డ చావగా–బిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను. ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చని పోయెనను సంగతి గ్రహించి–బిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారు–చనిపోయెననిరి. అప్పుడు దావీదు నేలనుండి లేచి స్నానముచేసి తైలము పూసికొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి తన యింటికి తిరిగి వచ్చి భోజనము తెమ్మనగా వారు వడ్డించిరి; అప్పుడు అతడు భోజనము చేసెను. అతని సేవకులు–బిడ్డ జీవముతో ఉండగా ఉపవాసముండి దానికొరకు ఏడ్చుచుంటివిగాని అది మరణమైనప్పుడు లేచి భోజనముచేసితివి. నీవీలాగున చేయుట ఏమని దావీదు నడుగగా అతడు–బిడ్డ ప్రాణముతో ఉన్నప్పుడు దేవుడు నాయందు కనికరించి వాని బ్రదికించునేమో యనుకొని నేను ఉపవాసముండి యేడ్చు చుంటిని. ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉపవాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదునుగాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.
2 సమూయేలు 12:13-23 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు. కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు. తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది. దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు. అతని ఇంట్లోని పెద్దలు అతని ప్రక్కన నిలబడి నేలపై నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కాని అతడు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చేయలేదు. ఏడవ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సలహాదారులు, “బిడ్డ బ్రతికి ఉన్నప్పుడే అతడు మనం చెప్పిన ఏ మాట వినలేదు. బిడ్డ చనిపోయిన విషయం అతనికి ఎలా చెప్పగలం? చెప్తే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో” అనుకుని బిడ్డ చనిపోయిన విషయం అతనికి చెప్పడానికి భయపడ్డారు. తన సలహాదారులు తమలో తాము గుసగుసలాడుకోవడం దావీదు చూసి, బిడ్డ చనిపోయాడని గ్రహించి, “బిడ్డ చనిపోయాడా?” అని అడిగాడు. వారు, “అవును చనిపోయాడు” అని జవాబిచ్చారు. వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు. అతని సలహాదారులు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడ్చారు. కాని ఇప్పుడేమో ఆ బిడ్డ చనిపోయాక లేచి భోజనం చేస్తున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?” అని అతన్ని అడిగారు. అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.