2 సమూయేలు 12:13-23

2 సమూయేలు 12:13-23 OTSA

అప్పుడు దావీదు నాతానుతో, “నేను యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశాను” అన్నాడు. అందుకు నాతాను, “యెహోవా నీ పాపాన్ని తొలగించారు. నీవు చావవు. కానీ నీవు ఇలా చేయడం వల్ల యెహోవాను పూర్తిగా ధిక్కరించావు కాబట్టి, నీకు పుట్టిన కుమారుడు చనిపోతాడు” అని చెప్పాడు. తర్వాత నాతాను తన ఇంటికి వెళ్లిపోయాడు, యెహోవా ఊరియా భార్య ద్వార దావీదుకు పుట్టిన బిడ్డను మొత్తగా ఆ బిడ్డకు జబ్బుచేసింది. దావీదు బిడ్డ కోసం దేవున్ని వేడుకున్నాడు. అతడు ఉపవాసం ఉండి రాత్రులు గోనెపట్టలో నేలపై పడుకున్నాడు. అతని ఇంట్లోని పెద్దలు అతని ప్రక్కన నిలబడి నేలపై నుండి అతన్ని లేపడానికి ప్రయత్నించారు కాని అతడు ఒప్పుకోలేదు, వారితో కలిసి భోజనం చేయలేదు. ఏడవ రోజు ఆ బిడ్డ చనిపోయాడు. దావీదు సలహాదారులు, “బిడ్డ బ్రతికి ఉన్నప్పుడే అతడు మనం చెప్పిన ఏ మాట వినలేదు. బిడ్డ చనిపోయిన విషయం అతనికి ఎలా చెప్పగలం? చెప్తే తనకు తాను ఏదైనా హాని చేసుకుంటాడేమో” అనుకుని బిడ్డ చనిపోయిన విషయం అతనికి చెప్పడానికి భయపడ్డారు. తన సలహాదారులు తమలో తాము గుసగుసలాడుకోవడం దావీదు చూసి, బిడ్డ చనిపోయాడని గ్రహించి, “బిడ్డ చనిపోయాడా?” అని అడిగాడు. వారు, “అవును చనిపోయాడు” అని జవాబిచ్చారు. వెంటనే దావీదు నేలపై నుండి లేచి స్నానం చేసి నూనె రాసుకుని బట్టలు మార్చుకుని యెహోవా మందిరంలోనికి వెళ్లి ఆరాధించాడు. తర్వాత అతడు తన ఇంటికి తిరిగివచ్చి భోజనం తెమ్మని చెప్పాడు. వారు భోజనం వడ్డించగానే అతడు తిన్నాడు. అతని సలహాదారులు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు మీరు ఉపవాసముండి ఏడ్చారు. కాని ఇప్పుడేమో ఆ బిడ్డ చనిపోయాక లేచి భోజనం చేస్తున్నారు. మీరు ఎందుకిలా చేస్తున్నారు?” అని అతన్ని అడిగారు. అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను. ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయాడు. నేనెందుకు ఉపవాసముండాలి? నేను అతన్ని మళ్ళీ బ్రతికించగలనా? నేనే వాని దగ్గరకు వెళ్లాలి తప్ప, వాడు నా దగ్గరకు తిరిగి రాడు కదా!” అని జవాబిచ్చాడు.

Read 2 సమూయేలు 12