2 రాజులు 5:9-15

2 రాజులు 5:9-15 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలన్నిటితో వచ్చి ఎలీషా యింటి గుమ్మం ఎదుట నిలిచాడు. ఎలీషా ఒక వార్తాహరుడి చేత “నీవు వెళ్లి యొర్దాను నదిలో ఏడు మునకలు వెయ్యి. నీ శరీరం పూర్వస్థితికి వస్తుంది. నీవు పరిశుభ్రం అవుతావు” అని కబురు చేశాడు. నయమానుకు కోపం వచ్చింది. అక్కడ నుండి వెళ్ళిపోయాడు. “ఆ వ్యక్తి బయటకు వచ్చి నా దగ్గర నిలిచి తన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి నా వంటిపై కుష్టురోగం ఉన్న చోట తన చెయ్యి ఆడించి బాగు చేస్తాడనుకున్నాను. ఇశ్రాయేలులో ఉన్న నదులన్నిటి కంటే దమస్కులోని అమానా, ఫర్పరు నదులు మంచివి కాదా? నేను వాటిలో స్నానం చేసి శుద్ధి పొందలేనా?” అంటూ తీవ్ర కోపంతో అక్కడినుండి వెళ్ళిపోయాడు. అప్పుడు నయమాను సేవకులు అతని దగ్గరికి వచ్చి “అయ్యా, ఆ ప్రవక్త ఒకవేళ ఏదన్నా కష్టమైన పని చేయమంటే నీవు తప్పకుండా చేసే వాడివే కదా! దానికంటే ‘నీటిలో మునిగి బాగు పడు’ అని అతడు చెప్పడం ఇంకా మంచిదే కదా” అన్నారు. అప్పుడు అతడు దేవుని మనిషి ఆదేశం ప్రకారం వెళ్ళి యొర్దాను నదిలో ఏడు సార్లు మునిగి లేచాడు. దాంతో అతని శరీరం పూర్తి స్వస్థత పొంది చిన్నపిల్లవాడి శరీరంలా పూర్వ స్థితికి వచ్చింది. నయమాను అప్పుడు సపరివార సమేతంగా తిరిగి దేవుని మనిషి దగ్గరికి వచ్చాడు. అతని ఎదుట నిలబడి ఇలా అన్నాడు “చూడండి, ఇశ్రాయేలులో తప్ప భూమి మీద ఎక్కడా వేరే దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నీ సేవకుడిచ్చే కానుక మీరు తీసుకోవాలి.”

షేర్ చేయి
Read 2 రాజులు 5

2 రాజులు 5:9-15 పవిత్ర బైబిల్ (TERV)

ఈ కారణంగా నయమాను తన గుర్రాలతోను రథాలతోను ఎలీషా ఇంటికి వచ్చాడు. తలుపుకి వెలుపల నుంచున్నాడు. ఎలీషా ఒక దూతను నయమాను వద్దకు పంపాడు. ఆదూత, “వెళ్లి, ఏడు మారులు యోర్దాను నదిలో స్నానం చేయుము. అప్పుడు నీ చర్మం నయమవుతుంది. నీవు శుద్ధుడవు అవుతావు, శుభ్రపడతావు” అన్నాడు. నయమాను కోపపడి, వెళ్లిపోయాడు. అతను, “ఎలీషా కనీసం వెలుపలికి వచ్చి నా యెదుట నిలబడి తన దేవుడైన యెహోవాని పిలుస్తాడనుకున్నాను. నా ముందర చేయి ఆడించి మరి నా కుష్ఠువ్యాధి బాగుచేస్తాడని ఆశించాను. దమస్కు నదులైన అబానా, ఫర్పరులు ఇశ్రాయేలులోని అన్ని జలాల కంటె మంచివి. నేనెందుకు దమస్కులోని ఆ నదులలో స్నానం చేసి శుద్ధుణ్ని కాకూడదు!” అని అనుకొని నయమాను మహోగ్రుడయి కోపంతో వెళ్లిపోయాడు. కాని నయమాను సేవకులు అతనిని సమీపించి అతనితో మాట్లాడారు. వారు ఈ విధంగా అన్నారు: “తండ్రీ, ప్రవక్త మిమ్మల్ని ఒక కష్టమైన పని చెయ్యమని చెబితే, ఆ విధంగా చేయవా? అలాగే, నీతో సులభమైన పని చెప్పినా, అది కూడా పాటించాలి. అతను చెప్పిందేమనగా, కడుగుకొనుము, నీవు శుద్ధడవయ్యెదవు.” అందువల్ల దైవజనుడు ఎలీషా చెప్పినట్లుగా నయమాను ఆచరించాడు. నయమాను యోర్దాను నది లోపలికి వెళ్లి ఏడు సార్లు మునిగాడు. వెంటనే నయమాను శుద్ధుడయ్యాడు. నయమాను చర్మం పసిపిల్లవాని చర్మంవలె మృదువుగా వుంది. నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.

షేర్ చేయి
Read 2 రాజులు 5

2 రాజులు 5:9-15 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

నయమాను గుఱ్ఱములతోను రథముతోను వచ్చి ఎలీషా యింటి ద్వారము ముందర నిలిచియుండగా ఎలీషా–నీవు యొర్దానునదికి పోయి యేడు మారులు స్నానము చేయుము, నీ ఒళ్లు మరల బాగై నీవు శుద్ధుడవగుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను–అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమునుబట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలముమీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని. దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలుదేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి–నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో ఏడు మారులుమునుగగా అతని దేహము పసిపిల్ల దేహమువలెనై అతడు శుద్ధుడాయెను. అప్పుడతడు తన పరివారముతోకూడ దైవజనునిదగ్గరకు తిరిగివచ్చి అతని ముందర నిలిచి–చిత్తగించుము; ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటియందును మరియొక దేవుడు లేడని నేను ఎరుగుదును; ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానము తీసికొనవలసినదని అతనితో చెప్పగా

షేర్ చేయి
Read 2 రాజులు 5

2 రాజులు 5:9-15 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

కాబట్టి నయమాను తన గుర్రాలతో, రథాలతో వెళ్లి ఎలీషా ఇంటి గుమ్మం దగ్గర ఆగాడు. ఎలీషా, “నీవు వెళ్లి, యొర్దానులో ఏడుసార్లు స్నానం చేయి; అప్పుడు నీ శరీరం మామూలుగా మారి నీవు శుద్ధుడవవుతావు” అని అతనికి చెప్పమని ఒక దూతను పంపాడు. అయితే నయమాను కోపంతో వెళ్లి, “అతడు తప్పకుండా నా కోసం బయటకు వచ్చి, నిలబడి, అతని దేవుడైన యెహోవా పేరిట ప్రార్థనచేసి, తన చేయి రోగం ఉన్నచోట అల్లాడించి కుష్ఠును నయం చేస్తాడనుకున్నాను. ఇశ్రాయేలు నీళ్ల కంటే దమస్కులో ఉన్న అబానా, ఫర్పరు నదుల నీళ్లు మంచివి కావా? నేను వాటిలో కడుక్కుని పవిత్రపరచబడనా?” అని అంటూ ఆగ్రహంతో వెనుకకు తిరిగి వెళ్లాడు. నయమాను సేవకులు అతని దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, ఒకవేళ ఆ ప్రవక్త మిమ్మల్ని ఏదైనా గొప్ప పని చేయమని చెప్తే మీరు చేయకుండా ఉంటారా? ‘స్నానం చేసి పవిత్రపరచబడండి!’ అన్నమాట దానికంటే ఇంకా మంచిది కదా!” అని అన్నాడు. కాబట్టి అతడు వెళ్లి దైవజనుడు చెప్పినట్లు యొర్దానులో ఏడుసార్లు మునిగాడు, వెంటనే అతని శరీరం శుద్ధి చేయబడి, పసివాడి దేహంలా మారింది. అప్పుడు నయమాను, అతని సేవకులందరు దైవజనుని దగ్గరకు తిరిగి వెళ్లారు. నయమాను అతని ఎదుట నిలబడి, “ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకంలో మరో దేవుడు లేడని ఇప్పుడు నేను తెలుసుకున్నాను. కాబట్టి దయచేసి మీ దాసుడనైన నేను ఇచ్చే ఈ కానుక అంగీకరించండి.”

షేర్ చేయి
Read 2 రాజులు 5