2 రాజులు 19:1-37

2 రాజులు 19:1-37 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

వాళ్ళ నివేదిక హిజ్కియా విన్నప్పుడు, తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరానికి వెళ్ళాడు. గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమునూ, శాస్త్రి షెబ్నానూ, యాజకుల్లో పెద్దలనూ, ప్రవక్త అయిన ఆమోజు కొడుకు యెషయా దగ్గరికి పంపాడు. వీళ్ళు గోనెపట్ట కట్టుకుని అతని దగ్గరికి వచ్చి అతనితో “హిజ్కియా చెప్పేదేమంటే, ఇది కష్టం, శిక్ష, దూషణల దినం. పిల్లలు పుట్టే సమయం వచ్చింది, కాని కనడానికి శక్తి లేదు. జీవం కలిగిన దేవుణ్ణి దూషించడానికి అష్షూరు రాజైన తన యజమాని పంపిన రబ్షాకే పలికిన మాటలన్నీ నీ దేవుడైన యెహోవా ఒకవేళ విని, నీ దేవుడైన యెహోవా విన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరురాజును గద్దించొచ్చు. కాబట్టి ఇక్కడ మిగిలి ఉన్న వాళ్ళ కోసం నీవు ప్రార్థన చెయ్యి.” రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరికి వచ్చినప్పుడు, యెషయా వాళ్ళతో “మీ యజమానికి ఈ మాట తెలియజేయండి. యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు పనివారు నన్ను దూషిస్తూ పలికిన ఆ మాటలు నీవు విని భయపడొద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టిస్తాను. అతడు అ వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు. అతని దేశంలో అతన్ని కత్తితో చంపుతారు” అన్నాడు. అష్షూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు, రబ్షాకే వెళ్లి అతన్ని కలుసుకున్నాడు. అప్పుడు, కూషురాజు తిర్హాకా తన మీద యుద్ధం చెయ్యడానికి వచ్చాడని అష్షూరు రాజు విన్నాడు. అతడు ఇంకొకసారి హిజ్కియా దగ్గరికి వార్తాహరులను పంపాడు. “యూదారాజు హిజ్కియాతో ఈ విధంగా చెప్పండి. యెరూషలేము అష్షూరురాజు చేతికి చిక్కదు అని చెప్పి నీవు నమ్ముకొన్న నీ దేవుడి వల్ల మోసపోవద్దు. చూడు, అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీకు వినబడింది గదా, నీవు మాత్రం తప్పించుకోగలవా? నా పూర్వికులు నాశనం చేసిన గోజాను, హారాను, రెజెపు ప్రజలు గానీ, తెలశ్శారులో ఉన్న ఏదెనీయులు గానీ, తమ దేవుళ్ళ సాయం వల్ల తప్పించుకున్నారా? హమాతు రాజు ఏమయ్యాడు? అర్పాదు, సెపర్వియీము, హేన, ఇవ్వా అనే పట్టణాల రాజులు ఏమయ్యారు?” అని వార్త పంపాడు. హిజ్కియా వార్తాహరుల చేతిలోనుంచి ఆ ఉత్తరం తీసుకుని చదివి, యెహోవా మందిరంలోకి వెళ్లి, యెహోవా సన్నిధిలో దాన్ని విప్పి పరిచి, యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తూ “యెహోవా, కెరూబుల మధ్య నివాసం ఉన్న ఇశ్రాయేలీయుల దేవా, భూమినీ ఆకాశాన్ని సృష్టించిన అద్వితీయ దేవా, నీవు లోకంలో ఉన్న అన్ని రాజ్యాలకూ దేవుడవు. యెహోవా, ఆలకించు. యెహోవా, కళ్ళు తెరచి చూడు. సజీవ దేవుడివైన నిన్ను దూషించడానికి సన్హెరీబు పంపినవాడి మాటలు ఆలకించు. యెహోవా, అష్షూరురాజులు ఆ ప్రజలను, వాళ్ళ దేశాలను పాడు చేసి వాళ్ళ దేవుళ్ళను అగ్నిలో వేసిన మాట నిజమే. ఆ రాజ్యాల దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు. అవి మనుషుల చేసిన కర్రలు, రాళ్లే. కాబట్టి వారు వాటిని నాశనం చేశారు. యెహోవా మా దేవా, లోకంలో ఉన్న మనుషులందరూ నువ్వే నిజంగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకునేలా అతని చేతిలోనుంచి మమ్మల్ని రక్షించు” అన్నాడు. అప్పుడు ఆమోజు కొడుకు యెషయా హిజ్కియా దగ్గరికి వార్త పంపుతూ “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పేదేమంటే, అష్షూరురాజు సన్హెరీబు విషయంలో నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించాను. అతని గురించి యెహోవా చెప్పేదేమంటే, సీయోను కుమారి కన్యక నిన్ను తిరస్కరిస్తున్నది. నిన్ను హేళన చేస్తూ ఉంది. యెరూషలేము కుమారి నిన్ను చూసి తల ఊపుతూ ఉంది. నీవు ఎవర్ని తిరస్కరించావు? ఎవర్ని దూషించావు? నీవు గర్వించి ఎవర్ని భయపెట్టావు? ఇశ్రాయేలీయుల పవిత్ర దేవుణ్ణి కాదా? నీ వర్తమానికుల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే గదా. నా రథాల సమూహంతో నేను పర్వత శిఖరాలకూ, లెబానోను కొండల ఎత్తులకూ, ఎక్కాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షాలనూ, శ్రేష్ఠమైన సరళ వృక్షాలనూ నరికాను. దూరపు సరిహద్దుల్లో ఉన్న సత్రాల్లోకీ, ఫలాలకు క్షేత్రమైన అడవిలోకీ ప్రవేశించాను. నేను బావులు తవ్వి, పరుల నీళ్లు పానం చేశాను. నా అరకాలి కింద నేను ఐగుప్తు నదులన్నిటినీ ఎండిపోజేశాను. నేనే పూర్వకాలంలోనే దీన్ని కలగచేశాననీ, పురాతన కాలంలోనే దీన్ని నిర్ణయించాననీ నీకు వినబడలేదా? ప్రాకారాలున్న పట్టణాలను నీవు పాడు దిబ్బలుగా చెయ్యడం నావల్లే జరిగింది. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసి, విభ్రాంతి పొంది, పొలంలో ఉన్న గడ్డిలా, కాడలు లేని చేలలా అయ్యారు. నీవు కూర్చోవడం, బయలుదేరడం, లోపలికి రావడం, నా మీద వేసే రంకెలూ అన్నీ నాకు తెలుసు. నా మీద నీవు వేసే రంకెలూ, నీవు చేసిన గొడవ నా చెవుల్లో పడింది గనుక నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను. నా కళ్ళెం నీ నోట్లో పెట్టి నిన్ను మళ్ళిస్తాను. నీవు వచ్చిన దారిలోనే నిన్ను మళ్ళిస్తాను. హిజ్కియా, నీకిదే సూచన. ఈ సంవత్సరంలో దానంతట అదే పండే ధాన్యం, రెండో సంవత్సరంలో దాని నుంచి వచ్చే ధాన్యం మీరు తింటారు. మూడో సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోస్తారు. ద్రాక్షతోటలు నాటి వాటి ఫలం అనుభవిస్తారు. యూదా వంశంలో తప్పించుకొన్న శేషం ఇంకా కిందకు వేరు తన్ని పైకి ఎదిగి ఫలిస్తారు. ఆ మిగిలిన వారు యెరూషలేములోనుంచి బయలు దేరుతారు. తప్పించుకొన్నవారు సీయోను కొండలోనుంచి బయలు దేరుతారు. సైన్యాలకు అధిపతి అయిన యెహోవా ఆసక్తి దీన్ని నెరవేరుస్తుంది. కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పేదేమంటే, అతడు ఈ పట్టణంలోకి రాడు. దానిమీద ఒక్క బాణమైనా వెయ్యడు. ఒక్క డాలైనా దానికి చూపించడు. దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాకుండా, తాను వచ్చిన దారిలోనే అతడు తిరిగి వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.” ఆ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వాళ్ళ శిబిరంలోకి వెళ్లి 1, 85,000 మందిని హతం చేశాడు. ఉదయాన ప్రజలు లేచి చూసినప్పుడు వాళ్ళందరూ శవాలై చచ్చి పడి ఉన్నారు. అష్షూరురాజు సన్హెరీబు వెనక్కి తిరిగి, నీనెవె పట్టణానికి వెళ్ళిపోయి అక్కడ నివసించాడు. అతడు నిస్రోకు అనే తన దేవుడు మందిరంలో మొక్కుతూ ఉన్నప్పుడు, అతని కొడుకులు అద్రమ్మెలెకు, షరెజెరు కత్తితో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకు పారిపోయారు. అప్పుడు అతని కొడుకు ఏసర్హద్దోను అతని స్థానంలో రాజయ్యాడు.

షేర్ చేయి
Read 2 రాజులు 19

2 రాజులు 19:1-37 పవిత్ర బైబిల్ (TERV)

ేహిజ్కియా రాజు ఆ విషయములు అన్నియు విన్నాడు. అతను తన వస్త్రాలు చింపుకుని గోనెపట్ట ధరించాడు. (అతను విచారంగాను తలక్రిందులైనట్లుగాను అది తెలుపుతుంది.) తర్వాత అతను యెహోవా ఆలయానికి వెళ్లెను. హిజ్కియా, ఎల్యాకీము (రాజభవన అధికారి) షెబ్నా (కార్యదర్శి) మరియు యాజకులలో పెద్ద వారిని అమోజు కుమారుడైన యెషయాప్రవక్త వద్దకు పంపాడు. తాము విచారంగాను తలక్రిందులైనట్లుగాను తెలుపడానికి గోనెపట్ట ధరించారు. వారు యెషయాతో ఇలా అన్నారు: “ఇది యిబ్బంది రోజనీ, మేము తప్పు చేసినట్లుగా తెలిపే రోజనీ హిజ్కియా చెప్పుచున్నాడు. పిల్లలు పుట్టుటకు ఇది సమయము, అయితే వారికి పుట్టుక ఇచ్చేందుకు తగిన బలము లేదు. అష్షూరు రాజుయొక్క సైన్యాధిపతి సజీవుడైన దేవుని గురించి చెడు విషయాలు చెప్పాడానికి ఇక్కడికి పంపబడియున్నాడు. మీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆ విషయములు వినవచ్చు. యెహోవా ఆ విరోధిని శిక్షించవచ్చు. కనుక ఇంకా మిగిలివున్న వారికోసము ప్రార్థన చేయండి.” హిజ్కియా రాజుయొక్క అధికారులు యెషయా వద్దకు వెళ్లారు. “మీ యాజమాని అయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. యెహోవా ఇలా చెప్పుచున్నాడు అష్షూరు రాజు, అధికారులు నన్ను ఎగతాళి చేయడానికి మీకు చెప్పిన విషయాలు విని మీరు భయపడవద్దు. నేనతనిలో ఒక ఆత్మను ప్రవేశపెడుతున్నాను. అతను ఒక వందతి వింటాడు. అప్పుడతను తన దేశానికి తిరిగి పారిపోతాడు. అతని దేశంలోనే ఒక ఖడ్గంతో అతను చంపబడేలా నేను చేస్తాను” అని యెషయా వారితో చెప్పాడు. అష్షూరు రాజు లాకీషు విడిచి వెళ్లినట్లు ఆ సైన్యాధిపతి తెలుసుకున్నాడు. అందువల్ల అతను తన రాజు లిబ్నాకి విరుద్ధముగా పోరు సలుపుతున్నట్లు చూశాడు. అష్షూరు రాజు కూషు రాజైన తిర్హకా గురించి ఒక వదంతి విన్నాడు. “తిర్హకా నీతో యుద్ధము చేయడానికి వచ్చాడు” అన్నదే ఆ వదంతి. అందువల్ల అష్షూరు రాజు మరల హిజ్కియా వద్దకు దూతలను పంపించాడు. ఆ దూతలకు ఈ సందేశం ఇచ్చాడు. ఈ విషయాలు తెలియజేశాడు. “యూదా రాజయిన హిజ్కియాకి ఈ విషయము చెప్పండి. ‘నీవు విశ్వసించే దేవుడు నిన్ను అవివేకిగా చేసే విధంగా చేయకు. అష్షూరు రాజు యెరూషలేముని ఓడించలేడు; అని అతడు చెప్పుచున్నాడు గదా. అష్షూరు రాజులు ఇతర దేశాలకు వ్యతిరేకంగా చేసిన పనులు నీవు వినియుంటావు. మేము వారిని సర్వ నాశనం చేశాము. నీవు కాపాడుదువా? లేదు. ఆ దేశాల దేవుళ్లు ఆ ప్రజలను కాపాడలేదు. నా పూర్వికులు వారిని సర్వనాశనము చేశారు. వారు గోజాను, హారాను, రెజెపులు తెలశ్శారులోని ఏదోను ప్రజలను నాశనం చేశారు. హమాతు రాజు ఎక్కడ? అర్పాదు రాజు ఎక్కడ? సెపర్వయీము రాజు? హేనా, ఇవ్వా రాజులు? అందురూ ముగింపబడ్డారు.’” అష్షూరు రాజు దూతలనుండి వచ్చిన ఉత్తరాలు హిజ్కియా చదివాడు. అప్పుడు హిజ్కియా యెహోవా ఆలయము వద్దకు వెళ్లి, యెహోవా ముందు ఆ ఉత్తరాలు వుంచాడు. హిజ్కియా యెహోవాని ప్రార్థించాడు: “ఇశ్రాయేలు దేవుడవైన యెహోవా, కెరూబుల నడుమ రాజుగా ఆసీనుడవై వున్నావు. దేవుడివి నీవే, ప్రపంచంలోని అన్ని రాజ్యాలకూ నీవే దేవుడివి. నీవు పరలోకము, భూమిని చేశావు. ప్రభువా, నా మొర విను, ప్రభువా, కళ్లు తెరువు, ఈ ఉత్తరాలు చూడు. సన్హరీబు సజీవుడైన దేవుని అవమానిస్తూ చెప్పిన మాటలు విను. అది నిజము, ప్రభూ. ఆ దేశాలను అష్షూరు రాజులు నాశనం చేశారు. ఆ జనాంగాల దేవుళ్లను వారు అగ్నిలోకి కాల్చివేశారు. కాని వారు నిజమైన దేవుళ్లు కారు. వారు కేవలము రాయి, కర్రలతో, మనుష్యులు చేసిన ప్రతిమలు. కనుక ఇప్పుడు, మా దేవుడువైన యెహోవా, మమ్ము అష్షూరు రాజునుండి కాపాడుము. అప్పుడు భూమిమీది అన్ని రాజ్యములు యెహోవావైన నీవే దేవుడవని తెలుసుకుంటాయి.” ఆమోజు కొడుకైన యెషయా హిజ్కియాకి ఈ సందేశము పంపించాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యిది చెప్పుచున్నాడు, అష్షూరు రాజు సన్హెరీబుకి విరుద్ధంగా నీవు నన్ను ప్రార్థించావు. అది నేను విన్నాను. “యెహోవా సన్హెరీబును గూర్చి ఇచ్చిన సందేశము: ఈ విధంగా ఉంది: ‘సీయోను (యెరూషలేము) కుమార్తె అయిన ఆ కన్య నీవు ముఖ్యుడవుకాదని భావిస్తున్నది. ఆమె నిన్ను ఎగతాళి చేస్తున్నది. యెరూషలేము కుమార్తె నీ వెనుక తన తల ఆడిస్తున్నది. కాని నువ్వెవరిని అవమానించి యెగతాళి చేసావు? నీవు ఎవరికి విరుద్ధంగా మాట్లాడినావు? నీవు ఇశ్రాయేలు పవిత్రునికి ప్రతికూలుడిగా వచ్చావు నీవు ఆయన కంటె మంచివాడివిగా ప్రవర్తించావు. నీ దూతల ద్వారా యెహోవాను అవమానించి నీవు ఇలా చెప్పావు: “ఉన్నత పర్వతాలకు నేను వచ్చాను నా పెక్కు రథాలతో నేను లెబానోను లోపలికి వచ్చాను నేను ఉన్నత దేవదారుల వృక్షాలు మరియు లెబానోనులోని ఉత్తమ సరళ వృక్షాలను చేధించాను. పచ్చని అడవికి నేను వెళ్లాను. అదియె లెబానోనులోని ఉన్నత భాగము. నూతన ప్రదేశాలలో నేను బావులు తవ్వాను మంచినీళ్లు తాగితిని ఈజిప్టు నదులను ఎండించాను.” ఆ దేశము మీదుగా నడిచాను అదే నీవు చెప్పింది, కాని నీవు దేవుడు చెప్పింది వినలేదా? నేను (దేవుడు) పూర్వమే పథకము వేశాను ప్రాచీన కాలం నుండి పథకం వేశాను ఇప్పుడది జరుగునట్లు చేశాను బలిష్ఠమైన ఆ నగరాలు నాశనము చేయుటకును రాతి కుప్పలుగా మార్చుటకును నిన్ను అనుమతించాను. నగరాలలో ఉన్నవారు శక్తివిహీనులు వారు భీతావహులు గందరగోళంలో ఉన్నావారు క్ష్రేత్రంలోని పచ్చికలా మొక్కలవలె వారు ఛేదింపదగిన వారు. వాడుటకు పూర్వము పెరగని విధంగా ఇండ్ల కప్పుల మీద పెరిగే పచ్చికవారు. నీవు ఎప్పుడు క్రింద కూర్చుంటావో నాకు తెలియును. నీవు యుద్ధానికి వెళ్లడం నాకు తెలుసు నీవు ఇంటి దగ్గర ఉండినప్పుడు నా పట్ల విసుగు చెందినది తెలుసును. అవును. నీవు నాపట్ల విసుగు చెందితివి నీ గర్వపు నిందా వాక్యాలు నేను విన్నాను అందువల్ల నీ ముక్కుకు గాలం వేస్తున్నాను నీ నోటికి నా కళ్లెము తగిలిస్తున్నాను ఆ తర్వాత నిన్ను వెనుకకు మరల్చి నీవు వచ్చిన తోవనే నడిపిస్తాను.’” తర్వాత యెషయా హిజ్కియాతో ఈలాగు చెప్పెను. “నీకు సహాయము చేయనున్నందుకు ఇది ఒక గుర్తు. ఈ సంవత్సరము తనంతట తానే పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. ఆ మరు సంవత్సరము గింజనుండి పెరిగే ధాన్యము నీవు భుజిస్తావు. కాని ఆ మూడో సంవత్సరము నీవు నాటిన గింజలనుండి లభించే ధాన్యము నీవు భుజిస్తావు. నీవు ద్రాక్షా పొలాలు సాగుచేసి, లభించే ఆ ద్రాక్షలు భుజిస్తావు. తప్పించుకున్న ప్రజలు, యూదా వంశంలో మిగిలిన వారు మరల పండించడము మొదలు పెడతారు. కొద్దిమంది సజీవులై వుంటారు, కనుక వారు యెరూషలేమును విడిచి వెళతారు. తప్పించుకున్న ప్రజలు సీయోను కొండలో నుండి వెలుపలికి వెళతారు. యెహోవా యొక్క గాఢాభిప్రాయం అలా చేస్తుంది. “అందువల్ల అష్షూరు రాజుని గురించి యెహోవా చెప్పేదేమనగా: ‘అతడీ నగరంలోకి రాడు. అతడీ నగరంలో అస్త్రప్రయోగం చెయ్యలేడు. అతడు తన కవచాలు ఈ నగరానికి తీసుకురాడు. నగరములను దాడి చేసేందుకు ముట్టడి దిబ్బను నిర్మించలేడు. అతడు వచ్చిన త్రోవనే తిరిగి వెళ్తాడు. అతడీ నగరంలోకి రాలేడు అని యెహోవా చెప్పుచున్నాడు! నేనీ నగరాన్ని రక్షిస్తాను. నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’” రాత్రి, యెహోవా దూత వెలుపలికి పోయి అష్షూరు శిబిరములోని 1,85,000 మందిని చంపాడు. ప్రజలు ఉదయాన మేల్కొనగా, వారు శవాలు చూశారు. అందువల్ల అష్షూరు రాజయిన సన్హెరీబు తిరిగివెళ్లి నీనెవెకి మరలిపోయాడు. అక్కడే అతడు నిలిచాడు. ఒకరోజు సన్హెరీబు తన దేవుడైన నిస్రోకు ఆలయంలో పూజ చేయిస్తూ ఉన్నాడు. అతని కుమారులు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు కత్తితో అతనిని చంపారు. అప్పుడు అద్రెమ్మెలెకు మరియు షరెజెరు అరారాతు దేశములోకి తప్పించుకు పోయారు. మరియు సన్హెరీబు కుమారుడు ఎసర్హద్దోను, అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

షేర్ చేయి
Read 2 రాజులు 19

2 రాజులు 19:1-37 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను. వీరు గోనెపట్ట కట్టుకొని అతనియొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి–హిజ్కియా సెలవిచ్చునదేమనగా–ఈ దినము శ్రమయు శిక్షయు దూష ణయు గల దినము; పిల్లలు పుట్టవచ్చిరిగాని కనుటకు శక్తి చాలదు. జీవముగల దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానునిచేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలన్నియు నీ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి, నీ దేవుడైన యెహోవాకు వినబడియున్న ఆ మాటలనుబట్టి ఆయన అష్షూరురాజును గద్దించునేమో కాబట్టి నిలిచిన శేషముకొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయుము. రాజైన హిజ్కియా సేవకులు యెషయాయొద్దకు రాగా యెషయా వారితో ఇట్లనెను–మీ యజమానునికి ఈ మాట తెలియజేయుడి–యెహోవా సెలవిచ్చునదేమనగా –అష్షూరురాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక యాత్మను నేను పుట్టింతును, అతడు వదంతి విని తన దేశమునకు వెళ్లి పోవును; తన దేశమందు కత్తిచేత అతని కూలచేయుదును. అష్షూరురాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్లి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలిసికొనెను. అంతట కూషురాజైన తిర్హాకా తనమీద యుద్ధము చేయుటకు వచ్చెనని అష్షూరు రాజునకు వినబడినప్పుడు, అతడు ఇంకొకసారి హిజ్కియాయొద్దకు దూతలను పంపి యీలాగు ఆజ్ఞ ఇచ్చెను. యూదారాజగు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి – యెరూషలేము అష్షూరురాజుచేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొనియున్న నీ దేవునిచేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా నీవుమాత్రము తప్పించుకొందువా? నా పితరులు నిర్మూలముచేసిన గోజానువారుగాని హారానువారు గాని, రెజెపులుగాని, తెలశ్శారులోనుండిన ఏదె నీయులుగాని తమ దేవతల సహాయమువలన తప్పించుకొనిరా? హమాతు రాజు ఏమాయెను? అర్పాదురాజును సెపర్వయీము హేన ఇవ్వా అను పట్టణముల రాజులును ఏమైరి? హిజ్కియా దూతలచేతిలోనుండి ఆ ఉత్తరము తీసికొని చదివి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థనచేసెను–యెహోవా, కెరూబులమధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమ్యాకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకలరాజ్యములకు దేవుడవైయున్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము; యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము; జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపినవాని మాటలను చెవిని బెట్టుము. యెహోవా, అష్షూరురాజులు ఆ జనములను వారి దేశములను పాడుచేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుండ్లు కాక మనుష్యులచేత చేయబడిన కఱ్ఱలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా; లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలిసికొనునట్లుగా అతనిచేతిలోనుండి మమ్మును రక్షించుము. అంతట ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపెను–ఇశ్రాయేలీయుల దేవుడగు యెహోవా సెలవిచ్చునదేమనగా – అష్షూరురాజైన సన్హెరీబు విషయమందు నీవు నా యెదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించియున్నాను. అతనిగూర్చి యెహోవా సెలవిచ్చుమాట యేదనగా–సీయోను కుమారియైన కన్యక నిన్ను దూషణచేయుచున్నది; నిన్ను అపహాస్యము చేయుచున్నది; యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవనిని తిరస్కరించితివి? ఎవనిని దూషించితివి? నీవు గర్వించి యెవనిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినేగదా నీ దూతలచేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవేగదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖర ములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్ఠమైన సరళవృక్షములను నరికివేసి యున్నాను వాని దూరపు సరిహద్దులలో సత్రములలోనికిని కర్మెలు ఫలవంతములగు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించియున్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసియున్నాను నా అరకాలిచేత నేను దిట్టమైన స్థలముల నదుల నన్ని టిని ఎండిపో జేసియున్నాను. నేనే పూర్వమందే దీని కలుగజేసితిననియు పురాతనకాలమందే దీని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములుగల పట్టణములను నీవు పాడు దిబ్బ లుగా చేయుట నావలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్థులు బలహీనులై జడిసిరి విభ్రాంతినొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుండుటయు బయలువెళ్లుటయు లోపలికి వచ్చుటయు నామీదవేయు రంకెలును నాకు తెలిసేయున్నవి. నామీద నీవు వేయు రంకెలును నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్లెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా – హిజ్కియా, నీ కిదే సూచనయగును. ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, మూడవ సంవత్సరమున మీరు విత్తనమువిత్తి చేలు కోయుదురు; ద్రాక్షతోటలు నాటి వాటిఫలము అనుభవించుదురు. యూదా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. శేషించు వారు యెరూషలేములోనుండి బయలుదేరుదురు; తప్పించుకొనినవారు సీయోను కొండలోనుండి బయలుదేరుదురు; సైన్యములకధిపతియగు యెహోవా ఆసక్తి దీని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజునుగూర్చి యెహోవా సెలవిచ్చునదేమనగా–అతడు ఈ పట్టణములోనికి రాడు; దానిమీద ఒక బాణమైన ప్రయోగింపడు; ఒక కేడెమునైన దానికి కనుపరచడు; దానియెదుట ముట్టడిదిబ్బ కట్టడు. ఈ పట్టణములోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును; ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రియే యెహోవాదూత బయలుదేరి అష్షూరు వారి దండు పేటలో జొచ్చి లక్షయెనుబది యయిదు వేలమందిని హతముచేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరును మృతకళేబరములై యుండిరి. అష్షూరురాజైన సన్హెరీబు తిరిగి పోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవత మందిరమందు మ్రొక్కుచుండగా అతని కుమారులైన అద్రెమ్మెలెకును షరెజెరును ఖడ్గముతో అతని చంపి అరా రాతు దేశములోనికి తప్పించు కొనిపోయిరి; అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను.

షేర్ చేయి
Read 2 రాజులు 19

2 రాజులు 19:1-37 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఇది విని రాజైన హిజ్కియా తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని యెహోవా మందిరంలోకి వెళ్లాడు. అతడు రాజభవన నిర్వాహకుడైన ఎల్యాకీమును, కార్యదర్శియైన షెబ్నాను, యాజకులలో పెద్దవారిని ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా దగ్గరకు పంపాడు, వారంత గోనెపట్ట కట్టుకున్నారు. వారు అతనితో ఇలా అన్నారు, “హిజ్కియా చెప్పిన మాట ఇదే: ఈ రోజు బాధ, చీవాట్లు, అవమానం ఉన్న రోజు, బిడ్డ పుట్టడానికి సమయం దగ్గరకు వచ్చినా కనే శక్తిలేని స్త్రీలా ఉంది. జీవంగల దేవున్ని దూషించడానికి అష్షూరు రాజు తన సేవకుడైన సైన్యాధిపతి పంపించాడు. అతడు పలికిన మాటలన్నీ మీ దేవుడైన యెహోవా విని అతని మాటలనుబట్టి మీ దేవుడైన యెహోవా అష్షూరు రాజును గద్దిస్తారేమో, కాబట్టి ఇక్కడ మిగిలే వారి కోసం ప్రార్థించండి.” రాజైన హిజ్కియా సేవకులు యెషయా దగ్గరకు వచ్చినప్పుడు, యెషయా వారితో ఇలా అన్నాడు, “మీ యజమానికి చెప్పండి, ‘యెహోవా చెప్పే మాట ఇదే: మీరు విన్న వాటికి అనగా అష్షూరు రాజు సేవకులు నన్ను దూషిస్తూ మాట్లాడిన మాటలకు భయపడకండి. వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ” అంతలో అష్షూరు రాజు లాకీషును విడిచి వెళ్లాడని అతని సైన్యాధిపతి విని, అతడు తిరిగివెళ్లి రాజు లిబ్నాతో పోరాడుతున్నాడని తెలుసుకున్నాడు. అప్పుడు సన్హెరీబు, కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధం చేయడానికి వస్తున్నాడనే వార్త విన్నాడు. కాబట్టి అతడు మరలా దూతలను హిజ్కియా దగ్గరకు పంపాడు: “యూదా రాజైన హిజ్కియాకు ఇలా చెప్పండి: నీవు నమ్ముకున్న నీ దేవుడు, ‘యెరూషలేము అష్షూరు రాజు చేతికి ఇవ్వబడదు’ అని చెప్పే మోసపు మాటలకు మోసపోవద్దు. అష్షూరు రాజులు అన్ని దేశాలను పూర్తిగా నాశనం చేసిన సంగతి నీవు ఖచ్చితంగా వినే ఉంటావు. మీరు మాత్రం తప్పించుకోగలరా? గోజాను, హారాను, రెజెపు, తెలశ్శారు పట్టణంలో ఉండే ఏదెను ప్రజలను నా పూర్వికులు నాశనం చేసినప్పుడు, ఆ జనాల దేవుళ్ళు వారిని విడిపించారా? హమాతు రాజు, అర్పదు రాజు ఎక్కడ? లాయిరు, సెఫర్వయీము, హేన, ఇవ్వా పట్టణాల రాజులు ఏమయ్యారు?” హిజ్కియా దూతల నుండి లేఖ తీసుకుని దానిని చదివాడు. తర్వాత యెహోవా ఆలయానికి వెళ్లి, యెహోవా సముఖంలో ఆ ఉత్తరాన్ని తెరిచాడు. హిజ్కియా యెహోవాకు ఇలా ప్రార్థన చేశాడు: “యెహోవా! ఇశ్రాయేలు దేవా! కెరూబుల మధ్యలో సింహాసనాసీనుడా! ఈ లోక రాజ్యాలకు మీరు మాత్రమే దేవుడు. మీరు భూమ్యాకాశాలను సృష్టించారు. యెహోవా, శ్రద్ధగా వినండి; యెహోవా, కళ్లు తెరచి చూడండి. జీవంగల దేవున్ని దూషించడానికి సన్హెరీబు చెప్పి పంపిన మాటలు వినండి. “యెహోవా, అష్షూరు రాజులు ఈ జనాలను, వారి దేశాలను నాశనం చేశారన్నది వాస్తవం. వారు వారి దేవుళ్ళను అగ్నిలో వేసి నాశనం చేశారు, ఎందుకంటే అవి దేవుళ్ళు కాదు, కేవలం మనుషుల చేతులతో చేసిన కర్ర, రాళ్లు మాత్రమే. ఇప్పుడు యెహోవా, మా దేవా, మమ్మల్ని అతని చేతిలో నుండి విడిపించండి. అప్పుడు ఈ లోక రాజ్యాలన్ని యెహోవాయైన మీరే దేవుడని తెలుసుకుంటారు.” అప్పుడు ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియాకు ఇలా సందేశం పంపాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పే మాట ఇదే: నీవు అష్షూరు రాజైన సన్హెరీబును గురించి నాకు చేసిన ప్రార్థన విన్నాను. అతని గురించి యెహోవా చెప్పిన మాట ఇదే: “ ‘కన్యయైన సీయోను కుమార్తె నిన్ను తృణీకరించి ఎగతాళి చేస్తుంది. యెరూషలేము కుమార్తె నీవు పారిపోతుంటే తల ఊపుతుంది. నీవు ఎవరిని నిందించి దూషించావు? ఎవరి మీద నీవు అరిచి గర్వంతో నీ కళ్ళెత్తి చూశావు? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునినే గదా! నీవు పంపిన దూతల ద్వారా ప్రభువును దూషించావు. నీవు అన్నావు, “నా అనేక రథాల చేత, పర్వత శిఖరాల మీదికి ఎక్కాను, లెబానోను ఎత్తైన స్థలాలను ఎక్కాను. దాని పొడువైన దేవదారులను నరికివేశాను, శ్రేష్ఠమైన సరళ వృక్షాలను నరికివేశాను. దాని చివరి సరిహద్దులను చేరుకున్నాను, దాని సారవంతమైన అడవులను చేరుకున్నాను. నేను పరదేశి నేలలో బావులు త్రవ్వి అక్కడి నీళ్లు త్రాగాను. నా అరికాలితో ఈజిప్టు నది ప్రవాహాలన్నీ ఎండిపోయేలా చేశాను.” “ ‘చాలా కాలం క్రితం నేనే నిర్ణయించానని, నీవు వినలేదా? పూర్వకాలంలో నేను సంకల్పించాను; ఇప్పుడు నేను అలా జరిగేలా చేశాను, నీవు కోటగోడలు గల పట్టణాలను రాళ్ల కుప్పలుగా చేసేలా చేశాను. వారి ప్రజలు బలహీనులై, భయాక్రాంతులై అవమానం పాలయ్యారు. వారు పొలంలో మొక్కల్లా, పచ్చని మొక్కల్లా, ఇంటికప్పు మీద పెరిగే గడ్డిలా పెరగక ముందే వాడిపోయినట్టు ఉన్నారు. “ ‘అయితే నీవు ఎక్కడ ఉన్నావో ఎప్పుడు వస్తావో ఎప్పుడు వెళ్తావో నా మీద ఎంత కోపంగా ఉన్నావో నాకు తెలుసు. నీవు నాకు వ్యతిరేకంగా లేస్తున్నందుకు, నీ అహంకారం నా చెవిని చేరినందుకు, నా గాలాన్ని నీ ముక్కుకు తగిలిస్తాను, నా కళ్లెం నీ నోటిలో వేస్తాను. నీవు వచ్చిన దారిలోనే నీవు తిరిగి వెళ్లేలా చేస్తాను.’ “హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు. యూదా రాజ్యంలో శేషం మరోసారి క్రిందికి వేర్లు తన్ని చిగురించి ఫలిస్తుంది. యెరూషలేము నుండి శేషం వస్తుంది, సీయోను పర్వతం నుండి తప్పించుకున్నవారు వస్తారు. “సైన్యాల యెహోవా రోషం దీన్ని సాధిస్తుంది. “కాబట్టి అష్షూరు రాజు గురించి యెహోవా చెప్పే మాట ఇదే: “ ‘అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు ఒక్క బాణమైనా వేయడు. ఒక్క డాలును దానికి చూపించడు దాని ఎదురుగా ముట్టడి దిబ్బ వేయడు. అతడు వచ్చిన దారినే తిరిగి వెళ్లిపోతాడు. అతడు ఈ పట్టణంలోకి ప్రవేశించడు అని యెహోవా ప్రకటిస్తున్నారు. నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.’ ” ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో లక్ష ఎనభై అయిదు వేలమంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు. అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు. ఒక రోజు అతడు నిస్రోకు అనే తన దేవుని గుడిలో పూజ చేస్తుండగా అతని కుమారులు ఆద్రమ్మెలెకు, షెరెజరు ఖడ్గంతో అతన్ని చంపి అరారతు ప్రాంతానికి పారిపోయారు. అతని తర్వాత అతని కుమారుడైన ఏసర్హద్దోను రాజయ్యాడు.

షేర్ చేయి
Read 2 రాజులు 19