2 రాజులు 1:1-18

2 రాజులు 1:1-18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

అహాబు చనిపోయిన తరువాత మోయాబు దేశం ఇశ్రాయేలు రాజ్యంపై తిరుగుబాటు చేసింది. అప్పుడే అహజ్యా షోమ్రోనులోని తన మేడగది కిటికీలో నుండి కింద పడి గాయపడ్డాడు. అప్పుడతడు దూతలను పిలిచి “మీరు ఎక్రోను దేవుడు బయల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఈ గాయం మాని బాగుపడతానో లేదో కనుక్కుని రండి” అని వారికి చెప్పి పంపించాడు. కానీ యెహోవా దూత తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా అన్నాడు. “నీవు లేచి సమరయ రాజు పంపిన దూతలను కలుసుకో. వారికిలా చెప్పు. ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి వెళ్తున్నారా? ఇశ్రాయేలులో అసలు దేవుడనే వాడు లేడనుకున్నారా? సరే, యెహోవా ఇలా చెప్తున్నాడు. నీవు కచ్చితంగా ఎక్కిన పడుకున్న పడక దిగకుండానే చనిపొతావు.” ఏలీయా వారికిలా చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. వారు ఇలా అన్నారు “ఒక వ్యక్తి మాకు ఎదురయ్యాడు. అతడు మాతో మిమ్మల్ని పంపిన రాజు దగ్గరకి తిరిగి వెళ్ళండి. అతనితో ఇలా చెప్పండి. యెహోవా చెప్పేదేమిటంటే ఎక్రోను దేవుడైన బయల్జెబూబును సంప్రదించడానికి దూతలను పంపుతున్నావా? ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి నీవు ఎక్కిన మంచం ఇక దిగవు. కచ్చితంగా చనిపోతావు, అని చెప్పాడు.” అప్పుడు రాజు “మిమ్మల్ని కలుసుకుని ఈ మాటలు చెప్పినవాడు ఎలా ఉన్నాడు?” అని అడిగాడు. అందుకు వారు “అతడు గొంగళి కట్టుకుని తోలు నడికట్టు పెట్టుకుని ఉన్నాడు” అన్నారు. అప్పుడు రాజు “ఆ వ్యక్తి తిష్బీ వాడైన ఏలీయానే” అన్నాడు. అప్పుడు రాజు యాభై మంది సైనికులతో ఒక అధికారిని ఎలీయా దగ్గరికి పంపించాడు. ఎలీయా ఒక కొండ మీద కూర్చుని ఉన్నాడు. ఆ అధికారి ఎలీయా ఉన్న చోటికి కొండ ఎక్కి వచ్చాడు. అతడు ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది. ఆహాజు రాజు మరో యాభై మంది సైనికులతో ఇంకో అధికారిని పంపించాడు. ఇతడు కూడా ఎలీయాతో “ఇదిగో, దేవుని మనిషీ, రాజు నిన్ను త్వరగా దిగి రమ్మంటున్నాడు” అన్నాడు. అందుకు ఏలీయా “నేను దేవుని మనిషినే అయితే ఆకాశం నుండి అగ్ని కురిసి నిన్నూ నీ యాభై మందినీ కాల్చి వేస్తుంది గాక” అని జవాబిచ్చాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని కురిసి ఆ అధికారినీ అతనితో ఉన్న యాభై మందినీ కాల్చి వేసింది. అయినా రాజు మూడోసారి మరో యాభై మంది సైనిక బృందాన్ని పంపించాడు. వీళ్ళ అధికారి కొండ పైకి వెళ్ళాడు. ఇతడు ఎలీయా ఎదుట మోకాళ్ళపై వంగి ప్రాధేయ పూర్వకంగా “దేవుని మనిషీ, నిన్ను వేడుకుంటున్నాను. నీ దృష్టిలో నా ప్రాణాన్నీ, నీ సేవకులైన ఈ యాభై మంది ప్రాణాలనూ విలువైనవిగా ఉండనీ. ఇంతకు ముందు వచ్చిన ఇద్దరు అధికారులనూ, వాళ్ళ సైనికులనూ నిజంగానే ఆకాశం నుండి దిగి వచ్చిన అగ్ని కాల్చివేసింది. కానీ ఇప్పుడు నా ప్రాణం నీ దృష్టికి విలువైనదిగా ఉండనీ” అన్నాడు. అప్పుడు యెహోవా దూత ఎలీయాతో “దిగి అతనితో కూడా వెళ్ళు. అతనికి భయపడకు” అని చెప్పాడు. కాబట్టి ఎలీయా లేచి అతనితో కూడా రాజు దగ్గరికి వెళ్ళాడు. తరువాత ఎలీయా అహజ్యాతో ఇలా అన్నాడు. “నీవు ఎక్రోను దేవుడైన బయల్జెబూబు దగ్గరికి దూతలను పంపించావు. ఈ సంగతులు అడిగి తెలుసుకోడానికి ఇశ్రాయేలులో దేవుడు లేడనుకున్నావా? కాబట్టి ఇప్పుడు నీవు పండుకున్న మంచం పైనుండి దిగవు. కచ్చితంగా చనిపోతావు.” ఏలీయా పలికిన యెహోవా మాట ప్రకారం ఆహాజు రాజు చనిపోయాడు. అతనికి కొడుకు లేడు. అందుచేత అతని స్థానంలో అతని సోదరుడైన యెహోరాము రాజు అయ్యాడు. యూదా రాజు యెహోషాపాతు కొడుకు యెహోరాము పాలన రెండవ సంవత్సరంలో ఇది జరిగింది. అహజ్యా గూర్చిన ఇతర సంగతులు ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో రాసి ఉన్నాయి.

షేర్ చేయి
Read 2 రాజులు 1

2 రాజులు 1:1-18 పవిత్ర బైబిల్ (TERV)

అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది. ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహజ్యా ఉన్నాడు. ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహజ్యా క్రిందపడి, బాగా గాయపడ్డాడు. అహజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు. కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనుష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకులను అడగటానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము. మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బయల్జెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.’” తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు. దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు. దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబుని ప్రశ్నలడగటం దేనికి? ఇట్లు చేయడంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తావనియు యెహోవా చెప్పాడు!’” “మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు. “ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు. తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే అది” అని అన్నాడు. అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు’” అని పలికాడు. ఏలీయా ఏభైమంది మనుష్యులను, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు. అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది. అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ, క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు. ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు. అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది. అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక! పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.” యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు. అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు. అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు. ఏలీయా ద్వారా యెహోవా చెప్పినట్లుగా అహజ్యా మరణించాడు. అహజ్యాకి కుమారుడు లేడు. అందువల్ల అహజ్యా తర్వాత యెహోరాము రాజయ్యాడు. యెహోషాపాతు. కుమారుడైన యెహోరాము పరిపాలించసాగాడు. అతని రెండవ సంవత్సర పాలన కాలంలో యెహోషాపాతు యూదా రాజుగా వున్నాడు. అహజ్యా చేసిన ఇతర పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

షేర్ చేయి
Read 2 రాజులు 1

2 రాజులు 1:1-18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై–మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి–ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా యెహోవాదూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను–నీవులేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము–ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా? కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను. తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. –మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా వారు–ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి–మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి– యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా –మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను. అందుకు వారు–అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా–ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను. వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితోకూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్చుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి–దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా– నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండిదిగి వానిని వాని యేబదిమందిని దహించెను. మరల రాజు ఏబదిమందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి–దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలీయా–నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను. ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితోకూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని–దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితోకూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా యెహోవాదూత–వానికి భయపడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజునొద్దకు వచ్చెను. అతడు వచ్చి రాజును చూచి–విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను. ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను. అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.

షేర్ చేయి
Read 2 రాజులు 1

2 రాజులు 1:1-18 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

అహాబు చనిపోయిన తర్వాత, మోయాబు ఇశ్రాయేలు మీద తిరుగుబాటు చేసింది. ఆ కాలంలో ఒక రోజు అహజ్యా రాజు సమరయలో ఉన్న తన మేడగది కిటికీలో నుండి క్రిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడు, “నేను ఈ గాయం నుండి కోలుకుంటానో లేదో మీరు వెళ్లి, ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయండి” అని దూతలకు చెప్పి పంపించాడు. అయితే యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాతో, “నీవు వెళ్లి, సమరయ రాజు పంపిన దూతలను కలిసి, ‘ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి వెళ్తున్నారా?’ అయితే యెహోవా చెప్పే మాట ఇదే: ‘నీవు పడుకున్న మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!’ అని చెప్పు.” కాబట్టి ఏలీయా ఈ వార్త చెప్పడానికి వెళ్లాడు. ఆ దూతలు రాజు దగ్గరకు తిరిగి వెళ్లగా అతడు వారిని, “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. అందుకు వారు, “ఒక మనుష్యుడు మాకు ఎదురయ్యాడు” అన్నారు. “అందుకతడు మాతో ఇలా అన్నాడు, ‘మీరు వెనక్కి వెళ్లి మిమ్మల్ని పంపించిన రాజుకు ఇలా చెప్పండి, “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపారా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం దిగవు, నీవు తప్పక చస్తావు!” ’ ” రాజు వారిని, “మిమ్మల్ని కలుసుకోడానికి వచ్చి ఈ మాటలు చెప్పిన మనిషి ఎలా ఉంటాడు?” అని అడిగాడు. అందుకు వారు, “అతడు గొంగళి కప్పుకున్నాడు, నడుముకు తోలుతో చేసిన నడికట్టు కట్టుకున్నాడు” అని చెప్పారు. అప్పుడు రాజు, “అతడు తిష్బీయుడైన ఏలీయా” అని అన్నాడు. అప్పుడు రాజు ఒక అధిపతిని, తనతో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఒక కొండమీద కూర్చుని ఉన్న ఏలీయా దగ్గరకు ఆ అధిపతి ఎక్కి వెళ్లి, “దైవజనుడా, ‘క్రిందికి రా!’ అని రాజు చెప్తున్నారు” అని చెప్పాడు. ఏలీయా అధిపతికి జవాబిస్తూ అన్నాడు, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది. అందుకు రాజు వేరొక అధిపతిని, అతనితో పాటు యాభైమంది మనుష్యులను ఏలీయా దగ్గరకు పంపాడు. ఆ అధిపతి, “దైవజనుడా! రాజు నీతో, ‘వెంటనే క్రిందికి రా!’ అని అన్నారు” అని చెప్పాడు. ఏలీయా జవాబిస్తూ, “నేనే దైవజనుడనైతే, ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ యాభైమంది మనుష్యులను దహించును గాక!” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి ఆ అధిపతిని అతని యాభైమంది మనుష్యులను దహించివేసింది. రాజు మూడవ అధిపతిని అతనితో పాటు యాభైమంది మనుష్యులను పంపాడు. ఈ మూడవ అధిపతి కొండెక్కి వెళ్లి, ఏలీయా ముందు మోకాళ్లమీద ఉండి, “దైవజనుడా” అని వేడుకున్నాడు, “నా ప్రాణాన్ని మీ సేవకులైన ఈ యాభైమంది ప్రాణాలను కాపాడండి! చూడండి, ఆకాశం నుండి అగ్ని దిగి ముందు వచ్చిన అధిపతులిద్దరిని వారితో పాటు వచ్చిన మనుష్యులందరిని దహించివేసింది. దయచేసి నా ప్రాణాన్ని కాపాడండి” అని అతడు బ్రతిమిలాడాడు. యెహోవా దూత ఏలీయాతో, “అతనితో దిగి వెళ్లు; అతనికి భయపడకు” అని చెప్పినప్పుడు ఏలీయా లేచి అతనితో కొండ దిగి రాజు దగ్గరకు వెళ్లాడు. అతడు రాజుతో, “యెహోవా చెప్పే మాట ఇదే: ఇశ్రాయేలులో దేవుడు లేరని ఎక్రోను దేవుడైన బయల్-జెబూబు దగ్గర విచారణ చేయడానికి దూతలను పంపించావా? నీవు చేసిన దాన్ని బట్టి నీవు ఎక్కిన మంచం మళ్ళీ దిగవు, అక్కడే చస్తావు!” అని అన్నాడు. కాబట్టి ఏలీయా చెప్పిన యెహోవా వాక్కు ప్రకారమే అతడు చనిపోయాడు. అహజ్యాకు కుమారుడు లేనందుకు, యూదాలో రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము పరిపాలనలోని రెండవ సంవత్సరంలో యోరాము రాజయ్యాడు. అహజ్యా పరిపాలన గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవి ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.

షేర్ చేయి
Read 2 రాజులు 1