2 రాజులు 1
1
1అహాబు మరణమైన తరువాత మోయాబీయులు ఇశ్రాయేలువారిమీద తిరుగబడిరి. 2అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలోనుండి క్రిందపడి రోగియై–మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబు నొద్దకు పోయి–ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థ పడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా 3యెహోవాదూత తిష్బీయుడైన ఏలీయాతో ఈలాగు సెలవిచ్చెను–నీవులేచి షోమ్రోనురాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి యిట్లనుము–ఇశ్రాయేలువారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయైన బయల్జెబూబునొద్ద మీరు విచారించబోవుచున్నారా? 4కాగా యెహోవా సెలవిచ్చునదేమనగా–నీవెక్కిన మంచము మీదనుండి దిగిరాకుండ నీవు నిశ్చయముగా మరణమవుదువు అని ఏలీయా వారితో చెప్పి వెళ్లిపోయెను. 5తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. –మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా 6వారు–ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి–మిమ్మును పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి– యెహోవా సెలవిచ్చునదేమనగా–ఇశ్రాయేలులో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకు నీవు దూతలను పంపు చున్నావే; నీవెక్కిన మంచముమీద నుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని అతడు పలికెనని వారు చెప్పగా 7–మిమ్మును ఎదుర్కొనవచ్చి యీ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను. 8అందుకు వారు–అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకొనినవాడని ప్రత్యుత్తరమియ్యగా–ఆ మనుష్యుడు తిష్బీయుడైన ఏలీయా అని అతడు చెప్పెను. 9వెంటనే రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని యేబదిమందితోకూడ ఏలీయా యొద్దకు పంపెను. అతడు కొండమీద కూర్చుని యుండగా అధిపతి యెక్కి అతని సమీపమునకు పోయి–దైవజనుడా, నీవు దిగిరావలెనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. 10అందుకు ఏలీయా– నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశమునుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని యేబదిమందికి అధిపతియైన వానితో చెప్పగా, అగ్ని ఆకాశమునుండిదిగి వానిని వాని యేబదిమందిని దహించెను. 11మరల రాజు ఏబదిమందిమీద అధిపతియైన మరియొకనిని వాని యేబదిమందితోకూడ పంపగా వీడువచ్చి–దైవజనుడా, త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. 12అందుకు ఏలీయా–నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశము నుండి దిగివచ్చి నిన్ను నీ యేబదిమందిని దహించునుగాక అని చెప్పగా, ఆకాశమునుండి దేవుని అగ్ని దిగి వానిని వాని యేబదిమందిని దహించెను. 13ఇంకను రాజు ఏబదిమందికి అధిపతియైన యొకనిని వాని ఏబదిమందితోకూడ పంపగా ఏబదిమంది మీద అధిపతియైన ఆ మూడవవాడు వచ్చి ఏలీయా యెదుట మోకాళ్లూని–దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీదాసులైన యీ యేబదిమంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. 14చిత్తగించుము; ఆకాశమునుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వానివాని యేబదిమందితోకూడ దహించెను; అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవిచేయగా 15యెహోవాదూత–వానికి భయపడక వానితోకూడ దిగిపొమ్మని ఏలీయాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితోకూడ రాజునొద్దకు వచ్చెను. 16అతడు వచ్చి రాజును చూచి–విచారణచేయుటకు ఇశ్రాయేలు వారిమధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్ద విచారణచేయుటకై దూతలను పంపితివే; నీవెక్కిన మంచముమీదనుండి దిగి రాకుండ నిశ్చయముగా నీవు మరణమవుదువు అని చెప్పెను. 17ఏలీయా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాటప్రకారము అతడు చనిపోయెను. అతనికి కుమారుడు లేనందున యూదా రాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యెహోరాము అతనికి మారుగా రాజాయెను. 18అహజ్యా చేసిన యితర కార్యములనుగూర్చి ఇశ్రాయేలురాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
ప్రస్తుతం ఎంపిక చేయబడింది:
2 రాజులు 1: TELUBSI
హైలైట్
షేర్ చేయి
కాపీ
మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి
Telugu Old Version Bible - పరిశుద్ధ గ్రంథము O.V. Bible
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide.