1 తిమోతికి 3:1-16

1 తిమోతికి 3:1-16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచిపనిని కోరడమే. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్ధ్యం కలవానిగా ఉండాలి. అతడు త్రాగుబోతుగా ఉండకూడదు, దుర్మార్గునిగా కాక సౌమ్యునిగా ఉంటూ, కొట్లాడేవానిగా డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు. అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండునట్లు చూసుకోవాలి. ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో, సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు. అతడు సంఘస్థులు కాని వారిలో కూడ మంచి పేరు గలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందలు పాలై సాతాను వలలో చిక్కుకోకుండా ఉంటాడు. అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు. వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. వారు ఖచ్చితంగా మొదట పరీక్షించబడాలి; ఏ దోషం లేనివారిగా నిరూపించబడితేనే వారు సంఘపరిచారకులుగా సేవ చేయవచ్చు. అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి. సంఘ పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉంటూ, తన పిల్లలను, కుటుంబాన్ని సరిగా నడిపించేవాడై ఉండాలి. తమ పనులను సక్రమంగా నెరవేర్చే పరిచారకులు ప్రజల మధ్య ఉత్తమ స్థాయిని పొందుకొని, క్రీస్తు యేసులో వారికున్న విశ్వాసంలో బహు ధైర్యంగా ఉంటారు. త్వరలో నేను మీ దగ్గరకు రావాలనే నిరీక్షణతో ఈ విషయాలను వ్రాస్తున్నాను. త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా వున్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను. నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూసారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకొనివెళ్ళారు.

షేర్ చేయి
Read 1 తిమోతికి 3

1 తిమోతికి 3:1-16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఎవరైనా సంఘానికి అధ్యక్షుడుగా ఉండాలనుకుంటే అతడు శ్రేష్ఠమైన పనిని కోరుకుంటున్నాడు అనే మాటను నమ్మవచ్చు. కాబట్టి అధ్యక్షుడు నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య ఉన్నవాడూ కోరికలు అదుపులో ఉంచుకునేవాడూ వివేచనాపరుడూ మర్యాదస్థుడూ అతిథి ప్రియుడూ బోధించడానికి సమర్థుడూ అయి ఉండాలి. అతడు తాగుబోతూ జగడాలమారీ కాక మృదుస్వభావి, ధనాశ లేనివాడూ అయి ఉండాలి. తన పిల్లలు తనకు సరైన గౌరవంతో లోబడేలా చేసుకుంటూ తన కుటుంబాన్ని చక్కగా నిర్వహించుకునేవాడై ఉండాలి. ఎవడైనా తన కుటుంబాన్నే సరిగా నిర్వహించకపోతే అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? అతడు కొత్తగా చేరినవాడై ఉండకూడదు. ఎందుకంటే అతడు గర్విష్టి అయి అపవాది పొందిన శిక్షనే పొందుతాడేమో. అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండేలా సంఘానికి బయట ఉన్నవారి చేత మంచి పేరు పొందినవాడై ఉండాలి. అలాగే పరిచారకులు గౌరవానికి తగినవారుగా, రెండు నాలుకలతో మాట్లాడనివారుగా ఉండాలి. తాగుబోతులుగా, అక్రమ లాభం ఆశించేవారుగా ఉండకూడదు. వెల్లడైన విశ్వాస సత్యాన్ని పవిత్రమైన మనస్సాక్షితో అంటిపెట్టుకొనే వారుగా ఉండాలి. మొదట వారిని పరీక్షించాలి. తరువాత వారు నిందకు చోటివ్వనివారని తేలితే పరిచారకులుగా సేవ చేయవచ్చు. అలాగే వారి భార్యలు కూడా గౌరవించదగినవారూ అపనిందలు ప్రచారం చేయనివారూ తమ కోరికలు అదుపులో ఉంచుకొనేవారూ అన్ని విషయాల్లో నమ్మకమైనవారూ అయి ఉండాలి. పరిచారకులు ఒకే భార్య కలిగినవారూ, తమ పిల్లలనూ తమ ఇంటివారిని చక్కగా నిర్వహించుకొనేవారుగా ఉండాలి. పరిచారకులుగా మంచి సేవ చేసిన వారు మంచి స్థానం సంపాదించుకుని క్రీస్తు యేసు పైని విశ్వాసంలో గొప్ప ధైర్యం పొందుతారు. త్వరలో నీ దగ్గరికి రావాలని ఆశిస్తున్నాను. ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ. మన దైవభక్తిని గురించి వెల్లడైన సత్యం గొప్పది. ఏ సందేహమూ లేదు. ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. ఆయన నీతిపరుడని ఆత్మ తీర్పునిచ్చాడు. ఆయనను దేవదూతలు చూశారు. దేశ దేశాల్లో ఆయన ప్రచారం అయ్యాడు. లోకం ఆయనను నమ్మింది. మహిమతో ఆయన ఆరోహణమయ్యాడు.

షేర్ చేయి
Read 1 తిమోతికి 3

1 తిమోతికి 3:1-16 పవిత్ర బైబిల్ (TERV)

ఇక్కడొక నమ్మదగిన సంగతి: సంఘంలో పెద్ద కావాలనుకొన్నవాడు గొప్ప సంగతినే కోరుకొనుచున్నాడు. పెద్ద నిందకు చోటివ్వనివాడై ఉండాలి. అతడు ఏకపత్నీవ్రతుడై ఉండాలి. మితంగా జీవించాలి. వివేకవంతుడై ఉండాలి. సంఘంలో గౌరవం కలిగి ఉండాలి. ఇతర్లకు సహాయం చేస్తూ ఉండాలి. బోధించగల సామర్థ్యం ఉండాలి. అలాంటివాడు మద్యం త్రాగరాదు. అతనిలో కోపానికి మారుగ వినయం ఉండాలి. పోట్లాడే గుణం ఉండకూడదు. ధనం మీద ఆశ ఉండకూడదు. తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోగలిగి ఉండాలి. అతడు తన పిల్లలు తనపట్ల విధేయతగా ఉండేటట్లు, తనను మనస్ఫూర్తిగా గౌరవించేటట్లు చేసుకోవాలి. తన సంసారాన్ని సక్రమంగా నడుపుకోలేనివాడు దేవుని సంఘాన్ని ఏ విధంగా నడపగలడు? అతడు క్రొత్తగా నమ్మినవాడై ఉండకూడదు. అటువంటి వ్యక్తి ఉబ్బెక్కిపోయి సాతాను పొందిన శిక్షనే పొందవచ్చు. సంఘానికి చెందనివాళ్ళలో కూడా అతనికి మంచి పేరు ఉండాలి. అప్పుడే అతడు చెడ్డ పేరు పొందకుండా సాతాను వలలో పడకుండా ఉంటాడు. అదే విధంగా సంఘ పరిచారకులు గౌరవింపదగినవాళ్ళై ఉండాలి. నీతిపరులై ఉండాలి. త్రాగుబోతులు కాకూడదు. మోసాలు చేసి లాభాలు పొందేవాళ్ళు కాకూడదు. దేవుడు చెప్పిన సత్యాలను వాళ్ళు పవిత్ర హృదయంతో ఆచరించాలి. వాళ్ళు మొదట పరీక్షింపబడాలి. ఆ తర్వాత ఎవ్వరికీ ఏ ఆక్షేపణ లేనట్లయితే వాళ్ళను పరిచారకులుగా ఎన్నుకోవచ్చు. అదే విధంగా పరిచర్యచేయు స్త్రీలు కూడా గౌరవింపదగినవాళ్ళై ఉండాలి. వాళ్ళు యితర్లను నిందిస్తూ మాట్లాడరాదు. అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. నమ్మదగినవాళ్ళై ఉండాలి. పరిచారకుడు కూడా ఏకపత్నీ వ్రతుడై ఉండాలి. తన పిల్లల్ని, కుటుంబాన్ని సక్రమంగా నడపాలి. ఆ విధంగా నడిపేవాళ్ళు క్రీస్తులో మంచి పేరు, బలమైన విశ్వాసం సంపాదించుకొంటారు. నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే, ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది. ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది.

షేర్ చేయి
Read 1 తిమోతికి 3

1 తిమోతికి 3:1-16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఎవడైనను అధ్యక్షపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్నీ పురుషు డును, మితానుభవుడును, స్వస్థబుద్ధిగలవాడును, మర్యా దస్థుడును, అతిథిప్రియుడును, బోధింపతగినవాడునైయుండి, మద్యపానియు కొట్టువాడునుకాక, సాత్వి కుడును, జగడమాడనివాడును, ధనాపేక్షలేనివాడునై, సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగా ఏలువాడునై యుండవలెను. ఎవడైనను తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరినవాడై యుండకూడదు. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకుండునట్లు సంఘమునకు వెలుపటివారిచేత మంచి సాక్ష్యము పొందిన వాడైయుండవలెను. ఆలాగుననే పరిచారకులు మాన్యులై యుండి, ద్విమనస్కులును, మిగుల మద్యపానాసక్తులును, దుర్లాభము న పేక్షించువారునైయుండక విశ్వాసమర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొనువారై యుండవలెను. మరియు వారు మొదట పరీక్షింపబడవలెను; తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలె పరిచర్యచేయు స్త్రీలును మాన్యులై కొండెములు చెప్పనివారును, మితాను భవముగలవారును, అన్ని విషయములలో నమ్మకమైనవారునై యుండవలెను. పరిచారకులు ఏకపత్నీ పురుషులును, తమ పిల్లలను తమ యింటివారిని బాగుగా ఏలువారునై యుండవలెను. పరిచారకులై యుండి ఆ పనిని బాగుగా నెరవేర్చినవారు మంచి పదవిని సంపాదించుకొని క్రీస్తుయేసునందలి విశ్వాసమందు బహు ధైర్యముగలవారగుదురు. శీఘ్రముగా నీయొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను; అయినను నేను ఆలస్యముచేసినయెడల దేవుని మందిరములో, అనగా జీవముగల దేవుని సంఘములో, జను లేలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని యీ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై యున్నది. నిరా క్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదైయున్నది; ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యెను. ఆత్మవిషయమున నీతిపరుడని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యెను.

షేర్ చేయి
Read 1 తిమోతికి 3

1 తిమోతికి 3:1-16 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచి పనిని కోరడమే. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్థ్యం గలవానిగా ఉండాలి. అతడు త్రాగుబోతై ఉండకూడదు, చేయి చేసుకునేవాడు కాక, మృదు స్వభావం గలవానిగా ఉండాలి, కొట్లాడేవానిగా, డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు. అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండేలా చూసుకోవాలి. ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో, సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు. అతడు సంఘస్థులు కాని వారి దగ్గర కూడా మంచి సాక్ష్యం కలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందల పాలు కాడు, సాతాను వలలో చిక్కులో పడడు. అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు. వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. వారు ఖచ్చితంగా మొదట పరీక్షించబడాలి; ఏ దోషం లేనివారిగా నిరూపించబడితేనే వారు సంఘపరిచారకులుగా సేవ చేయవచ్చు. అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి. సంఘ పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉంటూ, తన పిల్లలను, కుటుంబాన్ని సరిగా నడిపించేవాడై ఉండాలి. తమ పనులను సక్రమంగా నెరవేర్చే పరిచారకులు ప్రజలమధ్య ఉత్తమ స్థాయిని పొందుకొని, క్రీస్తు యేసులో వారికున్న విశ్వాసంలో బహు ధైర్యంగా ఉంటారు. త్వరలో నేను మీ దగ్గరకు రావాలనే నిరీక్షణతో ఈ విషయాలను వ్రాస్తున్నాను. త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా ఉన్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను. నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే: ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు, పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు, దేవదూతలు ఆయనను చూశారు, ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు, ఆయన గురించి లోకమంతా నమ్మింది, ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకెళ్లారు.

షేర్ చేయి
Read 1 తిమోతికి 3