ఈ మాట నమ్మతగింది: ఎవరైనా ఒక సంఘపెద్దగా ఉండాలని ఆశిస్తే అది మంచిపనిని కోరడమే. సంఘపెద్ద నిందలేనివానిగా, ఒకే భార్యకు నమ్మకమైన భర్తగా, కోరికలను అదుపులో ఉంచుకునేవానిగా, స్వీయ నియంత్రణ గలవానిగా, మర్యాదస్థునిగా, ఆతిథ్య ప్రియునిగా, సత్యాన్ని బోధించగల సామర్ధ్యం కలవానిగా ఉండాలి. అతడు త్రాగుబోతుగా ఉండకూడదు, దుర్మార్గునిగా కాక సౌమ్యునిగా ఉంటూ, కొట్లాడేవానిగా డబ్బును ప్రేమించేవానిగా ఉండకూడదు. అతడు పూర్తిగా గౌరవించదగిన రీతిలో తన కుటుంబాన్ని చక్కగా నడిపించుకొంటూ తన పిల్లలు తనకు లోబడి ఉండునట్లు చూసుకోవాలి. ఒకడు తన సొంత కుటుంబాన్నే సరిదిద్దుకోలేనప్పుడు, అతడు దేవుని సంఘాన్ని ఎలా చూసుకోగలడు? అతడు నూతన విశ్వాసిగా ఉండకూడదు, ఎందుకంటే అతడు తన స్థానాన్ని బట్టి గర్వంతో ఉబ్బిపోతాడేమో, సాతాను పొందిన శిక్షకే అతడు కూడా గురి అవుతాడు. అతడు సంఘస్థులు కాని వారిలో కూడ మంచి పేరు గలవాడై ఉండాలి, అప్పుడు అతడు నిందలు పాలై సాతాను వలలో చిక్కుకోకుండా ఉంటాడు.
అదే విధంగా, సంఘ పరిచారకులు కూడా గౌరవించదగినవారిగా, నిష్కపటంగా ఉండాలి, మద్యానికి బానిసగా ఉండకూడదు, అక్రమ సంపాదన ఆశించకూడదు. వారు స్వచ్ఛమైన మనస్సాక్షితో విశ్వాసపు మర్మాలను గట్టిగా పట్టుకోవాలి. వారు ఖచ్చితంగా మొదట పరీక్షించబడాలి; ఏ దోషం లేనివారిగా నిరూపించబడితేనే వారు సంఘపరిచారకులుగా సేవ చేయవచ్చు.
అదే విధంగా, సంఘపరిచారకుల భార్యలు కూడా గౌరవించదగినవారిగా ఉండాలి, ద్వేషంతో మాట్లాడేవారిగా కాకుండా కోరికలను అదుపులో ఉంచుకునేవారిగా ప్రతి విషయంలో నమ్మకమైనవారిగా ఉండాలి.
సంఘ పరిచారకుడు తన భార్యకు నమ్మకంగా ఉంటూ, తన పిల్లలను, కుటుంబాన్ని సరిగా నడిపించేవాడై ఉండాలి. తమ పనులను సక్రమంగా నెరవేర్చే పరిచారకులు ప్రజల మధ్య ఉత్తమ స్థాయిని పొందుకొని, క్రీస్తు యేసులో వారికున్న విశ్వాసంలో బహు ధైర్యంగా ఉంటారు.
త్వరలో నేను మీ దగ్గరకు రావాలనే నిరీక్షణతో ఈ విషయాలను వ్రాస్తున్నాను. త్వరలో నీ దగ్గరకు రావాలని ఆశిస్తున్నాను, ఒకవేళ నేను రావడం ఆలస్యమైనా కాని సత్యానికి పునాదిగా స్తంభంగా వున్న జీవంగల దేవుని సంఘమైన దేవుని గృహంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో నీకు తెలియజేయాలనే నేను ఈ సూచనలు వ్రాస్తున్నాను. నిస్సందేహంగా నిజమైన దైవభక్తిని గురించిన మర్మం గొప్పది, అది ఏంటంటే:
ఆయన శరీరంతో ప్రత్యక్షమయ్యారు,
పవిత్రాత్మ ఆయనను నీతిమంతుడని నిరూపించాడు,
దేవదూతలు ఆయనను చూసారు,
ఆయన గురించి భూరాజ్యాలన్నిటిలో ప్రజలు ప్రకటించారు,
ఆయన గురించి లోకమంతా నమ్మింది,
ఆయనను దేవుడు మహిమలోనికి తీసుకొనివెళ్ళారు.