1 థెస్సలొనీకయులకు 4:1-9

1 థెస్సలొనీకయులకు 4:1-9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)

సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇక ముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రభువైన యేసులో గల అధికారంతో మేము మీకు ఏమి బోధించామో మీకు తెలుసు. మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి. యూదేతరులారా కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకొని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. కనుక ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కనుక మీలో ఒకరి పట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.

1 థెస్సలొనీకయులకు 4:1-9 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

చివరిగా సోదరులారా, ప్రభువైన యేసు ద్వారా మేము మీకు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలుసు. మీరు దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలో, మీరు ఎలా నడుచుకోవాలో మేము మీకు నేర్పించాము. మీరూ ఆ ప్రకారంగానే జీవిస్తూ ఉన్నారు. ఈ విషయంలో మీరు మరింత అభివృద్ధి పొందాలని బతిమాలుతూ ప్రభు యేసులో మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీరు పరిశుద్ధులు కావడం, జారత్వానికి దూరంగా ఉండడం దేవుని ఉద్దేశం. మీలో ప్రతివాడూ దేవుణ్ణి ఎరగని ఇతరుల్లాగా కామవికారంతో కాకుండా పరిశుద్ధతలోనూ ఘనతలోనూ తన పాత్రను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుని ఉండటమే దేవుని ఉద్దేశం. ఈ విషయాన్ని ఎవరూ మీరకూడదు. తన సోదరుణ్ణి మోసం చేయకూడదు. ఎందుకంటే మేము ఇంతకు ముందు మీకు చెప్పి హెచ్చరించినట్టే ఈ విషయాల్లో ప్రభువు తప్పక ప్రతీకారం చేస్తాడు. పరిశుద్ధులుగా జీవించడానికే దేవుడు మనలను పిలిచాడు, అపవిత్రులుగా ఉండడానికి కాదు. కాబట్టి ఈ ఉపదేశాన్ని నిరాకరించేవాడు మనిషిని కాక, మీకు తన పరిశుద్ధాత్మను ప్రసాదించిన దేవుణ్ణే నిరాకరిస్తున్నాడు. సోదర ప్రేమను గూర్చి ఎవరూ మీకు రాయనక్కరలేదు. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలని దేవుడే మీకు నేర్పించాడు.

1 థెస్సలొనీకయులకు 4:1-9 పవిత్ర బైబిల్ (TERV)

సోదరులారా! చివరకు చెప్పేదేమిటంటే దేవుని మెప్పు పొందటానికి ఏ విధంగా జీవించాలో మేము మీకు బోధించాము. మీరు మేము చెప్పినట్లు జీవిస్తున్నారు. కాని మేము ప్రస్తుతం యేసు ప్రభువు పేరిట మిమ్మల్ని అడిగేదేమిటంటే మీరు ఆ జీవితాన్ని యింకా సంపూర్ణంగా జీవించాలి. ఇది మా విజ్ఞప్తి. యేసు ప్రభువు యిచ్చిన అధికారంతో మేము చెప్పిన ఉపదేశాలు మీకు తెలుసు. మీరు పవిత్రంగా ఉంటూ వ్యభిచారం చెయ్యకుండా ఉండాలి. ఇది దేవుని యిచ్ఛ. మీరు పవిత్రంగా, గౌరవప్రదంగా జీవించాలి. మీ దేహాలను మీరు అదుపులో పెట్టుకోవాలి. పవిత్రులు కానివాళ్ళు లైంగిక వాంఛలతో బ్రతుకుతూ ఉంటారు. ఆ విధంగా మీరు జీవించకూడదు. ఈ విషయంలో ఎవరూ తమ సోదరుల్ని మోసం చేయరాదు. వాళ్ళను తమ లాభానికి ఉపయోగించుకోరాదు. అలాంటి పాపం చేసినవాళ్ళను ప్రభువు శిక్షిస్తాడు. మేము దీన్ని గురించి ముందే చెప్పి వారించాము. దేవుడు మనల్ని పిలిచింది అపవిత్రంగా ఉండేందుకు కాదు. పవిత్రంగా జీవించేందుకు పిలిచాడు. అందువల్ల ఈ ఉపదేశాన్ని తృణీకరించినవాడు మానవుణ్ణి కాదు, తన పరిశుద్ధాత్మనిచ్చిన దేవుణ్ణి తృణీకరించినవాడౌతాడు. సోదర ప్రేమను గురించి మేము వ్రాయవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరస్పరం ప్రేమించుకొనమని దేవుడే మీకు బోధించాడు.

1 థెస్సలొనీకయులకు 4:1-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీ రేలాగు నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మావలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును, దేవుని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక, పరిశుద్ధతయందును ఘనతయందును తన తన ఘటమును ఎట్లు కాపాడు కొనవలెనో అది యెరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను; ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతి దండన చేయువాడు. పరిశుద్ధు లగుటకే దేవుడు మనలను పిలిచెనుగాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదరప్రేమనుగూర్చి మీకు వ్రాయనక్కరలేదు; మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్ప బడితిరి.

1 థెస్సలొనీకయులకు 4:1-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇకముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రభువైన యేసులో గల అధికారంతో మేము మీకు ఏమి బోధించామో మీకు తెలుసు. మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి. దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకుని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. కాబట్టి ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కాబట్టి మీలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.