1 థెస్సలోనికయులకు 4:1-9

1 థెస్సలోనికయులకు 4:1-9 TSA

సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇకముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. ప్రభువైన యేసులో గల అధికారంతో మేము మీకు ఏమి బోధించామో మీకు తెలుసు. మీరు లైంగిక దుర్నీతికి దూరంగా ఉంటూ పరిశుద్ధులుగా ఉండడమే దేవునికి ఇష్టం; మీలో ప్రతివారు మీ సొంత శరీరమనే పాత్రను పరిశుద్ధంగా, ఘనత కలిగినదిగా ఉండేలా దానిపై నియంత్రణ కలిగి జీవించాలి. దేవుని ఎరుగనివారి కామోద్రేకాన్ని కలిగి ఉండవద్దు. ఈ విషయంలో తన సహోదర సహోదరీలను అలుసుగా తీసుకుని మోసం చేయకూడదు. ఎందుకంటే, మేము ముందుగానే మీకు చెప్పి హెచ్చరించిన ప్రకారం అలాంటి పాపాలను చేసిన వారందరిని ఈ క్రియల విషయాల్లో ప్రభువు శిక్షిస్తారు. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు గాని అపవిత్రులుగా ఉండడానికి పిలువలేదు. కాబట్టి ఈ నియమాన్ని నిర్లక్ష్యం చేసినవారు మనుష్యులను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, మీకు తన పరిశుద్ధాత్మను ఇచ్చిన దేవున్నే నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం మీరు దేవుని నుండి నేర్చుకున్నారు కాబట్టి మీలో ఒకరిపట్ల ఒకరికి గల ప్రేమ గురించి మీకు వ్రాయాల్సిన అవసరం లేదు.