1 సమూయేలు 5:1-12

1 సమూయేలు 5:1-12 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)

ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబెనె జరునుండి అష్డోదునకు తీసికొనివచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి. అయితే మరునాడు అష్డోదువారు ప్రాతఃకాలమందు లేవగా, ఇదిగో దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడియుండెను కనుక వారు దాగోనును లేవనెత్తి వానిస్థానమందు మరల ఉంచిరి. ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను యెహోవా మందసము ఎదుట నేలను బోర్లబడి యుండెను. దాగోనుయొక్క తలయు రెండు అరచేతులును తెగవేయబడి గడపదగ్గర పడియుండెను, వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను. కాబట్టి దాగోను యాజకులేమి దాగోను గుడికి వచ్చు వారేమి నేటివరకు ఎవరును అష్డోదులో దాగోనుయొక్క గుడి గడపను త్రొక్కుటలేదు. యెహోవా హస్తము అష్డోదువారిమీద భారముగా ఉండెను. అష్డోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతముచేయగా అష్డోదువారు సంభవించినదాని చూచి–ఇశ్రాయేలీయుల దేవుని హస్తము మనమీదను మన దేవతయగు దాగోనుమీదను బహుభారముగా నున్నదే; ఆయన మందసము మనమధ్యనుండుటయే దీనికి కారణముగదా; అది యిక మన మధ్యనుండకూడదని చెప్పుకొని ఫిలిష్తీయుల సర్దారులందరిని పిలువనంపించి–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మనము ఏమి చేయుదుమని అడిగిరి. అందుకు వారు–ఇశ్రాయేలీయుల దేవుని మందసమును ఇక్కడనుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా, జనులు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును అక్కడనుండి గాతునకు మోసికొనిపోయిరి. అయితే వారు అష్డోదునుండి గాతునకు దానిని మోసికొనిపోయిన తరువాత యెహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి, గొప్ప నాశనము జేసెను. వారు దేవుని మందసమును ఎక్రోనునకు పంపివేయగా దేవుని మందసము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి–మనలను మన జనులను చంపివేయవలెనని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసమును మన యొద్దకు తీసికొని వచ్చిరనిరి. కాగా జనులు ఫిలిష్తీయుల సర్దారులనందర్ని పిలువనంపించి –ఇశ్రాయేలీయుల దేవుని మందసము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి. దేవుని హస్తము అక్కడ బహు భారముగా ఉండెను గనుక మరణభయము ఆ పట్టణస్థులందరిని పెట్టి యుండెను. చావక మిగిలియున్నవారు గడ్డల రోగముచేత మొత్తబడిరి. ఆ పట్టణస్థుల కేకలు ఆకాశమువరకు వినబడెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 5

1 సమూయేలు 5:1-12 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)

ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకుని ఎబెనెజరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు. వారు దాగోను గుడిలో దాగోను విగ్రహం ముందు దాన్ని ఉంచారు. అయితే మరుసటి రోజు అష్డోదు ప్రజలు ఉదయాన్నే లేచి చూసినప్పుడు యెహోవా మందసం ముందు దాగోను విగ్రహం నేలపై బోర్లా పడి ఉంది. వారు దాగోనును పైకి లేపి దాని స్థానంలో తిరిగి నిలబెట్టారు. ఆ తరువాతి రోజు ఉదయం కూడా దాగోను యెహోవా మందసం ఎదురుగా నేలపై బోర్లా పడి ఉంది. దాగోను విగ్రహం తల, రెండు అరచేతులు నరికివేసి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రం దానికి మిగిలి ఉంది. అందువల్ల ఈ రోజు వరకూ దాగోను యాజకులుగాని, గుడికి వచ్చేవారు గానీ, ఎవరూ అష్డోదులో దాగోను గుడి గడప తొక్కరు. యెహోవా హస్తం అష్డోదు వారిపై బహు భారంగా ఉంది. అష్డోదులో, దాని సరిహద్దుల్లో ఉన్నవారికి ఆయన తీవ్రమైన గడ్డలు రప్పించి వారిని చంపివేశాడు. అష్డోదు ప్రజలు జరిగింది చూసి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండ కూడదు. ఎందుకంటే ఆయన హస్తం మనమీదా, మన దేవుడు దాగోను మీదా తీవ్రంగా ఉంది.” అని చెప్పుకున్నారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల నాయకులందరినీ పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని అడిగారు. అందుకు పెద్దలు “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడనుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. అప్పుడు వారు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడనుండి గాతుకు తీసుకు వెళ్లారు. వారు అష్డోదు నుండి గాతుకు దాన్ని మోసుకు పోయిన తరువాత యెహోవా హస్తం గాతులో పెద్ద కలవరం పుట్టించింది. ఆయన పెద్దలకు, పిల్లలకు వినాశం కలిగించాడు. వారి దేహాలపై గడ్డలు వచ్చాయి. వెంటనే వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపివేశారు. దేవుని మందసం ఎక్రోనులోకి వచ్చినప్పుడు ఎక్రోనీయులు కేకలు వేసి “మనలనూ మన ప్రజలనూ చంపివేయాలని వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరికి తీసుకువచ్చారు” అన్నారు. అప్పుడు ప్రజలు ఫిలిష్తీయుల పెద్దలను పిలిపించి “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మనలను మన ప్రజలను చంపకుండా ఉండేలా దాన్ని దాని స్వస్థలానికి పంపించండి” అని చెప్పారు. దేవుని హస్తం శిక్ష అక్కడ ఎంతో భారంగా ఉంది. అందువల్ల మరణ భయం ఆ పట్టణం వారందరినీ అల్లకల్లోలం చేసింది. చనిపోకుండా మిగిలినవారు గడ్డలతో తీవ్రంగా బాధపడ్డారు. ఆ ఊరి ప్రజల అరుపులు ఆకాశాన్ని అంటాయి.

షేర్ చేయి
Read 1 సమూయేలు 5

1 సమూయేలు 5:1-12 పవిత్ర బైబిల్ (TERV)

ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎబెనెజరు నుంచి అష్డోదుకి తీసుకుని వెళ్లారు. దేవుని పవిత్ర పెట్టెను వారు దాగోను దేవాలయంలోనికి తీసుకుని పోయి దాగోను విగ్రహం పక్కన వుంచారు. అష్డోదు ప్రజలు ఆ మరునాడు తెల్లవారుఝామునే లేచి దాగోను విగ్రహం బోర్లపడి వుండటం చూశారు. యెహోవా దేవుని పవిత్ర పెట్టె ముందు దాగోను విగ్రహం పడిపోయి ఉంది. అష్డోదు ప్రజలు దాగోను విగ్రహాన్ని తిరిగి యధాస్థానంలో వుంచారు. కాని మరునాటి ఉదయం అష్డోదు ప్రజలు వచ్చి చూడగా దాగోను విగ్రహం మళ్లీ పడిపోయివుంది. దాగోను దేవుని పవిత్ర పెట్టెముందు పడిపోయివున్నాడు. ఈసారి దాగోను తల, చేతులు విరిగిపోయి ఆలయ గుమ్మం మీద పడి ఉన్నాయి. దాగోను మొండెం మాత్రం ఒక్క ముక్కగా మిగిలింది. అందువల్ల ఈ నాటికీ దాగోను యాజకులు గాని, ఇతరులుగాని అష్డోదులో దాగోను ఆలయం గడప తొక్కేందుకు నిరాకరిస్తారు. అష్డోదు ప్రజలకు, వారి ఇరుగు పొరుగు గ్రామాల వారికి యెహోవా తీవ్రంగా శిక్ష విధించాడు. బహు కష్టాలపాలు చేశాడు. వారంతా శరీరం నిండా గడ్డలు కలిగి బాధపడ్డారు. వారి మీదికి ఎలుకల దండును పంపించాడు. వాళ్ల ఓడలలోను, పంట పొలాల్లోను ఎలుకలు విపరీతంగా తిరగటం ప్రారంభించాయి. నగర వాసులంతా భయభ్రాంతులయ్యారు. అష్డోదు ప్రజలు అక్కడ జరుగుతున్నదంతా బాగా గమనించారు. “మనల్ని, మన దైవం దాగోనును బాగా శిక్షిస్తూవుంది గనుక, ఇశ్రాయేలు దేవుని పవత్ర పెట్టె ఇక ఏమాత్రం మనతో వుండరాదు.” అని అనుకున్నారు. అష్డోదు ప్రజలు ఫిలిష్తీయుల పాలకులు ఐదుగురినీ ఒక్కచోటికి పిలువనంపారు. “ఇశ్రాయేలీయుల దేవుని పవిత్ర పెట్టె విషయంలో తాము ఏమి చేయాలని వారిని అడిగారు.” అది విన్న పాలకులు, “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించమనగా” వారలా చేశారు. అలా ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను గాతునకు తరలించిన పిమ్మట, యెహోవా ఆ నగరాన్ని కూడా శిక్షించాడు. ప్రజలు భయభ్రాంతులయ్యారు. గాతులో చిన్న, పెద్ద అందరినీ కలవరపెట్టాడు. వారికి కూడ శరీరం నిండా కంతులు, గడ్డలు లేచేలా చేశాడు. కనుక ఫిలిష్తీయులు దేవుని పవిత్ర పెట్టెను ఎక్రోనుకు పంపించారు. కానీ దేవుని పవిత్ర పెట్టె ఎక్రోనుకు చేరగానే అక్కడి ప్రజలు, “ఇశ్రాయేలు ప్రజల దేవుని పవిత్ర పెట్టెను మా ఎక్రోను నగరానికి ఎందుకు తీసుకుని వస్తున్నారు? మమ్ములనందరినీ మీరు చంపదలిచారా?” అంటూ అరవటం మొదలు పెట్టారు. వారు ఫిలిష్తీయుల పాలకులనందరినీ ఒక్క చోటికి పిలిపించి “ఇశ్రాయేలు దేవుని పవిత్ర పెట్టె మమ్మల్నీ, ప్రజలందరినీ చంపకముందే దానిని యధాస్థానానికి పంపించి వేయమన్నారు.” ఎక్రోనీయులు మిక్కిలి భీతి చెందియున్నారు. అక్కడ దేవుని దండన చాలా భయంకరంగా ఉంది. చావగా మిగిలిన వారు శరీరంపై గడ్డలతో బాధపడ్డారు. ఎక్రోను ప్రజల అరుపులు ఆకాశాన్ని తాకు నట్లుగా ఉండెను.

షేర్ చేయి
Read 1 సమూయేలు 5

1 సమూయేలు 5:1-12 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)

ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత వారు దానిని ఎబెనెజెరు నుండి అష్డోదుకు తీసుకువచ్చారు. వారు దేవుని మందసాన్ని దాగోను గుడిలోనికి తీసుకువచ్చి దానిని దాగోను ప్రక్కన ఉంచారు. అయితే మరుసటిరోజు ప్రొద్దుటే అష్డోదు ప్రజలు లేచి చూడగా, యెహోవా మందసం ఎదుట దాగోను నేలపై బోర్లా పడి ఉంది. కాబట్టి వారు దాగోనును లేపి తిరిగి దాని స్థానంలో నిలబెట్టారు. ఆ మరుసటి ఉదయం అష్డోదు ప్రజలు లేచి చూడగా దాగోను యెహోవా మందసం ఎదుట నేలపై బోర్లా పడి ఉంది. దాగోను తల రెండు చేతులు నరికివేయబడి గుమ్మం దగ్గర పడి ఉన్నాయి. దాని మొండెం మాత్రమే మిగిలి ఉంది. కాబట్టి ఆ రోజు నుండి నేటి వరకు దాగోను యాజకులు గాని దాగోను గుడికి వచ్చేవారు గాని అష్డోదులోని దాగోను గుడిలో అడుగుపెట్టరు. యెహోవా హస్తం అష్డోదు ప్రజల మీద దాని చుట్టుప్రక్కల ప్రాంతాల మీద భారంగా ఉంది; ఆయన వారి పైకి వినాశనం తెచ్చి గడ్డలతో వారిని బాధించారు. అష్డోదు ప్రజలు జరిగిన దానిని చూసి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసం మన మధ్య ఉండకూడదు, ఎందుకంటే దానిని బట్టి ఆయన హస్తం మనమీద, మన దేవుడైన దాగోను మీద భారంగా ఉంది” అన్నారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మనం ఏమి చేద్దాం?” అని వారిని అడిగారు. అందుకు వారు, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి గాతు పట్టణానికి పంపించండి” అని చెప్పారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని అక్కడినుండి తీసుకెళ్లారు. కానీ వారు దానిని తరలించిన తర్వాత, యెహోవా హస్తం ఆ పట్టణానికి వ్యతిరేకంగా ఉండి, వారిని చాలా భయాందోళనలకు గురిచేసింది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పట్టణంలోని ప్రజలకు ఆయన గడ్డలు పుట్టించి బాధించారు. కాబట్టి వారు దేవుని మందసాన్ని ఎక్రోనుకు పంపించారు. దేవుని మందసం ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రోను ప్రజలు, “మనలను మన ప్రజలను నాశనం చేయడానికి వీరు ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని మన దగ్గరకు తీసుకువచ్చారు” అని కేకలు వేశారు. కాబట్టి వారు ఫిలిష్తీయుల పాలకులందరినీ పిలిచి, “ఇశ్రాయేలీయుల దేవుని మందసాన్ని ఇక్కడినుండి పంపివేయండి; దాని చోటికి దానిని పంపివేయండి” అన్నారు. ఎందుకంటే, ఆ పట్టణమంతా భయంతో నిండిపోయింది; దేవుని హస్తం దానిపైన చాలా భారంగా ఉంది. చనిపోకుండా ఉన్నవారు గడ్డల చేత బాధించబడ్డారు. ఆ పట్టణ ప్రజల కేకలు ఆకాశం వరకు వినబడ్డాయి.

షేర్ చేయి
Read 1 సమూయేలు 5