1 సమూయేలు 17:41-47
1 సమూయేలు 17:41-47 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
తన డాలు మోసేవాడు తనకు ముందు నడుస్తుండగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదుకు దగ్గరగా వచ్చి, ఎర్రగా, అందంగా ఉన్న దావీదును చూసి చిన్నపిల్లవాడని అతన్ని పట్టించుకోలేదు. అతడు దావీదుతో, “కర్ర తీసుకుని నా మీదికి వస్తున్నావు నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తన దేవుళ్ళ పేరట దావీదును శపించాడు. ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, “నా దగ్గరకు రా, నీ మాంసాన్ని పక్షులకు మృగాలకు వేస్తాను!” అన్నాడు. అందుకు దావీదు ఆ ఫిలిష్తీయునితో, “నీవు కత్తి ఈటె బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు కాని నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యాల దేవుడును సైన్యాల అధిపతియైన యెహోవా పేరట నేను నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తారు; నేను నిన్ను చంపి నీ తల నరికివేస్తాను. నేను ఈ రోజే ఫిలిష్తీయుల కళేబరాలను పక్షులకు అడవి జంతువులకు వేస్తాను. ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోకమంతా తెలుసుకుంటుంది. అప్పుడు యెహోవా కత్తితో గాని ఈటెతో గాని రక్షించేవాడు కాడని ఇక్కడ ఉన్నవారందరు తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాదే, ఆయనే మిమ్మల్ని మా చేతికి అప్పగిస్తారు” అన్నాడు.
1 సమూయేలు 17:41-47 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
బల్లెం మోసేవాడు తనకు ముందుగా నడుస్తుంటే, ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గరికి వచ్చి చుట్టూ తేరి చూసి, ఎర్రనివాడు, అందగాడు, బాలుడు అయిన దావీదును నిర్లక్ష్యంగా చూశాడు. ఫిలిష్తీయుడు “కర్ర తీసుకు నువ్వు నా మీదికి వస్తున్నావే, నేనేమైనా కుక్కనా?” అని చెప్పి తమ దేవుళ్ళ పేరున దావీదును శపించాడు. “నా దగ్గరికి రా, నిన్ను చంపి నీ మాంసాన్ని పక్షులకు, జంతువులకు వేస్తాను” అని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అన్నప్పుడు, దావీదు “నువ్వు కత్తి, ఈటె, బల్లెం తీసుకుని నా మీదికి వస్తున్నావు. నేనైతే నువ్వు దూషిస్తున్న ఇశ్రాయేలీయుల సేనల అధిపతి యెహోవా పేరిట నీ మీదికి వస్తున్నాను. ఈ రోజు యెహోవా నిన్ను నా చేతికి అప్పగిస్తాడు. నేను నిన్ను చంపి నీ తల తీసేస్తాను. దేవుడు ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాడని లోకంలోని వారంతా తెలుసుకొనేలా నేను ఈ రోజున ఫిలిష్తీయుల శవాలను పక్షులకు, జంతువులకు వేస్తాను. అప్పుడు యెహోవా కత్తిచేత, ఈటెచేత రక్షించేవాడు కాదని ఇక్కడ ఉన్నవారంతా తెలుసుకుంటారు. యుద్ధం యెహోవాయే చేస్తాడు. ఆయన మిమ్మల్ని మాకు అప్పగిస్తాడు” అని చెప్పాడు.
1 సమూయేలు 17:41-47 పవిత్ర బైబిల్ (TERV)
ఫిలిష్తీయుడైన గొల్యాతు నెమ్మదిగా నడుస్తూ దావీదుకు సమీపంగా వస్తున్నాడు. గొల్యాతు కవచంమోసే సహాయకుడు వానికి ముందుగా నడుస్తున్నాడు. గొల్యాతు దావీదును చూచి నవ్వసాగాడు. దావీదు ఒక సైనికుడు కూడ కానట్టు గొల్యాతు చూసాడు. దావీదు కేవలం ఎర్రని ముఖంగల ఒక అందగాడు మాత్రమే. గొల్యాతు దావీదు వైపు చూసి, “నేనేమైనా కుక్కని అనుకున్నావా కర్ర పట్టుకొని వచ్చావు!” అని ఎగతాళి చేశాడు. గొల్యాతు తన దేవుళ్ల పేర్లన్నీ ఉచ్చరిస్తూ దావీదును శపించాడు. “ఇటు రారా! నీ శవాన్ని పక్షులకు, జంతువులకు ఆహారంగా వేస్తాను” అంటూ దావీదు మీద కేకలు వేసాడు గొల్యాతు. “నీవు కత్తి, కవచం, ఈటెలు ధరించి నా దగ్గరకు వస్తున్నావు. కానీ నేను ఇశ్రాయేలు సైన్యాలకు దేవుడు, సర్వశక్తి మంతుడైన యెహోవా పేరిట నీ దగ్గరకు వస్తున్నాను. ఆయనపై నీవు నిందా వాక్యాలు పలికావు. ఈ రోజు ఆ యెహోవా, నాచేత నిన్ను ఓడిస్తాడు. నిన్ను నేను చంపేస్తాను. ఈ వేళ నేను నీ తల నరికి నీ శవాన్ని పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను. మిగిలిన ఫిలిష్తీయులందరికీ అలానే చేస్తాము. అప్పుడు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని ప్రపంచం అంతా తెలుసుకొంటుంది. ప్రజలను రక్షించాలంటే యెహోవాకు కత్తులు, కటారులు అక్కరలేదని ఇక్కడున్నవారంతా తెలుసుకొంటారు. ఈ యుద్ధం యెహోవాదే! మీ ఫిలిష్తీయులందరినీ ఓడించేలా యెహోవా మాకు సహాయం చేస్తాడు” అని దావీదు ఫిలిష్తీయుడైన గొల్యాతుతో చెప్పాడు.
1 సమూయేలు 17:41-47 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గ రకువచ్చి చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. –నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను.
1 సమూయేలు 17:41-47 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)