1 సమూయేలు 17

17
1ఫిలిష్తీయులు తమ సైన్యములను యుద్ధమునకు సమ కూర్చి యూదా దేశములోని శోకోలో కూడి ఏఫెస్దమ్మీము దగ్గర శోకోకును అజేకాకునుమధ్యను దిగి యుండగా 2సౌలును ఇశ్రాయేలీయులును కూడివచ్చి ఏలా లోయలో దిగి ఫిలిష్తీయుల కెదురుగ యుద్ధపంక్తులు తీర్చిరి. 3ఫిలిష్తీయులు ఆతట్టు పర్వతము మీదను ఇశ్రాయేలీయులు ఈతట్టు పర్వతముమీదను నిలిచియుండగా ఉభయులమధ్యను ఒక లోయయుండెను. 4గాతువాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులోనుండి బయలుదేరు చుండెను. అతడు ఆరుమూళ్లజేనెడు ఎత్తుమనిషి. 5అతని తలమీద రాగి శిరస్త్రాణముండెను, అతడు యుద్ధకవచము ధరించియుండెను, ఆ కవచము అయిదు వేల తులముల రాగి యెత్తుగలది. 6మరియు అతని కాళ్లకు రాగి కవచమును అతని భుజములమధ్యను రాగి బల్లెమొకటి యుండెను. 7అతని యీటెకఱ్ఱ నేతగాని దోనె అంత పెద్దది; మరియు అతని యీటెకొన ఆరువందల తులముల యినుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. 8అతడు నిలిచి ఇశ్రాయేలీయుల దండువారిని పిలిచి–యుద్ధపంక్తులు తీర్చుటకై మీ రెందుకు బయలుదేరి వచ్చితిరి? నేను ఫిలిష్తీయుడను కానా? మీరు సౌలు దాసులుకారా? మీ పక్షముగా ఒకనిని ఏర్ప రచుకొని అతని నాయొద్దకు పంపుడి; 9అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగినయెడల మేము మీకు దాసుల మగుదుము; నేనతని జయించి చంపినయెడల మీరు మాకు దాసులై మాకు దాస్యము చేయుదురు. 10ఈ దినమున నేను ఇశ్రాయేలీయుల సైన్యములను తిరస్కరించుచున్నాను. ఒకని నియమించినయెడలవాడును నేనును పోట్లాడుదుమని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచువచ్చెను. 11సౌలును ఇశ్రాయేలీయులందరును ఆ ఫిలిష్తీయుని మాటలు వినినప్పుడు బహు భీతులైరి.
12దావీదు యూదా బేత్లెహేమువాడగు ఎఫ్రాతీయుడైన యెష్షయి అనువాని కుమారుడు. యెష్షయికి ఎనమండు గురు కుమాళ్లుండిరి. అతడు సౌలు కాలమందు జనులలో ముసలివాడై యుండెను. 13అయితే యెష్షయియొక్క ముగ్గురు పెద్దకుమారులు యుద్ధమునకు సౌలువెంటను పోయి యుండిరి. యుద్ధమునకు పోయిన అతని ముగ్గురు కుమారుల పేరులు ఏవనగా, జ్యేష్ఠుడు ఏలీయాబు, రెండవవాడు అబీనాదాబు, మూడవవాడు షమ్మా, 14దావీదు కనిష్ఠుడు; పెద్దవారైన ముగ్గురు సౌలువెంటను పోయి యుండిరిగాని 15దావీదు బేత్లెహేములో తన తండ్రి గొఱ్ఱెలను మేపుచు సౌలునొద్దకు తిరిగి పోవుచు వచ్చుచు నుండెను. 16ఆ ఫిలిష్తీయుడు ఉదయమునను సాయంత్రమునను బయలు దేరుచు నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను.
17యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి–నీ సహోదరులకొరకు వేయించిన యీ గోధుమలలో ఒక తూమెడును ఈ పది రొట్టెలను తీసికొని దండులో నున్న నీ సహోదరులదగ్గరకు త్వరగా పొమ్ము. 18మరియు ఈ పది జున్నుగడ్డలు తీసికొనిపోయి వారి సహస్రాధిపతి కిమ్ము; నీ సహోదరులు క్షేమముగా నున్నారో లేదో సంగతి తెలిసికొని వారియొద్దనుండి ఆనవాలొకటి తీసికొని రమ్మనిచెప్పి పంపివేసెను. 19సౌలును వారును ఇశ్రాయేలీయులందరును ఏలా లోయలో ఫిలిష్తీయులతో యుద్ధము చేయుచుండగా 20దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొఱ్ఱెలను అప్పగించి ఆ వస్తువులను తీసికొని యెష్షయి తన కిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయెను; అయితే అతడు కందకమునకు వచ్చునప్పటికి వారును వీరును పంక్తులుగా తీరి, జయము జయమని అరుచుచు యుద్ధమునకు సాగుచుండిరి. 21సైన్యము సైన్యమునకు ఎదురై ఇశ్రాయేలీయులును ఫిలిష్తీయులును యుద్ధసన్నద్ధులై బయలుదేరుచుండిరి. 22దావీదు తాను తెచ్చిన వస్తువులను సామగ్రిని కనిపెట్టువాని వశము చేసి, పరుగెత్తిపోయి సైన్యములో చొచ్చి కుశలప్రశ్నలు తన సహోదరుల నడిగెను. 23అతడు వారితో మాటలాడుచుండగా గాతు ఫిలిష్తీయుడైన గొల్యాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములోనుండి వచ్చి పై చెప్పిన మాటల చొప్పున పలుకగా దావీదు వినెను. 24ఇశ్రాయేలీయులందరు ఆ మనుష్యుని చూచి మిక్కిలి భయపడి వాని యెదుటనుండి పారిపోగా 25ఇశ్రాయేలీయులలో ఒకడు –వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే; నిజముగా ఇశ్రాయేలీయులను తిరస్కరించుటకై వాడు బయలుదేరు చున్నాడు, వానిని చంపినవానికి రాజు బహుగ ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లిచేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలీయులలో స్వతంత్రులుగాచేయు ననగా 26దావీదు–జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వాని చంపి ఇశ్రాయేలీయులనుండి యీ నింద తొలగించిన వానికి బహుమతి యేమని తనయొద్ద నిలిచినవారి నడుగగా 27జనులు–వాని చంపినవానికి ఇట్లిట్లు చేయబడునని అతని కుత్తరమిచ్చిరి.
28అతడు వారితో మాటలాడునది అతని పెద్దన్నయగు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపమువచ్చి అతనితో–నీవిక్కడి కెందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొఱ్ఱె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును; యుద్ధము చూచుటకే గదా నీవు వచ్చితి వనెను. 29అందుకు దావీదు–నేనేమి చేసితిని? మాట మాత్రము పలికితినని చెప్పి 30అతనియొద్దనుండి తొలగి, తిరిగి మరియొకని ఆప్రకారమే యడుగగా జనులు వానికి అదేప్రకారము ప్రత్యుత్తరమిచ్చిరి. 31దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియ జెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. 32–ఈ ఫిలిష్తీయునిబట్టి యెవరిమనస్సును క్రుంగ నిమిత్తములేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా 33సౌలు–ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు; నీవు బాలుడవు, వాడు బాల్యమునుండి యుద్ధాభ్యాసము చేసినవాడని దావీదుతో అనెను. 34అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను–మీ దాసుడనైన నేను నా తండ్రియొక్క గొఱ్ఱెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలోనుండి ఒక గొఱ్ఱెపిల్లను ఎత్తికొని పోవుచుండగ 35నేను దానిని తరిమి చంపి దాని నోటనుండి ఆ గొఱ్ఱెను విడిపించితిని; అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. 36మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవముగల దేవుని సైన్యములను తిరస్క రించిన యీ సున్నతిలేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, 37సింహముయొక్క బలమునుండియు, ఎలుగుబంటియొక్క బలమునుండియు నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలోనుండికూడను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు–పొమ్ము; యెహోవా నీకు తోడుగానుండునుగాక అని దావీదుతో అనెను.
38పిమ్మట సౌలు తన యుద్ధవస్త్రములను దావీదునకు ధరింపజేసి, రాగి శిరస్త్రాణమొకటి అతనికి కట్టి, యుద్ధకవ చము తొడిగించెను. 39ఈ సామగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ల కలిగినది లేనిది చూచుకొనిన తరువాత దావీదు–ఇవి నాకు వాడుకలేదు, వీటితో నేను వెళ్లలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి 40తన కఱ్ఱ చేతపట్టుకొని యేటి లోయలోనుండి అయిదు నున్నని రాళ్లను ఏరుకొని తనయొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెల చేతపట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. 41డాలు మోయువాడు తనకు ముందు నడువగా ఆ ఫిలిష్తీయుడు బయలుదేరి దావీదు దగ్గ రకువచ్చి 42చుట్టు పారచూచి దావీదును కనుగొని, అతడు బాలుడై యెఱ్ఱటివాడును రూపసియునై యుండుట చూచి అతని తృణీకరించెను. 43ఫిలిప్తీయుడు–కఱ్ఱ తీసికొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కనా? అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించెను. 44–నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశపక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా 45దావీదు–నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకధిపతియగు యెహోవా పేరట నేను నీమీదికి వచ్చుచున్నాను. 46ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును; నేను నిన్ను చంపి నీ తల తెగ వేతును; ఇశ్రాయేలీయులలో దేవుడున్నాడని లోక నివాసులందరును తెలిసికొనునట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయులయొక్క కళేబరములను ఆకాశపక్షులకును భూమృగములకును ఇత్తును. 47అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటెచేతను రక్షించువాడుకాడని యీ దండువారందరు తెలిసికొందురు; యుద్ధము యెహోవాదే; ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. 48ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదురుపోగా దావీదు వానిని ఎదుర్కొనుటకు సైన్యముతట్టు త్వరగా పరుగెత్తిపోయి 49తన సంచిలో చెయ్యివేసి అందులోనుండి రాయి యొకటి తీసి వడిసెలతో విసరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురుచొచ్చినందునవాడు నేలను బోర్లపడెను. 50దావీదు ఫిలిష్తీయునికంటె బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోను రాతితోను ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. 51వాడు బోర్లపడగా దావీదు పరుగెత్తిపోయి ఫిలిష్తీయునిమీద నిలుచుండి వాని కత్తి వర దూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. 52అప్పుడు ఇశ్రాయేలువారును యూదావారును లేచి–జయము జయమని అరచుచు లోయవరకును షరాయిము ఎక్రోనువరకును ఫిలిష్తీయులను తరుమగా ఫిలిష్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణములవరకు కూలిరి. 53అప్పుడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి వచ్చి వారి డేరాలను దోచుకొనిరి. 54అయితే దావీదు ఆ ఫిలిష్తీయుని ఆయుధములను తన డేరాలో ఉంచుకొని అతని తలను తీసికొని యెరూషలేమునకు వచ్చెను.
55సౌలు దావీదు ఫిలిష్తీయునికి ఎదురుగా పోవుట చూచినప్పుడు తన సైన్యాధిపతియైన అబ్నేరును పిలిచి–అబ్నేరూ, ఈ యౌవనుడు ఎవని కుమారుడని అడుగగా అబ్నేరు–రాజా, నీ ప్రాణముతోడు నాకు తెలియ దనెను. 56అందుకు రాజు–ఈ పడుచువాడు ఎవని కుమారుడో అడిగి తెలిసికొమ్మని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. 57దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతని పిలుచుకొనిపోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతని సౌలు దగ్గరకు తోడుకొనివచ్చెను. 58సౌలు అతనిని చూచి–చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడుగగా దావీదు–నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరమిచ్చెను.

ప్రస్తుతం ఎంపిక చేయబడింది:

1 సమూయేలు 17: TELUBSI

హైలైట్

షేర్ చేయి

కాపీ

None

మీ పరికరాలన్నింటి వ్యాప్తంగా మీ హైలైట్స్ సేవ్ చేయబడాలనుకుంటున్నారా? సైన్ అప్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి

Video for 1 సమూయేలు 17